లోయ నిండింది

కవిత

- లోలా కోసూరి - 7702109311

నీళ్ళు ఒక్కచోట చేరితే ఎంత సంబరమో

చీమలన్నీ ఆహారం దగ్గర చేరినట్టు

మనుషులంతా ఆనకట్ట గేట్ల ముందర చేరుతున్నారు.

ఒకచోట చేరిన నీళ్ళు భళ్ళున కిందికి జారటాన్ని

సంబరంగా చూస్తున్నారు.

నిలిపి ఉంచటం కంటే

వొదులుగా వదిలేయటమే ఆనందమా!?

నిండుగా తొణికిసలాడే నదిముందు నిలబడి

ఏ ఒక్కరూ కళ్ళు విప్పార్చరు,

అచ్చం గర్భిణీ ముందు ఇబ్బందిగా మెసిలినట్లు

కుదురుగ్గా కూర్చోనే లేరు..

మొత్తం అన్నిగేట్లూ ఎత్తేశాక కిందికి దుమికే లక్షల క్యూసెక్కుల నీళ్ళను

మాత్రం సంభ్రమంగా చూస్తారు

పుట్టినబిడ్డ లేతపాదాలకు మొహమాన్చినట్లు

నీటి తుంపరలకు మొహమాన్చి

గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు.

 

ఒరే ఆనకట్టా నీకు దండాల్రా సామీ

మా బువ్వ ప్రవాహాన్ని

నిలువరించటానికి

ఎన్ని పూడికల కణుతుల్ని పొట్టలో దాచుకున్నావో...

ఎన్ని నెప్పుల మాత్రలు మింగావో..

 

కిందికి దుముకుతున్న నీటిపిట్టల్ని

గొప్పగా ఆనందిస్తున్నాం గానీ

అవి అక్కడ గూడు కట్టడానికి

నువ్వెన్ని గునపపు పోట్లు భరించావో.....కదా.

నదీ....నీకూ ఓ నమస్కారమే తల్లీ

నిలువునా ఎండిపోయి రాళ్ళుతేలిన గుండెల్తో

ఏ పాలూ చేపలేని వొట్టిపోయిన గేదెలా నువ్వున్నపుడు

నేనో...నా వాళ్ళో...

ఎవ్వరమూ ఇటేపైనా రాకపోతిమే అనే కోపమే లేకుండా

పాలిస్తున్న గేదెతల్లి మాదిరి ఎంత ఆనందంగా కదలకుండా నుంచున్నావే

నీకూ నీ ఓపికకూ

సవాలక్ష మొక్కులే అమ్మా..

 

లోయ నిండింది...

కట్ట ఎనక నీళ్ళతో,

కట్టముందు జనం కళ్ళతో..

 

ఇంక మడవేద్దాం పదండహే మాగాడికి..

మనిషి ప్రాణాలు నిలిపే జీవనాడికి..