సాహిత్యంలో ''ప్రస్థానం''

 

దర్పణం, గమనం, ప్రస్థానం వార్షిక సంచికల వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని 2002 అక్టోబర్ - డిసెంబర్లో ప్రస్థానం త్రైమాస పత్రిక మాసపత్రికగా నిలదొక్కుకుని, సాహిత్య ప్రస్థానం వెబ్ సైట్హోదాలో మీ ముందుకొచ్చింది. తెలుగులో సాహిత్య పత్రికలే తక్కువ. నాలుగు కాలాలు నడిచినవి మరీ తక్కువ. అభిరుచి గల సాహిత్యాన్ని ప్రోత్సహించే పత్రికలు, ప్రగతి శీల భావాలు గల సాహిత్య పత్రికలు అసలు లేవని కాదు కాని దినపత్రికలలో సాహిత్య శీర్షికలు, ఆదివారం అనుబంధాలే ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.

జీవితపు వడికి ఒడుదుడుకులకు పఠనమే తగ్గుముఖం పట్టిన స్థితిలో సాహిత్యం గురించే చదివేవారు ఎందరుంటారనే అనే సందేహాలు రావడం సహజం. శక్తివంతమైన ఏ గీతానికైనా జన బాహుళ్యం ఉర్రూత లూగడం ఆగలేదు.వీధినాటికల ప్రేక్షకులూ తగ్గలేదు. ఏ తెలుగు పత్రికా సాహిత్య పరిమళాలు లేకుండా, కవితా చరణాలు ఉపయోగించకుండా వెలువడ్డం లేదు. సభల్లో వక్తృత్వానికి సాహిత్యం అదనపు అర్హతగాకుండానూ పోలేదు.ఇంటర్నెట్‌ వెబ్‌సైట్‌లలో సాహిత్య సందర్శకుల సంఖ్య గణనీయంగా వుంటూనే వుంది. కానైతే దైనందిన వ్యవహారాల మధ్య, కంప్యూటర్‌ పరుగుల మధ్య కెరీర్‌ పుస్తకాలు చదివినంత పరిమాణంలో సాహిత్య గ్రంధాలు చదివే అవకాశం, వీలూ వుండటం లేదనేది నిజం.

అసలే ఈ వ్యవస్థ చైతన్య స్ఫోరకమైన అన్ని విలువలనూ తలకిందులు చేస్తుంది. అన్ని ఆసక్తులనూ వ్యాపారీకరిస్తుంది. 70 లలో కాల్పనిక సాహిత్యం, 80 లలో క్షుద్ర సాహిత్యం రావడం ఆ పరిణామ క్రమంలోనే. ఇప్పుడు టీవీ ఛానల్స్‌ విజృంభణతో వీక్షకుల కాలక్షేపానికి లోటు లేకుండా పోయాక అలాటి కాల్పనిక సాహిత్యమూ తగ్గుముఖం పట్టింది. కాని సీరియస్‌ సాహిత్యం, పుస్తకాలు రావడం ఆగిపోలేదు.

అంతెందుకు? హైదరాబాదు నగరంలో పుస్తకావిష్కరణ జరగని రోజే వుండదు..తెలుగుదేశంలో ప్రతి రెండో వాడూ కవి అని శ్రీశ్రీ అన్న మాటను నిజం చేసేలా వందల మంది కవుల పేర్లు కనిపిస్తాయి. ఇదంతా తెలుగునాట సాహితీ చైతన్యాన్ని తెలియజేస్తుంది.దురదృష్టం ఏమిటంటే- సాహిత్యం గురించి ఆసక్తివున్నంతగా అవగాహనలేదు, అందుబాటూ లేదు. సాహిత్యం మహాభారత రచనాకాలం నుంచీ రాజకీయాలతో ముడిపడే వుంటోంది. కాని ఆ మాటను అంగీకరించడం మాత్రం మన విమర్శకులు చాలా మందికి ఇష్టం వుండదు.

నిజానికి నిష్పాక్షిక సాహిత్యం అంటూ వుండడం మిథ్య. ఎప్పుడైనా అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక పక్షాన్ని బలపరుస్తుంది. అంతిమ విశ్లేషణలో అత్యధిక జన హితం కోరేదే నిజమైన సాహిత్యం. ఆ చెప్పే పద్ధతి మాత్రం మనో రంజకంగా వుండాలి. భావ వికాసమూ కలిగించాలి. ఈ రెంటినీ మేళవించగలిగిందే ఉత్తమ సాహిత్యం. అలాటి సాహితీ సృజనకు, దానిపై ఆరోగ్య కరమైన చర్చకు దోహదపడటమే ఈ సాహిత్య సంచిక ప్రధాన లక్ష్యం.ప్రపంచంపై సామ్రాజ్య వాద ప్రపంచీకరణ ఆధిపత్యాన్ని, దేశానికి చేటు తెచ్చే మతోన్మాదాన్ని, టెర్రరిజాన్ని వ్యతిరేకించే సాహితీ వేదికగా అది పని చేస్తుంది. శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేస్తూనే ఎలాటి పిడివాదాలకూ లోనవకుండా విశాల భావనలను కాపాడుతుంది. విలువలకు విలువ నిస్తుంది.

***

కవులు ప్రపంచానికి అనధికార శాసనకర్తలు అని షెల్లీ అన్నది హోదాగా గాక బాధ్యత అన్న అర్థంలోనే. తెలుగు కవులు,రచయితలు ఈ విధమైన సామాజిక చైతన్యం అనేక సార్లు చాటుకున్నారు. సెప్టెంబరు 11 ఘటనల అనంతర కాలంలోనూ, గుజరాత్‌ మారణహోమం తర్వాతనూ వ్యక్తమైన స్పందనే ఇందుకు ఒక నిదర్శనం. వ్యాపార పత్రికలు ఇచ్చే కొద్దిపాటి అవకాశంలోనే ఔత్సాహిక రచయితలు, కవులు తమ స్వరాలు వినిపిస్తున్నారు. ప్రజాకళాకారుల సహకారంతో పాలకులు దుర్నీతిని ఎండగడుతూనే వున్నారు. ఈ సాహితీ సృష్టి సాధారణంగా వూహించగలిగిన దానికన్నా చాలా ఎక్కువ రెట్లు వుందనేది వాస్తవం. నగరాలు, పెద్దపట్టణాలలోనే కాదు, మారుమూల ప్రాంతాలలో కూడా విరివిగాసాహిత్య సభలు జరుగుతున్నాయి. ఈ కొత్త గొంతులకు, ప్రాంతాలకూ కూడా ప్రాతినిధ్యం కల్పించడం, ప్రచురణావకాశం ఇవ్వడం ప్రస్థానం మరో లక్ష్యం.

సాహిత్యాన్ని ప్రచారం కోసం ఉపయోగించరాదని వాదించే వారు ఎప్పుడూ వుంటూనే వున్నారు. ప్రజలకు మేలు చేసే ప్రచారమా కీడు చేసేదా అనే విచక్షణ లేకుండా ఈ చర్చ జరపడం అర్థరహితం. సాహిత్యానికున్న అనేక కర్తవ్యాలలో నిస్సందేహంగా ప్రచారం కూడా ఒకటి.అయితే ప్రచారమే సాహిత్యం పని కాదు. ప్రచారం కోసం రాసేదంతా సాహిత్యమూ కాదు. సందర్భం, విషయం, లోతు అన్నిటినిబట్టి అది గౌరవం పొందుతుంది. ప్రజలందరికి సంబంధించిన ప్రయోజనకరమైన అంశాలను నిస్వార్థంగా రాసే వారు రచయితలు కానట్టూ స్వంత గోడు వినిపించేవారే అసలైన అక్షర పుత్రులైనట్టు ఎవరైనా భావిస్తే అంతకన్నా హాస్యాస్పదమైన సంగతి వుండదు.

నాడూ నేడూ కూడా కాలానుగుణమైన పద్దతులలో పత్రికలు సాహిత్యానికి సేవ చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని దుష్ప్రభావాలకు,అవాంఛనీయమైన సంచలనాలకు కూడా అవి కారణమవుతున్నాయి. సాహిత్య విలువలు ప్రచురణలో లభించే ప్రచారాన్ని బట్టి నిర్ణయమవుతాయనే ఒక దుర్భ్రమ ప్రబలింది. సాహిత్యం ప్రచారానికి కాదని అనేవారే లబించే ప్రచారాన్ని బట్టి విలువలు అంచనా వేయడం ఈ వ్యవస్థ తాలూకు వైపరీత్యాలలో ఒకటి. మహా రచయితలు కూడా మొదట పత్రికలలో పెద్ద ప్రాముఖ్యత పొందలేదని, ప్రజలు గుర్తించిన తర్వాతనే వారికి ప్రాధాన్యత పెరిగిందని గుర్తు చేసుకుంటే పత్రికా ప్రాపకం ప్రధానమనుకునే పొరబాటు భావన పోతుంది. సోదర రచయితలు కవులను గురించిన అభిప్రాయాలు దురభిప్రాయాలలో నూటికి తొంభై వంతులు ఈ కారణంగా ఏర్పడుతున్నవే. ఆఖరుకు పరమ జుగుప్సాకరంగా రచయిత్రులపై దాడి చేయడంలోనూ ఈ దుష్ప్రభావం కనపడుతుంది. నిజమైన సాహిత్య జీవులు ఈ వలయం నుంచి బయటకు రావాలి. ఇది మనం కూలగొట్టాలనుకుంటున్న వ్యాపార వ్యవస్థ తాలూకు వికృత ప్రభావమేనని గ్రహించాలి.

ఈ నాటి కాలంలో పుస్తక ప్రచురణ ఒక విధమైన ప్రహసనంగా సాగుతుందంటే ఎవరూ తప్పు పట్టనవసరం లేదు. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలు సర్వత్రా మార్మోగుతున్న తర్వాత కూడా పుస్తక రూపంలో రావడానికి పదేళ్ళపైనే పట్టింది. ఆ పరిస్థితి ఇప్పుడు లేకపోవడం మంచి పరిణామమే. రచయితలు కొందరి ఆర్థిక స్తోమతలో, ఆలోచనల్లో వచ్చిన మార్పు ఇందుకు ప్రధాన కారణం. వేల రూపాయలు వెచ్చించి, బోలెడు వ్యయంతో ఆవిష్కరణ సభలు జరిపి,'అట'్టహాసంతో పుస్తకాలు ప్రకటించిన తర్వాత అవి పాఠకులకు ఏ మేరకు చేరుతున్నాయని పరిశీలిస్తే నిరుత్సాహమే మిగులుతుంది. ఏ సాహిత్య సంస్థ దగ్గర చూసినా వందల సంఖ్యలో రచయితలు, కవుల చిరునామా లుంటాయి. విద్యా సంస్థలలో వందలాది మంది సాహిత్య విభాగాల వారుంటారు. వీరు గాక పరిణత పాఠకులు కూడా పెద్ద సంఖ్యలో వుంటారు. అయినా ప్రచురించే 500 కాపీలలో చాలా భాగం అలాగే వుండి పోతున్నాయంటే వీరు కూడా సాహిత్య గ్రంథాలను ఆదరించడం లేదని అర్థం కదూ? ఎవరికీ సాహిత్యం మీద ఆసక్తి లేదని, అభిరుచి లేదని నిర్వేదానికి లోనయ్యే రచయితలు పరస్పర ప్రోత్సాహం అవసరాన్ని గుర్తించడంలేదు. ఏ కొన్ని మినహాయింపులో తప్పిస్తే సాహిత్య బృందాల పాత్ర తక్కువగానే వుంది.

***

కెరీరిజం సాహిత్య రంగంలో చొరబడటం గురించిన ఆవేదన చాలా మందిలో కనిపిస్తుంటుంది. ఈ వ్యవస్థలో అలాటి అవలక్షణా లెప్పుడూ వుంటాయి. సాహిత్యం ఒక్కటే కెరీర్‌ను పెంచే స్థితి ప్రస్తుతం లేదు. దాన్ని ఇతరత్రా ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందడం వేరేవిషయం. కాని ఎవరో అలా చేస్తున్నారంటూ ఎప్పుడూ అదే ప్రధానాంశంగా తీసుకుని సాహిత్య విమర్శనను దారి తప్పించడం సరైంది కాదు. సామాజిక బృందాల ప్రతిస్పందనలను సాహిత్యంలో ప్రతిబింబించడం చాలా ప్రధానమే కాని అదే ఏకైక సూత్రంగా తీసుకుని పట్టువిడుపులు లేని శిబిరాలుగా విభజించుకోవడం నష్టదాయకమైన విషయం. కులం, ప్రాంతం, జెండర్‌ ఏ ప్రాతిపదికనైనా సరే సాహిత్య చర్చలో సహనం సంయమనం కోల్పోవడం బాధాకరం. సాహిత్యానికి సమాజానికి వ్యక్తికి వుండాల్సిన సంబంధాన్ని సవ్యంగా అర్థం చేసుకుంటే ఈ సమస్యలలో చాలా వాటికి ఆస్కారమే వుండదు. కొకు అన్నట్టు రచయిత తనను సమాజం గుర్తించాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాని అంతకుముందు తాను సమాజాన్ని గుర్తిస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి. అలా గుర్తించేట్టయితే సామాజిక పురోగమనానికి సమైక్యతకు ఏది దోహదపడుతుందో అర్థం చేసుకోవాలి. ప్రజా శత్రువులపై చేసే పోరాటానికీ సాహిత్యంలో భిన్నాభిప్రాయాలకూ మధ్య తేడాను చూడాలి. యోగ్యతాపత్రంలో చలం అన్నట్టు కవి మరో కవి గురించి సదభిప్రాయం వెలిబుచ్చడం జరగదనే స్థితి నుంచి బయటపడాలి. అభివృద్ది నిరోధకత్వం, అరాచకత్వం మినహా మిగిలిన అన్ని ప్రగతిశీల ధోరణులనూ కలుపుకుపోవాలనే అవగాహన కావాలి. సాహిత్య సంఘాలు కూడా ఎప్పుడు ఏ నేపథ్యంలో ఏర్పడివున్నా చారిత్రిక అనుభవాలను సమీక్షించుకుని తదనుగుణంగా వ్యవహరించాలి. విశాల జనబాహుళ్యమే కాదు, వాస్తవానికి సాహిత్యాభిమానులలో కూడా చాలా భాగం తమ పరిధికి వెలుపలే వున్నారనే పరమ సత్యాన్ని గుర్తించాలి. ప్రగతి శీల భావాలు గలవారైనా ఏ సంస్థతో సంబంధంలేని మేధావులు కూడా గణనీయ సంఖ్యలో వున్నారు. నేటి పరుగు పందెపు పద్మవ్యూహంలో చిక్కిన యువత కూడా తెలియకుండానే కవిత్వం, కథల పట్ల ఆకర్షితులవుతున్నారు.. ఈ నవ కవుల సృజన సామర్థ్యానికి పదును పెట్టడం, వారిని వైయక్తిక వేదనల నుంచి సామూహిక చింతన వైపు నడిపించడం కూడా నేటి సాహిత్య కర్తవ్యాలలో ఒకటి. ఇలాటి నూతన దృక్పథమే లేకపోతే కొత్త తరాన్ని ప్రయోజనాత్మక సాహిత్యం వైపు ఆకర్షించడం సాధ్యపడదు. ప్రమాదకరంగా మారిన ప్రపంచీకరణను ప్రతిఘటించాలంటే సాంకేతిక నైపుణ్యమూ వుండాలి. ఈ అంశాలన్నీ గమనంలో వుంచుకుని ప్రస్థానం నడుస్తుంది.

***

తెలుగు సాహిత్యంతో పాటు భారతీయ భాషలలో వెలువడుతున్న సమకాలీన సాహిత్యాన్ని, దాంతో పాటే అంతర్జాతీయ సాహిత్య ధోరణులను కూడా ఎప్పటికప్పుడు పరిచయం చేయడానికి పరామర్శించడానికి ప్రస్థానం ప్రయత్నిస్తుంది. జిల్లాల్లో జరిగే సాహిత్య కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని అందిస్తుంది. నూతనత్వానికి ప్రాధానత్య నిస్తూనే గతంలో వెలువడిన విలువైన అధ్యయనాలను, రచనలను పాఠకులకు అందించడానికి కృషి చేస్తుంది.కవిత్వంతో పాటు ప్రజా గీతాలకూ చోటుంటుంది. స్థానికంగా జరిగే సాహిత్యసభలలో వక్తలు చేసే మంచి ప్రసంగాలను, ప్రముఖుల ఇంటర్వ్యూలను జాగ్రత్తగా రాసి పంపితే ప్రచురించే అవకాశముంటుంది. వివిధ విషయాలపై కవులు, రచయితలు, పాఠకులు తమ రచనలు, అభిప్రాయాలను పంపితే తగు శీర్షికలో ప్రచురిస్తుంది.

ఈ పత్రిక రూపకల్పనలోనూ పాఠకులకు భాగస్వామ్యం వుండాలనే ఉద్దేశంతో అనుకున్నవన్నీ ప్రవేశపెట్టలేదు,ప్రకటించడమూ లేదు. ఈ వెబ్ సైట్లో ప్రస్థానం సంచికలు చూసిన తర్వాత మీరు పంపే సూచనలు, సలహాలతో మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు ఇంకో సారి ఈ అంశాలు సవివరంగా చెప్పుకోవచ్చు.

ఈ నాటి ధరవరలను దృష్టిలో వుంచుకుని పత్రిక రేటు చూస్తే అందరికి అందుబాటులో వుంచాలనే మా సంకల్పాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాటి పత్రికలు నాలుగు కాలాలు నడవాలంటే కావలసింది సాహిత్యాభిమానుల అండదండలే. అందుకే మీరు చందా కట్టి తెప్పించుకోవడంతో పాటు మీ సాహితీ మిత్రులను కూడా చందాదారులుగా చేర్పించాలి. విశాల ప్రాతిపదికపై నడవనున్న ఈ పత్రికను సాహితీ సంస్థలన్ని తమదిగా స్వీకరించి ప్రోత్సహించాలి. సమాజ పురోగమనంలో, చైతన్య వ్యాప్తిలో సాహిత్యం పాత్ర తెలిసిన రాజకీయ కార్యకర్తలూ దీని ప్రాధాన్యత గుర్తించి ముందుకు నడిపించాలి. గ్రంధాలయాలకు, విద్యాలయాలకు, సంఘాలు యూనియన్ల కార్యాలయాలకు తెప్పించాలి. సాహిత్యాభిమానులైన బంధుమిత్రులకు దీన్ని కానుకగా పంపించాలి. శక్తిని బట్టి రచయితలు, ప్రచురణ సంస్థలు బుక్‌ యాడ్స్‌ ఇచ్చి సహకరించాలి. ఇదంతా కేవలం ఆర్థిక ప్రయోజనం కోసమే కాదు, సమిష్టి కృషికి ఒక మార్గం. ఈ విధంగా మీ నుంచి సహకారం లభిస్తే ప్రస్థానం అనతి కాలంలో మరింత వేగంగా పురోగమిస్తుంది.

ఏమైనా దేశంలో పెచ్చరిల్లిన మతోన్మాదం ప్రజల సహజీవన సంప్రదాయాలను సర్వనాశనం చేస్తోంది. ప్రపంచీకరణ ప్రతిరంగంలోకి చొరబడి మన జీవితాలను తలకిందులు చేస్తున్న పరిస్థితులలో సాహిత్య సాంస్కృతిక రంగాలు మరీ కలుషితమవుతున్న నేపథ్యంలో సాహిత్య రంగంలో కర్తవ్యాలు నిజంగానే బృహత్తరమైనవి. ఆ దిశలో సాగే మహాప్రస్థానంలో భాగమే ఈ ప్రస్థానం.

దీనికి స్వాగతం పలకవలసినవారు మీరు. సహకరించి సహాయపడవలసినవారూ మీరే. మీకివే మా అక్షరాభినందనలు.

- తెలకపల్లి రవి, 
ఎడిటర్‌