మద్యంపై పోరాటం కాళ్ళకూరి 'మధుసేవ'నాటకం

డా|| జోస్యుల కృష్ణబాబు
98664 54340
మద్యరస మనుకార్చిచ్చు మానవుడను
తరువునకు సోకినంతనే తత్తదవయ
వమ్ములనెడి కొమ్మలతోడవమ్ము చేసి
బుద్ధియను చేవతో గూడ బుగ్గి సేయు! అంటూ మద్యపాన వ్యవసనంపై పదునైన బాణాన్ని ఎక్కుపెట్టారు కాళ్ళకూరి నారాయణరావు. సమాజాన్ని ప్రభావితం చెయ్యాలంటే శ్రవ్యం కంటే దృశ్యం గొప్పదని ఆయన భావించారు. అందుకే ఆనాటి (ఈనాటికి కూడా) సమాజాన్ని పట్టి పీడించే మూడు సామాజిక సమస్యలపై మూడు పదునైన అస్త్రాల్ని ఆయన ప్రయోగించారు.
వేశ్యావృత్తి, వేశ్యాలోలత వల్ల కలిగే అనర్ధాల్ని వివరిస్తూ చింతామణి నాటకాన్ని, వరకట్న దురాచారం వల్ల కలిగే కష్ట నష్టాల్ని వివరిస్తూ వర విక్రయాన్ని, మద్యం రక్కసి కోరల్లో చిక్కి కొంపలను ఆరోగ్యాన్ని గుల్లచేసికొనే వారి జీవితాల్లోని విషాదాన్ని గూర్చి మధుసేవ నాటకం ద్వారాను కాళ్ళకూరి చాలా బలంగా చిత్రీకరించారు.
అయితే ప్రదర్శన విషయానికి వస్తే చింతామణి నాటకం ఆంధ్రదేశమంతటా ఊరూరా, వాడవాడలా ప్రదర్శితమై ఆబాలగోపాలాన్నీ అలరించింది. వర విక్రయం ప్రదర్శన కంటే కూడా ఎక్కువగా రేడియో నాటికగా అనేకసార్లు ప్రసారమై జన హృదయాల్లో నిలిచిపోయింది. ఈ రెండూ చలన చిత్రాలుగా కూడ వచ్చాయి.

ఇక ఎటొచ్చీ ఈ మధుసేవ నాటకం మాత్రం తక్కిన రెండు నాటకాల్లాగా నాటక ప్రియులకు అంత దగ్గర కాలేకపోయింది. కాని రచనాపరంగా, సాహిత్యపరంగా ఇదికూడ గొప్పనాటకం. ఇప్పటికీ సమాజంలో మొదటి రెండు సమస్యలకంటే కూడ చాలా బలంగా వేళ్ళూనుకొన్న అతిపెద్ద సమస్య ఈ మద్యపానం. ఈ అంశాన్నే తీసుకొని కాళ్ళకూరి 1926లో 'మధుసేవ' నాటకాన్ని రాసారు. ఇది కూడా 10 అంకాలనాటకం. ప్రముఖ గాంధేయవాదులైన నారాయణరావు మహాత్ముని ప్రభావానికి లోనై మధుసేవను కధావస్తువుగా స్వీకరించి ఈ నాటకాన్ని రాసారు.
కథావస్తువు : ఇందులో నాయకుడు జమిందార్‌ రఘునాధరావు. చాలామంచివాడు, దైవభక్తి పరుడు, దుర్వ్యసన పరాఙ్మఖుడు. మరీ ముఖ్యంగా మద్యపానాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఒక్క మద్యపానమనేకాదు, నస్యము, సిగరెట్టు, బీడీ, నల్లమందు, గంజాయి - ఇవన్నీ మనిషికి ఎంత హాని చేస్తాయో తన మేనేజర్‌ అయిన విశ్వాసరావుకు చెపుతాడు. అతనిచేత నశ్యంకూడమాని పిస్తాడు. త్రాగుబోతురంగడుని పనిలోంచి తీసేస్తాడు.
అటువంటివాడు ఒకసారి అనుకోకుండా గుర్రం మీద నుండి పడిపోయి స్పృహతప్పుతాడు. అప్పుడు రంగడు అతని నోటిలో కొంత మద్యం పోసి డాక్టర్‌ వద్దకు తీసుకువెళతాడు. ఆ డాక్టర్‌ కూడ కొన్ని రోజులపాటు రఘునాధరావుచే మద్యం త్రాగిస్తాడు. అక్కడి నుండి రఘునాధరావు మద్యానికి బానిస అయిపోతాడు. శర్మ అని మరొక భ్రష్టుడు తన పబ్బం గడుపుకోవటం కోసం రోజూ రఘునాధరావుతో కలిసి మద్యం సేవించటమే కాక, కస్తూరి అనే వేశ్యని పరిచయం చేస్తాడు. పూర్తిగా ఆమె వలలో చిక్కిన రఘునాధరావు మొత్తం తన ఆస్తినంతా పోగొట్టుకొంటాడు. కనబడిన చోటెల్లా అప్పులు చేస్తాడు. రోడ్డున పడతాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య కూడా బెంగతో మరణిస్తుంది. చివరకు జ్ఞానోదయ మవుతుంది. మామగారు చనిపోతూ కూతురు పేర రాసిన ఆస్తి ఇతనికి దక్కుతుంది. ఆ ధనాన్ని మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి వినియోగించాలనే ఒక స్థిర నిశ్చయానికి వస్తాడు రఘునాధరావు. ఇతని మేనేజరు విశ్వాసరావు కూడ రఘునాధరావుకు చేదోడు వాదోడుగా ఉంటాడు. ఇదీ స్థూలంగా ఇందలి కథ.
మద్యప్రియుల మనస్తత్వాలు : రఘునాధరావు - శర్మ కలిసి మద్యాన్ని సేవిస్తుంటారు. ఇంతమంది ఎందుకు మద్య ప్రియులుగా మారుతున్నారు, ఏమిటి దాని మహాత్మ్యం? అని రఘునాధరావు అడిగిన ప్రశ్నకు శర్మ దాని మహిమయే దానికి కారణమంటూ ఇలా వర్ణిస్తాడు.
''బ్రాందిసీసా కంటబడగానె వరహాల
పాతు కాన్పించిన పగిది దోచు
ఠప్పుమంచును గార్కు చప్పుడైనంతనె
జయభేరి విన్నంత సంబ్రమొదవు
దొడదొడ గ్లాసులో దొలికించు సమయాన
నమృతంబు పడుచున్న యట్టులుండు
చుఱ చుఱ గొంతులో జొచ్చెడు తరి, పోయి
నట్టి ప్రాణము వచ్చినట్టులొప్పు
అవలనానంద వార్ధినోలాడునట్లు
స్వర్గ భూమి విహారము సలుపునట్లు
రంభ యొడిలోన నిద్దుర క్రమ్మినట్లు
తన్మయావస్థలోన జిత్తము సుఖించు''
అంతేకాదు మధువు ఒక్క గ్లాసు సేవించటం వల్ల కసుకందు కూడ లేచి హనుమంతునికి గంతులు నేర్పుతాడని, మూగవాడు వేనోళ్ళతో ఆదిశేషుని వెక్కిరిస్తాడని, పిరికివాడు సహితం శత్రువును చాచికొడతాడని, పుంస్త్వహీనుడు సింహబలుడౌతాడని, లోభి దానకర్ణుడౌతాడని, శోకభరితుడు హర్షాంబుధిలో తేలతాడని - ఇలా సాధారణంగా మద్యప్రియులు చెప్పే ప్రయోజనాలన్నిటినీ ఏకరవు పెడతాడు.
ఈ నాటకంలో రఘునాధరావును మద్యమే సర్వభ్రష్టుణ్ణి చేస్తుంది. ఆ మద్యం వల్లే అతనికి వేశ్య కస్తూరి దగ్గరౌతుంది. ఆమె పరిచయం వల్లే మొత్తం అతని జమిందారీగిరి అంతా సర్వనాశన మవుతుంది. కడకు భార్యను కూడ పోగొట్టుకొంటాడు.
కస్తూరిపై శ్రీహరి పాత్ర ప్రభావం : ఇందులో కస్తూరి పాత్రలో మనకు చింతామణి పాత్ర కంటె ఆమె తల్లి శ్రీహరి పాత్ర ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. శర్మకి కస్తూరిపై మనసవుతుంది. కాని ఆమెను మెయింటైన్‌ చేసే స్తోమత అతనికి లేదు. అందుకని జమిందార్‌ రఘునాధరావును ఆమెకు అలవాటుచేసి తద్వారా ఆమెకు దగ్గరవ్వాలనుకొంటాడు. ఆయాసమాయనది-అనుభవము తనది చేసుకోవాలనుకొంటాడు. ఆమె అతని కంటే నాలుగాకులు ఎక్కువ చదివింది. రఘునాధరావు వశమవుతున్నాడన్న ఆనందాన్ని లోపల అణుచుకొని, శర్మ అంటేనే తనకెంతో ఇష్టమన్నట్లుగా, అతనిని చూడనిదే ఉండలేనన్నట్లుగా మాట్లాడుతుంది.
ముందుగా శర్మను పూర్తిగా వశం చేసుకొంటుంది. ఆతని ద్వారా జమిందార్‌ రఘునాధరావును లోబర్చుకొంటుంది. రఘునాధరావు పరిచయమైతే తాను కూడ తక్కిన తనతోటి సాని కూతుళ్ళ వలె ఒక వెలుగు వెలుగుతాననుకొంటుంది. అంతేకాదు వేశ్యకు ఒకానొక ఉన్నతుని ప్రాపకం అవసరమంటూ
''వర్తకునకూర మేడయు, వైద్యునకొక
పతకమును, న్యాయవాదికి బండి, వేశ్య
కున్నత ప్రాపకంబివి యొదవెనేని
పరపతియు, గౌరవము వచ్చుబడియు హెచ్చు'' అని భావిస్తుంది.
మద్యపాన ప్రభావం : రఘునాధరావు చాలా అందగాడు. విపరీతంగా తాగుడుకు బానిసౌపోవడంతో, అప్పులపాలవడంతో అతని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. రఘునాధరావును ఎంతో అభిమానించే ఆతని మేనేజర్‌ విశ్వాసరావు తాగుడుకు అలవాటుపడ్డ తన యజమాని రూపురేఖల్ని తలచుకొని, ''శివుని గళ మొక్కటియె నల్పుచేసినట్టి/ కాలకూటంబు సురకన్న మేలు కాదె'' అంటూ బాధపడతాడు. శివుని కంఠాన్ని మాత్రమే నలుపుచేసిన ఆ కాలకూట విషమే మద్యం కంటే నయమని కాళ్ళకూరి భావన. నిజమే! మద్యం గౌరవాన్ని పోగొడుతుంది. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందాన్ని హరిస్తుంది. సాధారణంగా ఇలాంటి మద్యవ్యసనం ఎవరికైనా చెడు స్నేహాలవల్లే అలవాటవు తుందని అంటూ, ఖలునితో మైత్రి ఎంత ప్రమాదమో చెపుతూ, శర్మతో స్నేహమే తన యజమాని పతనానికి కారణమంటూ వాపోతాడు విశ్వాసరావు.
మద్య బానిసల ఇల్లాళ్ల అగచాట్లు : రఘునాధరావును మద్యవ్యసనం నుండి వేశ్యావ్యసనం నుండి మరల్చాలని భార్య నిర్మల ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయినా అతడు దారికి రాడు. తనలాంటి స్త్రీలు లోకంలో ఎందరున్నారో, వారెలా ఈ నరకాన్ని భరిస్తున్నారో అంటూ ఆమె ఇలా బాధపడుతుంది.
''భర్త యేవేశ్యపజ్జనో పండుకొనగ
నింటనొంటిగ శయనించి కంటగూర్కు,
వెంట తోడును లేక తపించునట్టి
రమణికంటెను నిర్భాగ్యురాలు కలదె?'' - అంతేకాదు
''కానలోనమొఱడుగా బుట్టవచ్చును
నీటికుక్కగా జనింపవచ్చు
పరగ త్రాగుబోతు భార్య కాకూడదు
కలను నైన - నాటకముననైన'' అంటూ వాపోతుంది. భర్త ఆస్తి అంతా హరించుకుపోయినా, తండ్రి మరణంతో ఆమెకు ఆస్తి దక్కుతుంది. ఆ ఆస్తికోసం శర్మ కస్తూరులు రంగడి ద్వారా ఆమెను హతమారుస్తారు. రఘునాధరావు పై ఆ హత్యానేరం మోపబడుతుంది. విశ్వాసరావు సహకారంతో రఘునాధరావు నిర్దోషిగా బయట కొస్తాడు.
రఘునాధరావు పశ్చాత్తాపం : తన ఇల్లాలిని అంత బాధ పెట్టినందుకు, ఆమెను పోగొట్టుకొన్నందుకు చాలా బాధపడతాడు రఘునాధరావు.
''ఎచటనో పుట్టి తమయిండ్లకేగుదెంచి
తమ్మెదైవములుగ చిత్తముననమ్మి
తమనిమిత్తము బ్రతుకులు ధారవోయు
సతులనేడ్పించు పతులకు గతులు కలవె?
అంటూ పరితపిస్తాడు. కస్తూరి మాటనమ్మి తానెంతో ఆత్మీయంగా మామా అని పిలిచే మేనేజర్‌ విశ్వాసరావుని కూడా అనుమానించి అవమానించినందుకు పరితపిస్తూ క్షమాపణకోరుతూ ఇలా పశ్చాత్తాపాన్ని వ్యక్తంచేస్తాడు.
''కుల గోత్రములు మాపుకొని రేపవలు మద్య
పాన మొనర్చిన పాప ఫలము
ఎగ్గు సిగ్గులు వీడి యేవేళ వెలయాలి
పంచను బడియున్న పాప ఫలము
అగ్నిసాక్షిగ పెండ్లాడిన నిజ ధర్మ
పత్ని నేడ్పించిన పాపఫలము
దూరదృష్టియుడిగి దుష్టులతో సహ
వాసమొనర్చిన పాప ఫలము
అన్నెముంబున్నెము నెఱుంగనట్టి మిమ్ము
బరుషవచనంబు లాడిన పాపఫలము
నేడుగాకున్న మరియొకనాడయినను
వడ్డితో గూడ ననుభవింపగవలదె'' అంటూ పరితపిస్తాడు. చింతామణి కథానాయకుడు బిల్వమంగళుడికి, రఘునాధరావుకి చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి.
ఈ నాటకం అప్పట్లో వేల సంఖ్యలో ప్రదర్శితమయింది. ఇతర రాష్ట్రాలలో కూడా, ముఖ్యంగా కలకత్తాలో ప్రదర్శితమైనట్లు ప్రముఖనటులు కీ.శే. స్థానం నరసింహారావు గారు తమ నటస్ధానంలో పేర్కొన్నారు. మద్యపానం మంచిదికాదని ప్రబోధించే నాటకాలు కాళ్ళకూరే కాక ఆయన ప్రభావంతో మరికొందరు కూడా రాసారు. 1. మధుసేవ - నాటకసర్వతి (1928) 2. మధుసేవ - మద్దూరి శ్రీరామ్మూర్తి (1934) 3. సురానంద - కొడాలి సత్యనారాయణరావు (1924) 4. మద్యనిషేధం - పులిజాల వేంకట అప్పారావు (1949).
ఈ విధంగా చెడు స్నేహాలు, వాటివల్ల ఏర్పడే మద్యపాన వ్యసనం, దాని వల్ల ఏర్పడే వేశ్యా సంపర్కం, వీటన్నిటివల్ల సంప్రాప్తమయ్యే పతనం, సర్వభ్రష్టతలను కవి చాలా స్పష్టంగా ఈ నాటకంలో వివరించారు. ఈవిధంగా కాళ్ళకూరి నాటకాలు సాంఘిక దురాచారాలను తూర్పారబట్టి కవి కాళ్ళకూరి నారాయణరావు యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసాయి. నాటక సాహిత్యంలో కాళ్ళకూరికొక ప్రత్యేక స్థానాన్ని కలుగజేసాయి.