కవితలు - ఆ కొన్ని క్షణాల కోసం, ప్రజాస్వామ్యం, తాయిలాలు, అలికిడి, ఎన్నికల కాలం, ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు

కవితలు

ఆ కొన్ని క్షణాల కోసం - పద్మావతి రాంభక్త
ప్రజాస్వామ్యం -
మోకా రత్నరాజు
తాయిలాలు -
బీవీవీ సత్యనారాయణ
అలికిడి -
స్వప్న మేకల
ఎ న్ని క ల  కా లం -
జానూ సురేష్‌
ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు -
మూని వెంకటా చలపతి

--------------------------------------------------------

ఆ కొన్ని క్షణాల కోసం

- పద్మావతి రాంభక్త - 9966307777

కొన్ని క్షణాలలో పరిమళాల శ్వాసను నింపుకోడానికి బయలుదేరినపుడు
ఎన్నో వేలయోజనాల నడకలోనైనా అలుపు తెలియదు
ఉధ తమైన  ఆత్మీయుల పలుకుల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నపుడు
కాలం రౌతు లేని గుర్రంలా పరుగెడుతున్నా
అసలు గమనింపుకే రాదు
వారి మాటలలోని హరితాన్ని
మనసంతా పూసుకుని పరవశించినపుడు
ఒక అలౌకిక ఆనందస్ధితిలో ఈదులాడుతూ
ఎంతో కష్టించి చేరాల్సిన సుదూరతీరం
ఆలోచనలో మెదలనే మెదలదు
వారి సాహచర్యంలో
పగుళ్ళు బారిన గుండె
పన్నీటి వాన కురిసిన అనుభూతికి లోనై పరవశిస్తుంది
వారి సాన్నిధ్యంలో లభించిన అమ్మలాంటి లాలనతో
ఉప్పొంగే కన్నీటినదులెన్నో చిటికెలో ఇంకిపోతాయి
అటువంటి సమయాలను అపురూపంగా ఒడిసిపట్టుకోడానికి
సప్తసముద్రాలనైనా దాటి వెళ్ళాలనిపిస్తుంది
అటువంటి వారి నుండి
కాసిని మంచిని  నింపే పదాలను స్వీకరిస్తూ
మనసుకంటిన మలిలాలను కడిగేసుకుని
మరకలేని తెల్ల కాగితంలా మెరవాలనిపిస్తుంది
అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని అయినా
నలుగురికీ నిస్వార్ధంగా హాయిని పంచే  చల్లని చెట్టు నీడలా
మనలను మనం  మలచుకోవాలనిపిస్తుంది
మన నోటిలో నానే వాక్యాలు
కొందరి దిగులు దుప్పట్లనైనా మడతపెట్టగలిగితే
అంత కన్నా కావలసినదేముంది
మన పలుకులు  మెత్తని రుమాళ్ళై
కొద్ది మంది బుగ్గలపైన గడ్డకట్టిన చారికలనైనా
తుడవగలిగినా చాలు
అప్పుడే  ఈ మూన్నాళ్ళ ముచ్చటైన బ్రతుకుకు ధన్యత కదా!!

ప్రజాస్వామ్యం

- మోకా రత్నరాజు - 9989014767

చీకట్లో
రాత్రిపూట సంచరిస్తూ
ఇళ్ళల్లో కన్నాలేసే
దొంగల్ని వదిలేసి
పొద్దున్నే చెత్తలేరుకునే వాళ్ళమీద
కలబడే వీధికుక్కలల్లే

అవయలోప
యోగ్యులైన యాచకుల్ని కాలదన్ని
జాతక; జ్యోతిష్యాల
కల్లబొల్లి మాయమాటల్ని నమ్మి
నోట్లతో సత్కరించే
అపాత్రిదాన కర్ణులల్లే
అన్నమేదో; సున్నమేదో
గమనించక
ఎన్నుకోవాల్సిన వాళ్ళను కాదని
మన్ను కరిపించే వాళ్ళను
అందలమెక్కిరించే
విలువెరుగని ఓటర్లున్నంత వరకూ-

ప్రజాస్వామ్యం
ఈనగాసిన నక్కలపాలై
కుక్కలు చింపిన విస్తరికాక ఇంకేమవుతుంది?

తాయిలాలు

- బీవీవీ సత్యనారాయణ - 9912233739

నుపముక్కని అయస్కాంతము ఆకర్షించినట్లు
ఓటును ఒడిసిపట్టి తన బుట్టలో వేసుకునే
తాయిలాలు సిద్ధమయ్యాయి
చేపలను పట్టడానికి వాడే గేలానికి
ఎర తగిలించినట్టు
ఓట్లను కొల్లగొట్టడానికి
తాయిలాలు తళుక్కుమంటున్నాయి
సరిగ్గా ఎన్నికలకు ముందే యీ తాయిలాలు
ఇపుడే గుర్తొచ్చినట్లు తారస పడుతుంటాయి
అన్నిపార్టీలు క్రొంగొత్త ఆకర్షణీయ ఆలోచనలతో
తాయిలాలును ముస్తాబుచేసి
మనల్ని మంత్రముగ్ధులను చేయడానికి
తమతమ ఖాతాలలో జమచేసుకోడానికి
ప్రజాకర్షణగా మనముందు ప్రదర్శణకు పెడతాయి
అచ్చం ఎన్నికల మేనిఫెస్టోని తలపించే రీతిలో
జనాలను తమ బందిఖానాలో వుంచుకోడానికి
యీ తాయిలాలను సంధిస్తాయి
ప్రజలను గోడును పెడచెవిన పెట్టిన పార్టీలే
సరిగ్గా ఎన్నికలకు ముందే
యీ తాయిలాలను తెరపైకి తెస్తాయి
ప్రభుత్వాలు ఇచ్చే పధకాలనుకుంటాముగాని
ఎవడబ్బ సొమ్మది?
మన జేబునుండి కాజేసిన కాసులేకదా......
యీ తాయిలాల వలలో చిక్కుకుని
సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే
మరో ఐదు సంవత్సరాలు
జనం విలవిలలాడడం ఖాయం
యీ మాయలమరాఠీల మాయాజాలంలో
మన బ్రతుకులు మటుమాయం !
తస్మాత్‌ జాగ్రత్త !!

అలికిడి

- స్వప్న మేకల - 9052221870

డుగులన్నీ తడబడిపోతుంటే
మనసేమో ఏ అలికిడిని లెక్కచేయక
భావమంతా గుండెల్లో భారమై  నిలుస్తోంది
ఎక్కడ జార విడిచిందో  మధుర స్ముతులన్నీ
ఎక్కడ బంధించేసిందో అనుబంధాలన్నిటినీ...

ఏకాకిగా మిగిలి పోతుంది
రెక్కలు విడిచి నేల రాలిన పిట్టలా ..
చుట్టూ అలుముకున్న
వెలుగంతా కంటి ముందు
అంధకారమై  నిలుస్తోంటే
ప్రతి బింబించని రూపు రేఖల ఆనవాళ్లే..!
అనంత ఆకాశం నిశ్చలంగా ఉంటే
మబ్బు పట్టిన మనసులోనుండి  చినుకు ధారలు
కురుస్తుంటే తడిసిన హ దయానికి
మిగిలింది వేదనే..!

ఎంత వేధించిందో తనువుని
ఎంత శోధించిందో అణువణువునీ...
చివరికి మిగిలింది నువ్వు లేని నేనుగానే..!!

ఎ న్ని క ల  కా లం

- జానూ సురేష్‌ - 7569480800

ది ఎన్నికల కాలం
ఋతుపవనాలు
ఏ.సి గదుల్లోనుండి
ఇప్పుడిప్పుడే బయటికొచ్చి
వాడ సందుల్లో సైతం
తిరుగాడేకాలం

ఇది ఎన్ని 'కలికాలం'
ఖద్దరు ధరించిన
పొలిటికల్‌ ఊసరవెల్లులు
ప్రజాస్వామ్యాన్ని
పరిరక్షిస్తామంటూ
వెల్లువలా ప్రజల మీదకు
దూకుతున్నకాలం
చొక్కా ప్యాంటు
మార్చినంత ఈజీగా
పూటకో పార్టీతో దోస్తీకట్టి
ఎలాగైనాసరే
దేశ ప్రజానీకాన్ని ఉద్ధరించాలని
ఆబగా ఎదురుచూస్తున్న
దగుల్బాజీ కాలం
రాజకీయ పెట్టుబడిదారుల
సంపాదనకు
పదవులే 'బడా దారులు' గా
కనిపిస్తోంటే

పార్టీ అయస్కాంత క్షేత్రాలకు
ఆకర్షించబడే
తుప్పుపట్టిన ఇనుప ముక్కలై
అధికార మాంసపు ముద్దకోసం
కాళ్లను వేళ్ళను నాకుతూ తిరిగే
బుజ్జి కుక్కలై
కోతల్లో పిట్టలదొరల్ని కూడా
ఉలిక్కిపడేలా చేస్తున్నారు
తెల తెల్లని కారు కూతలకు
కుర్రకారు సైతం తూగుతూ ఊగుతూ
వెర్రిగా పార్టీ లారీలెక్కుతుంటే
పచ్చని ప్రజాస్వామ్య వనం
దహనంకాక ఇంకేమవుతుంది!!?
అనుకోవాలేగాని
పట్టపగలు చుక్కల్నే కాదు
విశ్వాంతరాలాల్ని
ఇట్టే చూపెట్టగలరు
ఆకాశంలో అలల్ని
సముద్రంలో సూర్యునికి
స్నానమూ చేయించగల
వీరులు,ధీరులు ఉన్నారు
ఐదేండ్లకాలం
విసుగెత్తిపోయిన ఓటర్లు
నెట్వర్క్‌ లు  మారకుండ
ఎలక్షన్‌ స్పెషల్‌ ఆఫర్లు
ప్రకటించేస్తున్నారు
రగిలిపోయి షూటర్లుగా
మారుతున్న ఓటర్లను
క్వార్టర్ల పంపిణీతో
వశం చేసుకునేందుకు
రంగం సిద్ధం చేసుకుంటున్నారు
ఇది ఎన్ని 'కల' కాలం
ఎన్నో కలల్ని కళ్ళల్లో నింపుకొని

మండుటెండలాంటి జీవితాలకు
హామీలు ఎండమావులని తెలిసినా
చినుకు కోసం ఆరాటంగా
ఆకాశం కేసి చూస్తున్న
రాయలసీమ రైతున్నలా
వరాల వానలో తడుస్తూ
పగటికలలో చిందులేస్తూ
చేతికి చిక్కిన చేప పిల్లను
జారవిడుచుకున్నంత సులభంగా
నాయ 'కుల' స్పర్శకు కరగి మరగి
ఓటును సమర్పించుకొనే మహా చెడ్డకాలం

మర్డర్‌ మొనగాళ్లు
అత్యాచార వీరులు
స్కామ్‌ రారాజులు
దోపిడీదారులు, దొంగలు
పాలన అధికారులుగా
అర్హతలు స్థిరీకరించబడుతున్న చోట
రక్తపాత మహా వక్షాలు
అవినీతి కలుపు మొక్కలు
స్వేచ్ఛగా పెరగక ఊరకుంటాయా..!!?
ప్రజాస్వామ్య మైదానంలో
అర దశాబ్దానికి ఒకసారి ఆడుకొనే
అందమైన అబద్ధపు ఆటకు
మద్యం, నోటు, హింస
ఈ మూడేగా అంపైర్లు
ఎప్పుడో నా చిన్నపుడు చదువుకున్నా
మనదేశం అభివ ద్ధి చెందుతున్న దేశం అని
నేటికి పిల్లలు ఇదే చదువుతుంటే
అభివ ద్ధి చెందిన దేశంగా
ఇంకెప్పుడు మారతామయ్యా
ఐఏఎస్‌ లనో ఐపిఎస్‌ లనో
విద్యాధికుల్నో, సమాజాన్ని చదివినోళ్ళనో
ప్రత్యక్ష రాజకీయాలకు అర్హుల్ని చేయండయ్యా
అన్నా ఓటరన్నా..!
అటు ఇటు దిక్కులు చూస్తావేందన్నా
సగం తెగిన సంకెళ్ల వేదనతో
దేశం నీముందు నిల్చుంది
ఆ చేతిలోని ఆయుధాన్ని
ఇప్పటికైనా సరిగ్గా సంధించు....

ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు

- మూని వెంకటా చలపతి - 7396608321

కొత్త వెలుతురు నీ ఒంటికి చుట్టి
ఉరుముల మెరుపుల మధ్య నుంచి
బానిస మేఘాల మనసును తుడిచెందుకు
ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు....!
చీకటిని చేధించడానికి
వేకువ వెలుగుల్ని పరచడానికై
చిరునవ్వుల మొక్కల్ని చిగురింప చేయడానికి
ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు...!

విష నాగరికతలో నలిగిపోతున్న సమాజానికి
పడమర మార్గాన్ని చూపడానికి
తెల్లటి కాగితంపై ఎర్రని అక్షరాలతో
ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు...!
చెయ్యి చెయ్యి కలిపి సహసంతో నడిచి
శాంతి కోటలు నిర్మించడానికి
ప్రేమతో మనందరం జీవించడానికి
ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు...!

కులముల క్రౌర్యాన్ని కడతేర్చడానికి
మనుష్యుల వ్యధను తొలగించడానికి

ఈ ధరిత్రిలో నిజాన్ని మాత్రమే నిలపడానికి
ఉదయించాలి ఓ అక్షర సూర్యుడు...!