రెక్కలు

కవిత

- రవి నన్నపనేని - 799 3981211

 

రెక్కలున్నాయి నాకు

నేను నా కిష్టమైన సముద్రం మీద

ఎగురుతా -

అద్దం నిషేధించిన ప్రదేశాల్లోకి

నిర్భయంగా నిస్సంకోశంగా

వెళ్ళి వాలతా

ముఖానికి ముసుగేసి

మొండెంతో బతకనెప్ఫటికీ      

ఏ దొంగ చీకట్లో

 

రెక్కలున్నాయి నాకు

బుద్దిగా చదువుకుంటా!

ఏ పద్యంలో ఏ రహస్యం ఉందో

ఏ కత ఏం విప్పుతుందో

నిరంతర విద్యార్థినై

వెతుక్కుంటా -

అనుకుంటే

అవసరమనుకుంటే

ఒక పొద్దంతా చేపల వేటలో

చెరువులు చుట్టూ

దరువులు చుట్టూ తిరుగుతా

 

ఇష్టమైన స్నేహితుని కోసం

ఇష్టంగా రోటి పచ్చటి నూరుతా

ఉన్న కష్టం చెప్పుకుంటా

ఉన్నంతలో ఉంటా

ప్రియ మిత్రుని సన్నిధిలో

మనసు తేలికపడే కన్నీరవుతా

అత్యవసరంలో

ఆపదలో

రేపన్నది ఆలోచన లేకపోవడం

అడిగితే ఉన్నది ఇవ్వడం

ఎలా తప్పవుతుందని

నిలదీస్తా నిలబడతా

నచ్చినా

ఎవరికి నచ్చకపోయినా

నన్ను నన్నులా బతకనివ్వని

నన్ను బానిసని చేసే

ఏ నీతికైన

ఏ సూక్తికైన మంటబెడతా

 

రెక్కలున్నాయి నాకు

ఉలి,సుత్తి ధరించి

పక్క వాణ్ణి చెక్కుతూ

అనుక్షణం

పరాయి వ్యక్తిని

వేలెత్తి చూపే 

ఏ దద్దమ్మనైన

గుండె వాకీట్లోంచి

దూరంగా విసిరేస్తా

 

రెక్కలున్నాయి నాకు

మట్టిలో పొర్లాడతా

మట్టిలో స్నానం చేస్తా

మట్టిలో మొక్కనై పైకి లేస్తా

సాధారణ కాంక్షను

స్వచ్ఛమైన వాంఛను

బలికోరే

ఏ ఆంక్ష కైన

ఎదురెండే నేను!

ఏ పెద్దరికానికైన

ఎదుర్రాయే నేను!

రెక్కలున్నాయి నాకు

నా రెక్కల మీద కన్నేసి

ఆయుధం గురిపెట్టిన

ఏ వేటగాడికి లొంగను

హుకుం నా బద్ద శత్రువు!

ఆజ్ఞ నా విరోధి!!

 

రెక్కలున్నాయి నాకు

రెక్కల్తో ఇటువైపు కంటే

అటువైపు

చంద్రుడి ఆ రెండో వైపుకి

ప్రయాణిస్తా

పువ్వంటి ప్రపంచం

ఎక్కడ ఉంటుందో

ఎలా ఉంటుందో అన్వేషిస్తా-

జీవిత పోరాటమంతా

యుద్ధమంతా

ఉన్న రెక్కల కోసం కాదు

ఉండాల్సిన రెక్కల కోసం