ధర్మ వడ్డీ

కథ

- త్రిపురనేని గోపిచంద్‌

నేనా వూరు ఎందుకు వెళ్ళానో, నా కిప్పుడు జ్ఞాపకం లేదు. కాని వెళ్ళటం, చిన్నప్పటి స్నేహితుడు కనపట్టం, తన ఇంటికి నన్ను తీసుకువెళ్ళటం జరిగింది. కలవక కలుసుకోవటం వల్ల, చిన్నప్పటి విషయాలు తలుచుకొని నవ్వుకుంటూ వున్న సమయంలో అతడొచ్చాడు. రావటం రావటం ఎలా వచ్చాడని?

ముందువాకిలి నెమ్మదిగా తెరిచాడు. కుడికాలు గడపలో పెట్టి అటూ ఇటూ దొంగచూపులు చూశాడు. చంకలో వున్న మూటని పదిలంగా రెండోచేత్తో పట్టుకొని, తల ఓరగా పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ, నా స్నేహితుని దగ్గరకు వొచ్చి చంకలో మూట అందిస్తూ, ''ఇదిగోనోయ్‌ డబ్బూ'' అన్నాడు.

అసలు అతన్ని చూడగానే నా స్నేహితునికి ముఖ కవళికలు మారిపోయినై. అంతకు ముందున్న సంతోషం మాయమైపోయింది. నెమ్మదిగా మూట అందుకుంటూ, ''మనిషంటే మనిషివి నువ్వే సూరయ్యా! నికార్సయిన మనిషివి'' అన్నాడు.

ఈ మాటకు సూరయ్య సంతోషం పైకి కనపడనివ్వకుండా, ''మాటలకేంలే! డబ్బు తీసుకోగానే కాదు. నెల రోజుల్లో అసలు ఫాయిదాలు ఇచ్చివెయ్యాలి. వడ్డీ నీకు తెలిసిందేగా - ధర్మ వడ్డీ - నెలకు నూటికి రూపాయిన్నర. అదైనా నువ్వని ఇస్తున్నాను.'' అన్నాడు.

''అలాగే సూరయ్యా! నెల దాటకముందే ఇస్తాను'' అన్నాడు నా స్నేహితుడు.

ఇస్తానంటే కాదు. మాట చెల్లించుకోవాలి. శుభకార్యం ఒకటి తలపెట్టానా? మంచికీ చెడుకీ డబ్బు కావాల్సివొస్తుంది. తర్వాత కోర్టు గీర్టూ అంటే...''

అదేమిటి సూరయ్యా! నీ దగ్గర ఎన్నిసార్లు డబ్బు తీసుకోలేదు. ఎన్నిసార్లు ఇవ్వలేదు. ఎప్పుడైనా మాట తప్సీలు వొచ్చిందా?''

''సరేలే. డబ్బు లెక్కపెట్టుకో. అన్నీ రూపాయిలే. కొద్దిగా మాత్రం చిల్లర వుంది. మళ్ళీ నాకు రూపాయిలే ఇవ్వాలి సుమా! నోట్లూ గీట్లూ అంటే కుదరదు.''

''నువ్వు చెప్పాలా, సూరయ్యా'' అంటూ నా స్నేహితుడు మూట విప్పాడు. చూసేటప్పటికి నా తల తిరిగిపోయింది. అయోమయం అయిపోయింది. ఆ మూటలో వున్నవన్నీ రాళ్ళే! చిన్న చిన్న రాళ్ళూ, పెద్ద పెద్ద రాళ్ళూ. పెద్దవన్నీ కంకరరాళ్ళూ. చిన్నవన్నీ గులకరాళ్ళూ! నమ్మలేక నా స్నేహితుని మొహం పరీక్షగా చూశాను. అతను మాత్రం ఇదంతా లెక్కచెయ్యకుండా, అతి జాగర్తగా ఆ రాళ్ళని తీసి ఒక్కొక్కటే లెక్క పెడుతూ కూర్చున్నాడు.

నాకేమీ తోచక సూరయ్య వంక చూశాను. అతనింకా తల ఓరగానే పెట్టి లెక్క పెట్టబడుతూవున్న రాళ్ళను రెప్ప వెయ్యకుండా పరీక్షిస్తున్నాడు. ఇంతలో నా స్నేహితుడు లెక్క పూర్తిచేసి, ''సరిపోయినయి, సూరయ్యా'' అన్నాడు.

''ఇవ్వాళ సరిపోయినై అంటే కాదోయి. ఇవ్వాళ ఇరవై. మళ్ళా ఇరవై సోమవారం నాటికి నా డబ్బంతా దమ్మిడీల్తో ఇచ్చెయ్యాలి'' అని జ్ఞాపకం చేసి నా స్నేహితుడితో మూడుసార్లు ''ఇస్తాను'' అనిపించుకొని వెళ్ళిపోయాడు సూరయ్య.

అతడు ఎప్పుడు వెళ్తాడా, ఈ తంతేమిటో ఎప్పుడు తెలుసుకుందామా అని కూర్చున్న నేను, అడుగుదామని నా స్నేహితునివైపుకి తిరిగేటప్పటికి, అతడు చేత్తో నన్ను వారించి వాకిలివైపు చూపాడు. నేను అటు చూట్టం, సూరయ్య గభాలున తలుపు నెట్టుకొని లోపలకు రావటం ఒకేసారి జరిగింది. మనిషి ఇదివరకుమల్లే లేడు. అపాదమస్తకం వొణికిపోతున్నాడు. కళ్ళు యెర్రగా జ్యోతుల్లా వున్నై. గాలి తెగ పీలుస్తున్నాడు. తల మాత్రం ఓరగానే వుంది.

ఒక్క క్షణం వాకిట్లో ఆగి రంయిన నా స్నేహితుడి మీదకు వచ్చి ఇలా కేకలువేశాడు- ''ఏదీ నా డబ్బు? ఎన్నాళ్ళయింది? ఇదిగో అదిగో అంటూ కుక్కని తిప్పుకున్నట్టు నీ యింటిచుట్టూ తిప్పుకుంటావా? పరువూ మర్యాదా ఉండక్కర్లా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా?''

నిజం చెప్పొద్దూ! ఈ మాటలు వినేటప్పటికి నాకు కంపరమెత్తింది; కోపం వచ్చింది కాని ఏమి చెయ్యటం? గుడ్లు వప్పచెప్పి చూస్తూ కూర్చున్నాను.

నా స్నేహితుడు భయంగా, అతి వినయంగా, ''ఇదిగో సూరయ్యా, నీ డబ్బు! నాల్గు రోజులు ఆలస్యమైనంత మాత్రాన నీబోటి పెద్దమనిషి ఇట్లా నోరు పారేసుకోవడం ఏం మర్యాద?'' అని తన దగ్గరే వున్న ఆ రాళ్ళమూటని ఇచ్చాడు.

''మరి వడ్డీయో? డబ్బు నాకు చేదై ఇచ్చాననుకున్నావా? నీ తాతకి అచ్చుండి ఇచ్చాననుకున్నావా? పూర్తి పరిష్కారం చేసి కదులు,'' అని బొడ్లో చెయ్యేసి నిలవేశాడు సూరయ్య.

''ఇస్తాను సూరయ్యా, వొదులు'' అన్నాడు నా స్నేహితుడు.

''తీసుకురా'' అని ఒక్క తోపు తోశాడు సూరయ్య.

నా స్నేహితుడు పడబోయి నిభాయించుకొని గోడ పక్కకు వెళ్ళి, పది రాళ్ళు ఏరి తెచ్చి సూరయ్య చేతిలో పెట్టాడు. సూరయ్య వాటిని లెక్కపెట్టుకొని, నా స్నేహితునితో ఒక్క మాటైనా అనకుండా గిరుక్కున వాకిలివైపుకు తిరిగి తల ఓరగా వుంచుకొని గబగబా నడిచి వెళ్ళిపోయాడు.

నా స్నేహితుడు ఒక్క నిట్టూర్పు విడిచి నేను అడగవలసిన అవసరం లేకుండా తానే యిలా చెప్పాడు- ''పాపం ఏం చెప్పను? ఒకప్పుడు ఈ ఊళ్లోకళ్లా షావుకారు సూరయ్య. ఇప్పుడు పిచ్చెక్కి యీ విధంగా తయారయ్యాడు'' అన్నాడు.

''ఇతనికి పిచ్చా! ఎందుకెత్తింది? పిచ్చిలో యిదేమిటి?'' అని అడిగాడు.

నా స్నేహితుడు సూరయ్య కథ యీ విధంగా చెప్పాడు:

''సూరయ్య యీ గతికి రావటానికి అతని తండ్రే కారణం. అతని తండ్రి చాలా మంచివాడు. మెత్తని హృదయం కలవాడు. అటువంటి అతడే, కొడుకు పతనానికి కారకుడయ్యాడు.''

''అంత మంచివాడు...''

చెప్తాను విను. అంత మంచివాడు అవటం వల్ల దానాలుచేసి, అడ్డాలు వుండీ తన ఆస్తంతా పాడుచేశాడు. అన్నీ పోయిన తర్వాత పలకరించే దిక్కు లేకుండా చచ్చిపోయాడు. ఇది కన్నులారా చూచిన సూరయ్యకు సంఘం మీద కసి ఏర్పట్టంలో ఆశ్చర్యం లేదు. అందుకని పూర్తిగా తన స్వభావాన్ని మార్చుకొని, పెత్తనానికి వొచ్చినప్పటి నుంచీ కఠోరంగా సంపాదించటం మొదలుపెట్టాడు. ఉన్న నాలుగు ఎకరాలూ అమ్మేసి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు. మనుషుల్తో వున్న ఇతరత్రా సంబంధాలన్నీ క్రూరంగా తెగ్గొట్టుకున్నాడు. తనకీ, మిగిలిన మనుషులకీ ఒక్కటే సంబంధం - వడ్డీ వ్యాపారం. తాను వడ్డీకి డబ్బు యివ్వటానికి పుట్టాడు: మిగిలిన జనం డబ్బు పుచ్చుకొని వడ్డీ ఇచ్చుకోటానికి పుట్టింది.

ఇట్లా తయారై, మిగిలిన రైతుల్ని పీల్చి పిప్పిచేసి కొద్ది సంవత్సరాల్లోనే వూళ్ళోకల్లా షావుకారై కూర్చున్నాడు. ఎంత షావుకారైనా డబ్బు సంపాదించటం అలవాటైన తర్వాత పద్ధతులు యెలా మారతై - కనక డబ్బు అవసరం లేనప్పటికీ కూడా పాత పద్ధతుల మీదే నడిచాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. అరిచి గీ పెట్టినా దమ్మిడీ జారనిచ్చేవాడు కాదు. బాకీదార్లని ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టి, ఇన్ని నీళ్ళు కూడా పుట్టకుండా చేసి తన డబ్బు పిండుకునేవాడు. ఆ పిండుకోవటంలో కూడా దయాదాక్షిణ్యాల్లేవు. కొంపలు కూలినా, కుటుంబాలు నాశనమైనా అతని హృదయం కరిగేది కాదు.

అందుకని అతని డబ్బుతోపాటు, అతనిమీద వూళ్లో అసూయా అసహ్యం కూడా పెరుగుతూ వచ్చినై. అతన్ని చూస్తే భయమే తప్ప, యిష్టం ఒక్క వ్యక్తిక్కూడా లేకుండా పోయింది. సూరయ్య యిది కూడా మంచిదే అనుకున్నాడు. నాక్కావలసింది డబ్బు! వీళ్ళ యిష్టం ఎవరిక్కావాలి? అంటూ వుండేవాడు. పరిస్థితులు ఇట్లా వుండగా ఒక సంఘటన జరిగింది.

ఈ ఊళ్ళోనే అవతల వీధిలో చంద్రయ్య అనే రైతు వున్నాడు. చంద్రయ్య ఈ సూరయ్యకి రెండువందల రూపాయల బాకీ యివ్వలేదు. చంద్రయ్య అవటం చిన్న రైతే ఐనా టౌన్తో సంబంధం వున్నవాడు అవటం వల్ల, డబ్బన్నా కోర్టన్నా లెక్కలేకుండా వుండేవాడు. డబ్బున్నవాళ్ళంటే అసహ్యం వుంది. భయం లేదు. తనకు అవసరానికి డబ్బిచ్చాడనే విశ్వాసం లేకపోగా తన దగ్గర సూరయ్య అన్యాయంగా డబ్బు దోచుకుంటున్నాడనే భావం, కోపం కలిగినవాడు. సూరయ్య హెచ్చు వడ్డీ వస్తుందని అతనికి అప్పు పెట్టాడేగాని, పెట్టిందగ్గర్నుంచీ డబ్బు రాదేమో అనే భయంతో అతని ఇంటి చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు. ఒకరోజు చంద్రయ్యని నా డబ్బిచ్చి కదలమని నిలవేశాడు. నానా దుర్భాషలూ అడాడు; దాన్తో లోలోపల రగులుకుంటున్న అగ్ని చంద్రయ్యలోనుంచి గుప్పున బయటపడింది - ''నేను దమ్మిడీ ఇవ్వను. నీ తాత్తో చెప్పుకో! ముందు గడపలో నుంచి అవతలకు వెళ్ళు'' అని కేకలువేశాడు.

పాపం సూరయ్యకు ఇట్లాంటి అనుభవం ఇదివరకెప్పుడూ కలగలేదేమో, చంద్రయ్య మాటలకు నిరుత్తరుడై ఒక్క నిమిషం మాట్లాడలేకపోయాడు.

''వెళ్ళవ్‌!'' గద్దించాడు చంద్రయ్య. ''చంద్రయ్యా! ఇది నీకు మంచిది కాదు: కోర్టుకు లాగి పప్పు తీయిస్తాను.'' అన్నాడు సూరయ్య.

''పప్పు తీయిస్తావట్రా మాదచ్చోద్‌'' అని నానా బూతులు కూసి మెడమీద కర్రవేసి బయటకు గెంటాడు  చంద్రయ్య.

ఇక చూడు సూరయ్య సంగతి. సూరయ్యకు శివం ఎత్తింది. పిచ్చి గంగిర్లెత్తినై. కనపడ్డవాడుకల్లా చెప్పాడు. ''ధర్మవడ్డీ - ధర్మవడ్డీ కూడా ఇవ్వడట! అసలే ఇవ్వడట! ఇదెక్కడన్నా వుందా? రాములవారి కాలం నుంచీ ఈ వడ్డీ వుందికదా!'' అని మొత్తుకున్నాడు.

తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి గబగబా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని, అంగోస్త్రం నడుంకి కట్టి తెల్లగుడ్డ గొడుగు చంకన పెట్టి టౌన్‌కి బయల్దేరాడు. అప్పటికీ ఆశ చావక, చంద్రయ్య వాకిలిముందు సకిలిస్తూ నాలుగైదుసార్లు అటూ ఇటూ పచారు చేశాడు: బజార్న పోతున్న వార్ని నిర్నినిమిత్తంగా పిలిచి, ''కొంచెం కోర్టులో పనివుండి టౌన్‌కి వెళ్తున్నాను'' అని ఇంట్లో వున్న చంద్రయ్యకు వినబడేటట్లు చెప్పాడు. చంద్రయ్య ''కోర్టుక్కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మదేముడి దగ్గరకు వెళ్ళు. ఈ వూరు నీళ్లు నీకు ప్రాప్తం లేదు'' అని ఇంట్లోనుంచే కేకవేశాడు.

ఇంకేం చేస్తాడు? ఇక తప్పేదేముంది? చంద్రయ్య మాటలకు కొంచెం జంకినా డబ్బెలా వొదులుకోవటం? మనస్సుని తిట్టి లోబరుచుకొని టౌన్‌కి వెళ్ళి ప్లీడరుతో మాట్లాడి, చంద్రయ్యకు రిజిష్టరీ నోటీసు ఇప్పించాడు. నోటీసైతే ఇప్పించాడేగాని, మనస్సులో ఆరాటం హెచ్చింది. దిగులుదిగులుగా వుండి ఏమీ తోచక టౌనులో అటూ ఇటూ తారట్లాడి ఇంటికి బయల్దేరేటప్పటికి అతనికి భయం వేసింది. ఆ డొంక మా ఒక్క వూరికి వచ్చేదే అవటం వల్ల మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది. పైగా రెండు పక్కలా కొరివిదయ్యాలు తలలు విరబోసికున్నట్లు కనబడే, గుబురుగా పెరిగిన చెట్లు. సూరయ్య ధైర్యంచేసి ఆంజనేయ దండకం పఠిస్తూ డొంకలో పది గజాలు నడిచాడు. ఆ పెద్ద మర్రిచెట్టు చూశావుగా, అక్కడకు వొచ్చాడు. ఆకస్మాత్తుగా పక్క పొదల్లో అలికిడి వినిపించి ఆగిపోయాడు. గొంతులో పాట గొంతులోనే ఆగిపోయింది. వెంటనే అతనికోసం పొదల్లో కనిపెట్టుక్కూచున్న చంద్రయ్య ముఠా పదిమంది అతన్ని కమ్ముకున్నారు. మీదకు దూకారు. చావచిదకగొట్టారు. పాపం కింద పడేసి సున్నంమీద ఎముకల్లేకుండా కొట్టారు. చంద్రయ్య మీదపడి అతని జేబులో వున్న ఇరవై రూపాయలూ లాక్కొని ''దావా దాఖల్చేశావుగా? ఖర్చెవరు పెట్టుకుంటారు నీ తాత?'' అని కాలికి వొచ్చినట్టు తన్నీ, మిగిలినవాళ్ళని తీసుకొని, సూరయ్యని అక్కడే వొదిలి వెళ్ళిపోయారు.

క్షణాలమీద ఈ వార్త వూరంతా పొక్కింది. సూరయ్యని కొట్టారంటే సూరయ్యని కొట్టా''రని వూరంతా ఆ గుబ్బుగా చెప్పుకుంది. కాని ఒక్కడు కూడా జాలి తలిచినవాడే లేడు. 'పాపం' అన్న పాపాన పోయినవాడే లేడు.

సూరయ్య భార్య దొడ్డ ఇల్లాలు. కూతురు కూడా చాలా మంచిది. కాని బయట జరిగే దురంతాలను వాళ్ళెలా ఆపగలరు? సూరయ్య మనస్సును ఎలా తిప్పగలరు?

తెల్లగా తెల్లవారింతర్వాత వూళ్ళో షావుకార్లు సూరయ్యని పరామర్శించటానికి వొచ్చారు. సూరయ్యకు ఆ రాత్రంతా నిద్ర లేదు. ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. భార్యా కూతురు నోటికి మూత లేకుండా ఏడుస్తున్నా, వాళ్ళ వంకకి చూట్టం లేదు. అన్ని దెబ్బలు తిన్నా ఒక్క మూలుగన్నా మూలగటం లేదు.

షావుకార్లు వొచ్చి, ''సూరయ్యా! ఇక చూస్తూ వూరుకుంటే లాభంలేదు. క్రిమినల్‌ కేసు బనాయించి వాళ్ళ అంతు కనుక్కోవలసిందే!'' అన్నారు.

సూరయ్య కొంచెం కదిలి, వాళ్ళని నింపాదిగా చూచి, ''ఇంకేం? అందరం చందాలు వేసుకొని వ్యాజ్యమాడదాం'' అన్నాడు.

'చందాలు' అనేటప్పటికి షావుకార్లు మొహమొహాలు చూచుకున్నారు. ''అదేమిటి సూరయ్యా నిన్ను కొట్టటమేమిటి? మేం చందాలు వేసుకోవటమేమిటి?'' అన్నారు.

ఈ మాటలకు సూరయ్యకు కోపం వచ్చింది. అంత బాధలోనూ లేచి కూర్చొని, ''వాళ్లు నన్ను కొట్టారా? నా దగ్గిర వున్న డబ్బుని కొట్టారు. అంటే ఈ వూళ్ళో వున్న షావుకార్లందర్నీ కొట్టారు. వడ్డీకోసం అప్పుపెట్టే ప్రతివాడ్నీ కొట్టారు. నన్ను కొట్టటమైతే ఒక్క చంద్రయ్యే కొట్టేవాడు. మిగిలినవాళ్ళంతా ఎందుకు కుమ్మక్కు చేస్తారు? వాళ్ళు కొట్టగలరు గనక అంతా కలిసి కొట్టారు. మనం చందాలు వేసుకోగలం గనక అంతా కలసి చందాలు వేసుకుందాం'' అన్నాడు.

షావుకార్లకు యిదేమీ అర్థం కాలేదు. దెబ్బల్తో సూరయ్య మతి చెడ్డదీ అనుకున్నారు. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు జారుకున్నారు.

ఎంతమంది చెప్పినా, ఎంత చెప్పినా సూరయ్య వినలేదు - కేసు పెట్టనంటే పెట్టనన్నాడు. ''నా సొంత డబ్బు తగలేసుకొని, ఈ డబ్బున్నవాళ్ళకోసం వ్యాజ్యం ఆడిపెట్టనా? నే చెయ్యను'' అనేవాడు.

కాని, చంద్రయ్య ఏ ముహూర్తాన చెయ్యిచేసుకున్నాడోగాని, అప్పటినుంచీ సూరయ్య దశ తిరిగిపోయింది. దెబ్బలు తిని కేసు పెట్టకపోయేటప్పటికి వూళ్లోవాళ్ళకి లొల్లి అయిపోయాడు. తాము ఏ డబ్బుని చూచి భయపడుతున్నారో ఆ డబ్బు సమయానికి సూరయ్యను ఆదుకోలేకపోయేటప్పటికి ఇంకేముంది? పెద్దలు మొదలు, కుర్రవాళ్ళ వరకూ సూరయ్యని ఆటలుపట్టించటం మొదలుపెట్టారు. ఇల్లు కదిల్తే చాలు- ''సూరయ్య వడ్డీ, చంద్రయ్య లాఠీ'' అని పిల్లలు చప్పట్లు కొట్టుకుంటూ వెంటపడేవారు. రావలసిన డబ్బు అడిగితే బాకీదార్లు ''ఏం తన్నులు కావాలా?'' అనేవారు. కొందరు ''ఇదిగో అసలు - ఇదిగో వడ్డీ' అని మొట్టికాయలు వేసేవారు కూడాను.

చివరకు సూరయ్యకు చిల్లిగవ్వ కూడా వసూలు కాకుండాపోయింది. ఎట్లా వచ్చిన డబ్బు అట్లాగే పోయింది. ఎక్కడ పెట్టిన డబ్బు అక్కడే ఇంకిపోయింది. తనకు తదనంతరమైనా వస్తుందనుకున్న ఆస్తి రాకుండా పోయిందని అల్లుడు కూతుర్ని ఇంట్లోనుంచి వెళ్ళగొట్టాడు.

సూరయ్య భార్య మొహం, కూతురు మొహం చూడలేక వీలైనంతవరకు ఇంట్లో వుండకుండా తిరుగుతూ కాలం గడిపేవాడు. నాలుగు మెతుకులు నోట్లో వేసుకొచ్చి చెరువు గట్టుమీద రావిచెట్టు కింద ఒంటరిగా కూర్చునేవాడు. ఇన్ని రాళ్ళు ఏరుకుని ఒక్కొక్కటీ చెర్లో వేస్తూ అవి నీళ్ళలో పుట్టించే కదలికను పరీక్షిస్తూ కూర్చునేవాడు.

కాని, ఊళ్ళో జనం అక్కడ అతని సుఖంగా వుండనివ్వలేదు. అతడు నిస్సహాయుడౌతున్నకొద్దీ జనం తన బలాన్ని ఎక్కువ ఉపయోగించడం మొదలుపెట్టింది. జనానికి అతనిమీద కలిగిన కసీ, అలుసూ అతనితోనే ఆగక అతని కుటుంబం మీదకు తిరిగింది.

ఒకరోజు సూరయ్య కూతురు వాముల దొడ్లో గేదెకు మేత వేస్తుంటే నలుగురు పట్టుకొని గాతంలో పడేసి బలాత్కారంగా చెరిచారు. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిం తర్వాత ఆ పిల్ల లేచి, నడవలేక కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి, బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంగతి తెలిసి సూరయ్య భార్య అవమానాలు సహించలేక కిరసనాయిలు పోసుకొని కాల్చుకొని మరణించింది. అదే సమయంలో విరోధులు సూరయ్య ఇవ్వవలసిన బాకీలు తమ పేర ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని ఇల్లు వేలం వేయించారు...''

ఇంతవరకు ఓపికతో విని, ఇక ఆపుకోలేక నేను ఈ ప్రశ్న వేశాను - '' ఈ ఘోరకృత్యాన్ని జరక్కుండా ఎవ్వరూ ఆపలేదూ?''

''తప్పన్న వాళ్ళే లేరు. చేసుకున్నది అనుభవిస్తున్నాడని కొందరూ, ఈ ఉద్రేకంలో అడ్డు చెపితే తమ కుటుంబాలు సరిగ్గా ఉండవేమో అనే భయంతో కొందరూ. మొత్తానికి అంతా మెదలకుండా వూరుకున్నారు.''

''ఊ! తరవాత ఏం జరిగింది?'' అని అడిగాను.

''ఇంకేముంది? డబ్బు దారిన డబ్బు నడిచింది. కూతురు అలా అయిపోయింది. భార్య ఇలా అయిపోయింది. సూరయ్య గుండెలు పగిలిపోయినై. ఆవులాగా అడలుతూ వూరు పట్టుక తిరిగేవాడు. కొన్నాళ్ళకు పిచ్చెత్తింది. ఇప్పుడెవరన్నా జాలితలచి ఇన్ని మెతుకులు పెడితే తింటాడు. ఆ చెరువుగట్టుమీద రావిచెట్టు కిందే వుంటాడు. ఎండలో, వానలో అక్కడే వుంటాడు. ఎప్పుడూ కూతురు సంగతిగానీ, భార్య సంగతిగానీ ఎత్తడు. ఎవర్నీ పలకరించడు. రోజు కొక్కసారి వెళ్లి తన పాత ఇంటిని దూరాన్నుంచి చూచుకొని కన్నీరు పెట్టుకుంటూ వుంటాడనీ, రాత్రిళ్ళు తన కూతురు పడి ఆత్మహత్య చేసుకున్న బావి దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తూ వుంటాడనీ వూళ్లో చెప్పుకుంటూ వుంటారు... ఇదీ సమాచారం...''

నేను కథంతా ప్రాణాలు బిగపట్టుకొని విన్నాను. సూరయ్య కథ చెప్పమన్నప్పుడు ఇటువంటి విషాదగాథ వింటానికి సిద్ధపడలేదు. గనుక చాలా ఖేదపడ్డాను.

''మరి ఈ రాళ్ళ వ్యవహారమేమిటి?'' అని అడిగాను.

''అలవాటు'' అన్నాడు నా స్నేహితుడు. ''పాత అలవాటును పట్టి ఇలా చేస్తూవుంటాడు. మేం కూడా జాలిపడి అతని మనస్సుని ఈ అవస్థలో కష్టపెట్టడం ఎందుకని తగువిధంగా ప్రవర్తిస్తూవుంటాం. ఈ సూరయ్య...''

నా స్నేహితుడు చెబుతుండగానే వీధిలో పెద్దగోల బయల్దేరింది ''సూరయ్య వడ్డీ, చంద్రయ్య లాఠీ'' అని కేకలు బయటనుంచే సూరయ్య ''బే'' అని ఆడిలాడు. ఆ ధ్వని విని మే మిద్దరం బయటకు పరుగెత్తాం.

బయట వీధిలో సూరయ్య రోజుకుంటూ, రొప్పుకుంటూ గబగబా నడుస్తూ వెళుతున్నాడు. చేతులో నా స్నేహితుడిచ్చిన మూట భద్రంగా వుంది. వెనక పదిమంది పిల్లలు పోగై గోలచేసుకుంటూ సూరయ్య మీదకు రాళ్ళు విసురుతున్నారు.

నడుస్తూ నడుస్తూ వున్న సూరయ్య ఆకస్మాత్తుగా పరుగెత్తటం మొదలుపెట్టాడు. రంయిన పరుగెత్తి ఒక ఇంటిముందు ఆగి, ఒక్క నిమిషం ఆ యింటిని చూచి, అక్కడనుంచి కదిలి పక్కనే వున్న బావి గట్టుమీద నిలబడ్డాడు. పిల్లలంతా ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. చేతుల్లో

రాళ్ళు చేతుల్లోనే వున్నాయి. నేనూ నా స్నేహితుడు వూపిరి బిగపట్టి చూస్తూ నుంచున్నాం. సూరయ్య వంగి బావిలోకి చూచి లేచి, ఇంటివైపుకి చూశాడు. ఉండి ఉండి 'బే' అని సైరన్‌లాగా, విన్నవాళ్ళకి సలపరం పుట్టేటట్టు అడిలి రాళ్ళమూటతో సహా బావిలోకి దూకాడు.

వాళ్ళూ వీళ్ళూ పోగయ్యారు గాని ఏమీ లాభం లేకపోయింది. నా స్నేహితుడిచ్చిన రాళ్ళమూట తేలనివ్వకపోయింది. శవం బయటకు వచ్చింది. మేం ఇంటికి వచ్చిన తర్వాత  నా స్నేహితుడు ఇలా చెప్పాడు - ''ఆ ఎదురుగా వున్న ఇల్లే అతని ఇల్లు. అతడు దూకిన బావే అతని కూతురు ఆత్మహత్య చేసుకున్న బావి.''