అబ్బూరి ఛాయాదేవి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కే బి లక్ష్మి ఇకలేరు

నివాళి

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

   ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (75) జూలై 25న హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 1944 మే 29 న జన్మించారు.  1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరిన తదనంతరం కాలంలో ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు.

కష్ణావతారం (1982), నెలవంక (1983), రావు- గోపాలరావు(1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆధునిక, ప్రాచీన సాహిత్యాన్ని సాధికారికంగా అధ్యయనం చేసిన ప్రతిభాశాలి. దీర్ఘకాలం విజయవాడ ఆకాశవాణిలో బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఆంధ్రజ్యోతిలోనూ, ఆంధ్రప్రభ వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తెలుగు సాహిత్య క్షేత్రంలో కవిగా, సాహిత్య విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రసిద్ధ సాహిత్యవేత్త ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి తనయుడుగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రతో తెలుగు సాహిత్యంలో ఆయన కొనసాగారు. ఔత్సాహిక, యువ రచయితలను కవిత్వం రాసేలా ప్రోత్సాహించేవారు. తెలుగు సాహిత్యంతో పాటు సంస్క ృత సాహిత్యంలో కూడా మంచి పరిచయం కలిగిన శ్రీకాంతశర్మ పలు సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. పలు పుస్తకాలకు వ్యాఖ్యానాలు రాశారు. ఆలోచన (వ్యాసాలు), అనుభూతి గీతాలు కవితా సంపుటి, ఇంటిపేరు ఇంద్రగంటి పేరుతో రాసిన స్వీయ జీవిత చరిత్ర, సువర్ణ అంతరంగ మథనం కవిత్వం, ఏకాంత కోకిల కవిత్వం, ఉపనిషత్‌ కల్పతరువు తదితర రచనలు చేశారు. వారు రాసిన నాటకాలు, నాటికలు, వ్యాసాలు తదితర సాహిత్యం మొత్తం రెండు భాగాలుగా వెలువరించారు. తెలుగు భాషా సాహిత్యానికి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ చేసిన కృషి ప్రశంసనీయమైనది.  వారికి జోహార్లర్పిస్తూ, వారి కుటుంబానికి సాహితీస్రవంతి తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం.

అబ్బూరి ఛాయాదేవి

ప్రముఖ రచయిత్రి,  కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (86) జూన్‌ 28న కన్నుమూశారు.<--break-> 1933 అక్టోబరు 13న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించారు. ఆమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు సైతం ప్రముఖ రచయితే. 1951-53 మధ్య కాలంలో ఛాయాదేవి నిజాం కళాశాలలో ఎంఏ చదివారు. 1953లో కళాశాల ప్రత్యేక సంచికలో 'అనుభూతి' అనే ఆమె మొదటి కథ ప్రచురితమైంది. అనంతరం ఛాయాదేవి మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను, పురుషుల ఆధిపత్యంలో అణచివేతకు గురవుతున్న స్త్రీలను గురించి ఎన్నో కథలు రాశారు. ప్రధానంగా పురుషాధిక్యం స్త్రీలను ఎదగనివ్వకుండా చేస్తోందనే ఆలోచనతో ఛాయాదేవి 'బోన్సాయ్‌ బతుకులు' పేరిట సంపుటి తీసుకొచ్చారు. దీనిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2000 సంవత్సరంలో 10వ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పెట్టింది. 'తన మార్గం', 'అబ్బూరి ఛాయాదేవి కథలు', పిల్లల కోసం 'అనగనగా జానపద గాథలు' జిడ్డు కష్ణమూర్తిపై పుస్తకం, అఖరికి అయిదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్‌ కథలు తదితర రచనలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2005 సంవత్సరంలో 'తన మార్గం' అనే కథా సంకలనానికి 'కేంద్ర సాహిత్య అకాడమి' పురస్కారం ఆమెను వరించింది. ఆమె ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో లైబ్రెరియన్‌గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. తెలుగు సాహిత్యంలో స్త్రీకోణంలోంచి కథలు రాసిన తొలితరం కథారచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. వారికి సాహిత్య ప్రస్థానం మాసపత్రిక తరపున జోహార్లు.

 

కె.బి. లక్ష్మి

ప్రముఖ రచయిత్రి, పాత్రికేయురాలు డాక్టర్‌ కె.బి.లక్ష్మి (కొల్లూరి భాగ్యలక్ష్మి -70) జూలై 29న హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. కేబీ లక్ష్మి బహుముఖ ప్రజ్ఞాశాలి. రేడియో వ్యాఖ్యాతగా, వక్తగా, విమర్శకురాలిగా, కథా రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.  'మనసున మనసై', 'జూకామల్లి' కథల సంపుటాలు వెలువరించారు. 'వీక్షణం', 'గమనం' కవితా సంకలనాలు కవయిత్రిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 2003లో రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ రచయిత్రిగా పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్‌ కె.బి. లక్ష్మికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో నివసిస్తుండగా, కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. ఈనాడు సంస్థ వెలువరించే 'చతుర', 'విపుల' మాసపత్రికలకు సుదీర్ఘకాలం సంపాదకురాలిగా వ్యవహరించారు. వారికి సాహిత్య ప్రస్థానం నివాళి అర్పిస్తున్నది.