ఓటున్నోడు

కవిత

- డా.యస్‌. సత్యప్రసాద్‌ - 94405 44675

ఏంటి?

అలా కొత్తగా చూస్తావేం?

పోయిన ఓట్లప్పుడు వచ్చాడు..

గుర్తుపట్టలా?

 

నీకు దణ్ణాలు పెట్టాడు

నీ నోటికాడ అంబలి

కలబడి తాగాడు

చింపిరిగుడ్డల నీ బిడ్డని

చీమిడి తుడిచి ముద్దాడాడు

మీ బతుకులు మారుస్తానని

మంగమ్మ శపథం చేశాడు

 

మళ్ళీ ఇప్పుడేంటి, అంటావా?

మళ్ళీ ఓట్లొచ్చాయంట

ఓటెవరికెయ్యాలో తెలియక

తల పట్టుకుకూర్చుంటావని

నేనున్నాగా నీ వాడినని

గుర్తు చెయ్యడాని కొచ్చాడంట

నీ ఓటు తనకెయ్యాలంట

ఢిల్లీ విమానమెక్కించాలంట

అక్కడంతా ఉన్నోళ్ళంట

వాళ్ళంత ఎదుగుతాడంట

నీ బాధలు వినిపిస్తాడంట

ఈసారి మాత్రం మరవడంట

నీ పనిమీదే ఉంటాడంట

కావాలంటే..

కోనేటి నీటి మీద రాసిస్తాడంట

మళ్ళీ ఓట్లొచ్చేదాకా

నిన్ను విసిగించడంట

అవునంట

నీమీద ఒట్టంట

 

ఏంటి?

అలవాటుగా సరేనంటున్నావ్‌?

కట్టిపెట్టు నీ తలఊపుళ్ళు

డూడూ బసవన్నలా ఇంకెన్నాళ్ళు?

ఓటున్నోడివి

నే'తల' రాతలు మార్చే ధీటున్నోడివి

నీ బుర్రలోకి ఓసారి పరికించి చూడు

నరనరాన చైతన్యం పాకించి చూడు

మోసాల, వేషాల నిగ్గుతేల్చి చూడు

కుటిల రాజకీయాల చీల్చిచెండాడు

 

వేలికొనల నుండి విద్యుత్తు పాకించు

పుటం వేసి చూసి ఓటుమీట తాకించు

చరిత్రగతులు మార్చే శక్తిశాలి నీవు

'ప్రజలచేత పాలన'లో భాగస్వామి నీవు