పదునైన పాటలు

విశ్లేషణ

- సయ్యద్‌ జహీర్‌ అహ్మద్‌ - 9505152560

        ''పశుర్వేత్తి శిశుర్వేత్తి.....'' అని ఆర్యోక్తి.  గానంలో లీనమైన పశువు, శిశువు  పరవశిస్తాయని దానర్థం.  కవిత్వం, పద్యం పండితులను పఠితులను రంజింపజేస్తుంది.  గేయం, గానం, సంగీతం పామరుల మెదళ్ళలోకి దూసుకుపోతుంది.  తన ఉనికిని చాటుకుంటూ పాట ఎల్లలు దాటి ప్రవహిస్తుంది. ''ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ'' అన్నది పాటే. అలాగే రవీంద్రుని జాతీయ గీతం, బంకిం చంద్రుని వందేమాతరం. గాత్రం, సంగీతం, తోడైతే ఆ పాట జనం నాలుకల మీద నర్తిస్తుంది. అలా పాటల పల్లకినెక్కించి ఊరేగించిన కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు జంధ్యాల రఘుబాబు కలం నుండి జాలువారిన ''సైరా...మా బళ్ళారి'' అనే శీర్షికతో 30 పాటలతో కూరిచిన సంపుటిని వెలువరించారు.  ఈ పాటల పుస్తకం చిరు ప్రయత్నమని, తొలి ప్రయత్నమని తన ముందుమాటలో చెబుతారు. పాట పరమార్ధం  ప్రజలకు చేరడం, సమాజానికి ఉపయోగపడటం అంటారు. పాట వినోదానికే కాదు దాని లక్ష్యం సమాజానికి ఉపయోగపడటం అన్నది ప్రజా కవుల ఉద్దేశ్యం.  ఈ పాటల సంపుటికి ప్రముఖ పాటల రచయిత స్ఫూర్తి, ప్రజా గాయకులు మహమ్మద్‌ మియ, ఎం.పి.బసవరాజు ముందు మాటలు పాటల గురించి మనకెన్నో విషయాలను తెలుపుతాయి. పుస్తకం చివరిలో అభినందన మందారాలంటూ ఈ పుస్తకం పై జిల్లాలోని కవుల అభిప్రాయాలనూ పొందుపరిచారు.

ఈ సంపుటిలోని మొదటి పాట ఘన నివాళి శీర్షికన ''వాసు నీ ఊసేది/ వాసు నీ పాటేది/ మధ్యలోనె మమ్మొదిలి/ చిరునవ్వుగా మిగిలినా'' అంటూ మొదలై కర్నూలు జిల్లా ప్రజా నాట్యమండలి గాయకుడు, రచయిత, దర్శకుడు ఆర్‌.ఎ.వాసు ఆకస్మిక మరణంతో తనలోని భావోద్వేగాన్ని అక్షరబద్దం చేసి ఎలిజీని ఇలా నివేదిస్తారు. ''నడుస్తూ సమాజపు/ నడకల్ని గమనిస్తూ/ ఆకలితో నిద్రపోయి మెలకువతో రాస్తావు/ ఒక చేతిలో ఎర్రని జెండా/ ఒక చేతిలో వెలుగుల కలము/ చివరిదాక పట్టావు/ చిగురాకుగ రాలినావు''.  ''నేల తల్లినిరా ప్రకతి మాతనురా/ జీవానికి జన్మనిచ్చిన భూమాతను నేనురా/ విఛ్ఛిన్నం చేయకురా విగతవైపోకురా/ విశాల జగతిని నిర్జీవం చేయకురా'' అనే పల్లవితో సాగె గీతంలో పర్యావరణ పరిరక్షణకు వక్షాల నరికివేతలవల్ల భూతలం వేడెక్కి జీవం మనుగడె ప్రశ్నార్ధకమవుతుందంటారు. ''మా వూరి బ్యాంకు'' అన్న పాటలో గ్రామీణ బ్యాంకులు గ్రామానికి దీపికలు, రైతునోటి నాలుకలు, దేశానికి ఏలికలు, దేశభక్తి రెపరెపలు అని గ్రామ స్వరాజ్యాన్ని కోరతారు. ''చిన్నోడికి రుణమియ్య/ చిక్కులెన్నొ పెడితివి/ పెద్దోడికి వేలకోట్లు/ అప్పనంగ ఇచ్చితివి'' అంటూ ''నేటికైన కళ్ళు తెరువు మోడీ/ నేటికైన నిజం చూడు జెట్లీ'' అని నాయకులకు ఉద్బోధ చేస్తారు.

సైరా మా బళ్ళారి పుస్తకం టైటిల్‌.  ''సైరా మా బళ్ళారి/ నాటకానికి నువ్వేవేశావ్‌ దారి బళ్ళారి/ తెలుగునాట నటనకు నువ్వే పునాది బళ్ళారి'' అని బళ్ళారి రాఘవను ప్రస్తుతించారు. ఆయన నాటక రంగానికి చేసిన సేవలకు ప్రతీక ఈ గేయం. ఇదే శీర్షికతో రెండు పాటలతో ప్రజానాట్యమండలి 9వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆడియో సి.డి. తేవడం జరిగింది.  పాటని రూపకంగా కూడా మలిచారు. ''అన్నింటా మహిళలు/ ముందుండాలని కోరావు/ నాటకాన నాయికలు/ రావాలని పిలుపిచ్చావు'', ''ప్రయోగాల గనియే నీవు/ ప్రగతిశీల గతియే నీవు/ ఆధునికం నీ ఆలోచన/ శాస్త్రీయం నీ పంథా'', ''ప్రజలకోసమే కళలంటూ/ దేశాలెన్నో తిరిగావు/ అనుభవాలు పంచావు/ అవగాహన పెంచావు'' అంటూ ఆయన జీవితకాలంలో నాటక రంగానికి చేసిన సేవలకు ప్రతీక ఈ గేయం.  ''చిరిగిన చొక్కానైనా తొడుగు/ పుస్తకం తప్పక కొను'' అంటూ పుస్తకమే సాధనం అన్న పాటలో పుస్తకంపై ఆసక్తి కలిగిస్తారు. ''ఖురాను బైబిల్‌ గురు గ్రంథం/ భగవద్గీత త్రిపీఠకం/ ఆగమశాస్త్రం అవేస్తా/ కొజికి వేదం ఏదైనా/ అదీ ఓ పుస్తకమే/ అదీ మన నేస్తమే'' అంటారు. కదం తొక్కవే కర్నూలు అన్న గేయంలో కర్నూలు ప్రశస్తిని, ఉనికిని తెలుపుతూనే హైకోర్టుకై పోరాటం చేయమని చెబుతారు. ''చదువంటే మూడక్షరాలు/ చదువంటే మూడో కన్ను/ చదువంటే శాశ్వత నేస్తం/ చదువంటే జీవన సత్యం'' అనే పల్లవితో రాసిన గీతం చదువువల్ల విజ్ఞానం కలుగుతుందని చక్కగా చెబుతారు జంధ్యాల.

''అవినీతి అధమనీతి'' కి పట్టం కట్టే లంచగొండుల వైఖరిని దుయ్యబడుతూ పధకాలను, వ ధ్ధుల పింఛన్లలోను మామూళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తున్నారంటారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సాయపడవలెనోయ్‌ అన్న గురజాడ సూక్తిని పెడచెవిన పెట్టారంటారు. ''మతం మత్తు మందురా/ కులం కుళ్ళు కంపురా/ విభజనల చేసి మనల/ ఆటబొమ్మల చేస్తారుర'' పల్లవిలో కారల్‌ మార్క్స్‌ మాట నిజమేనంటారు. ఇంకో పాట ''ప్రభుత్వ పాఠశాల'' లో గవర్నమెంటు బడిని కళ్ళకు కట్టినట్టు, అందులో ఉన్న వెసులుబాటు, సౌకర్యాలు ప్రయివేటు బళ్ళలో దొరకవని చెబుతారు. ''మహిళా దినోత్సవం'' పాటలోని ఒక చరణంలో ''ఈ భ్రూణ హత్యలను ఈ యాసిడ్‌ దాడులను/ ఈ మానభంగాలు ఈ అవమానాలను/ నిర్భయ చట్టాలెన్ని వచ్చినాగాని/ ముందుండి అతివలే ఆయుధాలు కావాలి'' అని మహిళల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారు. కాలాలు పధ్ధతులు ఎన్ని మారినా కాని/ కష్టజీవి చెమటకు విలువ కట్టలేని జనం/ ప్రపంచాన ఉన్నారని కనిపెట్టి నడవాలి/ చేయి చేయి కలిపి మనం ముందుకు సాగాలి'' అని మేడే ప్రచార గీతంలో చెబుతారు.

పామరునికి కూడా తెలిసిందేమంటే రాయలసీమలోని ముఠా కక్షలు, ఫ్యాక్షన్‌లు, కరువు కాటకాల మీద రైతన్నల వలస, బలవన్మరణాల గురించి తప్పకుండా స జిస్తాడనడానికి జంధ్యాల ''సీమ బతుకు'' పాట అద్భుతంగా రాశారు. మొత్తానికి ఈ పుస్తకంలోని 30 పాటలు ప్రభోద గీతాలే.  పలు సందర్భాల్లో పాడుకోగలిగేలా కూడా ఉన్నాయి.  కవర్‌ పేజి బళ్ళారి రాఘవతో పాటు పలువురు ప్రముఖ గాయకులు, అమరులైన కర్నూలు జిల్లా ప్రజా గాయకులు నాగరాజు, ఆర్‌.ఏ వాసుల ఫోటోలతో  ఆకర్షణీయంగా  రూపుదిద్దుకుంది. రాయలసీమలో కవిత్వ, కథా సంపుటిలు, సంకలనాలు ఎక్కువగా వేస్తున్న తరుణంలో పాటల పుస్తకం రావడం హర్షించదగిన విషయం. ఆ విషయంలో జంధ్యాల రఘుబాబును అభినందించవలసిందే.