సాహిత్య ప్రస్థానం సెప్టెంబర్‌ 2017

సాహిత్య ప్రస్థానం సెప్టెంబర్‌ 2017

సాహిత్య ప్రస్థానం సెప్టెంబర్‌ 2017

ఈ సంచికలో ...

 • రెక్కల్ని ఎగరనిద్దాం (కథ)
 • భూ కేంద్రీకరణ మీద యుద్ధం 'జీవకోన'
 • ఆర్‌. వసుంధరా దేవి కథలో 'స్త్రీ' చిత్రణ
 • పితృస్వామ్యం అడుగుజాడల్లో
 • మారాలి లోకం (కథ)'
 • విలక్షణ ఆత్మకథ 'నేనో కూలోణ్ణి'
 • కత్తుల వంతెనపై కవిత్వ సమరం
 • స్టేన్లీ కుబ్రిక్‌ 'ఎ క్లాక్‌ వర్క్‌ ఆరెంజ్‌'
 • మునుపటి మహబూబ్‌నగర్‌ జిల్లా శాసనాలు
 • ఓపెన్‌ సీక్రెట్స్‌ (కథ)
 • కాకినాడ సాహితీస్రవంతి 4వ వార్షికోత్సవం
   

రెక్కల్ని ఎగరనిద్దాం....

యస్‌.వి.యమ్‌.ఎన్‌. గాయత్రి
9440465797


నా చేతినిండా కాగితాలు...
దార్శనికాలు ఎక్కువయ్యే కొద్దీ ప్రయాణం ఎటుసాగాలో నిర్ణయించుకోవడం కష్టం.
అందులోనూ అవతలి వారి బూట్లలో దూరి మరీ కూర్చోడం తెలిసిన నాలాంటి వారికి....
ఇంజనీరింగ్‌ తర్వాత ఏం చెయ్యాలనే ప్రశ్నకు సమాధానం నా జీవితాన్ని నిర్దేశిస్తుంది. నా చేతిలోని ఈ పేపర్లలో సమాధాన్ని వెతుక్కుంటున్నాను.
'వచ్చే నెలలో టెస్ట్‌ వుంటుంది. ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసుకుంటే' జనవరి కల్లా ల్యాండ్‌ ఐపోవచ్చు.'' పేపర్లు నాకందిస్తున్న జ్యో చేతివంక చూసాను. తెల్లటి నాజూకైన
వేళ్ళు... వేలికి చిన్న డైమండ్‌ రింగ్‌.....
ఆమె స్టేటస్‌ కు సింబల్‌గా.....
''మనీ ఎంత అవసరం ఉండొచ్చు''! అడిగాక అనిపించింది. అడిగుండాల్సింది కాదని !
'' ఓ థర్టీ... థర్టీ ఫైవ్‌ దాకా ఉండొచ్చు. ఎలాగూ పార్ట్‌ టైం జాబ్‌ చేస్తాం కదా...
''పార్ట్‌ టైం అంటే ఎక్కడా? సరుకుల కొట్లోనా? పెట్రోల్‌ బంక్‌లోనా''? ఈ సారి నాలో జనించిన ఈ సందేహాన్ని తొక్కి పట్టేసాను బైటపెట్టలేదు.
జ్యో, నేను బిటెక్‌ నాలుగు సంవత్సరాలు కలిసి ప్రయాణించాం. ఇప్పుడు జ్యో నాకు ఇంకో అవకాశం ఇస్తోంది... కలిసి ప్రయాణించడానికి నా ఉద్దేశ్యమేంటో జ్యోకు పట్టదు. జ్యోకు నేనంటే ఇష్టమే. కానీ.. విదేశాల్లో వుండటమంటే ఇంకా ఇష్టం.
''ఊరు.. దేశం.. ఇవన్నీ వదలిపోవాలి!'' నసిగానని నాకు తెలుస్తోంది. జ్యో కనుబొమ్మ ఒకటి పైకి తీసింది. చిన్నగా భుజాలు ఎగరేసింది. ఏదో సినిమాలో చూసానే... ఇలాగే.... గాలికి రేగుతున్న నా కొప్పుని తన ముని వేళ్ళతో సవరించింది.
''ఏవన్నీ వదిలేటం' స్టడీస్‌ కోసం నువ్వు పుట్టి పెరిగిన పల్లెటూరును, ఇంటిని వదిలెయ్యలేదూ? 'నేనూ- నా పల్లెటూరు' అంటూ... మీ నాన్నతో కలిసి మట్టి పిసుక్కోడం లేదుకదా! ఇదీ అంతే.. ఇంకొంచెం అడ్వాన్స్‌.. ఫారిన్‌.''
జ్యో ధాటికి నేను తట్టుకోగలనా? కురుక్షేత్రంలో అర్జునుడిలా వింటున్నాను. కాకపోతే... ముకుళిత హస్తాలతో కాదు అంతే.
''మీ ఫాదర్‌ కోరిక కూడా అదేకదా! పెద్ద చదువులు చదవడం... కాకపోతే ఫారిన్‌లో... మన జెనరేషన్‌, సెంటిమెంట్స్‌ కొంచెం పక్కనపెడ్తే చాలు శంకర్‌... మన తర్వాత జనరేషన్స్‌... హ్యాపీస్‌''.

కంచెల దారి

డా|| సి. భవానీదేవి
9866847000


దేశమంటే మనుషులే ఐతే
మనుషుల్ని తరిమికొట్టే మా మట్టినేమనాలి?
మా తలపై ఉంది ఆకాశం మాత్రమే
కాళ్ళకింద చారెడు మట్టి కోసం
మీరంతా నాటుకున్న కంచెల వెంబడి
ప్రాణభయంతో పరిగెత్తుతున్నాం
మాకూ ఇల్లు వాకిలి ఉద్యోగం ఉండేవి
మీలాగే కుటుంబమూ ఉండేది
మా పాదాల ముళ్ళ ప్రయాణం
మరో దేశాన్ని ఆక్రమించుకోటానికో
వ్యాపారం పేరుతో దోపిడీకో కాదు
స్వంతగడ్డ మీద బతకలేని వాళ్ళకి
భూమ్మీదే బతికే యోగ్యత పోతుందా?
ఎవరో అధికార ఆగడాలు సృష్టిస్తుంటే
ఇంకెవరో తిరుగుబాటు విలయాలు కల్పిస్తే
మరెవరో మతమౌఢ్యాన్ని ముడివేస్తే
ఇందరి చేతల్లో చేతుల్లో నుసి అవుతున్న వాళ్ళం
ఆయిల్‌ ట్రక్కుల్లోంచి, క్రూయిజుల్లోంచి
డింగీలలోంచి కొన ఊపిరితో ఉరికినా
మీ సరిహద్దుల కంచెల కాపలా నేత్రాలు
మళ్ళీ మమ్మల్ని మహాసముద్రాల్లోకి తోసేస్తున్నాయి

ఇష్టం

నన్నపనేని రవి
9963671531


గూట్లో దాక్కున్న పిట్ట కంటే
వలస పక్షుల ప్రయాణమంటేనే
నాకెందుకో ఎక్కువ ఇష్టం
పూలతోటలో పచ్చపురుగు కంటే
తేనెటీగలూ తుమ్మెదలంటేనే నాకెందుకో ఎక్కువ ఇష్టం
అద్దంలో
ప్రతిబింబం మీద పోరుతున్న పేరు తెలియని
పికిలి కంటే
పంటపొలాల్లోకి దిగుతున్న పిచ్చుకల దండంటేనే
నాకెందుకో ఎక్కువ ఇష్టం
నల్లమబ్బుల కింద తూనీగలూ నడిచే దారిలో చీమలూ
మట్టిపుట్టలోని చెదపురుగులూ చెప్పే పాఠం
ఆలకించాలా
అనుభవానికీ ఆలోచనకీ జోడించుకోవాలా
పడమరకి ఓ కొమ్మా తూర్పుకి మరో కొమ్మా
విస్తరించిన
నియంత నీడల వృక్షరాజసం కంటే
జమ్మి చెట్లకింద తుమ్మచెట్లకింద లతలూ లతికలంటేనే
నాకెందుకో ఎక్కువ ఇష్టం
తలుపుచాటున
పిండివంటల ఒంటరి చిరుతిండి కంటే
చెలికాళ్ళ మధ్య
తోపులో
వానగాయలూ నేరేళ్ళూ నక్కెర్లూ
ఏరుకోడమంటేనేఎక్కువ ఇష్టం

ఆర్‌. వసుంధరాదేవి కథలలో - స్త్రీ చిత్రణ

ఆర్‌. సుజిత
9177110048


వసుంధరాదేవి కథలన్నీంటిలోనూ ప్రధాన పాత్ర స్త్రీనే! ఒక ఆఫీసరు భార్య మానసిక ప్రపంచమెంత పరిమితమో, ఆ ప్రపంచమూ అంతే పరిమితమైంది. అయితే తనకు తెలిసిన ప్రపంచపు శకలంలోంచి అనంతమైన విశ్వ స్వరూపాన్ని దర్శించగలగడంలోనూ ఆమె ప్రతిభ పాఠకుల్ని విభ్రాంతుల్ని చేసింది. ఇంట్లో పని చేసే హసీనా, షాకిరాల్లాంటి మామూలు మనుషుల జీవితాల్లోంచీ రచయిత్రి పొందిన అసాధారణమైన, ఆ పాత్రల్ని మరపురాని పాత్రలుగా రూపొందించింది.

ఒక్కొక్క రచయితది ఒక్కోశైలి. ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రత్యేకత. రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం, కడప, కర్నూల్‌, చిత్తూరు జిల్లాలకు చెందిన రచయిత్రులు తనదైన శైలిలో అనేక కథలను రాశారు.
చిత్తూరుకు చెందిన ఆర్‌. వసుంధరాదేవి  కథ ప్రారంభంలోనే కథా వస్తువుకు బీజాంకురాలు కన్పిస్తాయి. కథనానికి దిక్సూచిగా కనిపిస్తుంది. కథా వస్తువులోని ఒక తాత్విక దృష్టి కోణమే కథనంలో చింతనాధారంగా అల్లుకుంటూ వస్తుంది. ఈ చింతనాధారం తాళం చెవుల గుత్తిలాంటిది. ఒక్కొక్క తాళం చెవితో ఒక్కొక్క తలుపు తెరుచుకున్నట్లుగా లోపలే అతని హృదయాన్ని వెలిగించే విద్య ఈ రచయిత్రికి బాగా తెలుసు. కథల్లో ఎక్కడికక్కడే అందాన్నిమెరిపించే చలం, లోతైన విశ్లేషణ చేసే కొడవటిగంటి కుటుంబరావు లాంటి రచయితలూ ఈ సందర్భంలో గుర్తుకువస్తారు.

పాఠం నేర్పే గురువు

చలపాక  ప్రకాష్‌
9247475975


ఏదో రాయమని
కలం గోలపెడుతోంది!
వెంట అంటిపెట్టుకున్న  కష్టాల సుడిగుండాన్ని
అద్దంలో చూసుకునే సరికి-
కలంలో ఆరిపోయిన సిరాలాగా
గుండెలో తడి ఆరిపోతోంది!!

ఏమీ తోచని ఒంటరితనం
సత్తువులేని కాళీని మిగిల్చి
ఉచితంగా కట్టిపడేస్తోంది!!!

ఏదో చెప్పాలనే బాధ-
పైకి నవ్వుల ముఖాన్ని
కప్పుకు తిరుగుతోంది
నాటకం అంటే తెరపైనే కాదు-
తెరముందూ వేయక తప్పదని
కాలగడియ ఋజువు చేస్తోంది

విలక్షణ ఆత్మకథ 'నేనో కూలోణ్ణి'

హిందీమూలం: లీలా బాందివడేకర్‌
తెలుగు: ఘట్టమరాజు
09964082076


చెప్పుకోదగ్గ మంది మహిళలు మరాఠీలో స్వీయచరిత్రలు రాసుకొన్నారు. వాళ్ల రచనల్లో కాలంకొద్దీ వచ్చిన చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి. రెవరెండ్‌ నారాయణ వామనతిలక్‌, భార్య లక్ష్మీబాయి 1934-38 ల మధ్య 'స్మృతిచిత్రే' (జ్ఞాపక చిత్రాలు) శీర్షికతో ఆత్మకథ రాసుకొన్నారు. ఇది ఇప్పటికీ ఓ శ్రేష్ఠమైన స్వీయచరిత్రగా ప్రసిద్ధి. లక్ష్మీబాయి తన ఆత్మకథ నిజాయితీగా సమకాలీన సంఘధోరణుల్ని, మతవిశ్వాసాల్నీ శక్తిమంతంగా చిత్రించింది. ఆమె స్వీయచరిత్రలో లోతైన హేతువాద దృష్టితోపాటు, అసాధారణమైన వ్యంగ్యం కూడా కనిపిస్తుంది.

మరాఠీ సాహిత్యంలో స్వీయ చరిత్ర రచనావ్యాసంగం చాలా కాలం నుంచి సాగుతూవుంది. 1882కు ముందే నానాఫడ్నవీసు, వాసుదేవ బలవంత ఫడ్కే, విష్ణుబువా బ్రహ్మచారి మొదలైన మహనీయులు తమ జీవితానుభవాల గురించి ఆరాకొరా రచనలు చేశారు. కాని అవి నేటి స్వీయచరిత్రల్లా సంపూర్ణమైనవి కావు. మరాఠీలో తొలిసారిగా స్వీయచరిత్ర రాసుకొన్న గౌరవం శ్రీమతి రమాబాయి రానడేకు దక్కుతుంది. ఈమె ప్రసిద్ధ సంఘసేవాపరాయణులైన న్యాయమూర్తి మహాదేవ గోవింద రానడే సతీమణి. రమాబాయి రానడే 1910లో 'అమ్చా ఆయుష్యాతీల్‌ కాహీ అర్‌వణీ (నా జీవితంలోని కొన్ని సంఘటనలు) అన్న ఆత్మకథ రాసుకొన్నారు. దాన్లో ఆమె తన భర్తను పదే పదే గౌరవ పురస్కారంగా స్మరించుకొంది. దీని తర్వాత 1960 దాకా మరాఠీలో ఎన్నో స్వీయచరిత్రలు వెలువడ్డాయి. వాస్తవిక  సంఘటనలు, గతస్మృతులు, విన్నపాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఫిర్యాదులు, సొంత అనుభవాల ద్వారా వ్యక్తమైన సాంఘిక చరిత్ర, పఠనీయత, సూక్ష్మత, ప్రబోధాత్మకత వగైరా ఈ స్వీయచరిత్రల విశిష్టగుణాలు.

చినుకు

గరికిపాటి మాస్టారు
8897672733


చినుకు రాలకుంటే రైతు లోకానికి వణుకు
నాటిన విత్తనం మొలకెత్తదని
చినుకు పడకపోతే జనానికి బెరుకు
దప్పిక తీరదని
చినుకు చినుకుకూ రైతు ముఖంలో నవ్వుల పువ్వులు పూస్తాయ్‌.
జీవాలు నిలవాలంటే చినుకు రాలాలి.
చినుకు రాలినప్పుడు నేల తల్లి ఫక్కున నవ్వుతుంది
ఎంతైన పొడికి ఓర్చగలం కానీ తడికి ఓర్చలేం...
అనంటూంటారు
వర్షపు తడి తగలందే చేను ఎలా పండుతుంది..?
చినుకు తడి తగలందే కడుపు ఎలా నిండుతుంది..?
కనుక.....సోదరా..!
వర్షపు తడికి ఓర్చుకో
చినుకు రాలాలని కోరుకో....