వేకువ తీరాన

పక్కి రవీంద్రనాథ్‌
9440364486


సందడి చల్లారింది
తలుపులు పెనవేసుకున్నాయి
ఎయిర్‌ కండిషనర్‌
శీత పరిమళమై గదంతా వ్యాపించింది
దీపం రెప్ప వాల్చింది
ఇంటరి తనాన్ని కప్పుకున్నాను
జ్ఞాపకాలు కుట్టడం మొదలుపెట్టాయి
మగత రానని మారాం చేస్తోంది
నిశ్శబ్దపు రొద
లేచి కూర్చున్న చెవులు
గడియారపు ముళ్లు
ఒకటే కబుర్లు
కుంటిదయిన కాలం
ఒంటిపై పాకుతున్న అసహనం
ఆవలింతలు ఆహ్వానిస్తున్నా
నిద్ర నిద్ర నటిస్తోంది
నాకింద పరుపు
కొండచిలువ దేహాన్ని తలపిస్తోంది
దిండు దిశలు మార్చుకుంటోంది
దూరంగా రైలు కూసింది
రంగుల రెక్కలాడిస్తూ బాల్యం వాలింది
పొత్తిళ్లలో పొదివి పట్టుకుని
పవిటను కప్పి
నాచే వెన్నెల తాగిస్తూ అమ్మ
ఉక్కపోతకే ఊపిరాడనీయకుండా
విజ్ఞాన వింజామరలు వీస్తూ నాన్న

రామదాసును శృతి చేసుకుంటూ

రాత్రుళ్లను రాగరంజితం చేస్తూ

తాతయ్య

కథల రాసులు పోసో

కళ్లకు లేపనం పూసో

అతల, వితల, సుతల

తలాతల సువర్లోకాలను

ఆవిష్కరిస్తూ నానమ్మ

నన్ను జోల గుర్రమెక్కించి

చీకటి మబ్బుల దాటించి

కలల వనంలోకి

నడిపించిన నిన్నటి తరం

గుక్క పట్టి ఏడ్చినపుడు

నన్ను ఊరడించిన అమృత స్వరం

పూతోటలో పసితనం ఊరేగిన జాడలు

పట్టుకుందామంటే ఎగిరిపోతున్న

సీతాకోక చిలుకలు

కీచురాళ్ల కచేరీతో వర్తమానం నా ముందు కళ్లు తెరుచుకుంది

చీకటి గుట్టలోంచి మిణుగురొకటి

నాన్న పటం ముందు వాలింది

అల్మరాలోంచి నవ్వుతూ నాన్న

పుస్తక బాహువులతో నన్ను చేరబిలిచాడు

విశాల విశ్వాన్ని తెరిచే

తాళపు చెవులను నా చేతిలో వుంచాడు

తూరుపు గూటిలో వెలుతురు కూసింది

వేకువ కువకువలతో రాత్రి తోక ముడిచింది