ఆటవిడుపు

 

 

 

 

సిహెచ్‌.వి. బృందావనరావు         9963399189
అల్లసాని పెద్దన్నో అభినవ శ్రీనాధుడో
ఒళ్లు తిమ్మిరెక్కి ఏడిచే
అందమైన అమ్మాయిల ఏడుపుల్ను
గణయతి ప్రాసల కవిత్వంతో
గమకంగా వినిపిస్తారు గాని
ఏడుపులే బతుకులైన వారి రోదనలను
ఎవరు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు.
ఏడుపులే ఏకాంతనేస్తాలై
చింతల బొంతల్లోనే నిరంతరమూ
నివాసం చేస్తున్నవాళ్ళనూ
బతుకు బంజర్లచుట్టూ
విలాపాల కంచెలు కట్టుకొని
ఆగామి మీద ఆశలెరుగని
అమాయకపు ఏడుపు పొట్లాలనూ
ఏ కవి తన కవితా వస్తువుగా స్వీకరిస్తాడు.
గెలిచిన వాడిదే రాజ్యమైనాక
కొల్లగొట్టబడ్డ వాళ్ళందరూ వెళ్ళగొట్టబడ్డవాళ్ళే.
విజేతలు రాయించిన వీలునామాలు
ఏడుపొక్కటే గదా
చరిత్ర వాళ్ళకు మిగిల్చిన వారసత్వం
ఊర్పులే ఊపిర్లై, ఎక్కిళ్ళే చెక్కిళ్ళైన
వీరి అశ్రుసంగీతాలను
ఏ సరిగమలూ అక్కున చేర్చుకోవు.
ఊరు ఊరంతా
నవ్వుల పల్లకీ మీద ఊరేగుతుంటే
వీరి గల్లీలు మాత్రం
ఏడుపు పాటల సంపుటాలుగానే ఉండేవి
వెన్నెల దుప్పటి కప్పుకొని లోకం
వెచ్చటి కలల మీద తేలిపోతుంటే
ముడుచుకు పోయిన ముతకబొంతై వీరి వీధి
కలత కలవరింపుల ఉలికిపాటు అయ్యేది
సాంత్వనల మొసలి కన్నీళ్ళకూ
సానుభూతి ప్రకటనలకూ
సంస్కరణ ప్రదర్శనలకూ
ఉద్ధారక బిరుదావళులకూ
వీరి ఏడుపుల్నే పెట్టుబడి చేసుకున్న భద్రలోకం
ఉదారపు అనుకంపల వెనకాల
వెక్కిరింపుల వెక్కసాల్ని దాచుకుంటుంది
ఇక ఇప్పుడు ఏడుపులకే
ఏడుపొచ్చే రోజులోచ్చేశాయి.
బాధకు పర్యాయపదం కవిత్వమేగాని
బాధ తెచ్చే ఏడుపును బహిష్కరించింది కవిత్వం
కొత్తభాషనూ, కొత్త పరిభాషనూ నిర్మించుకుని
కొత్త భావాల బావుటా ఎగిరేందుకు
కొత్త పిడికిలై బిగుసుకుంటున్నది
ఏడుపులకింక శిక్ష
అవమానాల కింక ఆటవిడుపు
ఏడ్చిన ప్రతిగొంతూ
ఇప్పుడో కొత్త రవికిరణం.