అక్షర కిరీటి

కవిత

- మార్ని జానకిరామ్‌ చౌదరి - 94403 38303

తడొక  అచంచల దీపస్తంభం

శిఖరాగ్రాన రుద్దిన పక్షిముక్కులా

కాంతిపుంజాల్ని ప్రసరిస్తాడు

రాతి మొనలమీద

రాలుతున్న చెమటచుక్కలను

దారంతో గుదిగుచ్చి

మట్టిదేహాల మెడలో

హారమై మెరుస్తాడు

ఒక్కోసారి...

కొలిమిలో పుటంపెట్టిన

పురావేదనకు చిత్రిక పడుతూ

మగ్గంలో కండెగా మారిపోతాడు

మరోసారి అంతర్ముఖుడై

నాగేటి చాళ్ళలో జీవనాడుల్ని నాటుతూ

అన్నంముద్దకు అక్షర కిరీటం తగిలిస్తాడు

పికిలిపోయిన తేనెతుట్టె నుండి

బొట్టు బొట్టుగా రాలుతున్న

భావసంచయాన్ని మధుపాత్రలో తడుపుతుంటాడు

ఎండిన నదిలాంటి గుండెకింద

కన్నీటి చెలమల్ని తవ్వుతూ

బ్రతుకు మోడుల్ని చిగురిస్తాడు

అజ్ఞాత వీరుల చితాభస్మాన్ని

పాటల తోటలపై చల్లుకుంటూ

నెత్తుటి కొడవళ్ళు మొలిపిస్తాడు...

రెక్క తెగిన పిట్ట స్వరంలో

దగ్ధగీతికలా మండుతుంటాడు

అంతరాంతరాలలో ప్రసూతివేదనల్ని

పొరలు పొరలుగా ఒలుస్తూ

మంత్రసానిగా నిరీక్షిస్తుంటాడు...

ఏదోక నడిఝాము

మేధో గర్భాన్ని చీల్చుకొని

కాంతిపుంజం పుట్టుకొస్తుందని...

అసంపూర్తి కవితకు

తుది వాక్యమై నిలుస్తుందని...