అడవి చేతులు ముడుచుకుని కూకోదు..

కవిత
- పల్లిపట్టు నాగరాజు - 9989400881

వెళ్లిపోవడం కుదిరేపనికాదు
ఇంటిని మూటగట్టుకుని
బుజాలపైనేసుకుని
భుజాలపై పనిముట్లతో పొద్దంతా
బువ్వకోసరం తిరిగీ తిరిగీ బెట్టబడి పోయుండాము

ఇప్పుడేగాదు ఎప్పుడూ వెళ్లిపోవడం కుదిరే పనికాదు
బతుకుల్ని ఈడే పైరు చేసుకుంటుండాము.!

2

యుగాలుగా
మా దేహాల్ని తవ్వుకుంటుండారు గదా
ఇప్పుడు మా ఇండ్లను కూడా తవ్విపోసుకుంటారా?

3

ఇది మా ఇల్లు కాదా?
ఇది మా ఊరుకాదా?
మా కొంపాగూడూ మీ కండ్లల్లో పల్లేదా.?
మీరు పొమ్మన్నపుడల్లా పోతావుంటే
ఎంత దూరమని పోవాలి.?
ఈ చెట్లకు అల్లుకున్న మా చేతుల తీగల్ని తెగ్గోసుకుని
ఈ మట్టిన పాకుతున్న మా వేరుపేగుల్ని తెంచేసుకుని
మా జీవితాలు వల్లకాడు జేసుకుని ఎల్లిపోవలా?
అంతంలేని మీ దుడ్డుదాహం ఆవిలించినప్పుడంతా
మా అడుగులు తుడుచేసుకుని ఆగమైపోవాలా?

4

మా ఇంటి చుట్టూతా ఎన్నన్నీ
ఆకలేసినప్పుడు మాత్రమే
పురుగోబుట్రో తినే అమాయక పచ్చులూ
కాయోకసువో తిని కాలమెల్లదీసే మూగజీవాలు
ఒకటా రెండా...
గాయమైనప్పుడు ఆకుపసురైన అడవి
పడిసమొస్తే కసాయమైన అడివి
నాటువైదిగానికి ఆదిపాఠమైనట్టే
వేటవిద్దెలోనూ అనాదిపాఠశాలని
అపుడే మరిచిపోతే ఎట్టబ్బా.!
ఎంతటి కొమ్ములు తిరిగినదాన్నైనా
రొమ్ములోకొట్టి దొమ్ముకాయలు చీల్చి
చియ్యలుచెయ్యడం నేర్పింది మాకు అడివమ్మేగదా
అదిగూడా మరిచిపోతే ఎట్టామరీ.!?

5

పోండి పోండని మరీ వొళ్ళు మండించకండీ
మండిపడే ఎండుకొమ్మలున్నాయి
సుర్రని మండే ముళ్లసుదుగులున్నాయి
కాలడమేగాదు కాల్చిపడేస్తాయి
చెట్లకడుపుల్లో
పురాతనంగా రగులుతున్న నిప్పుకల్లులున్నాయి

6

అయినా
మా ఇల్లు అడివే కావచ్చు
అడివిది కూడా మనిషి బతుకనే యోచనలేదా?
అడివిలోనూ బతుకులుంటాయని గెవనముండద్దా?
చెట్లు
పారా మడక గొడ్డలి పిక్కాసుల పిడులై
పిడికెళ్లలో చేరి బతుకుపోరు నడిపినట్టే
అడవి తలుచుకుంటే
కర్రలు ఉరిమే ఆకాశమూ అవతాది..!

7

వొకనీతీపాతీ లేకుండా
ఎల్లండెళ్ళండని వేదిస్తావుంటే
ఏడ్పుల్లో అడవులు తగలబడిపోతావుంటే
ఏ అడివైనా చేతులుముడుచుకు కూకుంటాదా..!?
(...అడవిబిడ్డలకు...)