వీరేశలింగం గారు : సంఘ సంస్కరణోద్యమము

 డా|| సి. నారాయణ రెడ్డి
ఫ్రాన్సు దేశములో వాల్టేరువలె ఆంధ్రదేశమున సంఘసంస్కరణము కొరకు తన కలమును ఖడ్గసదృశముగా జళిపించిన మహాపురుషులు వీరేశలింగంపంతులుగారు. సాంఘిక దురాచార నిర్మూలనములోనేమి, బహుముఖ సాహితీప్రక్రియా సృష్టిలోనేమి, ఆంధ్రజాతీయతా ప్రచారములో నేమి, వీరేశలింగంగారే పితామహుతుల్యులు. వారే రథులు, సారథులు. 1874లో వారు వివేకవర్థనియను పత్రికను స్థాపించిరి. ఇది మాసపత్రిక. ఈ పత్రికా ప్రకటన ప్రయోజనములు రెండని పంతులుగారే తమ స్వీయచరిత్రలో వ్రాసికొనిరి. ఒకటి భాషాభివృద్ధి; రెండవది దేశాభివృద్ధి. తెలుగుభాషలో మృదువైన, సరళమైన శైలిలో సలక్షణ వచన రచన చేయుట భాషాభివృద్ధికి మార్గమని, దురాచారములను నిర్మూలించి, మతకులాచార విద్యానీతి విషయములందు నానాముఖముల కృషిచేయుట దేశాభివృద్ధి మార్గమని పంతులుగారు వివరించిరి. లంచగొండితనమును బట్టబయలు చేయుటయందు, స్త్రీ విద్యా విషయమునందు, వితంతు వివాహ విషయమునందు వీరేశలింగం గారి కృషి అనన్యమైనది. 1881లో రాజమహేంద్రవరమున ఒక నాటక సమాజమును స్థాపించి 'చమత్కార రత్నావళి'యను రెండు నాటకముల నాడించిరి. ఇవి ప్రహసన రూపములో నున్నవి. వీని ప్రదర్శనతో నగరమందు గొప్ప సంచలనము కలిగినది. 1881 డిసెంబరు 11వ తేదీని రాజమహేంద్రవరములో మొదటి వితంతు వివాహము జరిపించి పంతులుగారు సంఘ సంస్కరణోద్యమమునకు పతాకస్థాయి కల్పించిరి.

సంఘసంస్కరణోద్యమముతో పాటు సాహిత్య కేదారమున ఎన్నో క్రొత్త అంట్లను నాటిన భవిష్యద్ద్రష్ట వీరేశలింగంగారు. గద్యవాఙ్మయమును క్రొత్తదారులలో నడిపించుటయందు వారే ఆద్యులు. కావ్యనాటకములే కాక తెలుగులో ప్రకృతిశాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము, శారీరశాస్త్రము, పదార్థ వివేచనాశాస్త్రము, భౌతిక భూగోళ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములు, అలంకార సంగ్రహము, ఆంధ్రతర్క సంగ్రహము మున్నగు బహువిధ వాఙ్మయ సృష్టి చేసిన మనీషి ఆయన. ఆంధ్రసాహిత్య చరిత్రమును క్రమబద్ధముగా ప్రమాణవంతముగా వ్రాసినదాతడే. వీరి ఆంధ్రకవుల చరిత్ర ప్రచురణముతో నన్నయ, రామకృష్ణకవి ప్రభృతులకు సంబంధించిన కట్టుకథలు మాయమైపోయినవి. ఒక్క కవితారంగము తప్ప సారస్వత క్షేత్రములోని అన్నిదారులలో సరిక్రొత్త ప్రయోగములు చేసిన మహారచయిత పంతులుగారు.

''తెనుగులో వచన ప్రబంధమును నేనే చేసితిని. మొదటి నాటకమును నేనే తెనిగించితిని. మొదటి ప్రకృతిశాస్త్రమును నేనే రచించితిని. మొదటి ప్రహసనమును నేనే వ్రాసితిని. మొదటి చరిత్రమును నేనే రచించితిని. స్త్రీలకై మొదటి వచన పుస్తకమును నేనే కావించితిని''.

ఒక్కమాటలో చెప్పవలెనన్నచో ఆంధ్రదేశమునకు సాంఘికముగా వినూతన జాగృతిని కలిగించిన ప్రప్రథమ వైతాళికుడు వీరేశలింగంపంతులుగారు.

(ఆధునికాంధ్ర కవిత్వము : సంప్రదాయములు: ప్రయోగములు పుస్తకం నుండి)