శతవర్థంతి సంస్మరణ

వీరేశలింగం ఒక విజ్ఞాన సర్వస్వం

రస ప్రపంచంలో గురజాడ ధ్రువతార అయితే వీరేశలింగం ఒక విజ్ఞాన సర్వస్వం. దురాచారాల గాఢాంధకారంలో నిద్రపోతున్న జాతిని మేల్కొలిపి విజ్ఞానపు వెలుగులు ప్రసరించిన మహనీయుడు. ఆంధ్రుల అభ్యుదయోద్యమానికి మూల పురుషుడు. ప్రతికూల శక్తుల ఝంఝా ప్రభంజనానికి చెక్కుచెదరకుండా నిలబడి శాఖోపశాఖలుగా విస్తరించిన వటవృక్షం. తెలుగులో మొట్టమొదటి వాస్తవిక నాటకం గురజాడ రచిస్తే మొట్టమొదటి వాస్తవిక నవలను వీరేశలింగం రచించాడు. తన కథలలో, కవిత్వంలో గురజాడ భావవిప్లవం తీసుకు వస్తే, వీరేశలింగం తన జీవితంలో దాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించాడు. విభిన్న భావాల సంఘర్షణలో తాటస్థ్యానికి విరుగుడు శాస్త్రీయ విజ్ఞానమేనని ఇద్దరూ తమ రచనల ద్వారా ప్రచారం చేశారు. గిడుగు, గురజాడ, వీరేశలింగం! వీరు జల్లిపోయిన విజ్ఞాన బీజాలు యిప్పుడిప్పుడే ఫలవంతమవుతున్నాయి. అయినా అసలు వీరు పుట్టనేలేదన్నట్లుగానో, వీరు సలిపిన పరిశ్రమ అంతా విఫలమైయి పోయినట్లుగానో, ఏ శక్తుల మీద వీరు తిరుగుబాటు చేశారో వాటిని ఊత కర్రలుగా చేసుకొని వెనక్కి పోవాలని యీ యిరవయ్యో శతాబ్దపు 55వ సంవత్సరంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అభ్యుదయ రచయితలమైన మనం గిడుగు సాంప్రదాయాలలో, గురజాడ కావ్యవాహినులలో, వీరేశలింగం విప్లవధోరణులలో ప్రాణవాయువులు పీల్చుకుంటున్న మనం, నిస్సందేహంగా ఆంధ్ర సాహిత్య పరిణామంలో అగ్రశ్రేణిని పయనిస్తున్న మనం, మళ్ళీ మనల్ని పాతరాతి యుగానికి పట్టుకుపోయే ప్రయత్నాలను సహిస్తామా అని ప్రశ్నిస్తూ జవాబుకోసం ఆగకుండానే (అది ఎలాగుంటుందో నాకు ఎలాగూ తెలుసు కాబట్టి) ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నాను.

- శ్రీశ్రీ

(ఆంధ్ర అభ్యుదయ రచయితల ఐదవ మహాసభ 1955 జూలై 30, 31 తేదీల్లో విజయవాడలోని షెహెన్‌షా మహల్లో జరిగింది. సభాధ్యక్ష స్థానం నుంచి చదివిన ఉపన్యాస పాఠం ఇది. ఈ సభలోనే శ్రీశ్రీ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.)(అభ్యుదయ మాసపత్రిక జూలై 1955)