మానవత్వాన్ని మేల్కొలిపే కవిత్వం-

- డాక్టర్‌ పెంకి విజయ కుమార్‌ 9553392949

'ఏ బాల్కానీలోనో హాయిగా ఉయ్యాలూగుతూ తాగేందుకు నా కవిత్వం కాఫీ కాదు దేహమ్మీద నుండి రాలుతున్న చెమట చుక్క'
అని తన కవితా లక్ష్యాన్ని సూటిగా ప్రకటించుకున్న శ్రమైక జీవన సౌందర్యకవి బిల్ల మహేందర్‌. లక్ష్యాన్ని ప్రకటించడం వేరు, ఆ లక్ష్య సాధనకు కట్టుబడి అదే మార్గంలో పయనించడం వేరు. ఆ మార్గంలో పయనించడమంటే కవి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కొంత త్యాగం చేయక తప్పదు. అలా త్యాగం చేసిన నాడే ఆ కవి, అతని కవిత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు. బిల్ల మహేందర్‌ ప్రజల గుండెలను తట్టిలేపే కవిత్వానికో చిరునామా.
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో 'పిడికిలి' శీర్షికతో ఉద్యమ కవిత్వాన్ని ప్రకటించి విజయం సాధించడమే కాకుండా దివ్యాంగులలో ఉత్సాహాన్ని ప్రోదిచేసేలా 'గెలుపు చిరునామా' పేరుతో కవితల సంపుటి ఆవిష్కరించి మరోమెట్టును అధిరోహించారు. ప్రస్తుతం మానవ జాతిలో మగ్యమవుతున్న మానవత్వాన్ని మేల్కొల్పడానికి 'ఇప్పుడొక పాట కావాలి' అంటూ వచన కవితా సంపుటితో ముందుకొచ్చారు.
సంపుటిని పరికించిచూస్తే... కవి ప్రస్తావించిన వర్తమాన విషయాలు తప్పుదారుల్లో నడిచే వారికి చెర్నాకోలా దెబ్బల్లా ఛెల్‌ మన్పిస్తాయి. పనిలోపనిగా మానవత్వాన్ని మేల్కొల్పడానికి పూనుకుంటాయి.
'నిజంగా మీరు/ నా కోసం ఏదైనా/ ఖచ్చితంగా చేయాలనిపిస్తే.../ ఇకనుండి/ ఎప్పుడైనా గడపదాటేముందు / మొలిచిన మీ అంగాన్ని ఇంట్లోనే వదిలి వెళ్ళండి!!'...
నానాటికి స్త్రీ తత్వాన్ని చిదిమేస్తున్న పురుష అహంకారానికి, మగాడితత్వానికి ఈ కవిత ఓ చురక.'మొలిచిన అంగం' పదప్రయోగం పదునైన అభివ్యక్తితో అధిక్షేప ధోరణిని ప్రస్పుటపరుస్తుంది. పురుషాధిక్యాన్ని ప్రశ్నిస్తుంది. సమంజసమైన ఆలోచనల్లోకి నెడుతుంది. బాల్యాన్ని చదువుల పేరుతో చిదిమేస్తున్న తల్లిదండ్రులకు చెంపపెట్టు 'ఎగిరి పోనివ్వండి' కవిత. ఈ కవితలో
'నిత్యం ఎగిరే సీతాకోక చిలకల రెక్కల్ని విరిచి/ నువ్వు నేను ఇవ్వాళ స్వేచ్ఛ గురించి మాట్లాడడం/ అంతకన్నా అసలే బాగాలేదు'
అని పిల్లలకు సహజ స్వేచ్ఛనివ్వకపోవడంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని ఆత్మాశ్రయ ధోరణితో హెచ్చరించడం బాగుంది. ఆకలేసి మామిడిపళ్ళు దొంగతనం చేసిన అభాగ్యున్ని పొట్టనపెట్టుకున్న నీచ కులపోకడల లోకంలోని దారుణాన్ని కళ్ళకు కడుతూ
'నిన్నటిదాకా/ తరగతి గదిలో మామిడి తీపి గురించి పాఠమై మోగిన నేను / రేపు విషమని ఎలా చెప్పను..??/ ఇప్పుడు / నా దళిత బిడ్డలకు / ఈ దేశపు జాతీయ ఫలం కూడా / అంటరానిదేనని ఎలా బోధించను??'
అంటూ తనలోని బోధకుని బాధకునిగా మార్చిన సంఘటనలపట్ల కవి స్పందించిన తీరుకు, మానవత్వాన్ని ప్రశ్నించిన విధానానికి జేజేలు పలకాల్సిందే. నరుక్కుంటూ పోతే అడవులేకాదు, మనుషులూ మిగలరంటాడు ఓ సినిమా రచయిత. మహేందర్‌ మాత్రం
'అడవి అంటే/ రాయి రప్పనేకాదు/ గనులు ఖనిజాలు అంతకన్నా కాదు/ కొన్ని మన అడుగు జాడలు/ ఇంకొన్ని ఆకుపచ్చని బతుకులు' అంటారు. మరో కవితలో 'ప్చ్‌..,/మనిషి ఒక్కడే ఎంత లోతుల్ని తవ్వినా/ 'ఒట్టి' మనిషిగానే మిగులుతున్నాడు!!' అంటారు.
నిజమే కదా!. అడవులు, ఖనిజ సంపదలతోనే మానవ వికాసం పచ్చగా ముడిపడి ఉందని చెప్పడం, అందుకుగాను వాటిని సంరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని గుర్తుచేయడం ప్రశంసనీయం. మరికొన్ని కవితల్లో మానవ జీవన వికాసానికి అడ్డంకులైన దుఃఖం, అందుకు కారణ 'భూతాల'ను సహేతుకంగా ఉదహరించి తూర్పార బట్టడం, వాటికి పరిష్కారాలను సూచించడం కవి నిపుణతకు నిదర్శనం.
'దుఃఖము ఇవ్వాల్టిదికాదు/ యేండ్ల తరబడి మోస్తూనే ఉన్నాను/ వెనుకకు ఏ పేజీ తిరగేసిన/ అక్షరాలన్నీ కన్నీళ్లతో తడిసి బరువెక్కుతాయి' అంటూనే మరోకవితలో 'కాలాన్ని గెలుస్తూ ముందుకెళ్ళడమే జీవితమైనప్పుడు/ గాయమన్నది చిన్న మాటే ఉత్తమాటే' అనే వాక్యాలు మనోవికాస పాఠాలల్లే మార్మోగుతాయి. నానాటికీ నల్లపూసవుతున్న మానవత్వాన్ని తట్టి లేపే ప్రయత్నంలో కవి సంధించిన పదాలు తప్పిపోతున్న మనషుల హదయాలకు శరాలై తాకుతాయి.
'నీ కళ్ళముందే/ మాంసపు ముద్దలు తెగిపడుతున్నా/.../ ఇప్పుడిక్కడ మనుషులంతా కన్నీళ్లుకూడా రాల్చలేని మరబొమ్మలుగా మిగిలి/ మనుషులుగా ఎప్పుడో తప్పిపోయారు'
అని నేటి సాంకేతిక యుగంలో స్పందనలేని ఇనుపహదయాలపై సిరాను చిలకరించి మేల్కొలిపే విధంగా కవిత కదలాడటాన్ని గమనించవచ్చు. మానవత్వాన్ని మేల్కొలపడానికి అక్షరాన్ని ఆయుధంగా ఎంచుకున్న కవి 'నాకు అక్షరమంటే/ కాలే కడుపులోంచి రాలే కన్నీళ్లలోంచి/ కష్ట జీవుల చెమట చుక్కలోంచి ఎగిసిపడే ఓ నిప్పు కణిక/ తాడిత పీడిత జనాల గుండెల్ని నిత్యం తట్టి లేపే ఓ వెలుగు చుక్క'
అంటూ తన కవితా లక్ష్యాన్ని ఉన్నతీకరించడం ఒక ఎత్తయితే
'చీకట్లో వెన్నెలను కురిపించినోడు కదా/ వెలివాడల్లో వెలుగుల్ని పూయించినోడు కదా/ అతడికి యుద్ధమేమి కొత్త కాదు కుట్రలు తెలియంది కాదు/ జైలు ఊచలేన్నో సరిగ్గా లెక్కతెలుసు/ ఏదో ఒక సమయాన/ నది సంద్రమై
ఉప్పొంగుతుంది/ చిరునవ్వు పాయిరమై పంజరంలోంచి ఎగిరొస్తుంది' అని తాడిత పీడిత వర్గాల పక్షాన నిలిచి, వారి మోముపై చిరునవ్వులు పూయించడంలో కవి ఆర్ద్ర హదయం గోచరిస్తుంది.
'తొలకరి జల్లులకు తడిసి ముద్దైన మట్టి వాసన/మండుటెండలకు రాలిపడిన సెమట సుక్కలు/ ఎరుపు జెండా వైపుకు ఎగిసిపడిన బిగి పిడికిళ్లు/అలానే బావుంటాయి'
అంటూ శ్రమజీవుల పక్షాన ఎర్రజెండాతో నిలబడటం కవి పోరాట పటిమకు, నిబద్దతకు అద్దం పడుతుంది.అదే నిబద్దతతో
'గుండె గుండెల్లో మమతల్ని నింపి/ గుడిసె గుడిసెల్లో వెలుగుల్ని పూయించే ఓ కొత్త పాట కావాలి' అని కోరికను వ్యక్తపరుస్తూనే 'ఇక పని చేయాల్సింది కరగాల్సింది/గడ్డకట్టుకు పోయిన కొందరి మానవత్వం' అని గొంతెత్తి స్వేచ్చా గీతికను ఆలపిస్తూ 'రేపటి ఉదయం కోసం/ కవిత్వాన్ని ఆయుధంగా మలిచి/ చెమట చుక్కల చుట్టూతా పహారా కాస్తాను'
అంటూ భరోసా ప్రకటించి మానవత్వాన్ని మేల్కొల్పే కవిత్వాన్ని రచిస్తూ, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న బిల్ల మహేందర్‌ అభినందనీయులు. ప్రతుల కోసం 9177604430 కి సంప్రదించండి.