కొత్త ఊడ

కవిత

- శ్రీధర్‌ చౌడారపు - 9440032211

కాలం కలిసిరాని ఆ సమయంలో

ఆత్మవిశ్వాసం మెల్లమెల్లగా ఆవిరయిపోయి

కలలు కల్లలయి కరిగిపోతుంటే

ఆశల కోటగోడలు నిలువునా కూలిపోతుంటే

అప్పులు చేయరాని తప్పులుగా మారి

తల కొట్టేస్తామని తర్జనితో బెదిరిస్తుంటే

పరువును హత్య చేస్తామని పక్కాగా చెబుతుంటే

ఒంటరితనాన్ని వెంటేసుకుని

నిరాశదుప్పటిని నిండుగా కప్పుకుని

ఓ చీకటిపూట ఊరి కళ్ళు కప్పేసి

అయినవాళ్ళను మాటలతో మాయచేసి

మౌనంతో కానివాళ్ళ నోళ్ళు మూయించేసి

ఊరి పొలిమేరనుంచి దూరంగా సాగిపోతూ

తననాదరించి పెంచి పోషించిన

గాలీ నీరూ మట్టీ చెట్టూ పుట్టా సాక్షిగా

బంధాలనుంచి బాధ్యతలనుంచి

సెలవు తీసుకుంటుంది ఓ జీవితం శాశ్వతంగా

తెల్లారేసరికి ఊరిచివరి మర్రిచెట్టుకు

మరో కొత్త ఊడ మొలుస్తుంది

తెల్లబోయిన ఊరు ఊరంతా కెవ్వుమంటుంది

రాయని మరణవాంగ్మూలాన్ని

మరోసారి మౌనంగా చదువుకుంటూ

వెక్కి వెక్కి ఏడుస్తున్న వారసత్వం

గోల ఏమీలేక బదిలీ అయిన

గోరంత ఆస్తులను చూసి

మాటమాత్రం చెప్పకుండా మీదపడిన

కొండంత అప్పులను చూసి

వెర్రెక్కిపోయి నిలువుగుడ్లు వేస్తుంది