తెలుగుకు దిగులు

సంపాదకీయం

ఇంగ్లీషు మీడియం మోజులో పడిన సమాజంలో ఇప్పటికే కొత్త తరాల విద్యాధికులకు దూరమవుతున్న తెలుగు భాషకు అలాగే ఇతర దేశీయ భాషలకూ మరో సవాలు ఎదురవడం ఆందోళనకరం. హిందీ దివస్‌ సందర్భంగా దేశ ప్రజలందరూ రెండవ భాషగా హిందీ నేర్చుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇచ్చిన పిలుపు ఇతర భాషలవారిలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో దుమారం రేపింది.రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులోని ఇరవై రెండు భాషలకూ సమాన  అధికార ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగ స్పూర్తికి ఇది విరుద్ధం. వందలాది భాషలు మరెన్నో వందల మాండలికాలు లిపి లేని తెగల భాషలతో అలరాలే ఈ  భారతావని విశాల వారసత్వానికీ వ్యతిరేకం. 42-46 శాతం మంది మాత్రమే మాట్లాడే హిందీ నిజానికి భోజ్‌పురి, ఉర్దూ, పంజాబీ, అవధ్‌ తదితర అనేక పలుకుబడుల సంగమం. దాన్ని రాసేది దేవనాగరి అంటే సంస్క ృత లిపిలో. ఉర్దూ లిపిలోనూ రాయొచ్చు. దాంతో పోలిస్తే తెలుగు, తమిళం తదితర దక్షిణాది భాషలు వేల సంవత్సరాల చరిత్ర, సాహిత్యం కలిగివున్నాయి. విశిష్ట భాష హోదా కూడా పొందాయి. వాటిపై హిందీని రుద్దే ప్రయత్నం రాజ్యాంగ నిర్మాణ దశలో వీగిపోయింది. 60 వ దశకం మరో పెద్ద ప్రకంపనాలకే దారితీసింది. అయినా మరోసారి అదే దుస్సాహస వాక్కులు కేంద్రం నుంచి రావడం ఆశ్చర్య కరం. చాలా విషయాల్లో ఏకపక్ష కేంద్రీకృత ఆధిపత్యాన్ని  తెచ్చిపెడుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భాషా వైవిధ్యాన్ని కూడా  దెబ్బతీయాలని చూడటం సహించరాని విషయం. తెలుగు వారంతా గొంతెత్తి ఖండించాలి. దీనిపై  తెలుగు రాష్ట్రాల పాలకుల నుండి నిరసన వ్యక్తం కాకపోవడం దురదృష్టకరం. చాలా కోణాల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలతో కేంద్రం వెనక్కు తగ్గినట్టు మాట్లాడుతున్నా సమస్య వుండనే వుంది. అంతకుముందు విద్యా విధాన ముసాయిదాలోనూ ఈ సంకేతాలు ఇచ్చి సర్దుకున్నారు. బహుభాషల భారత దేశంలో ఏ ఒక్క భాషనో అందరూ నేర్చుకోవాలని శాసించడం చెల్లుబాటు కాదు. అలాగే ఇంగ్లీషు నేర్చుకోవచ్చు గాని మాతృభాషలో బోధనావకాశమే లేని విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు చేయడం కూడా సరికాదు.