జంక్షనులో టీ కొట్టు

కవిత

బొద్దూరు విజయేశ్వర రావు - 9490544551

గేటు జంక్షనులో టీ కొట్టంటే చాలు

మనసు రెక్కలు కట్టుకొని వాలిపోతుంది!

కూటికోసం గూటినొదిలిన పక్షుల్లా

కూలికోసం మేమంతా బయటికొచ్చాక

కలుసుకొనే స్నేహ సంగమమది!

దాన్ని తప్పించుకొని వెళ్ళినరోజు

పరీక్ష తప్పిన పిల్లాడిలా

ముఖం వాడిపోయేది!

కాలాన్ని కరిగిస్తూ కదులుతున్న

ఒడిదుడుకుల జీవన రహస్యపు మొగ్గలన్నీ

స్వేచ్ఛగా విచ్చుకొనేదిక్కడే!

చిరిగిన బతుకులో

చెరగని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ

నిలువెత్తు ప్రేమ స్వరూపి ఆ టీకొట్టువాడు!

పాలవంటి తన మనసు నుండి

మాటలను పొంగిస్తూ

ఆప్యాయతల టీ పొడిని కలిపి

అనుబంధాల చిక్కటి 'టీ'ని మాకందించేవాడు!

నిరంతర జీవనగమనంలో

మాకొక జ్ఞాపకాల మూటలను అందించిన

ఆత్మీయ మమతల కుటీరం ఆ టీకొట్టు!

ఆధునికీకరణ గారఢీలో

ఇప్పుడది ఫ్లైవోవర్‌ పునాదుల క్రింద

సమాధి అయ్యింది!

దాన్ని నమ్ముకొని

బతుకుబండిని నడిపిన వాడు

తన నెత్తుటితో

రైలు పట్టాలని అభిషేకం చేసి

రుణం తీర్చుకొన్నాడు!