వాళ్ళూ వీళ్ళూ ఒకటైనారు

పొత్తూరి సుబ్బారావు
9490751681


గతంలో అంటుకున్న చెడును
తుడిచిపారేశాం
వర్తమానంలో ఆవరించిన భయాన్ని
అవతలికి నెట్టేశాం
భవిష్యత్తుకు భరోసా ఇచ్చారని
నెత్తికెక్కించుకున్నాం
కడిగిన ముత్యాలమని వాళ్ళంటే
మేమెలా కాదనగలం
ఐదూళ్ళిస్తే చాలన్న పాండవులను గెంటేసిన
కౌరవులం వంటి వాళ్ళము కాదు మేము
ఐదేళ్ళు అవకాశమిస్తే చాలు
లెక్కలేనంతగా అద్భుతాలు సృష్టిస్తామంటే
ఓట్ల హారాన్ని వాళ్ళ మెడనిండా దిగేశాం

నోట్లతో ఇల్లంతా  అలంకరించుకున్నారన్న

సత్యాన్ని దిగమింగుకున్నాం

పెద్దనోట్ల రద్దుకు వాళ్ళేమాత్రం చలించకున్నా

ఒళ్ళంతా హూనమయ్యేలా

మేము క్యూలో నిలబడ్డాం

ఇక చాలు వాళ్ళ పాలనని

వాళ్ళని కాదని వీళ్ళని ఎన్నుకుంటే

వాళ్ళూ వీళ్ళూ ఒకటైనారు

ప్రయోగశాలలో

రసాయనాల రంగును మార్చటం

కష్టసాధ్యము కావచ్చు

రాజకీయాల్లో రంగులు మార్చటం మాత్రం

నాయకులకు సులభసాధ్యమే

పైకి విసిరిన వస్తువు క్రిందేపడటం

న్యూటన్‌ భూమ్యాకర్షణ సిద్ధాంతమయితే

అటూ ఇటూ మారుతుండే నాయకుల వైనం

ఏ శాస్త్రజ్ఞుడికీ అంతుపట్టని ధనాకర్షణ సిద్ధాంతం

జనాకర్షణ మర్మమెరుగని ఓటర్లుమటుకు

ఎటూ వెళ్ళలేక నిస్సహాయులవుతున్నారు