తులసి మొక్కలు

- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

''ఇక్కడ మునగడమూ గుండువారి రేవులో తేలడమూనూ; అక్కడికి ముందెవరు వెడితే వాడికి తక్కిన వాళ్లు వందరూపాయలివ్వడం. ఏమంటారు?'' అని ప్రకాశము నిక్కచ్చిగా నడుగగా 'నేనంటే నేనూ నూ' అని నలుగురైదుగురు విద్యార్థులు సిద్ధపడిరి; గాని యందొకడు ''రూపాయల పందెం యేమిటిరా! ఓడి పోయినవాళ్లు పోతగట్టుమీద యెక్కడా నుంచోకుండా మైలుదూరం పరుగెత్తడం. ఏం చెబుతావు?'' అని యడిగి తక్కినవారు అంగీకరింపకపోగా నేను తగ్గేను.

మొత్తము నలుగురు ముందుకు వచ్చిరి. ''సంయే'' అంటే ''సంయే'' అనుకున్న తరువాత పైవారిలో నొకడు చప్పటులు చరువగా ఆ నలుగురును ఒక్కసారి బుడుంగున మునిగిరి.  తక్కినవారందరును ఒడ్డెక్కి గుండువారిరేవు నకు పరుగెత్తుకొనిపోయిరి. పదిబారలలో నొకడు తేలి ''నావాటా ముప్పయి మూడు రూపాయలవుతాయి. పారేస్తాను'' అని పలుకుచు నొడ్డెక్కెను. మరి పది బారలలో నింకొక్కడును, అరఫర్లాంగులో మరియొక్కడును తేరి ఒడ్డెక్కిరి.

అది మాఘమాసము. నాడు ఆదివారము మార్కండేయస్వామిని సేవింపవచ్చి అనేక జాతుల స్త్రీలు గుండువారిరేవులో స్నానములు చేయుచుండిరి. నీటి కాసు బ్రాహ్మణులపని చాలా తొరీ త్రొక్కుడుగా నుండెను.

 తక్కువ జాతి మగపిల్లలు కొందరు ఈతలాడుచు నడుమ నడుమ బ్రాహ్మణులచే నదలింపబడుచుండిరి. సాహసము గల విద్యార్థులు కొందరు మెట్లు దిగి నీటి చెంతకు బోగా స్త్రీల శీలనైశిత్యము నెరిగిన మరి కొందరు ఒడ్డుమీదనే యుండిపోయిరి. అందరును ప్రకాశము రాకను గమనించుచు గోదావరి దెసకు చూచుచుండిరి. ''మునిగి యెదురు రావడమూ ఫర్లాంగుపైగానూ. ప్రకాశం మాత్రం వూడిపడ్డాడా యేమిటి మనకంటే?'' అని మొదట తేలినవాడనగా ''మనం యింతదూరం వచ్చాముగాని వాడూ అక్కడే తేలి వుంటాడు'' అని రెండవాడనియెను. ''వాడు గూడా అక్కడే తేలితే మరి రూపాయలు యెవరికీ యివ్వడం?'' అని మూడవ వాడడుగగా ''కాఫీహోటలు వాళ్లకి'' అని చప్పటులు కొట్టినయాతడనియెను. పైని యిట్లుండగా నీటిలో నొక కుఱ్ఱవాడు ''బాబోయి యెంతచేపో'' యని యులికిపడెను. నీటికాసు బ్రాహ్మణుడు డొకడు ''మొసలి'' అని యెగసిపడెను. ఒక బ్రాహ్మణుడు సంకల్పము చెప్పుచుండగా స్నానము చేయుచున్న యొక బాలిక ''అమ్మోయి'' అని యెగిరిపడి నీటిలో మునిగెను. కంగారుపడి యిద్దరు ముగ్గురు యువతులామెను లేవదీయునంతలో ప్రకాశ మామెయెదుట తేలి నిలిచెను.

తోడనే పెద్ద గందరగోళమైనది. ''నువ్వు మనిషి కాదూ?'' అని యెగసిపడిన బ్రాహ్మణుడు మండిపడెను. చాలమంది స్త్రీలు చుట్టుకొనిరి. ''చిన్నాడవాచితకాడవా? పైగా బ్రాహ్మడవు కూడానూ. ఇలాంటి పనే చెయ్యడం?'' అని యొక ప్రాఢ కసరుకొనగా'' ఆడతోడున పుట్టలేదూ నువ్వూ? ములిగివచ్చి మా పిల్లని పట్టుకుంటావా? చూడుమరి'' అని చురచుర తీరము దెసచూచుచు ''మీ బావని తీసుగురా తమ్ముడూ'' అని యొక యువతి పలికెను. అక్కడనేయున్న యామె తమ్ముడు మండిపడుచు బూతులు ప్రారంభించెను. బాలికయింకను గడగడ వణికిపోవుచునే యుండెను. ప్రకాశము ఏమియు చెప్పలేక స్థాణువువలె నిలిచియుండెను. అప్పుడు పైనున్న విద్యార్థులలో నొకడు వచ్చి జరిగిన సంగతి యంతయు చెప్పి ఈ పొరపాటు మన్నింపవలసినదని కోరెను; కాని లాభము లేకపోయినది.

ఇంతలో వొకపురుషుడు ముగ్గురు పోలీసులను దీసికొనివచ్చి ''అరదండాలు తగిలించం డయ్యోరికి'' అనియెను. పోలీసులు ''ఏంపని చేశావయ్యా?'' అని ముంగోపముతో నడుగగా ''అలా మొద్దులాగ వూరుకుంటావేం మాట్లాడకా?'' అని యెగిరిపడిన బ్రాహ్మణుడు వీపుమీద పొడిచెను. అప్పుడు ప్రకాశము ''నేను చేసిన పని చాలా తప్పే; కాని యిది బుద్ధిపూర్వకంగా చెయ్యలేదు. ఈ సమయంలో యిక్కడ యింతమంది స్త్రీలు స్నానం చేస్తూ వుంటారన్న వూహే నాకు కలగలేదు. ఇక జరిగిపోయిన దానిని గురించి యేమనుకున్నా ప్రయోజనం లేదు, కనుక, నేను నెగ్గిన నూరు రూపాయలూ నీకిచ్చేస్తాను. క్షమించు'' అని చేతులు జోడించుకొని పలుకగా బాలిక బిడియపడి మొగము ప్రక్కకు త్రిప్పికొనియెను. ఆమెతల్లి అంగీకరింపబోయెను. గాని ఆమెయన్న వంద రూపాయలా? ఎవడి క్కావాలీ? బంకోలు పంపించేస్తా జూడు నిన్ను. ఇంకా చూస్తారేమయ్యా?'' అని పోలీసులను హెచ్చరించెను. కేసు లేకుండా చేసుకోవాలంటే పిల్ల కయిదువందలిచ్చి పోలీసోనికి సమాధానం చెప్పుకో'' అని పోలీసులను తెచ్చిన యువకుడనియెను? ''అయిదు వందలు కాదు. వెయ్యి రూపాయలు పుచ్చుకొని పైగా ఖైదుచేయించినా పాపంలేదు వీడికి, ఆ పిల్లకి నూరు రూపాయలిస్తానన్నావు. రెండు గంటలనుంచి సంపాదించుకున్న డబ్బులు అయిదు రూపాయలకు పైగా చేతులోవుండగా నీమూలాన్ని గోదావరిలో పడిపోయాయి, మరి నామాట యేమంటావు?' అని యాబ్రాహ్మణుడు తారాజువవలె లేచెను.

విచారణ చేయగా ఆ బాలిక వేశ్యయని తేలినది. పైనున్న విద్యార్థులలో నొకడు ''నూరురూపాయలిస్తానంటుండగా యింకా వెక్కివెక్కి యేడుస్తుందేమిరా బోగంపిల్లా?'' అనియెను. దానిమీద నామెయన్న మండిపడి ''పనికిరాదు. స్టేషనుకి తీసుకుపదండి'' అని పట్టుపట్టెను.

రాజీ కుదరలేదు. ''నీపేరే'' మని యొక పోలీసడిగెను. ''జంధ్యాల ప్రకాశం. జూపూడి వారి కొట్లలో బస. బి.యే. సీనియరుక్లాసు'' అని ప్రకాశము చెప్పెను. పోలీసులాతనిని వెంటనిడుకొని స్టేషనుకు వెడలిపోయిరి. ఆ బాలిక అన్నయగు మాధవరావును, తక్కిన విద్యార్థులందరును, పోలీసులను దెచ్చిన యువకుడును వారివెంట వెడలిరి. ఆ బాలికయు, అక్కలు,  తల్లి మున్నగుస్త్రీలు గుడికి పోయిరి. ఇదియంతయు చూచుచున్న యొక వృద్ధ బ్రాహ్మణ వితంతువు ''బోగందైతే మాత్రం! ఎదిగినబిడ్డ; తప్పుకాదూ?'' అని తన దారిని బోయెను. ఆ మాట ఆ బాలిక నల్లగుండెకు చివాలున తగిలెను.

2

రంగనాయిక-ఆ బాలిక తనవాళ్లతో యిల్లుచేరి పొడిబట్టలు కట్టుకొనునప్పటికి సానులు చాలమంది చేరిరి. ఆమెతల్లియగు రాజామణి జరిగినదంతయు చెప్పెను. పెద్దక్క ''రంగమ్మ బేజారైపోయిందే. దాని గుండె లింకాకొట్టుకుంటూనే వున్నాయి'' అనగా పోలీసులను తెమ్మనిన రెండవ యక్క ''అంతా బ్రహ్మలే. కోనసీమ జట్టులావుంది. లేకపోతే అంతపని చెయ్యరు'' అనియెను. మూడవయక్క ''వక బాపనోడు బోగంపిల్ల యెగిసెగిసిపడుతోం''దన్నాడు. చూశావా? అసలు ములిగి వచ్చినవాడు అణిగేవుండగా పైనున్న వాళ్లే యెగిరి పడ్డారు. అందర్నీ  కైదు చేయిస్తే మంచిది.'' అనగా నాల్గవయక్క ''కేసూవద్దు గీసూవద్దూ. రౌడీల నప్పగిస్తే సరీ బాజాపడుతారు'' అనియెను. అందరు నన్నివిధ ములననిరి. రుసరుసలు, విసవిసలు ప్రగల్భవచనములు, చెలరేగెను, రంగనాయికకు ''బోగందైతే మాత్రం? ఎదిగిన బిడ్డ. తప్పుకాదూ?'' అనుమాట ఖంగు ఖంగున వినబడి నట్లయ్యెను. ఈ స్థితిలో మాధవ రావు వచ్చి ''వాడెవడైతే నాకేం? కైదులో పెట్టించేస్తా చూడు'' మని యూరడించెను. ''ఏమయిన'' దని యొక సాని యనగా ''బసా, పేరూ, అన్నీ రాసుగుని విడిచి పెట్టేరు. రేపు కేసు పెడతారు'' అని యాతడు బదులు చెప్పెను.

ఎవరియింటికి వారు వెడలిపోయిరి. భోజనము లగునప్పటికి రంగనాయిక అక్కల సరసులు - ఒక బ్రాహ్మణుడు, ఇరువురు వైశ్యులు, ఒక చౌదరి వచ్చిరి. అందరును దూరముగా నుండియే జరిగినదానికి నొచ్చుకొనిరి; గాని పోలీసులను తెచ్చిన వైశ్య యువకుడు ''నేనెంతపని చేశానో చూశావా?'' అని రంగనాయిక చేయిపట్టుకోబోయెను.

చేతిమీద చేయిపడినది; అంతే, ఇంకను పట్టుకొనలేదు. వెంటనే యామె త్రాచుపిల్లవలె ''బోగం దాన్నయితేమాత్రం? చెయ్యి పట్టుకోవడమే?'' అని కస్సుమనియెను. రాజామణి అసంతుష్టయై యూరకుండగా పెద్దక్క ''యిప్పుడా మరిదిగారూ వేళాకోళం?'' అని బొమలు ముడుచుకొనియెను.

''మీరు చెయ్యి చేసుకుంటారండీ మాట్లాడితేనా'' అనియాతనిసాని విసుగుకొనియెను. బ్రాహ్మణుడు ''తొందరపడ్డావు'' అనగా చౌదరి ''అసలే రంగం ఉడికి పోతూవుంది పాపం'' అనియెను.

రాజామణి బ్రాహ్మణునితో ఏదో చెప్పబోవుచుండగా రంగనాయిక ''సానయితే యింత లోకువా? నాకక్కరలేదు సానరికం'' అని చివాలున లోపలకు పోయెను. అందరును మొగమొగములు చూచుకొనిరి. దోషిస్తబ్ధుడై తనగదికి పోయెను. తక్కినవారందరును కొంతసేపు రంగనాయిక శౌర్యమును గురించి మాట్లాడుకొని వెడలిపోయిరి.

రాజామణి శయ్యమీద బోరగిలపడి పడుకొనియున్న బిడ్డను ''రంగా'' యని పలుకరించెను; కాని యామె పలుకలేదు.  ''ఇంత శౌర్యం అయితే యెలాగే తల్లీ?'' అనుచు రాజామణి ప్రక్కలో పరుండగా రంగనాయిక మొగముమాత్ర మివ్వలకు త్రిప్పుకొని ''నేను చెయ్యలేనమ్మా సానరికం. నాకు పెళ్ళిచేసెయ్యి అని మరల యథారీతిగ పరుండెను. ఆ మాటవిని యామె

ఉలికిపడి ఆలోచనాథీన  యయ్యెను.

రంగనాయిక పదునాలుగేండ్ల బాలిక. రజస్వలయై యారుమాసములైనది. ఇంకను కన్నెరికము కాలేదు. వీణావాదనము నేర్చుకొనుచున్నది. అక్కల సరసులామె కొకవరునికుదుర్చుటలో వ్యగ్రులైయుండిరి. కన్నెరికము చేయుట కొకవర్తకుడు అంగీకరించెను. గాని అయిదువందలా ఎనిమిదివందలా యని వ్యవహారము నడుచుచుండెను. రాజామణి తన యీకడసారపు బిడ్డకు ఒక వైష్ణవునిచే కన్నెరికము చేయింప గోరుచుండెను; కూతుళ్లు ఆ యాలోచనమును ప్రత్యాఖ్యానములు చేయుచుండిరి.

కాని అయితే పదునారేండ్ల బాలికయే. అయినను సానులతోడను, సరసుల నడుమను మసులుచున్న దగుటచే నామెకు కొంత ప్రౌడిమ అబ్బియుండెను. ఈ కారణములవలన ఆమె వృద్ధబ్రాహ్మణ వితంతువు మాటను చక్కగ బోధపరుచుకొనగలిగెను. సహజముగ నామ మోస్తరు వేరు. ముక్తసరు మనిషి. అక్కలనైన రాసికొనుచు తిరుగదు. అందుచేత వారప్పుడప్పుడామెను ''ఇలా అయితే సరసుణ్ణిబాగానే మెప్పిస్తావు'' అనీ, ''బువ్వ బాగానే వస్తుందనీ'' యనుచుందురు. అప్పుడెల్ల నామె ''పోనీలెండి, వచ్చినంతలోనే గడుపుకుంటాను. నా గుణాలు నచ్చిన సరసుడే వుంటాడు. అసలు నేను మంచి బ్రాహ్మణ్ని చూసి కూడా వెళ్ళిపోయి వారింట్లో చాకిరీ చేస్తూ బతుకుతాను'' అనుచుండెను.

3

మరునాడు పోలీసులు ప్రకాశము మీద కేసు పెట్టిరి. మాధవరావు వెంటవచ్చి ప్రకాశము కాలేజీలో తరగతిలో నుండగా నోటీసు ఇప్పించెను. దొర'యేమి''టని యడుగగా ప్రకాశము జరిగినదంతయు చెప్పెను. మరి యొకచో పాఠములు చెప్పుచున్న వీరేశలింగము పంతులును బిలిచి దొరయంతయు చెప్పను. ఇద్దరును ఒక్క క్షణము నిశ్శబ్దముగా నుండిరి. ''నాతో చెప్పావు కాదేమీ?'' అని పంతులడుగగా ప్రకాశము ''ఇంత వరకూ వస్తుందనుకోలేదు'' అనియెను. దొర గంభీరముగా చూడగా పంతులు ఆ చూపుల నందుకొని వెడలిపోయెను.

వాయిదా రేపనగా ప్రకాశము పబ్లికు ప్రాసిక్యూటరగు రామదీక్షితుని యింటికరిగెను. అప్పటికప్పుడే వీరేశలింగము పంతులు వచ్చియుండెను. ప్రకాశము నమస్కరించి యిట్లు మాట్లాడెను.

''వేశ్యా బాలికపక్షంగా తమరు దాఖలు చేసిన కేసులో నేను ముద్దాయిని''.

''అలాంటి పని చేశావేమి అబ్బాయీ?''

''నేను చేశానా అని నాకేం సందేహం; కాని జరిగి పోయింది మాత్రం తప్పులోనే చేరుతుంది''

''ఇంకా నింపాదిగా అంటున్నావా? పెద్దసెక్షనే పడింది''

''అది మీ చేతిలో వుంది. నేనిక్కడ బి.యే. సీనియరు తరగతి చదువుతున్నాను. ఈ కేసులో మీరు దాఖలు చేసిన ప్లయింటు చూడగా నా భవిష్యజ్జీవితాన్ని గురించి చాలా భయం కలుగుతూ వుంది. నాలుగో తరగతి మొదలు యింతవరకూ అపజయమనేది లేకుండా యెకాయిటాకీని పైకివచ్చాను. చాలా మాట్లు తమరు గూడా నాకు చందాలిచ్చి వున్నారు కనుక నా బీదతనాన్ని గురించి మళ్ళీ చెప్పవలసిన పనిలేదు.''

''తప్పుచెయ్యడానికి బీదాసాదా భేదం వుందా?''

''అదిగాదు నేను మనవి చేసుకునేది. నేను అల్లరి జట్టులోనివాణ్ణి కానని నావిశ్వాసం. వీరేశలింగం పంతులుగారు నాగురువులు-''

''బాగుపడతావు?''

''కాని మీరు దాఖలుచేసిన కేసు-''

''నన్నేం చెయ్యమంటావు. నువ్వలా ప్రవర్తించావు''

నా వుద్దేశాన్ని తమరు విమర్శించాలని కోరుతున్నాను. స్టీమరురేవులో మునిగి గుండువారిరేవులో తేలడానికి మా క్లాసువాళ్లం పోటీలు పడ్డాము. అందుకు యౌవనం యొక్క వ్యగ్రోత్సాహంతప్ప వేరేమీ కారణాలు లేవు''

''అది వ్యగ్రోత్సాహం అని నువ్వు చెప్పేటప్పుడు దానివల్ల యిలాంటివి సంభవిస్తాయని నేనింక చెప్పడం''-

అంతటా ఫలం అలా వుండకపోయినా ఆ సమయంలో నా విషయంలో అలాగే జరిగింది.

''మునిగివెళ్లి తేలడంలో స్త్రీసంఘంలో అలా జరిగిందంటావు. ఇంతేనా నువ్వు చెప్పేదీ?''

''సరిగా అంతేనండీ. ఆ సమయంలో అక్కడ అంతమంది స్త్రీలు వుంటారని వూహించలేకపోయాను.

''స్త్రీలు కాకపోతే పురుషులుంటారు. కాకపోతే పడవ వుంటుంది. ఎలాగయినా ఆ రేవులో తేలేటట్లు పందెం వేసుకోవడం తప్పే''

''తప్పే అయింది. కనుకనే పశ్చాత్తాపం''

''విప్రా: పశ్చిమబుద్ధయ:''

''అది జాతికంతకీ చెందిన కళంకం''

''ఇంతకీ నువ్వు చెప్పే దేమిటీ?''

''జరిగిపోయిన సంగతికి మూలం యేమిటో, యెలా జరిగిపోయిందో మనవిచేశాను. నా స్థితి మనవి చేశాను. నాప్రార్థన యేమంటే? ఆ పందెంలో నేను నూరు రూపాయలు గెలిచాను. అవి ఆ బాలికకు దాఖలు చేస్తాను. కేసుతప్పించి నన్ను కటాక్షించాలి తమరు''

''కోరిక మంచిదే. కేసులు రాజీకావడమే నా వుద్దేశం''

''ప్రయత్నిస్తే తమకు వ్యతిరేకం జరగదు. కళంకం రికార్డయిపోవడం వకటీ, నా భవిష్యత్తు ధ్వంసం కావడం వకటీనీ, తమరు బాగా యోచించాలి''

దీక్షితులు దీనికి సమాధాన మాలోచించుచుండగా వీరేశలింగముపంతు లందుకొనియెను.

''దీనికి పర్యవసానం యేమిటో?''

''రెండు వేలదాకా జరిమానా రెండేళ్లదాకా వరకమూనూ. అధికారి తన యిష్టాన్ననుసరించి యిందులోయేదో వకటిగాని, రెండూగాని విధించవచ్చు.''

''ముందు రుజువు కావాలన్నమాట.''

''అంటే?''

''ముద్దాయీ యేవుద్దేశంతో వుండగా ఆ పని జరిగిందో ఆ విషయం తేలవద్దూ?''

''జరిగిపోయిన దానికేమో రేవంతా సాక్ష్యమే''

ఈ సమయమున ప్రకాశ మందుకొని ''నేను జరిగిన సంగతంతా యిందాకనే మనవిచేశాను. కోర్టులో గూడా ఇలాగే చెబుతాను. దీనికి సాక్ష్యమే అక్కరలేదూ. ఇది జరగలేదని వాదించను. క్షమించవలసిందనే మొదటినుంచీ నా ప్రార్థన'' అని చెప్పెను.

''కష్టసుఖాలూ, లాభనష్టాలూ, మంచిచెడ్డలూ వివరించి చెబుతాను. ఆ యింట్లో తల్లిపెత్తనం వుంటే మాత్రం రాజీ జరుగుతుంది. కాని ఆ పిల్ల అన్న చాలా పట్టుదలగా వున్నాడు. అప్పుడు నీ వాళ్లేమో బోగం జాతిని నిందించారట. పంతులుగారూ! అతనొక్కమాట చెప్పాడు. అది మీతో చెప్పడం నాకు యిష్టంలేదు; దానికి నేనూ అంగీకరించలేదు. రాజీకి అదొక్కటే మార్గం కాదు. ఆ పిల్లాడు-''

''ఏమన్నాడూ?''

''చెప్పమంటారా?''

''వచ్చిన కేసు సవ్యమైనదికాదు. దానికి సంబంధించిన ఆలోచనలు తగినట్టుగానే వుంటాయి. అయినా వినడానికి కేమీ?''

''మీ శిష్యుడు ఆ పిల్లకి కన్నెరికం -''

ఈ శబ్దము వినుటయే తడవుగా ప్రకాశము శ్రీహరీ యని చెవులు మూసికొనియెను. పంతులు ఉలికి పడెను.

''అందుకోసమే నేను చెప్పనన్నాను''

''ఆ పిల్లాడు అలా అన్నాడా?''

''అవును, రాజీకావాలంటే అదొక్కటే మార్గం అంటాడు''

''అందు కింకెవ్వరూ దొరకరూ?''

''లోటా? పిల్ల దీపంలా వుంది. చాలా తెలివైనది. శీలం చాలా నిశితమైనదని తలుస్తాను.''

''ఏమన్నారూ?''

''పరపురుషుడు తను తాకినందుకు ఆ పిల్ల చాలా కించపడుతోంది''

''అయితే వకపనిచేస్తారా?''

''ఏమిటది?''

''ఆ పిల్లతల్లిని మా తోటలోకి వకమాటు పంపించ గలరా?''

''దానికేమీ?''

''అయితే సరే''

ఇట్లు చెప్పి పంతులు సెలవు పుచ్చుకొని బయలు దేరెను. ప్రకాశము గూడ దీక్షితునకు నమస్కరించి బయలుదేరెను. రాత్రి పదిగంటలకు రమ్మని ప్రకాశమును పంపివేసి పంతులు తనతోటకు వెడలిపోయెను.

4

దీక్షితుని వర్తమానమును విని సానులందరును తెల్లపోయిరి. పంతులుకు వేశ్యలనిన బద్ధవైరమని అందరు నెరుగుదురు ఎందుకో యెవరికి నేమియు తోచలేదు. రాజామణి బయలుదేరగా పెద్దకూతురుగూడ వెంటబడెను.

రాత్రి యెనిమిదిగంటలైనది. అప్పుడే భుజించి వచ్చి పంతులు వెన్నెలలో పడకకుర్చీమీద కూర్చుండెను. సానులు వచ్చి నమస్కరించగా అతడు కూర్చుండగోరెను; గాని ఆ తల్లీకూతుళ్లు ఇద్దరును వినియమును జూపి నిలిచియే యుండిరి. అందుకు పంతులు ''లోకంలో జరిగే సంగతులు నాకు బాగా తెలుసును. ఎటు వంటివాళ్ళూ గూడా మిమ్మల్ని కూచోమనడం తమకు అగౌరవమని భావిస్తారు. కాని నా వుద్దేశం అదికాదు. నా యెదుట మీరు ఆ కుర్చీలమీద కూచోడం నాకు అమర్యాద కాదు. ప్రస్తుతం హిందూసంఘం స్త్రీల గౌరవాన్ని మరిచిపోయి వుంది. అందుచేతనే దేశం యిప్పుడిలా వుంది. ఇంగ్లీషుదొరతనం రాబట్టిగాని లేకపోతే మనం యింకా అధోగతిపాలై వుందుము. నోరుమాలిన వయస్సులో మీరీపాడు వృత్తిలో ప్రవేశపెట్టబడ్డారు. మీ వృత్తిని నేనసహ్యించుకుంటాను; కాని మంచి వుద్దేశంతో కబురుపంపించారు. గనుక మిమ్మల్ని గౌరవించడం నావిధి. ఒక్క నాభార్యతప్ప తక్కిన స్త్రీలంతా నాకు తల్లులూ, తోడబుట్టుపడుచులునూ. కనక మీరా కుర్చీలమీద కూచోండి'' అని చెప్పెను. చేయునదిలేక సానులు కూర్చుండిరి. ''వీరేశలింగం పంతులు గారు యిలాంటి వారా?'' అని సానులు ఆశ్చర్యపడిరి. పంతులడుగగా రాజామణి తన కుటుంబపు సంగతులన్నియు చెప్పెను. పంతులు యిట్లు చెప్పెను.

''నేనిప్పుడొక సంగతి చెబుతున్నాను. ఉలికి పడకండి. రాజామణీ! నువ్వు పెద్దదానవు. నీకు సంగతులన్నీ తెలుసును. నలుగురు కూతుళ్లని సానరికంలో దింపి కష్టమో, సుఖమో, లాభమో, నష్టమో అనుభవిస్తూ వున్నావు. కనక రంగనాయికకు పెళ్లి చేయకూడదూ? అప్రయత్నంగా వక పురుషుడు తన్ను తాకినందుకు ఆమె విచారిస్తోందని చెబుతున్నావు. సంసారిణికి వుండవలసిన శీలనైశిత్యం ఆమెకు పూర్తిగా వున్నట్లు నాకుతోస్తూవుంది.''

''మా పిల్ల సానిగా వుండడానికే ముచ్చట పడుతూ వుందండి.''

''అది శుద్ధాబద్ధం. యిప్పుడడిగి చూడు''.

''ఇప్పటికీ దానికదే అభిప్రాయమండి. కాదంటే తమరుగూడా అడిగిచూడవచ్చు.''

''నువ్వు నాకలాంటి అవకాశం యిస్తే యికలేని దేమిటి? రంగనాయిక నిప్పుడిక్కడికి రప్పించగలవా?''

రాజామణి చెప్పగా పెద్దకూతురు బండియెక్కి వెడలిపోయెను. ఈ ప్రస్తానము ఆమె చెప్పగా యింటనందరును తెల్లవోయిరి. రంగనాయిక మాత్రము యింకను వినుటకాత్రము చూపెను. ఆమెకు ''బోగందైతే మాత్రం? ఎదిగిన బిడ్డ. తప్పుకాదూ?'' అనుమాట స్ఫురణకు వచ్చెను. తోడనే ఆమె బయలుదేరెను. అది చూచి తక్కిన అక్కలు ముగ్గురును గూడ బయలుదేరిరి. అందుకు వారి సరసులు తొలుత నసమ్మతిని జూపిరి; గాని తుద కంగీకరించిరి.

వీరు వచ్చులోపల పంతులు రాజామణి కనేక విషయములు చెప్పెను. రాజామణిగూడ చాలసేపు వాదించినది. ''సానులు వుండడమూ, మానడమా అంటే మానడానికి నేనేకాదు సంఘమే వప్పుకోదు; కాని నా బిడ్డకి మీరు పెళ్లిచేస్తాననంటే మీరు చెప్పిన కారణాలవల్ల వప్పుకుంటాను. సాధ్యమైతే మీరు ప్రయత్నించవచ్చునని యామె చెప్పినది. ఆమె యీ మాటలు ముగించుచుండగా అందరును వచ్చిరి. అందరికంటెను ముందుగా రంగనాయిక పంతులుకు నమస్కరించి తల్లిచెంత నిలిచి పంతులు పిలువగా యెదుటికిబోయెను. అందు కానందించి పంతులు లేచి నిలిచి, రాజామణిని జూచి ''మీరు చూస్తూనే వుండవచ్చును నీ కూతుర్ని. మామాటలు మీకు వినబడకుండా వుండేటంత దూరంగా తీసుకుపోయి కొన్ని మాటలు చెప్పవలసివున్నాయి. ఏమంటావు?'' అనియెను. రాజామణి యందు కంగీకరింపగా పంతులు బయలుదేరెను. పిలువకుండనే రంగనాయిక పంతులు వెంట వెళ్లెను.

పంతులొకచెట్టు క్రింద కూర్చుండగా రంగనాయిక గూడ కూర్చుండెను. పిదప నిరువురును సంభాషణ ప్రారంభించిరి; గాని అది యెవరికిని వినబడనిది.

అక్కడ యేకాంతసంభాషణ జరుగుచుండగా యిక్కడ గుసగుసలు ప్రారంభమయ్యెను. ''రంగమ్మకి పెళ్లి చెయ్యగూడదటే?'' అని తల్లి యడుగగా పిల్ల లందరునందుకొనిరి. ''కన్నెరికం తరవాయిగా సానియ వుండగా యిప్పుడెవరు పెళ్ళాడుతారూ?'' అని యొకతె యడిగెను. ''అదికూడా సానయితే మనమేళంలోకి యిత పరాయి సాని పనివుండదు'' అని యొకతె పలికెను.'' ''కేసు యేమవుతుందో తేలేదాకా యేమాటా చెప్పలే'' నని యింకొకతె యనియెను. ''సానిరికంలో వుండే లాభనష్టాలు మనం చూస్తూనే వున్నాము. పంతులుగారు చెప్పే మాటలు గూడా బాగానే వున్నాయి'' అని పెద్ద పిల్ల చెప్పెను. ఒక్క అరగంట గడచిన తరువాత పంతులు వచ్చి కుర్చిమీద కూర్చుండగా రంగనాయిక వచ్చి తల్లి చెంత నిలిచెను. ''ఇప్పుడడగండి యేం చెపుతుందో.'' అని పంతులనగా అందురును ఒక్కమారే ''రంగా! పెళ్లాడతావా?'' అని యడిగిరి. వెంటనే ఆ బాలిక ముక్తకంఠముతో ''ఆడతాను'' అని చెప్పెను. పంతులుకు ఆనందము వెల్లివిరిసిపోయెను. సానులకు విద్యుదాఘాతము తగిలినట్లయినది.

'' నా ప్రయత్నం చాలావరకు ఫలించింది. ఇక మీరేమంటారూ?''

''చెప్పడానికేంవుందీ? మా రంగమ్మ పద్ధతి మొదటినుంచీ వేరే. అది యిదివర కప్పుడప్పుడు ''పెళ్లాడతాను'' అంటూనే వచ్చింది గాని ఆ కోరిక యింత దృఢంగా వుంటుందని మేము అనుకోలేదు''

''సరే''

''ఇలాంటి వుద్దేశం గల పిల్ల సానిగావుండి నెగ్గలేదు. తరవాత దాన్ని యేడిపించడం మంచిదిగా తోచదు''.

''బాగుంది''

''నేనప్పుడప్పుడనుకుంటూ వుంటాను, ఏమనీ? సానులలో కులస్త్రీలువుంటారనీ, కులస్త్రీలలో సానులు వుంటారనీనీ''

''యథార్థం''

''స్త్రీకి పదహారేళ్లేనా వస్తేగాని యీ విషయం తేలదు. కనుక అందాకా పెళ్ళిచెయ్యకుండా వుంటే మంచిదనుకుంటాను''

''నువ్వు పెద్ద విషయాలు ప్రస్తావిస్తూ వున్నావు. నువ్వు చెప్పే మాటల్ని పట్టి చూస్తే శీలనైశిత్యము ఉన్న వాళ్లకే పెళ్లిచేస్తే మంచిదని తేలుతుంది''.

''అవునండి.''

''అయితే అసలు పెళ్లియొక్క వుద్దేశం యేమిటి? ధర్మప్రజాసంపత్తి అని ఆపస్తంబాదులు చెప్పేరు. ప్రజోత్పత్తి కులటలలో గూడా వుంది. కనుక ధర్మమే ఆ రెంటిలో ప్రధానం. అనగా స్త్రీ గాని పురుషుడు గాని ఏకచారత్వాన్ని విడిచిపెడితే వారి వివాహం భ్రష్టమైపోయిందన్నమాట.''

''అందుకు సందేహం వుందాండి?''

''ఉందని యెవరు చెప్పగలరూ? దీనివల్ల వివాహం అనేది స్త్రీకి పురుషుడికి గూడా ఐచ్ఛికం అని తేలుతూ వుంది. హిందువులు పురుషుడు బ్రహ్మచారిగా వుండిపోతే అంగీకరిస్తారు; కాని స్త్రీ కన్యగా వుంటే గోల పెడతారు. పురుషుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా వూరుకుంటారు; కాని స్త్రీ పునర్వివాహం చేసుకుంటానంటే మండిపడతారు; పురుషుడు వక భార్యని విడిచి పెట్టి అంటే ఆమె జీవితాన్ని నాశనం చేసి -యింకో స్త్రీని పెళ్లాడితే యెవరూ యేమీ అనరుగాని స్త్రీకి అలాంటి అధికారం లేదంటారు. మొత్తానికి హిందూ సంఘం అంతా యిలాంటి దోషాలతో నిండివుండడం చేతనే యింతగా కూలిపోయింది.''

''చిత్తం''

''పొరపాట్లు అంతటా వుండవచ్చును. మూఢవిశ్వాసాలు అన్ని మతాల్లోను వుండవచ్చు; గాని హిందూ జాతిలాంటి మూఢజాతి ప్రపంచకంలో లేదు. ఈ జాతిలోకూడా పెద్దపెద్ద మహానుభావులు ద్భవించారు గాని అందరుకూడా అనాలోచితంగా వర్ణవ్యవస్థకి కట్టుపడడంచేత సంఘం కుళ్లిపోయింది.''

''చిత్తం''

''ఇది యిలా వుండనియ్యి. ప్రస్తుతాంశానికి వద్దాము. నా ప్రయత్నం చాలావరకు ఫలించింది. పర్యవసానం రేపు సాయంత్రం చెబుతాను. రంగనాయిక స్త్రీ రత్నం. ఆమెకి తగిన పురుషరత్నం నా దృష్టిలో వున్నాడు. అతనంగీకరిస్తే రేపురాత్రి అతనూ నేనూ మీయింటికి వస్తాము. అంతనంగీకరించపోతే నేను మీతో యిక మాట్లాడను. ఎవణ్నో వకణ్ణి తీసుగు వచ్చి రంగనాయికకు పెళ్లిచేయడం నాకిష్టం లేదు. మేము వచ్చినా రాకపోయినా రేపు రాత్రి పదిగంటలు మొదలు పదకొండు గంటలదాకా మీయింటో నువ్వూ, నీ కూతుళ్లయిదుగురూ తప్ప మరివక స్త్రీగాని పురుషుడు గాని వుండకూడదు. ఈలోపుగాగాని తరువాతగాని - అంటే అయిపోయీదాకా రంగనాయిక పెళ్లి సంగతి యెవరికీ - నీ అల్లుళ్లకీ, కొడుక్కీ కూడా - తెలవకూడదు.''

''నా కొడుక్కి తెలవకపోతే యెలాగండి?''

''అంత:కలహాలు-''

''అవునవును. ఈ రహస్యం సంగతి ముందతనితో గట్టిగా చెప్పు. రహస్యభేదనం అయిందంటే కొన్ని చిక్కులు వున్నాయి.''

''చిత్తం''

''మరి మీరిక వెళ్లండి''

''దణ్ణాలు''

''శుభం. మీ మంచిబుద్ధికి నేను చాలా సంతోషించాను. ఈశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు. రంగనాయిక పెళ్లిచేయగలిగితినా అది నా జీవితానికంతా ప్రకాశం కలిగిస్తుంది. మరి వెళ్లండి.''

సానులందరును పంతులుకు నమస్కరించి బయలుదేరిరి. పంతులు ''రంగా!'' అని పిలువగా ఆమె నిలిచి పోయెను. పంతులులేచి ఆమెచెంతకు వచ్చి ''అమ్మా! నీకు చెప్పవలసిందేమీ లేదు. నీ మూలంగా మీజాతి బాగుపడుతుంది. దేశం బాగుపడుతుంది. నీకు చెప్పిన మాటలు మరిచిపోకు. తల్లీ! రేపు రాత్రిదాకా నేను చెప్పిన రహస్యాన్ని కాపాడు'' అని చెప్పెను. రంగనాయిక శిరమువంచుకొని ''చిత్త''మని పలికి మరియొకమారు నమస్కరించి తన వారిని కలిసికొనియెను. పంతులు బ్రహ్మానందపరవశుడయ్యెను.

5

చెప్పిన చొప్పున మరునాటి రాత్రి తొమ్మిదిగంటలకు పంతులు రాజామణి యింటికి వచ్చెను. రాజామణి స్వాగతమిచ్చి చూడగా పంతులు వెనుక ప్రకాశముండెను. రంగనాయిక సిగ్గుపడెను. ఆమెయక్కలు తెల్లపోయిరి.

పంతులు కుర్చీమీద కూర్చుండగా ప్రకాశమాత నిపాదముల సన్నిధిని కూర్చుండెను. సానులందరును యెదుట కూర్చుండిరి. పంతులు పిలువగా రంగనాయిక అతని కుడిప్రక్కన నిలిచెను.

''వరుణ్ణి తీసుకొనివస్తానని నిన్న రాత్రి చెప్పేను. ఈశ్వరానుగ్రహంచేత ఈవాళ అలారాగలిగేను. ఇతణ్ణి మీరు చూసేవున్నారు. ఇతనిమీద కసిగాకూడా వున్నారు. అయినా రంగనాయికని పెళ్లాడడానికి యింతకంటే మంచి వరుడు పృథివి మీదలేడు. ఇతను స్వచ్ఛమైన వెలనాటి కుటుంబంలో పుట్టిపెరిగాడు. కాని బీదవాడు. 'మా' అన్న శబ్దంలేదు. తల్లీదండ్రీ కూడా లేరు. ఒక్క సోదరి మాత్రం వుంది. ఆమె భర్తతో కాపురం చేసుకుంటూవుంది. ఇతను ప్రైమరీ మొదలుకొని పక్కతరగతిలో నైనా అపజయం అనేది లేకుండా పైకి వచ్చాడు. ఈ యేటితో - అంటే వచ్చే మార్చితో బి.యే. అయిపోతాడు. ఇతనికున్న ధనంఅంతా అదే. నాలుగు సంవత్సరాల నుంచి నా శిష్యుడుగా వున్నాడు. సంవత్సరం క్రిందట వితంతువుని పెళ్లాడడానికి నిశ్చయించుకున్నాడు. అయితే యిప్పుడు బ్రహ్మసమాజంలో కలవదలచి నా దగ్గిరేవున్న వినయవతీ, గుణవతీ, రూపవతీ అయిన కమ్మ వితంతువును పెళ్లాడాలనుకుంటున్నాడు. కనుకనే మీ పిల్లని పెళ్ళాడడానికి అంగీకరించాను. ఇతను మీ పిల్లని గోదావరిలో పట్టుకున్నాడని మీకు కోపం గదా? మీ పిల్లని పట్టుకన్నవాడే ఆమెను పెళ్లాడుతున్నాడు. ఇంకేమీ?''

''బాగానే వుందండి. ప్రస్తుతం మా జాతిని గురించి కొంచెం చెబుతాను. మంచోచెడో యీజాతి యిలా నడుస్తోంది. మాలో పెళ్ళిళ్లు కూడా జరుగుతూనే వున్నాయి. కాని మంచి వరులు దొరకడం కష్టం. ఈ కారణం చేతగూడా కొందరు తమ బిడ్డల్ని సానులుగా చేస్తున్నారు. అగ్రజాతులవా రెవరేనా పెళ్లాడడానికి సిద్ధపడితేనూ పిల్లలో అనేకమంది కులస్త్రీలు అవుతారు.''

''నువ్వన్నమాట చాలా మంచిదే. ఇందులో రెండు కష్టాలు వున్నాయి; పెళ్లిచెయ్యడానికి సానులు అంగీకరించడం వకకష్టం; సానికూతుర్ని పెళ్లాడడానికి అగ్ర కులాల యువకులు సిద్ధపడడం అంతకంటె కష్టం. రంగనాయకి పుణ్యం మంచిది కనుక నువ్వూ మా ప్రకాశమూ గూడా చటుక్కున అంగీకరించారు''

మీరు తెచ్చిన వరుడు నాకిష్టమే. మరి నా బిడ్డ యేమంటుందో?''

''తక్కిన నీకూతుళ్లేమంటారు?''

''ఏమర్రా?''

''నాకిష్టమే''

''నాకంగీకారమే''

''నాకు వప్పుదలే''.

''నాకూ సంతోషమే''

''సెబాస్‌! ఇక రంగనాయిక సంగతా? ఆమె నిన్న రాత్రే అంగీకరించింది. లేకపోతే నేను ప్రకాశాన్ని యిక్కడికి తీసుకురాకనే పోదును. అయినా మీరు కూడా వినవలసిందే. అమ్మా! రంగనాయికా? నీ వుద్దేశం చెప్పూ.''

''నేను వారినే పెళ్లాడతాను''

రాజామణి తటాలున ఆమెను కౌగిలించుకొనియెను. అక్కలందరును చుట్టుకొని లాలించిరి.

పిదప పంతులు రంగనాయికను, ప్రకాశమును ఒక బల్లమీద కూర్చుండజేసి ఒకరిచేతనొకరికి తాంబూలాలిప్పించి దీవించెను. సానులు గూడ దీవించిరి. పంతులు పౌర్ణమివెళ్లిన రెండవదినమున (ఆరుదినముల గడువు) వివాహమని చెప్పి బయలుదేరెను.

వెళ్లుచు వెళ్లుచు నాతడు సానులనందరిని సంబోధించి ''మీకు తెలవందేమీలేదు. అనేక కారణాలచేత యీ వివాహ విషయం మీ రతిరహస్యంగా వుంచాలి. మీ సరసులికిగూడ తెలవనివ్వగూడదు. పెళ్లినాటి మధ్యాహ్నం మీకు కావలసినవాళ్ల నందరినీ పిలుచుకోండి. అప్పుడేనా వరుడు ఫలానా అని చెప్పవద్దు. ఈ వివాహం చూడడానికీ, దంపతుల్ని ఆశీర్వదించడానికీ నాతోగూడా పెద్దలనేకులు వస్తారు. అందర్నీ మీరు గౌరవించాలి. పీటలమీద కూచునేటప్పుడు మాత్రమే వరుడెవరో అందరికీ తెలివాలి'' అని చెప్పి వెడలిపోయెను.

పిమ్మట ఆ తల్లీకూతుళ్లందరును వరవర్ణనము ప్రారంభించిరి. పెద్దపిల్ల ''శాంతమైనవాడు'' అనియెను. పోలీసులను తెప్పించిన పిల్ల ''ఆ వేళ గోదావరిలో నేను మొగం సరిగా చూడనే లేదూ. చామనచాయ అయినా రంగమ్మకి తగినవాడే. పక్కపాపిడి క్రాపింగుచేత మొగం యెంతో బాగుంది. కళ్లల్లో నిదానమూ, గాంభీర్యము వున్నాయి. మొగం కలకల్లాడుతుంది'' అనియెను. మూడవయామె. ''ఇరవైయేళ్లకంటే ఎక్కువ వుండవు. నూగు మీసాలతో యెంతో చక్కదనం వున్నది'' అనియెను. నాల్గవపిల్ల ''పొడుగూ పోట్టీ కాదు, లావూ సన్నమూ కూడా కాదూ. అన్ని విధాలా చెల్లాయికి తగినవాడూ.'' అనగా రాజామణి ''బి.యే. అయిపోతాడుట. పెద్ద ఉద్యోగం అవుతుంది. రంగం అదృష్టం'' అనియెను. ఇట్లు కొంతతడవైన తరువాత ''పెళ్లికొడుకు సంగతి జాగ్రత్త'' అని చెప్పి రాజామణి పోయి శయనించెను. సినీమాకు పోయిన సరసులు వచ్చు నంతవరకు ఆ యక్కచెల్లెండ్రు ప్రకాశము సంగతియే చెప్పుకొనుచుండిరి.

6

అటు కన్నెరికపు బేరములు జరుగుచుండగా ఇటు వివాహ నిశ్చయము వేశ్యావాటిక అంతయు గందరగోళముగా నుండెను. సానులకంటె విటులే ఆశ్చర్యపడసాగిరి. ఎవరి నడిగినను, ఎట్లు ప్రయత్నించినను వరుని సంగతి తేలలేదు. మాధవరావు గూడ ''చెప్పలే''ననియెను.

అంతవరకును రహస్యముగ కన్నెరికపు బేరాలు చేసిన షాహుకారు ఇప్పుడు బయలుపడెను. ఎనిమిది వందలకే అంగీకరింపని యాతడిప్పుడు వేయిన్నూట పదారులిచ్చెదననియెను. అయినను ఆ యాశవదులు కొమ్మని జవాబు వచ్చెను. రంగనాయికను చూసినను చాలునని రెండుసార్లు వచ్చెను; గాని లాభము లేక పోయెను. ఎంతో ప్రాథేయపడగా ''మరివకని భార్యని నీవెందుకు చూడాలయ్యా?'' అని ప్రత్యుత్తరము వచ్చెను. ''పెళ్లికొడుకెవరో చెప్పండి'' అని యడుగగా రాజామణి ''మీ కేమిపని?'' యని కచ్చితముగా నడిగెను.

కచేరీలో రామదీక్షితుడే విచారణకు వాయిదా కోరెను. ''పిల్లకి పెళ్లిచేస్తారుటే'' యని పోలీసులడుగగా దీక్షితుడు ''దానివల్ల మనకి వచ్చిన బాధ యేమిటీ?'' అని యడిగెను. ''మీ కేసుకోసం మమ్మల్ని పెళ్లిమానుకోంటారుటండీ?'' యని రాజామణి యడిగెను. ''పెళ్లికీ  కేసుకీ సంబంధం యేమిటీ? మీ ప్రయత్నాలు మీరు మానవద్దు. ఇంట్లో నా పెత్తనం యేమీ సాగదు. నా మట్టుకు నేను మీరెలా చెయ్యమంటే అలాచేస్తాను'' అని మాధవరావు చెప్పెను. ''కేసు తీసేసుకుంటాం మాకు ప్రజంటు ముట్టచెప్పు'' అని ప్రకాశము నడుగగా నాతడు ''మళ్లీ యీ ప్రస్తావన తెచ్చారంటే మీసంగతి దొరకి రిపోర్టు చేస్తా''ననియెను. వారిని పిలిచికొని వచ్చిన వైశ్యయువకుడు ''ఆవేళ మిమ్మల్ని పిలవమంటే పిలిచాను. ఇందులో నా పూచీ యేమివుందీ?'' అనియెను. వివాహము సంగతి డిప్టీసూపరెంటికి చెప్పగా ''పెళ్లి నిలుపుచెయ్యడానికి మనకేమైనా అధికారం వుందా?'' అనియెను. చేయునది లేక సబినస్పెక్టరు మొగము దిగాలు వేసికొనియెను. సర్కిలు ఇనస్పెక్టరు ''పెళ్లికొడుకెవరో తెలుసుకోండి'' అని చెప్పెను. గాని యెవరును ఆ ప్రయత్నము చేయలేదు.

వివాహదినము వచ్చినది. మాధవరావు గృహాలంకారమున చాలా నైపుణ్యము చూపెను. సరసులు అవసరవస్తువుల నన్నిటిని సమకూర్చిరి. రాజామణి మధ్యాహ్నము బయలుదేరి ఇద్దరు కూతుళ్లతో వెళ్లి బంధువుల నందరిని పెళ్లికి పిలిచెను. అందరును ''పెళ్లికొడుకెవరూ'' అని యడిగిరి. గాని యామె ''చూస్తారుగాదూ?'' అని మాత్రమే ప్రత్యుత్తరమిచ్చెను. వీరేశలింగము పంతులుగూడ రావలసినవారి నందరిని ఆహ్వానించెను. దీనితో పట్టణమంతయు నుడికిపోయెను. ''మాయచేసి యే అమాయిక శిష్యుడికో బోగందాన్ని కట్టిపెడుతున్నాడు పంతులు'' అని సంస్కార విముఖులు గోల ప్రారంభించిరి. ''వితంతువులకు మళ్లీ పెళ్లి చెయ్యడం బాగానే వుంది. వర్ణసాంకర్యం కూడా చేస్తారు పంతులుగారు' అని సంస్కారాభిమానులు చెప్పుకొనసాగిరి. ''అసహనం వున్నా, ద్వేషాలువున్నా, హెచ్చు తగ్గులువున్నా , అవన్నీ మనలో వర్ణవ్యవస్థలవల్లనే వచ్చిపడ్డాయి. ఈ కులపద్ధతి యెంతత్వరగా నాశనమైతే దేశం అంత త్వరలో బాగుపడు''నని బ్రహ్మసమాజ సభ్యులు చెప్పసాగిరి.

సాయంత్రమైనది. అనుచరవర్గముతో పంతులు రాజామణి యింటికి వచ్చెను. ఆయనుచరులయందొకడైయున్న ప్రకాశమును వదినెలు జలకమాడించి అలంకరించి యెక్కడ పెండ్లిపీట వేయుదురో అక్కడికి సమీపమున నున్న గదిలో నుంచిరి. పంతులు వీధిగుమ్మమున నిలిచి వచ్చిన పెద్దల కందరికి స్వాగతమిచ్చెను.

జిల్లా జడ్జీ, సబుకలెక్టరు, కాలేజీప్రిన్సిపలు, తహస్సీలుదారు, మాజిస్ట్రీటు, కోర్టుమున్సబులు, సబుజడ్జీ, పోలీసుపెద్దదొర, చిన్నదొర, సర్కిల్‌ ఇనస్పెక్టరు, కొందరు ప్లీడర్లు, రామదీక్షితుడు, పెద్దల సంపాదనతో తగుమనుష్య లనిపించుకొనుచున్న నిర్వ్యాపారులు, మున్నగువారనేకులు వచ్చిరి. నాలుగిండ్లభవంతి కనుక నది సరిపోయెను; గాని లేకున్న అందరును వీధిలో నిలువవవలసినదే.

ఏడున్నరయైనది. పంతులు బ్రహ్మపీఠము నధిష్టించెను. రాజామణి రంగనాయికను తెచ్చి పీటమీద కూర్చుండబెట్టెను. పంతులు కనుసన్నమీద రాజామణి పెద్దకూతురు తలుపు తీయగా ముసిముసి నగవులతో ప్రకాశమువచ్చి రంగనాయిక చెంత కూర్చుండెను. కరతాళధ్వనులు మిన్నుముట్టెను. మంగళవాద్యములు భోరుకలంగెను. కొందరు ''సెబాస్‌'' అనిరి, కొందరు నిర్విణ్ణులైరి. కొందరు ఆశ్చర్యపడిరి. కొందరు ''కలికాలం'' అనిరి. కొందరు చకితులైరి. దొరలు, సంస్కార ప్రియులు పంతులు పట్టుదలను కొనియాడిరి. అందరు ననేకవిధముల చెప్పుకొనిరి.

యుక్తసమయమున యుక్తరీతిని వివాహకృత్యము లన్నియు ముగిసెను. సానులు కంఠములెత్తి పాడి మంగళహారతి యిచ్చిన పిదప పంతులు వధూవరులను లేవదీసి సభలో నున్నతాసనములమీద కూర్చుండజేసి జరిగిని దంతయు నుపన్యసించెను. పిదప ప్రిన్సిపలు లేచియిట్లు చెప్పెను.

''ఆంధ్రదేశచరిత్రలో ఈ విషయం ప్రత్యేకప్రకరణంలో వర్ణించతగ్గది. ఈ వివాహంవల్ల ఈ పట్టణానికి చాలా శోభ కలిగింది. ఈ వివాహం యొక్క పూర్వచరిత్ర అంతా పంతులుగారు బాగా చెప్పేవున్నారు. యుక్త సమయములో వారు పూనుకొనక పోయినచో వేశ్యజాతిలో నూతనాధ్యాయాన్ని ప్రారంభింపచేసిన యీ బాలిక కుంభీపాకనరకంలో కూలిపోయివుండును. తల్లుల యొక్క అవివేకం వల్ల యీ జాతిలో యింకా యిలాటి బాలికలు చాలామంది చెడిపోతున్నారు. సంగతులన్నీ బాగా బోధిస్తే యేవేశ్యా కూడా తనబిడ్డల్ని పాడుచేసుకోడానికి సాహిసించలేదు. దీనికంతకీ అగ్రజాతుల స్వార్థం కొంతా, ఔదాసీన్యం కొంతా కారణాలైవున్నాయి. మీ సంఘంలో వుండే ఆచారాలు యిప్పుడు చాలామట్టుకు మీ శాస్త్రానికీ, ప్రపంచ సభ్యతకీ గూడా దూరంగానే వున్నాయి. మంచిదారిలో నడపబూనుకోవడం వకయెత్తూను. ఈ విషయంలో ఆంధ్రదేశానికల్లా వక్క వీరేశలింగం పంతులుగారే కనబడుతున్నారు. వారికంటే విద్వాంసులూ, ధనంకలవారూ, మంచీచెడ్డా తెలిసిన వారూ, కష్టసుఖాలెరిగివారూ, దేశం యొక్క దుస్థితికి వగచే వారూ, మీలో చాలామంది వుండవచ్చును; గాని యీశ్వర సందేశాన్ని విని, దానిని బాగా బోధపరుచుకుని, ఆచరణలో పెట్టగలవారు పంతులుగారొక్కరే కనబడుతున్నారు. వాస్తవంగా శంకరరామానుజాదుల తరువాత పంతులుగారు మళ్లీ అంతవారని చెప్పడానికి కేమీ సందేహం లేదు. పంతులుగారి వుద్దేశాలను ఖండించే వారు కొందరుండడం నిజమే. పంతులుగారు సంఘాన్ని పాడుచేస్తున్నారనడమే కాని తాము నమ్మిన ధర్మాన్ని పునరుద్దరించడం కోసం వారేమీ ప్రయత్నించడం లేదు. చెడిపోయిన సంఘాలని బాగుచెయ్యాలన్నప్పుడు పూర్వశాస్త్రానుసరణం యెప్పుడూ, యెవరికీ సాధ్యంకాదు. పూర్వం యెప్పుడో నిర్ణయింపబడ్డ సంఘ నియమాలలో కొన్ని కాలాన్ని బట్టీ, సంపర్కాన్ని బట్టీ, పాత్రలబట్టీ, ప్రభుత్వాన్ని బట్టీ దిద్దబూనే వారికి అసహ్యంగా కనబడడం ప్రపంచకం అంతటా వున్నదే. ఇంతవరకు సంస్కారాన్ని వడిసిన యే ఆచార్యుడూ కూడా కేవలమూ పూర్వశాస్త్రాలను అనుసరించి మాత్రమే పనిచెయ్యలేదు. అలా చెయ్యలేడుకూడాను. సంతత సాహచర్యం వల్లనైతేనేమి, సంస్కారవైముఖ్యం వల్లనైతేనేమి, పంతులుగారి ఘనతని ఈ పట్టణంలోని వారనేకులు గ్రహింపలేకపోవచ్చును; గాని వారు ఉపాధ్యాయుగులా వుండడం వల్ల నా కాలేజీ చాలా పవిత్రమైనదని నేను నమ్ముతున్నాను. వారిస్నేహం వల్ల నా గౌరవం పెరుగుతూ వుందని నేను చాలా ఆనందిస్తున్నాను. అయితే నేటివరకూ వారి అనుచరులలో వారికి తగినవారు లేకపోయినందుకు నేను చాలా విచారించుతున్నాను. తలుచుకుంటే శ్రద్ధచేస్తే మా ప్రకాశం అంతవాడు కావచ్చును. ప్రకాశం నా ప్రియశిష్యుడు. నా కాలేజీకంతకీ దీపం వంటివాడు. నేను అతడు ఒక పతిత సంఘంలోని పిల్లని పెళ్ళాడడంలో తన విద్యాధికతకు తగిన ఔన్నత్యాన్నీ, జ్ఞానానికి తగిన విచక్షణతనీ, తన అభిజాత్యానికి తగిన ఔదార్యాన్నీ వెల్లడించి స్తుతిపాత్రుడైనాడు. ఈ సాహసకృత్యం వల్ల అతడు ఇప్పటి శిథిలసంఘానికి కొంచెం దూరం అయినా ఈ బాలికారత్నం యొక్క సాహచర్యం వల్ల అతని జీవితం ప్రకాశమానమై అనేకులకు ఆదర్శం కాగలదు. ఇప్పుడిప్పుడు హిందువులలో కొందరు వేశ్యావృత్తిని తగ్గింప బూనుకొని వుండడం మంచిదే; గాని వుపన్యాసాల వల్లా, వ్యాసాల వల్లా తగినంత ప్రయోజనం కలగదు. నేడు అనేక కారణాలవల్ల వేశ్యాకులంలో వున్న కన్యలకు ఆ కులంలో తగిన వరులు లేరు. అంచేత సంస్కారం ప్రారంభం కావలసిన ఈ సందిగ్ధసమయంలో అగ్రజాతుల యువకులు ఆ బాలికలను పెళ్లాడడానికి ముందుకు రావలసి వుంది. అగ్రజాతులు ఆ జాతికి చేసిన ద్రోహం యిట్టి పనుల వల్లనే తీరుతుంది; గాని మాటలవల్లా, సానుభూతి వల్లా కాదు. ఈ సందర్భంలో యీ బాలిక యొక్క తల్లిని గురించి కొంచెం చెప్పవలసివుంది. నలుగురు కూతుళ్లని కులవృత్తిలో దింపిన ఆమె ఈ బాలిక విషయంలో చాలా మంచిపని చేసింది. ఈశ్వరుడు ఆమెని పాపాలనుంచి విముక్తి కలిగించడానికి ఈ పని వక్కటే చాలు. ఆమెనీ, ఈ కుటుంబంలోని తక్కిన వారినీ నేను చాలా ప్రశంసిస్తూ ఈ దంపతులను రక్షించవలసినదని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను''.

ఈ యుపన్యాసము ముగిసిన తరువాత పోలీసు పెద్దదొరలేచి వివాహమునకు సంబంధించినవారి నందరిని వినుతించి ''ఈ వరుని మీద మేము పెట్టిన కేసు రేపే తగ్గించుకుంటా''మని చెప్పెను. రామదీక్షితుడు లేచి తనకు తెలిసిన సంగతులన్నీ తెలిపి, ''కన్నెరికం ప్రస్తావన చేసిన మాధవరావు నేడు ఈ వివాహ సందర్భంలో చాలా హడావుడిగా వున్నందుకు ఆనందిస్తూ వధూవరులను ఆశీర్వదిస్తున్నా''నని చెప్పెను. ఇంకను మరికొందరు ప్రస్తావించిరి. చివర రాజామణి సమయోచితముగా కొంచెము చెప్పి వచ్చినవారందరికీ తన కృతజ్ఞతను తెలిపి వధూవరుల నాశీర్వదించవలెనని కోరెను.

ఈ సంభాషణలన్నియు విని అచ్చట నున్న వారందరును ఉద్రిక్తులైరి. అనేకులు వధూవరులకు వెలగల పారితోషికము లిచ్చిరి, ప్రిన్సిపలు వధువునకొక వెండిగిన్నెను, వరునకొక రిస్టువాచీని ఇచ్చి ''నా శిష్యుడైన ప్రకాశం ఉన్నతిని గురించి నేనెప్పుడూ శ్రద్ధచేస్తూ వుంటా''నని మాట యిచ్చెను.

అంతయు నైన తరువాత మాధవరావును, మరి కొందరాతని బంధువులును వచ్చినవారికి చందన తాంబూలము లిచ్చి సత్కరించిరి. ఆ రాత్రి పంతులు కోరికమీద ఆక్షేపణలేనివారు అచ్చట సర్వవర్ణ భోజనమున పాల్గొనిరి. చిత్రవిచిత్రములగు బాణాసంచాలతో రాత్రి గొప్ప యూరేగింపు జరిగెను.

ఈ వివాహమును గురించి అనేక పత్రికలు తమ యామోదమును వెల్లడించినవి. దేశభక్తులనేకులు తమ సంతసమును ప్రకటించిరి. గుహలలోని అంధకారమున ఆయానందసందోహమును దవుదవ్వుల మూర్ఖాచార పరాయణుల దుర్విమర్శనములు గూడ ఉండినవి.

- నవంబరు, 1926, భారతి మాసపత్రిక.