నరకలోకాన్ని మూసేశారు

డా|| పి. విజయ్‌కుమార్‌ - 9490099988ó

యమధర్మరాజు దిగాలుగా వున్నాడు. చిత్రగుప్తుడు గమనించాడు. ''ప్రభూ, ఎందుకిలా వున్నారు'' అని అడిగాడు. ''ఏం చెప్పమంటావ్‌ చిత్రగుప్తా, మనసేం బాగాలేదు'' అన్నాడు. ''ఏమైంది ప్రభూ, వివరం చెప్పండి'' అన్నాడు చిత్రగుప్తుడు. ''విను చెబుతాను. నిన్న వైకుంఠంలో అగ్రస్థాయి సమావేశం జరిగింది. విష్ణుమూర్తి అధ్యక్షత వహించాడు. శివుణ్ణి కూడా అగ్రస్థానంలో విష్ణువు సరసన కూర్చోమన్నారు కానీ నిరాకరించాడు. పైన కూర్చుంటే నాకు సౌకర్యంగా ఉండదు. అని ఒక మూలకెళ్ళి డాన్స్‌ ప్రాక్టీస్‌ చేసుకుంటూ వుండిపోయాడు. అసలింతకీ ఎజెండా ఏమిటంటే నరకాన్ని మూసేయాలన్న ప్రతిపాదనపై చర్చ. చర్చ పేరుకే గాని నిర్ణయం ముందే తీసుకుంటారు. నీకు తెలియనిదేముంది?'' ఇంతవరకు చెప్పి ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు యమ. ''ఏమిటీ? యమలోకాన్ని మూసేస్తారా? ఇదేమి ఆలోచన? నమ్మశక్యంగా లేదే'' విస్తుపోయాడు గుప్త. ''అవునయ్యా అవును, నువ్వు సరిగ్గానే విన్నావు. అసలింతకీ ఈ మీటింగుకు నువ్వు లేకుండా నేనొక్కడినే వెళ్లడం ఏమిటి? ప్రతిసారీ ఇలాంటి మీటింగులకు నిన్ను తోడు తీసుకెళతాను కదా. ఈసారి నిన్ను తీసుకురావద్దన్నారు. వెళ్ళాక అర్థమయింది నిన్ను ఎందుకు వద్దన్నారో'' ''అర్థమైంది ప్రభూ, నేనొస్తే ఎక్కడ పుల్ల పెడతానోనని వాళ్ళభయం. '' అన్నాడు గుప్త. ''కరెక్ట్‌' అన్నాడు యమ. ''అసలింతకీ ఈ ఆలోచన ఎలా వచ్చింది ప్రభూ?'' ''నేనూ అదే అడిగాను. వాళ్ళ సమాధానం ఇది. భూలోకంలో పాపాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవ్వరికీ పాపభీతి లేకుండా పోతోంది. నరకంలో పడే శిక్షల గురించి ఎవ్వరూ భయపడటం లేదు. అందుకే నరకాన్ని మూసేయాలని నిర్ణయిస్తున్నామని చెప్పారు.'' ''మరైతే మనకిక పని లేనట్లేనా ప్రభూ?'' ''ఇదే ప్రశ్న నేనూ వేశాను. మీకు రిట్రెంచ్‌మెంట్‌ ఇచ్చామన్నారు. ఈ మాటెక్కడా వినలేదే? అన్నాను. ఈ ఐడియా భూలోకం నుండి తెచ్చుకున్నాములే అన్నారు.'' ''మరిప్పుడు మనం ఏంచేయాలి?''

''అదే అడిగాను. మీకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తాం హ్యాపీగా వుండండి. కాలక్షేపానికి మిగతా లోకాల్లో చిన్నచిన్న పనులిప్పిస్తాములే అన్నారు.''

''ప్రభూ, అష్టదిక్పాలకుల్లో ఒకరు మీరు. ఇంత వెలుగు వెలిగి ఇప్పుడొక మూలన పడుండటమా? ఏమిటీ ఘోరం?''

''ఏం చేస్తాం గుప్తా, విధి వైపరీత్యం''

''కాదు ప్రభూ, విధి పైత్యం అనాలి''

''అలా నేననకూడదు. ప్రోటోకాలూ, కోడ్‌ అప్‌ కాండక్టు అడ్డం వస్తాయి.''

''దిక్కు మాలిన ప్రోటోకాలూ, కోడ్‌ అప్‌ కాండక్టు.

ఉన్నదున్నట్టు మాట్టాడటానికే ఇవి అడ్డం వచ్చేది. చెత్త పనులు చెయ్యడానికి మాత్రం అడ్డం రావు.''

''నిజమే గుప్తా, అక్షరాలా నిజం''

''మరైతే ఇక మన కర్తవ్యం ఏమిటి ప్రభూ?''

''నాకు ఇంద్ర లోకంలో అడిషనల్‌ డైరెక్టర్‌ పోస్ట్‌ కావాలన్నాను. ఇంద్రుడు నావైపు గుర్రుగా చూశాడు. లార్డ్‌ విష్ణు ఒప్పుకున్నాడు. కానీ ఒక కండిషన్‌ పెట్టాడు. నా స్థానానికి గౌరవం వుంటుంది కానీ అధికారాలు వుండవు. నా పని ఫైల్స్‌ మీద సంతకాలు పెట్టడమే. ఏ విషయాన్నీ ప్రశ్నించడం గానీ, ఆరా తీయడం కానీ చెయ్యకూడదు. ఈ మాట విన్నాక ఇంద్రుడు కాస్త నిమ్మళించినట్లు అనిపించింది.''

''ప్రభూ, మరి నా సంగతేమిటి?''

''అడిగాను గుప్తా. నాతోపాటే వుండాలన్నాను. ఇంద్రుడు అడ్డం పడ్డాడు. గుప్తా కిరికిరిలు పెడతాడు, నేనొప్పుకోను అన్నాడు. విష్ణు జోక్యం చేసుకుని నన్ను సమర్ధించాడు. దాంతో ఇంద్రుడు నోరు మూశాడు.''

''అయినా కిరికిరులు పెట్టడంలో నారదుడి ముందు నేనెంత ప్రభూ?''

''నేనూ అదే మాట అన్నాను. అందుకే కదా నారదుణ్ణి ఒక చోట స్థిరంగా ఉండనియ్యంది'' అన్నాడు విష్ణుమూర్తి. ఇంకా గొడవెందుకులే అనుకుని నా కోరిక తీర్చండి ప్రభూ అని వేడుకోగా ఒకే అన్నాడు విష్ణు.

''మరి మన సిబ్బంది మాటేమిటి?''

''వాళ్ళను మిగతా లోకాల్లో సేవకులుగా నియమిస్తారట.''

''ఏమి సేవలు చెయ్యాలి వాళ్ళు?''

''ఆయా లోకాలలో వున్నవారికి రకరకాల సేవలు చెయ్యాలి. ఉదాహరణకు అలసి పోయినప్పుడు సేద తీర్చాలి. బాడీ మసాజ్‌ చేసి స్నానం  చేయించాలి. ఇలా అన్నమాట.''

''ఏం చేసి అలసిపోతారో?''

''చాల్లే ఊరుకో''

''అయ్యా నేను నోరు మూశాను. ఇంకా చెప్పండి.''

''పాపులకు శిక్షలు లేనట్లేనా అని అడిగాను. ఎందుకు లేవు? భూలోకంలోనే అనేక నరక లోకాల్ని గుర్తించాము. నారదుడు చాలా రీసెర్చ్‌ చేసి సమాచారం తెచ్చాడు. మేము దివ్యదృష్టితో ఆ విషయాన్ని ధృవీకరించుకున్నాము. త్రిమూర్తులు సమావేశమై ఒక నిర్ణయానికొచ్చాము. ఈ భూలోక నరకాలు ఏర్పడి చాలా రోజులైంది. వీటి ముందు మనం నరకం ఏమాత్రం చెల్లదు. మన నరకం అవుట్‌డేటెడ్‌ అయిపోయింది. కాబట్టి నరకలోక విధుల్ని భూలోక నరకాలకు అవుట్‌సోర్సింగ్‌ చేస్తున్నాము అన్నాడు విష్ణుమూర్తి. ఈ భూలోక నరకాలను దైవ ప్రసాదాలుగా గుర్తిస్తున్నామని కూడా సెలవిచ్చారు లార్డ్‌ విష్ణు.''

''ఈ అవుట్‌ సోర్సింగ్‌ ఏమిటి ప్రభూ?''

''ఇది కూడా భూలోకం నుండి తెచ్చుకున్న ఐడియా యేనట. విష్ణువు గారు సెలవిచ్చారు.''

''ఇదేం విపరీతం! మనం విధేయుల నుంచి మనం నేర్చుకోవడమా? ఎంత విడ్డూరంగా వుంది!''

''హ హ్హ హ్హ హ్హ హ్హ -- ఇక్కడ అసలు పాయింట్‌ వచ్చింది. పై నుంచి కిందకు, కింద నుంచి పైకి ఆలోచనల రవాణా అనే సూత్రాన్ని భూలోకంలో ప్రాక్టీస్‌ చేస్తున్నారట. ఈ విషయాన్ని గమనించిన లార్డ్‌ విష్ణు కి బ్రెయిన్‌లో స్పార్క్‌ వచ్చింది. దాని ఫలితమే ఈ నూతన నిర్ణయాలు.''

''ఈ పరిణామాలను జీర్ణం చేసుకోవటం నావల్ల కాదు ప్రభూ.''

''జీర్ణం చేసుకోవద్దు, ఎక్కడోచోట కక్కేయి, ఇప్పుడు నేను చేస్తున్నది అదేగా''

''మనకంటే అధములు- మనకంటే సమర్థంగా పని చేయటమా? నాకెంతో జెలసీగా వుంది. అసలక్కడ జరుగుతుందో చూడాలని వుంది ప్రభూ''

''నాక్కూడా చూడాలని వుంది''

''ఇంతకీ మనం చూడబోయేది భూలోకంలోని చెరసాలలేగా?''

''నీ ముఖం, మనం చూడబోయేది అక్కడి నవ నవీన విద్యాశాలలు''

''ఏమిటీ, నవ నవీన వధ్య శాలలా?''

''అలా కూడా అనుకోవచ్చు. మరి వెళదామా అక్కడకి?''

''ఇంతకీ భూలోకంలో ఏ దేశం వెళ్ళాలి మనం?''

''చెత్త ప్రశ్న. భూమి మీద పవిత్ర ప్రాంతం ఏది?''

''భరత ఖండం''

''మరింకేం? తెలిసికూడా చొప్పదంటు ప్రశ్నలు''

''సరే సార్‌, సారీ సార్‌, ఇక బయలు దేరుదాం సార్‌. అక్కడి విశేషాలు చూడాలని చాలా కుతూహలంగా వుంది. ఇక్కడెట్లాగూ పనేం లేదుగా మనకు.''

''ఆగాగు, ఇక్కడ సెటిల్‌ చెయ్యాల్సిన పనులున్నాయి. నరక లోకం క్లోజ్‌ చేసినట్లు ప్రకటించాలి. సిబ్బందికి నచ్చచెప్పి సముదాయించాలి. సిబ్బందిని, పాపులనూ ఎక్కడెక్కడికి తరలించాలి అనే విషయంలో వైకుంఠం నుండి ఆర్డర్స్‌ వచ్చే వరకు ఎదురు చూడాలని చెప్పాలి. శిక్షల అమలు తక్షణం నిలిపివేయాలి.''

''అలాగే ప్రభూ, ఇది నేను చెప్పి వస్తాను.''

''ఆగాగు, ఒక ముఖ్యమైన విషయం వుంది. భూలోకంలో డబ్బు లేకపోతే ఏమీ చెయ్యలేం. మన పాపుల్లో దొంగనోట్ల నిపుణులున్నారు. వారిని బతిమాలి తగినన్ని నోట్లు ఏర్పాటు చేసుకోవాలి.''

''ప్రభూ, తమరి బుద్ధి కుశలత అనిర్వచనీయం''

''నాకు పొగడ్తలు నచ్చవని తెలుసుగా నీకు''

''అయ్యా, మన్నించండి ఏదో మనసులోని మాట అన్నానంతే''

''సర్లే, ఆ పనులు కానియ్యి, నేను కొంచెం రెస్ట్‌ తీసుకుంటాను. నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు బయలుదేరుదాం''

''చిత్తం ప్రభూ''.