భరద్వాజ అద్భుత కథన రూపకం 'సశేషం'

విశ్లేషణ

- డాక్టర్‌ కందిమళ్ల సాంబశివరావు - 9848351517

జీవన సమరాన్ని సజీవంగా సాక్షాత్కరించుకొని సాక్షర నిరక్షర తారతమ్యం లేకుండా సకల మానవ చైతన్యాన్ని అక్షరరూపంలో ప్రత్యక్షం చేసిన భావర్షి డాక్టర్‌ రావూరి భరద్వాజ. నీరుకాయ ధోవతి, పైపంచ మీద వైరం కాని వైరాగ్యం, నాభినుండి వెలుతురును వెతుక్కుంటూ చుక్కల్లా చూడదలచినదాన్ని చూడవలసిన రీతిగా చూసేందుకు ప్రయత్నించే గాబరా చూపులు, మాటమాటలో మమకారాన్ని మధురంగా కురిపించే మార్దవం, సభ్యతా వాసనలకు మురిసిపోని సౌజన్యం, హృదయాన్ని హృదయంతో పలికించే సౌహార్ధం వంటి ఋషి తుల్య లక్షణాలు భరద్వాజుడి నిజనైజాలు. ఆకలితో పేగులు కనలి కనలి.. బాధల పాకుడు రాళ్లపై జారిజారి... అనుభవాల ఉలితో తనను తాను చెక్కుకున్న శిల్పాచార్యుడు భరద్వాజ. జ్ఞాన పీఠ సోపానాలను అధిరోహించడానికి వారి నవలలు; కథలు; స్మృతి ఆవిష్కరణలతో పాటు ఎన్నో శ్రవ్య నాటికలూ, నాటకాలూ అర్హత నిచ్చాయి.

మృత్యువును కథాంశంగా తీసుకొని భరద్వాజ 1963లో నాటికను వ్రాయగా అది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ''దేశ - కాల-పాత్రలు'' అనే పేరుతో ప్రసారం చేయబడింది. అప్పుడే చనిపోయిన ఒక మనిషి, గర్భస్థ శిశువు, ఆత్మ అనే పాత్రలు ఇందులో ఉన్నాయి. ''ది క్లాక్‌'' అనే ఆంగ్ల నాటిక ఆధారంగా భరద్వాజ ఈ నాటికను రచించారు.

అనంతర కాలంలో ''లోకాన్ని ఉద్దేశించి వ్రాసిన లేఖ'' మొనలేని శిఖరం, భానుమతి; సద్య స్ఫూర్తి, కన్నీరు, ఇష్టసిద్ధి, అనే శ్రవ్యనాటికలను వ్రాశారు. లోకాన్ని ఉద్దేశించి వ్రాసినలేఖ, మొనలేని శిబిరం రెండు నాటికల్లో మృత్యువే కథాంశం. ఈ రెండు నాటికలూ ఆకాశవాణి హైదరాబాద్‌నుండి ప్రసారమయ్యాయి. భరద్వాజ రాసిన ఒక గొప్ప కథన రూపకం ''సశేషం''

సశేషాన్ని భరద్వాజ కథన రూపకం అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో స్థల, కాలాలను రచయిత ముందుగానే పరిచయం చేస్తారు. తరువాత పాత్రలు ప్రవేశిస్తాయి. కథను కొంత నడిపాక నిష్క్రమిస్తాయి. ఈ స్థల, కాలాలను మనం విస్మరిస్తే కథాసూత్రం తెగిపోతుంది. పాత్రల మాటల్లో స్థల, కాలాల ప్రసక్తి ఎక్కువగా ఉండకపోవడం ఈ ప్రక్రియలోని విశేషం. సశేషంలో నటి, సూత్రధారుడు ప్రవేశించి పాత్రలు, స్థలాలను గూర్చి పరిచయం చేస్తారు. ఆ పరిచయంతో పాటు రచయిత, పాత్రలు చెప్పని అనేక విశేషాలను వివరిస్తారు. ఈ చరాచర జగత్తులో ఏదీ శాశ్వతం కాదు.. ఏదీ నిత్యమూ కాదు. ప్రతిదీ ఏదో ఒక నాటికి నశించి తీరవలసిందే. ఇలా పోవడాన్ని మృతి చెందడం అంటున్నారు. జీవించే అర్హత

ఉన్న వారికే మరణించే అర్హత కూడా

ఉంటుంది. జీవితం అందరినీ సమానంగా చూస్తుంది. మరణం ఒక నికషోపలం వంటిది. మంచి చెడ్డల తారతమ్యాలను మరణం ఇట్టే తేల్చివేస్తుంది. మరణమంటే మానవులందరూ భయపడతారు. సమస్త మానవకోటి భయపడుతుంది. మరణానంతరం ఇంతకంటే మంచి జీవితం ఉంటుందంటే నమ్మలేకపోతున్నారు. అలా ఉంటుందని వీరికి తెలియదు. స్వతహాగా మృత్యువు భయంకరమైనదికాదు. అదొక సహజ పరిణామం. కానీ అసహజమైన జీవితం మృత్యువును భయంకరంగా చిత్రించింది. మృత్యువు ద్వారా లభించే పరమానందాన్ని మానవులకు తెలియకుండా భగవంతుడు దాచి ఉంచాడు. ప్రతి జీవీ ఏదో ఒక క్షణాన మృత్యు సన్నిధిని చేరుకోక తప్పదు. అది తెలిసినా తప్పుకోవడానికి ప్రయత్నించడం కన్నా హాస్యాస్పదం ఏముంటుంది. ఎందరెందరో బంధువులు, మిత్రులూ నీ ఇంటి కొచ్చినప్పుడు సంతోషంతో స్వాగతం చెబుతావు. అలాగే మృత్యువును కూడా మీ మిత్రుని లాగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు స్వాగతం చెప్పలేకపోతున్నారు? ఏదో ఒక నిర్ధేశిత క్షణాన హితునిలాగానో.. అతిధిలాగానో.. ఆఖరికి శత్రువు లాగానో మృత్యువు నీ ఇంటికి రాక తప్పదు. మృత్యువు ఏ రూపంలో నీ ఇంటికి రావడమనేది మృత్యువు పట్ల నువ్వు అవలంబించే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. మృత్యువు నీకు బంధువు. నీకు స్నేహితుడు. అనంతత్వమనే మహా సౌధంలోకి ప్రవేశించేందుకు మంచి వాకిలి వంటిది మృత్యువు. భగవంతుని సంసేవనంలో నిన్ను నిమగ్నం చేయడానికి మృత్యుభయాన్ని మించిన హెచ్చరిక మరొక్కటేదీలేదు. మరణం తుది నిద్ర కానేకాదు. అది తొట్టి తొలి మేలుకొలుపు మాత్రమే.'' అనే సందేశంతో భరద్వాజ వ్రాసిన కథన రూపకం సశేషం.

ఈ రూపక రచనా నేపథ్యాన్ని భరద్వాజ ఈ విధంగా వివరించారు. ''1977 మార్చి 20న గుండెపోటుకు గురై

ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్నాను. 1983 జనవరి 6న రెండవసారి గుండెపోటుకు గురై నిజాం ఆస్పత్రిలో ఉన్నాను. ఈ రెండు సందర్భాలలో నేను చూసిన వాటినీ, నా దినచర్య గ్రంథంలో పదిలంగా నమోదు చేసుకున్నాను'' జీవితానికీ... మరణానికీ మధ్య; చేతనకూ నిశ్చేతనకూ మధ్య జీవానికి నిర్జీవానికీ మధ్యగల సరిహద్దురేఖ సన్నగా ఉంటుంది. అయినా స్పష్టంగా ఉంటుంది. జీవించడం వేరు; మరణించడం వేరు. ఈ జీవన్మరణాల మధ్యగల సరిహద్దురేఖను ఇప్పటికి రెండు దఫాలు దర్శించి, స్పర్శించే అదృష్టం నాకు లభించింది. ఆ రేఖను దర్శించినప్పుడూ, స్పర్శించినప్పుడు నేను పొందిన అనుభూతులూ, నేనులోనైన సంవేదనలూ నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకమున్నాయి.

ఈ అనుభవాలనూ; అనుభూతులను ప్రాతిపదికగా చేసుకొని ఏదన్నా వ్రాద్దామన్న ఆలోచన. బెజవాడ గోపాలరెడ్డి ఓ ఉత్తరం ద్వారా నన్ను పరామర్శించారు. ఆ ఉత్తరం నన్ను దిలించింది. ఆ ఉత్తరం నా గురించి నాకు సరికొత్త భాష్యం చెప్పింది.'' ఆ ప్రేరణతో 'సశేషం' కథన రూపకాన్ని వ్రాశాను.

అమృతమూర్తి అనే మంచిమనిషి గుండెనొప్పితో విలవిలలాడుతుంటే మిత్రులు ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు కొన్నాళ్లు చికిత్స జరగడం, తగ్గింది అనుకున్న సమయంలో హఠాత్తుగా ప్రాణం పోవడంతో నాటకం ముగుస్తుంది. మలిరూపంతో ప్రారంభమయ్యే ఈ నాటకాన్ని అంతరంగం, బహిరంగం అని రెండు రంగాలుగా విభజించారు. అంతరంగంలో మనోసాగరంలో ఎగిసిపడే మధనాలు; ఆలోచనలు; ఆవేదనలు వ్యక్తమైతే బహిరంగంలో పాత్రల మధ్య సంభాషణాత్మకంగా సన్నివేశం జరుగుతుంది. శ్రవ్య నాటకంగా దీనిని మలచినప్పుడు కొన్నిచోట్ల నాటకీయతను చేయడంతోపాటు అమృతమూర్తి స్వగతంగా చేశారు. ఇందులో ఒక సన్నివేశానికి భరద్వాజ గర్తమానం అనే కొత్త మాటను ప్రయోగించారు. గర్తమానమంటే భరద్వాజ మాటల్లో చెప్పాలంటే ''గతకాలంలోని ఓ సంఘటనను వర్తమాన కాలంలో చెబుతున్న సందర్భాన్ని తెలియజేయడం''. అంటే ఫ్లాష్‌ బ్యాక్‌.

''శరీరధారులకు మరణమనేది సహజం. జీవించడమనేది అసహజం. అందుచేత ఎవరైనా క్షణకాలంపాటు ఊపిరి తీసుకొన్నారంటే ఎంతో లాభం సంపాదించామనే అనుకోవాలి'' అనే కాళిదాసు రఘువంశంలోని మాటలతో సూత్రధారుడు నాందిని చెప్పడంతో నాటకం ప్రారంభమౌతుంది. సూత్రధారుడు నటితో కలిసి ప్రస్థావనను నిర్వహిస్తాడు. ఇది నాటకం కాదు. నాటకీయత ఉన్న కథ. ఒక రకంగా ఇది సుఖాంతం. మరొక రకంగా ఇది విషాదాంతం. ఈ సుఖదుఃఖాలు రెండూ ఒకేసారి ఒకేచోట కలిసిమెలిసి కలిసిపోయి ఉండడం. ఇది పూర్తి కథకాదు. అలాగని నాటకం కాదని సూత్రధారుడు ప్రస్థావన ముగించడంతో నాటకం ప్రారంభమౌతుంది. అంతరంగం; బహిరంగం; ఒక్కొక్కసారి అంతరంగం, బహిరంగం ఏకకాలంలో జరుగుతాయి. అంతరంగం అని సూత్రధారుడు ప్రత్యేకంగా చెప్పినప్పుడు అమృతమూర్తి అంతఃచేతన వివరించబడుతుంది. సుప్తచేతనలోని భావాలకు అద్దం పడుతుంది. అమృతమూర్తి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోగానే సూత్రధారుడు ప్రవేశించి చావు పుట్టుకల చక్రభ్రమణంలో ఇక్కడ ఒక జీవికి చరమాంకం... మరో చోట ఇప్పుడే మరొక ప్రాణికి నాందీ ప్రస్థావన. ఇక్కడ నుండి వెళ్లి మరోచోట కొత్త నాటకాన్ని ప్రారంభిద్దాం'' అంటూ నాటకాన్ని ముగిస్తాడు.

''నా కోపం... ఆనందం.. నా విషాదం... నాతృప్తి.. ఆత్మ ఇవన్నీ నేను కాదు'' వీటి అన్నింటిని కలుపుకొని

ఉన్నప్పుడూ నేను ఉన్నాను. వీటన్నింటినీ వదిలేసినప్పుడూ నేను ఉన్నాను'' 'నేను' అనే అహాన్ని ఛిద్రం చేసినప్పుడు మిగిలే అనంతమైన శూన్యాన్ని భరద్వాజ సశేషంలో గొప్పగా వివరించారు. ఈ పరమ సత్యాన్ని కథగా; సంభాషణగా; నాటకం లాంటికథగా, కథలాంటి నాటకంలా, కావ్యంలాంటి వాక్యంగా, శాస్త్రం గాని శాస్త్రంగా, తత్వంగాని తత్త్వంగా తనకు తోచిన  రీతిని చెప్పాలనే తాపత్రయం సశేషంలో కన్పిస్తుంది. జీవన సమరంలో జీవితం కోసం జీవకోటి ఎదుర్కొనే పోరాటాన్ని కళ్లకు కట్టినట్లుగా తన రచనల్లో చూపించే భరద్వాజ సశేషంలో జీవి ఆంతరంగికంగా అనుభవించే ఆరాటాన్ని ఆ పాత మధురంగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఆత్మీయంగా అందించారు. ఈ తాత్విక చింతనను హృద్యంగా చిత్రించడానికి వినూత్న కథని శైలి ఎంతగానో ఉపకరించింది. ఇందులో ఒక్కొక్క చోట అనర్గళమైన కవితాధార జలపాతంలా దూకుతుంది. మరోచోట అహ్లాదమైన కథాగమనం గోచరిస్తుంది. మధ్య మధ్య హఠాత్తుగా వేదాంత చర్చ పుడుతుంది. ప్రాచ్య, పాశ్చాత్య వైద్య శాస్త్రమంతా ఒక్కొక్క చోట చీకటి గుహల్లో వెలుతురును చూపిస్తుంది. అన్నింటిలో ప్రాణవాయువుగా సంచరించే ఆత్మతత్వవిచారం ''సశేషం''లో రచయితను నిర్వచించి రచించే సత్వసారం. జీవితంలో మనం సాధించాలనుకొన్నది చివరకు మనకు కాకుండా పోతుండడం కళ్లారా చూసిన పాత్రలు మన దృష్టిని అంతర్ముఖం చేస్తాయి. లోక, శోక వినాశం ద్వారా పరలోక పరమార్థాన్ని వివరించేందుకే 'సశేషం'లోని ప్రతి శబ్దం సార్ధక్యాన్ని పొందింది. ఇలాంటి సమర్థపదవిధి భరద్వాజ పెన్నిధి. మరణానంతర జీవితంలోని చిరంతన రహస్యాలను పనసతొనల్లా విడమరచి చెప్పడంలో భరధ్వాజ ఆలోచనాలోచనం సార్థక్యం చెందింది. జన్మరాహిత్యం వంటి గంభీర విషయాన్ని ఇల్లు ఖాళీ చేసేటప్పుడు సామాను సర్దుకోవడం వంటి సామాన్య సంఘటనతో మేళవించి చెప్పడం భరద్వాజ కథా కథన కౌశలానికి ఒక చిన్న తార్కాణం.

భాష చెప్పినట్లు భరద్వాజ పలకలేదు. భరద్వాజ చెప్పినట్లు పలికింది. చివరిక్షణాల్లో అమృతమూర్తికి మృత్యువు సాక్షాత్కరిస్తుంది. ఆ మృత్యువులోని రమణీయ రహస్యాన్ని వివరిస్తూ ''కనులెత్తి చూస్తున్న కాంతి కిరణంలా... అప్పుడే విరిసిన ఇంద్రధనసులా... మహాకవి అంతరాలలో మెదిలే సద్భావరేఖలా మహాయోగి ప్రశాంత చిత్తంలా - మహతీస్వనంలా.... శరత్‌ పూర్ణిమలా.. అమృత కలశంలా.. చిన్మయానందంలా.. నిశ్శబ్దంలా .... నిలువెత్తు నవ్వులా.... అన్నీ అయినట్లుగా.. ఏమీ కానట్టుగా... అంతా తెలిసినట్టుగా... ఏమీ తెలియనట్టుగా  సచ్చిదానందంలా

ఉన్నదట. సామాన్యులకు దూరం కాకుండా అసామాన్య భావాలను అందుకొని అందించడమే సశేషంలో కనిపించే సారస్వతమైన ఆరాటం. ఆయన జీవన పోరాటం ''సశేషం''లో ఆరాటంగా మారింది. ఈ ఆరాట పోరాటాలకు అతీతమైన కువలయ లయ విన్యాసాలను వినిపించే కోలాటాన్ని కూడా భరద్వాజ తన రసధునితో మేళవించి వినిపించిన రసమయ కథన నాటకం సశేషం.

ఈ రచనలో మృత్యువు వెలిబుచ్చిన భావాలను షెర్లాక్‌, ట్రయాన్‌ ఎడ్వర్డ్స్‌, పుల్లర్‌; కార్వెల్‌, మిల్టన్‌ వంటి రచనలను భరద్వాజ స్ఫూర్తిగా స్వీకరించారు. సశేషం కథన రూపకాన్ని యస్‌.వి.ప్రసాద్‌ శ్రవ్యనాటకంగా అద్భుతంగా మలిచారు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్‌, నుండి పలుమార్లు ప్రసారమైంది. అమృతమూర్తి పాత్రను డాక్టర్‌ చాట్ల శ్రీరాములు అద్భుతంగా పోషించారు. డాక్టర్‌ రావూరి భరద్వాజకు జ్ఞాన్‌పీఠ్‌ పురస్కారాన్ని అలంకరించిన వెండితెరపై మెరిసే నటీమణుల జీవితాల చీకటి వెలుగుల్ని కలైడోస్కోప్‌లో చిత్రించిన గొప్ప నవల పాకుడు రాళ్లు. ఈ నవలను మొదటి శివరామరావు నాటకీకరణ చేయగా ఆకాశవాణి హైదరాబాద్‌ నుండి ప్రసారం చేయబడింది. అనంతరం ఇదే నవలను జీడిగుంట రామచంద్రమూర్తి నాటకీకరించి స్వీయ సమర్పణలో ఆకాశవాణి ద్వారా ప్రసారం చేశారు. ఈ నవలలో మంజరి పాత్రను శ్రీమతి శారదా శ్రీనివాసన్‌ అనితరసాధ్యంగా పోషించారు.

భరద్వాజ ఒక దశాబ్దికాలం ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రంలో నిర్వాహకునిగా ఉద్యోగించారు. శ్రవ్య మాధ్యమంపై ఆయనకు పట్టు అపారమైనది. ఈ నేపథ్యంలో శ్రవ్య నాటక రచనకు పెద్ద పీట వేశారు. ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం నుండి ప్రసారమైన నాటకాల్లో సశేషం;

పాకుడురాళ్లు శ్రవ్య నాటకాలు మైలురాళ్లుగా నిలిచాయి. జీవిత పాఠశాలలో అనుభవాలే ఉపాధ్యాయులుగా, హృదయ స్పందనలే ఆర్థ్రతగా రచన చేసిన భరద్వాజ నూటికి నూరుపాళ్లూ జ్ఞానపీఠ సుప్రతిష్టతకు అచ్చమైన అర్హుడు.