చావు పాదు

శిఖా - ఆకాష్‌ 
7095874172


వెన్నెల ఆకాశ నక్షత్రాల మిణుగురు నాట్యాలు...
రంగురంగుల సీతాకోకల బాసలూ... సెలయేటి గాలుల పాటలూ....
గులాబీ మొగ్గల పరిమళాలూ... పక్షుల కేరింతలూ... చిరుజల్లుల ఉత్సాహాలు...
ఇంద్ర ధనుస్సుల ఆనందోత్సాహాలు...
ఏమైపోయాయి? ఎటెళ్లి పోయాయి?
కలలు కాలుతున్న స్మశానం వాసన..!?
కార్పొరేట్‌ వెన్నెల వల
బాల్యం మెడకో ఉరితాడై బిగుసుకుంటున్నది...
వెలుగు దివ్వెలు చీకటి దిబ్బలై మిగులుతున్నవి
పూలు నేలరాలినంత సహజంగా
పిల్లల బతుకులు నేలరాలడం సహజాతి సహజమైపోయింది...
ఏదీ ప్రశ్న కావడం లేదు
సమాధానాలసలే దొరకడం లేదు
శిక్షలు దోషులకు కాక
పసి మనసులకు అమలవుతున్నవి
బడిగంట మరణమృదంగమై మోగుతున్నది.!
మార్కులు... ర్యాంకులు...
గొప్ప జీతాలు.. గొప్ప గొప్ప హోదాల ముందు
జీవితమేమంత విలువైనది కాదని రూఢీ అవుతున్నది 
కార్పొరేట్‌ రాజ్యం
కలల బాల్యాన్ని బలికోరుతున్నది
చావునొక విలువగా నిర్ణయిస్తున్నది
మరణమొక ప్రేమ లేఖై పోతున్నది
తల్లిదండ్రులారా..!
మీ పిల్లలకు గొప్ప చదువులను
ఇవ్వకపోయినా పర్వాలేదు
కార్పొరేట్‌ పాడెను మాత్రం
భవితకు బహుమానంగా ఇవ్వకండి...
అయ్యలారా..! అమ్మలారా.!
మీ కలలకు వారి చావులు పరిష్కారమవడమేమిటీ?
చదువొక మాఫియా అయిపోయాక
రాజ్యం బాల్యానికి ఒక డెత్‌సెల్‌ను నిర్మిస్తున్నది
ఉద్యోగస్తులారా..!
మీ పిల్లల బతుకులు హాస్టల్లో
అనాధ బతుకులై పోతున్నవి 
చదువు అత్యంత ఖరీదైన చోట
చావు కారుచౌకై పోతున్నది
చదువంటే  వేటై పోతున్నది
ఆత్మహత్యల తోటై పోతున్నది
పోటీ... ఒత్తిడి... వేగం... మోహం..
అంతా కార్పొరేట్‌ వ్యవహారమే...
కార్పొరేట్‌ వ్యామోహమే...
ఎటు నుంచి ఎటు చూసినా...
అ వ్యవస్థను ఆత్మహత్యల రుతువేదో పట్టిపీడిస్తున్నది
''నారాయణా.! నారాయణా.!''
చావు ఒక ''చైతన్య''మై విజృంభిస్తున్నది...
రాజ్యమా..!
ప్రతి గడప ముందూ
ఒకానొక కార్పొరేట్‌ హత్యగా
నిలబడి వున్నందుకు జోహార్లు..!
తలిదండ్రులారా..! వేకువ సూరీళ్లైన విద్యార్థులారా..! ప్రజలారా..!
ఒక్కో కొసా పేనుకుంటూ...
రాజ్యం మెడన ఉరితాడేద్దాం వస్తారా?
మన కలలను ఛిద్రం చేసున్న
బతుకును ప్రశ్నార్థకం చేస్తున్న
చావు పాదైన కార్పొరేట్‌ వెన్నెలకు
చావు పాతరేద్దాం వస్తారా?