వలస (కవిత)

వాయుగుండ్ల శశి కళ    

నల్ల మబ్బుల గూటిలో మెరుపు దీపం వెలుగగానే
ఉరుముల బాజాలు మోగుతాయి
చల్లటి గాలి వింజామరాలతో సేదతీరుతూ
వేల మైళ్ళ ప్రయాణ బడలికని మరచి

విచ్చేస్తాయి దేవతా పక్షులు
వానవిల్లు కింద
చినుకుల ముత్యాలు వెదజల్లుతూ
దూరదేశాల అతిధులు
మార్గశిరం లో రెక్కల బారులతో
చక్కని ముగ్గులు గీస్తూ
విడిదింట్లో చెట్లకి రెక్కల గొడుగులు కప్పుతాయి
నేలపట్టు వెదురు పట్టు వాటికి ఆటపట్టు అయి
పులికాట్‌ ఇప్పుడు ఎర్ర కాళ్ళ పూలను పూస్తుంది
విప్పిన రెక్కలాగానో
చేస్తున్న జపం లాగానో
వయ్యారపు నడకలోనో
అప్పుడే పుట్టిన
చిన్ని పిట్టల ఊసులతోనో
పురిటి జాతర సందడి
నామకరణాలు చెయ్యవేమో కానీ
కేరింతలు గు గు లు
పెలికాన్‌ దవడ లోని చేపలతో
చిన్ని కూనలకు ఇక్కడే అన్న ప్రాసన
ప్లెమింగో కళ్ళలో పులికాట్‌ ఇప్పుడు
తన సొగసును చూసుకుంటూ ఉంది
ఇప్పుడు కదా మనకు వేయి కళ్ళు కావాలి
లక్షల బ్రతుకు చిత్రాల రంగులు
మనసున పూయించుకోవడానికి
ఆ చిన్ని పిట్టల్లో మనం పిల్లతనం లోకి దూకడానికి
ఏమిటో వలస పక్షులంటాము కాని
అవి ఇక్కడే పుట్టి
మన పౌరసత్వం పొందిన మన పిల్లలే కదా !!