ఇష్టం

నన్నపనేని రవి
9963671531


గూట్లో దాక్కున్న పిట్ట కంటే
వలస పక్షుల ప్రయాణమంటేనే
నాకెందుకో ఎక్కువ ఇష్టం
పూలతోటలో పచ్చపురుగు కంటే
తేనెటీగలూ తుమ్మెదలంటేనే నాకెందుకో ఎక్కువ ఇష్టం
అద్దంలో
ప్రతిబింబం మీద పోరుతున్న పేరు తెలియని
పికిలి కంటే
పంటపొలాల్లోకి దిగుతున్న పిచ్చుకల దండంటేనే
నాకెందుకో ఎక్కువ ఇష్టం
నల్లమబ్బుల కింద తూనీగలూ నడిచే దారిలో చీమలూ
మట్టిపుట్టలోని చెదపురుగులూ చెప్పే పాఠం
ఆలకించాలా
అనుభవానికీ ఆలోచనకీ జోడించుకోవాలా
పడమరకి ఓ కొమ్మా తూర్పుకి మరో కొమ్మా
విస్తరించిన
నియంత నీడల వృక్షరాజసం కంటే
జమ్మి చెట్లకింద తుమ్మచెట్లకింద లతలూ లతికలంటేనే
నాకెందుకో ఎక్కువ ఇష్టం
తలుపుచాటున
పిండివంటల ఒంటరి చిరుతిండి కంటే
చెలికాళ్ళ మధ్య
తోపులో
వానగాయలూ నేరేళ్ళూ నక్కెర్లూ
ఏరుకోడమంటేనేఎక్కువ ఇష్టం
తాటికర లెక్క తప్పుతున్నా
తొలిమాను మొదులుకొని ఇంకో తడవ గణించడమే
ఎక్కువ ఇష్టం
ముంజెల గంపచుట్టూ దొంతు కూర్చున్న
పిల్లగుంపంటేనే ఇంకా ఇష్టం
ఒక్కణ్ణో ఒక సాహసగాణ్ణో
నేనై ఉండడం కంటే
ఈగలు ముసిరిన బెల్లంగా జీవించడమే
నాకెంతో ఇష్టం
విభక్తులన్నింటిలోకి
'లు' వర్ణకమంటేనే మరింత ఇష్టం
నిత్య ఏకవచనం కంటే
మనిషి
నిత్య బహువచనరూపమవ్వడమే ఎప్పటికీ
నాకిష్టం....