మాట్లాడుకోవాల్సిన కవిత్వం 'మైనపుబొమ్మలు'

కెంగార మోహన్‌ - 9493375447

సాహిత్యంలో అనేక వాదాలొచ్చాయి. అనేక వివాదాలూ వుంటాయి. కవిత్వంలో ఎవరి అస్తిత్వం వారు మాట్లాడుతుంటారు, కవిత్వీకరిస్తుంటారు. స్త్రీల గూర్చి, స్త్రీ వేదనల గూర్చి పురుషులు రాస్తే స్త్రీవాదమనరు, స్త్రీవాద సానుభూతి సాహిత్యమంటారు. ఎవరి అస్తిత్వాన్ని వారు, వారి వారి కోణాల్లోంచి, దృక్ఫథాల్లోంచి, జీవితాల్లోంచి రాస్తేనే అది బాగుంటుందన్న మాట నిజమే అయినా ఒక్కోసారి ప్రత్యక్ష అనుభవాల ద్వారా కూడా కవిత్వం బాగా రాసి గుండెల్ని పిండెయ్యొచ్చు అని నిరూపించారు కవి లోసారి సుధాకర్‌. వృత్తిరీత్యా పోలీసధికారి అయిన ఈయన కడపజిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పొట్టకూటికోసం వేశ్యావృత్తిని కొనసాగిస్తున్న వేశ్యల దీన, హీన గాథల్ని మైనపుబొమ్మలుగా చెక్కారు. సాధారణంగా కేసులను విచారించి, కేసులను నమోదు చేసి న్యాయస్థానానికి పంపే తంతు ముగించి చేతులు దులుపుకునే ప్రస్తుత వ్యవస్థలో వేశ్యల జీవితాల్ని అధ్యయనం చేయగలిగారు లోసారి సుధాకర్‌. ఈ కవి మొదటి కవితా సంపుటి అయినప్పటికీ ఈ కవిత్వాన్ని రాయలసీమలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం, యోగివేమన విశ్వవిద్యాలయం కడప వారు యంఏ (తెలుగు) చదువుతున్న వారికి పాఠ్యాంశాలుగా ఎంపిక చేసారు. ఇలా రెండు విశ్వవిద్యాలయాలకు పాఠ్యాంశాలుగా మైనపుబొమ్మలు కావడం సాదారణ విషయంగా భావించలేము. ఈ కవిత్వానికున్న ప్రమాణాలేమిటి అని అంచనావేసినపుడు ఈ కవిత్వం గూర్చి మాట్లాడుకోవాల్సిన సందర్భమనిపించింది.

ఈ కవిత్వపు లోతుల్ని తవ్వినపుడు 'చిరునామా లేని బతుకులు మావి/ నాలుగు రోడ్ల కూడలిలోనో/ బస్‌షెల్టర్‌ దగ్గర్నో/గోడచాటు మసకచీకట్లోనో/ మా ఆనవాళ్ళు దొరుకుతాయి/ అట్టే పోల్చుకోవటం ఎంతో కష్టం కాదు/ చితిమంటల్లో నుంచి చీలిన కాంతిరేఖలా/ మా పెదాల మీద చిర్నవ్వొక్కటి/ మండుతుంటుంది/ సముద్రాల అడుగున/పుట్టిన బడబాగ్నిలా/ కడుపులో మెలిపెట్టే ఆకలి/ మోహపు చూపై ప్రవహిస్తుంటుంది/ పావలాకో, పాతిక్కో/ చివరికి గుప్పెడు మెతుకులకో/ మాశరీరాలు అంగడిలో సరుకులౌతాయి/ బతుకుద్వార బంధాలవద్ద/ తలకిందులై వ్రేలాడే/గబ్బిలాల జీవితాలు మావి/చీకటి ఖండాలు మా జీవితాలు/ దేవుడా నగ్నహృదయంతో నమస్కరిస్తున్నా/ మావి కాని జీవితాలు మాకెందుకు? (గబ్బిలం)  వేశ్యల జీవితాన్ని మరింత లోతుల్లోకి వెళ్ళి రాసిన సందర్భాలు తక్కువే. పొట్టకూటికోసం ఒళ్ళమ్ముకునే జీవితాలు వేశ్యలు. వారు కావాలనో కోరికలకో, మోహానికో బరితెగించో చేయరు. కావాలని కూడా ఈ వృత్తిలోకి రారు. ఆకలితో చేసే పోరాటంలో బతికేందుకు, తాము ఏమైనా పర్వాలేదు తమ వాళ్ళకోసం వృత్తిలోకి వచ్చి విటులు పెట్టే రాక్షసలైంగిక హింసను మౌనంగా భరిస్తారు.

నేటి ప్రపంచీకరణ యుగంలో ఈ కవిత్వం అవసరం. ఇది మాట్లాడు కోవాల్సిన కవిత్వం. ఇది లైంగిక హింస ఏలుతున్న రాజ్యం. బతుకుసమరంలో బండబారుతున్న జీవితాలు వేశ్యలవి.  ఎవరికి వారు వారి గూర్చే వారు, వారి గూర్చే వారు మాట్లాడుకుంటూ వీరి గూర్చి ఎవరు మాట్లాడ్తారు. సుధాకర్‌ మాట్లాడాడు. వారి జీవితాల్ని అణువణువు కాదు కాదు, పరమాణువు కేంద్రబిందువుల్లోకెళ్ళి స్పృశించాడు. ఈ కవితలో వేశ్యల బాధను చూడండి ''ఒకానొక సున్నితత్వం/మొద్దుబారిన తనంలోంచి/మొలకెత్తిన మోదును/చీకటింటసుఖవాంతిలో/చిదిమిపోతున్న కోమలత్వాన్ని/అందాన్ని అనాగరికత దోచేసినప్పటి మౌనాన్ని/రాత్రి సర్పం మింగేసిన ఒకానొక దుస్వప్నాన్ని/ ఎందరో ఎంగిలిపడి/ కొందరే ఉమ్మేసిన''ఛీ''త్కారాన్ని/రేయింబవళ్ళూ బతుకు జాగరణ/ ఆకలి దు:ఖం/ అవమానం ప్రేమ రాహిత్యం/జీవితం ఓ మందులేని సుఖరోగం/ హృదయం తడారిపోతున్న ఎడారి/ ఇంకా ఎంత దూరమని/ వాని నపుంసకత్వం కూడా/ మాపాలిట శాపమౌతుంది/ మా వంటి నిండా పిచ్చికుక్క గాట్లవుతుంది/ రాత్రి ఎంత నడిచినా/ ఆవలి తీరం లేదు/ ఎక్కడికెగిరి పోతాం?/ నిర్భంధ నిశీధి ఉక్కుకౌగిళ్ళ నుంచి (ఎండుపూలు) ఈ కవితలో శీర్షికతోనే గొప్ప కవితా ఎత్తుగడ వేశాడు. వేశ్యను ఎండుపూలతో పోల్చడం ఊహకందని భావన. గుండెలోంచి బాధల అలలు ఎంతగా ఎగసి పడింటే ఇలా చెప్పగలరు. ఒక్కోసారి వేశ్యల జీవితాన్ని స్త్రీలు కూడా ఇంత బాగా చెప్పగలరా అనిపిస్తుంది. రాయలసీమలో కరవుందంటారు. ఆకలి వుందంటారు. వాటికి పర్యాయపదాలైన ఎన్నో ఇలాంటి బతుకులక్కూడా కారణం అవే. బువ్వ సంగతేమో గాని, గంజిక్కూడా నోచుకోలేని జీవితాలు ఎముకల అస్థిపంజరాల్ని మోసుకుని వెళ్తున్న జీవమున్న మనుషులు సీమలో కనిపిస్తారు. మానవచరిత్రపై సీమ బతుకుల రేఖాచిత్రాలు కనిపిస్తూనే వుంటాయి.

దయనీయమైన బతుకులున్న రాయలసీమలో వేశ్యల బతుకులు దుర్భరంగానే వుంటాయి కాబట్టే కవిత్వం శక్తి వంతంగా వుంది. ఇదే కవితలో  ''శత్రురక్తం మా వంటిలో / పెరుగుతున్న పాపం/ కడవలు కడవలుగా/ నెత్తుటి స్రావం/ జీవితం ఒక పెద్ద అబద్ధం/ బతుకు బార్లా తెరచిన రహస్యం/ ఎప్పుడూ తడిగాయాల పర్వమే/  కలలు కళ్ళని మింగేసినప్పటి/ ఒక వాస్తవాన్ని మోస్తున్న దృశ్యం/ ధ్వంసం చేయబడ్డ అవయవాలు/ రాత్రికి ఉరితీత/ అబ్బా చెప్పలేను/ నగ్న దేహాన్ని మూసుకోవడానికి/ ముందూ వెనకా/ రెండూ చేతులూ/ దేవుడా ఇక నీకు నమస్కరించలేను..నుజ్జునుజ్జయిన వొళ్ళుతో చేతులతో ఎలా నమస్కరిస్తుంది. ఇలాంటి కవితలు దర్శనమిస్తాయి. కవిత్వంలో బాధుండాలంటారు. మరి ఇంతలా వుండలా? వెక్కి వెక్కి ఏడ్వాలా? మౌనంగా రోధించాలా? బాధను కూడా ఇంత దీనంగా ధైన్యంగా చెబుతారా అనిపిస్తుంది. సంపుటి శీర్షిక మైనపు బొమ్మలు. ఈ శీర్షికతో  ఒక కవిత వుంటుంది. దేహంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో కళ్ళారా చూడలేమేమో కాని,  కవిత్వం చదువుతున్నంత సేపూ వొంటి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దేహం ఒక్కసారిగా ఉడికిపోతుంది. ఈ సమాజంలో చిత్రవధ అనుభవిస్తున్న వేశ్యలు మైనపుబొమ్మలు.  ''ఈ దేశం యంత్రమై/ ఈ మర్మాంగాలు లోహపు పరికరాలై వుంటే బాగుండు/ మేము మనుషులుగా పుట్టడం కన్నా/ మరబొమ్మలై వుంటే బాగుండు/ మస్కిష్కంలో ఆలోచనా స్రవంతులు/ ఉదయించకున్నా బాగుండు..స్త్రీలను గూర్చి రాస్తే స్త్రీవాద సానుభూతి సాహిత్యమంటారు. మరిక్కడ స్త్రీల గూర్చి పురుషుడు రాశాడు. దీన్ని అలాగే అందామా? అలా అనిపించడం లేదు. కవిత్వం లోతుల్లోకి ప్రవహించిన ఒక ప్రత్యక్ష అనుభవం తాలూకూ వాస్తవం. కాదు కాదు నిఖార్సైన నగ్న సత్యం. ఇదే కవితలో దేశం వ్రణమై/ బతుకు రణమై/ క్షణక్షణం ఓ పదునైన కరవాలమై/ జీవితం యెడారిపై గాట్లు గాట్లుగా పోట్లు పోట్లుగా అలుముకున్న చీకట్లు.. నిజంగా ఈ మైనపుబొమ్మలకు లోసారి సుధాకర్‌ ఊపిరిపోసి మాట్లాడించాడు.