ఆశ చావని కృషీవలుడు

కవిత

- వి. రవీంద్రరెడ్డి - 9494422842

నీలాకాశం వైపు

ఇన్నాళ్లు ఆశగా చూశాడు,

ఆకాశం నల్లరంగును పులుముకొని

వానమాడం పట్టి

నల్లని మేఘాలు గర్జించి

తెల్లని ముత్యంలాంటి చినుకులతో

ఈ నేలంతా తడిసి ముద్దయి

దండిగా పదునయితే

సేద్యం చేసుకోవచ్చని

రాములోడి గుళ్లో భజనలు చేశాడు,

కాటమయ్య స్వామికి పూజలు చేశాడు,

పొలిమేర పెద్దమ్మకు

పొర్లు దండాలు పెట్టాడు,

దండి పదును కాకున్నా,

కాసిన్ని వాన చినుకులయినా

రాలకపోతాయ అని,

కనపడ్డ రాయికల్లా మొక్కాడు,

వరుణదేవుడు కాస్త కరుణించాడు

కాసిన్ని వాన చినుకులు

ఈ మాత్రం దానికే

తెగ సంబరపడిపోయాడు,

బ్రతుకు మీద ఆశతో

తాను నమ్ముకున్న

అమ్మలాంటి పుడమితల్లి సాక్షిగా

పెళ్ళాం మెడలోని పుస్తెలమ్మేసాడు

అధిక వడ్డీకి అప్పు తీసుకొచ్చాడు

సంతకు బయలుదేరాడు

కాడెద్దులను కొన్నాడు

ఆసామి వద్ద

విత్తనాలు అరువుగా తెచ్చాడు

పొద్దుగుంకక ముందే

మడకను భుజం మీద వేసుకొని

చెర్నాకోలు చేతబట్టి

చెక్కలగుంటకతో సేద్యం చేసి

పలకల గుంటకతో

ఎత్తు పళ్లాలను చదును చేసిన

ఎర్రమట్టి చేనులో

అరువుగా తెచ్చిన ఇత్తనాలను

నాలుగు ఎకరాల ఎర్రనేలలో

నాలుగుసాళ్ల గొర్రుతో

మిట్టమధ్యాన్నాం కల్లా ఇత్తేసాడు

సాలీసాలని పదునుతో నాలుగు రోజులైనా

ఇక ఇత్తనం గింజైనా

పుడమితల్లి గర్భాన్ని చీల్చుకుని

తన చేను గట్టును చూడలేదని

విలవిలలాడిపోయాడు..

వారం రోజుల తరువాత

చేనులోకి పోయి

తడారిపోతున్న ఎర్రమట్టి వైపు

దీనంగా చూస్తున్నాడు..

దిన దినం, ప్రతిదినం

ఈదురుగాలులు,

ఉరుములు, మెరుపులు

కారు మబ్బులతో

దూరం కొండలు, ఊళ్లు

కప్పబడుతున్నాయి గానీ,

ఒక చినుకయిన

నేల రాలక,

విత్తిన విత్తనాల

ఊపిరి ఊసురుమని

ఈదురుగాలులతో సహా

ఎటో వెళ్ళిపోతున్నా,

దిక్కుదోచక,

ఆశ చావక

చేనులో నిలబడి

పెద్దకుశాల కార్తిలో కురిసే

వాన చినుకులకోసం

మళ్లీ అదే ఆకాశం వైపు

ఆశగా చూడడం తప్ప

ఏమీ చేయలేని

నిస్సహాయ పరిస్థితి

ఈనాటి రైతన్న దుస్థితి..