ముల్లుపాఠం

కవిత

- తగుళ్ళ గోపాల్‌ - 9505056316

చానా రోజుల తరువాత

ఎట్లా కుచ్చుకుందో తెల్వదు గాని

ముల్లైతే నాటింది.

 

అమ్మముందు

మళ్ళీ చిన్నపిల్లాడిని చేసిన

ఈ ముల్లును తిట్టాలనిపించలేదు.

 

ఉమ్మురాసి,జిల్లెడుపాలు వోసి

నిప్పుతో కాపుతూ

ముల్లును  తీస్తుంటే

రక్తపుమరకల్లా చేతికి

ఒక్కొక్క జ్ఞాపకం.

 

కంపల మీదంగ, ఒరికొయ్యల మీదంగ

ఎగిరిదుంకి ఆవుల్ని మర్లేసినంక

తూట్లు పడిన జల్లెడలాగ అరికాళ్ళు.

ఎక్కడ కూర్చుంటే అక్కడ

కాళ్ళను ముందలేసుకొని

ముండ్లను తీయడంతోనే

గడిచిపోయింది బాల్యం.

 

అందరిలో ఉంటూనే

ఒంటరితనాన్ని మోస్తున్న ఇప్పటి నొప్పికన్న

ఈ తుమ్మముల్లు నొప్పి

ఏమంత పెద్దది గాదు.

ఇంకా బడిసంచిని

నెత్తికి తగిలించుకోకముందే

మనిషికి చీము,నెత్తురు ఉన్నాయని

ఉద్యమపాఠాల్ని నేర్పింది ఈ ముల్లు.

 

ముల్లును ముల్లుతోనే

తీసిన చేతులు గదా!

అందుకే ఈ పిడికిలికి

ఇంతటి ధిక్కారపు గొంతు.

తుమ్మ, రేగు, కంప

ఎన్ని రకాల ముండ్లో

అరికాళ్ళ సున్నితపుపొరను తీసేసి

రాయిలాగ బతకడం నేర్పినయి.

 

కట్టెలమోపు నడుముకు

తాటాకుల మెల్లెను కట్టి

ముండ్లను ఎట్లా మోయలో

నెత్తినిండ పరుసుకున్న

పచ్చనాకులే నేర్పించినయి.

 

కాసిన్ని నూకల్ని ఉడికించడానికి

ఆకలిముండ్లను ఎట్లా మండించాలో

మా మట్టిపొయ్యికే ఎరుక.

 

చిన్నప్పుడు

బొబ్బలెక్కిన నా కాళ్ళను జూసి

లబ్బరిచెప్పుల్ని కొనియ్యడమే కాదు

నా బతుకుపాదానికి ముల్లునాటకుండ

అక్షరాన్ని తొడిగిండు మా సారు.