మూసుకుపోయిన దారి

కరీమ్‌
ఆదివారం అక్కయ్య వాళ్లింట్లో హకీకా (పుట్టెంట్రుకలు) కార్యక్రమం. చాల్రోజుల తర్వాత ఊరికొచ్చాను. అంతకు ముందు అడపా దడపా వచ్చినా అలా వచ్చి యిలా వెళ్ళి పోవడమే. తీరుబడిగా ఊర్లో ఉండింది లేదు. చుట్టాల్తో గడిపింది లేదు. స్నేహితుల్ని కలిసింది లేదు.
ఏళ్ల తరబడి పరాయి రాష్ట్రాల్లో ఉద్యోగం. పుట్టి, పెరిగిన ఊరితో ఏదో తెలీని పరాయితనం. బతుకు యారత్రికమై మనసు సున్నితత్వాన్ని కోల్పోయింది. ఈ మధ్య ఊరు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. నిద్రలో మెలకువ వస్తే ఊర్లో నేను నడయాడిన దార్లు, కలిసి తిరిగిన స్నేహితులు గుర్తుకొస్తున్నారు. ఊరెళ్ళి నాల్రోజులు గడపాలి. ఊరి దారుల్లో తనివితీరా తిరగాలి. తెగిన బంధాలను కలుపుతూ కొత్త ముళ్ళు వేయాలి. స్నేహితుల్ని కలసి జ్ఞాపకాల ఆల్బమ్‌ తిరగేయాలి. మొద్దుబారిన మనసుకు మార్ధవత నేర్పాలి.
తనతో చెప్తే వెళ్దామంది. అక్కయ్య ఇంట్లో కార్యక్రమం కలిసొచ్చింది. శని, ఆదివారాలకు మరో రెండ్రోజులు సెలవు పెట్టుకుని తనతో కల్సి ఊరొచ్చాను. పొద్దున్నే అల్పాహారం తిని, టౌనుహాలు దగ్గరుండే చిన్ననాటి స్నేహితుణ్ని కలుద్దా మని కాలినడకన బయల్దేరాను. దారిలో మట్టి పరిమళంలా జ్ఞాపకాలు మనసును తాకాయి.
నేను నడుస్తున్న దారి చిరపరిచితమైన దారి. అతి పురాతన రాదారి. నేను పుట్టక ముందు నుంచీ ఉంది. మా పూర్వీకులు ఈ దారిన నడిచారు. దారి పొరల్ని తవ్విచూస్తే వాళ్ళ పాదముద్రలు కన్పిస్తాయి. బతుకు ప్రయాణంలో గుచ్చుకున్న ముళ్ళ బాధలు, తగిలిన ఎదురు రాళ్ళ దెబ్బల కధలుగా అవి చెప్తాయి. నా తొలి అడుగులు ఈ దారి మీదే పడ్డాయి. ఈ దారిలోనే నా బాల్య, యవ్వనాలు గడిచాయి. నా చేయి పట్టుకుని నడిపించి నాకు బతుకు దారి చూపించింది.
నాలుగు దశాబ్దాల క్రితం నాటి మాట.
మా ఊరు నరసరావుపేట గుంటూరు - గుంతకల్‌ రైల్వే మార్గంలో ఉంది. రైల్వే ట్రాక్‌ ఈదారి మీదుగా పోతుంది. రైలు పట్టాల కావల అరండల్‌పేట, ఈవల ప్రకాష్‌ నగర్‌ని వారధిలా కలుపుతుంది. ఊరి మెడలో కంఠహారంలో వయ్యారంగా సాగుతుంది. మేముండే ప్రకాష్‌నగర్‌ వాసులకు ఈ దారితో భావోద్వేగమైన అనుబంధం ఉంది. నిండా రెండు తరాలు ఈ దారిన నడిచాయి.
ఈ దారిలోనే నేను ఏడో తరగతి వరకు చదువుకున్న మా తిలక్‌ బడి ఉండేది. అప్పట్లో బాడుగ భవనంలో నడిచే బడి తర్వాత సొంత భవనాలు ఒనగూడటంతో రెడ్ల బజారుకు తరలిపోయింది. రోజు ఈ దారిలోనే నడుచుకుంటూ బడికెళ్ళొచ్చేవాణ్ని. అటు తర్వాత మున్సిపల్‌ హైస్కూలుకు, ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీకి ఈదారెమ్మటే వెళ్లేవాణ్ని.
దారిలో పారేసుకున్న జ్ఞాపకాలు ఒక్కొక్కటే దొరుకు తున్నాయి. బడికెదురుగా ఇప్పుడు టౌనుహాలు ఉన్నచోట పశువులాసుపత్రి ఉండేది. చుట్టుపక్కల గ్రామాల పాడి రైతులు పశువుల్ని తోలుకొచ్చి వైద్యం చేయించేవాళ్ళు. ఒకసారి ఏడుకాళ్ళతో దూడ పుట్టింది. ఆ వింతను చూడటానికి జనం ఎగబడి వచ్చారు.
పశువులాసుపత్రినానుకుని ఇప్పుడు ఎక్సైజు కార్యాలయం ఉన్న పెద్ద పెంకుటింట్లో కోర్టు ఉండేది. కాలక్రమంలో అది స్టేషన్‌రోడ్డులోని కోర్టు బిల్డింగులోకి మారిపోయింది.
నాయిన వకీలు దగ్గర గుమస్తా. రికార్డు చంకన పెట్టుకుని రోజూ ఈ దారిలోనే కోర్టుకు నడుచుకుంటూ వచ్చేవాడు.
కోర్టు ఆవరణలో దారి పక్కన శాఖోపశాఖలతో విస్తరించి, నేలకు దిగిన ఊడలతో ఆకాశాన్నంటుతూ పెద్ద మర్రి చెట్టు ఉంది. దీని పుట్టుక ఎరిగిన వాళ్ళు మా ఊళ్ళో ఎవరూ లేరు. దీని గుబురు కొమ్మల్లోకి కిరణాలు ప్రసరించడం దినకరుడికి కూడా సాధ్యం కాదు. మర్రి నీడల కింద వాయిదాల కొచ్చిన కోర్టు పక్షులు, బాటసారులు సేదతీరేవారు. సాయంత్రం కాగానే గుంపులు గుంపులుగా కాకులు వాలి గోల గోలగా అరుస్తుం డేవి. రైలొచ్చినప్పుడు అవి అరుస్తూ కకావికలుగా ఎగరడం ఓ జ్ఞాపకం. అవుట్‌బెల్‌ కొట్టినప్పుడు మర్రిచెట్టే మాకు ఆటస్థలం. దాని తొర్రల్లో దాక్కుని దొంగా పోలీస్‌, చెట్టెక్కి కోతికొమ్మచ్చి ఆడుకునేవాళ్ళం. ఊడలు పట్టుకుని అరచేతులు మంట పుట్టేదాకా ఊయలలూగేవాళ్ళం. పగలు అమ్మ వొడిలో ఆడుకున్నట్లు ఆ చెట్టు నీడన స్వేచ్ఛగా, నిర్భయంగా ఆడుకునే మేము... చీకటి పడ్డాక దాని దాపులకు వెళ్ళడానికి భయపడే వాళ్ళం. పగటి పూట మా కంటికి పేదరాశి పెద్దమ్మలా కన్పించే చెట్టు రాత్రిపూట మాత్రం పెద్ద దయ్యంలా కన్పించేది.
మర్రిచెట్టు కెదురుగా దారికి కుడి పక్కగా ఈద్గా మైదానం ఉంది. రంజాన్‌, బక్రీద్‌ పండుగలప్పుడు ముస్లింలు అక్కడకు చేరి సామూహిక ప్రార్ధనలు చేస్తారు. నాయన వాళ్ళతో కలసి నేను నమాజ్‌కు వచ్చేవాణ్ని. రెండడుగులు ముందుకెళ్తే ఎన్జీవో హోం ఉంది. అప్పట్లో ఉద్యోగ, కార్మిక సంఘాల సమావేశా లకు, సాహితీ కార్యక్రమాలకు వేదికగా ఉండేది. చిన్నప్పుడు ఇక్కడే మొదటిసారి ఆరుద్రను చూసే భాగ్యం కలిగింది.
అక్కడ్నుంచి కూతవేటు దూరంలో శృంగేరి పీఠంవారి శంకరమఠం ఉంది. మఠంలో శారదా అమ్మవారి కోవెల ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం, సాయంత్రం భక్తులు వస్తుంటారు. నవరాత్రులప్పుడు మఠాన్ని ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. దారిపొడవునా లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. ఆ తొమ్మిది రోజులూ మఠం భక్తులతో కిక్కిరిసి పోతుంది. సాయంత్రాలు పురాణ ప్రవచనముంటుంది. పెద్దవాళ్ళకు మఠం దైనందిన జీవితంలో ఒక వ్యాపకంగా ఉండేది. ఉదయ సాయంత్రాలు మఠంలో గడుపుతూ సాంత్వన పొందేవారు.
టౌనుహాలు దగ్గరకొచ్చాను. అక్కడ్నుంచి చూపులు సారించి దారివైపు చూసి నడుస్తున్నవాణ్ని ఉన్నపాటునే ఆగిపోయాను. ఒకప్పుడు జనంతో, వాహనాలతో రద్దీగా ఉండే దారి కర్ఫ్యూ పెట్టినట్లు నిర్మానుష్యంగా ఉండటం చూసి విస్మయానికి గురయ్యాను. ఒకళ్లిద్దరు పాదచారులు తప్ప దారి దాదాపు నిర్జనంగా ఉంది. వెంటనే తేరుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది రైల్వే అండర్‌పాస్‌.
కాలగమనంలో ఊరు పెరిగింది, జనం పెరిగారు. గుంటూరు - గుంతకల్‌ రైలు మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు, గూడ్సు రవాణా చేసే రైళ్ళ రాకపోకలు పెరిగాయి. దాదాపు ప్రతి గంటకు ఒకసారి రైల్వే గేటు పడేది. గేటు పడ్డప్పుడల్లా జనం నరకయాతన పడేవారు. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయేవి. గేటు తెరిచినప్పుడు రెండు వైపుల నుంచి వాహనాలు ఒక్కసారిగా వచ్చి ట్రాక్‌ మీద ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేది. బైట పడటానికి గంటసేపు పైగా పట్టేది. ఒక్కోసారి వెంట వెంటనే గేటు పడేది. అప్పుడు పడే బాధలు వర్ణనాతీతం. గేటు పడ్డప్పుడు జనం ముఖ్యంగా మా ప్రకాష్‌నగర్‌ వాసులు పడుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈదారికి ప్రత్యామ్నాయంగా టైనుహాలు వెనుకవైపు నుంచి అండర్‌ పాస్‌ నిర్మించారు. నాలుగేళ్ళ క్రితం అది అందుబాటులోకి వచ్చింది.
అప్పట్నుంచి జనం దాని గుండా వెళ్తూ ఈ దారిని విస్మరించారు. రైల్వే వాళ్ళు లెవల్‌ క్రాసింగ్‌ను తీసివేసి అడ్డంగా గోడను నిర్మించి దారిని శాశ్వతంగా మూసేసారు. దారినలా చూసేసరికి గుండె బావురుమంది. ఏళ్ల తరబడి జనాన్ని తన గుండెల మీద నడిపించిన దారి బిడ్డలు పట్టించుకోని తల్లిలా ఒంటరిగా మిగిలిపోవడం చూసి మనసు చివుక్కుమంది. అడుగు వేయడానికి కాళ్ళు మొరాయించాయి. భారంగా అడుగులు వేసి ముందుకు కదిలాను.
టౌనుహాలు గంభీరంగా నిల్చొని కన్పిస్తుంది. దాని ప్రాంగణంలో నిశ్శబ్దం ఘనీభవించినట్లు అలికిడన్నది లేదు.
గేటు దగ్గర వాచ్‌మెన్‌ కొండలు మౌనమునిలా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. నన్ను గుర్తుపట్టి లేచి పలకరించాడు.
ఆపాదమస్తకం టౌనుహాలు వైపొకసారి చూసి 'నాటకాలు వేయడం లేదా?' అని కొండల్ని అడిగాను. కొండలు జీవం లేని నవ్వు నవ్వాడు.
'ఈదారి మూసాక, సుట్టూ తిరిగి రాడం కష్టమై జనం రాడం మానేసారు. నాటకమేస్తే పట్టుమని పదిమంది కూడా రాటల్లేదు. జనం రాడం లేదని నాటకాలు ఎవురూ వేయడం లేదు' దిగాలుగా చెప్పాడు.
'మరైతే కార్యక్రమాలు ఏవి జరగట్లేదా?'
'అప్పుడప్పుడు గవుర్మెంట్‌ పోగ్రాములు జరుగుతున్నాయి. దారి మూసేసాక టౌనుహాలుకు మునుపటి వైభం పోయింది బాబు' నిరాశగా చెప్పాడు కొండలు.
ఒకప్పుడు భువన విజయంలా నిరంతరం సంగీత, సాహిత్య కార్యక్రమాలతో నాటక ప్రదర్శనలతో విలసిల్లిన టౌనుహాలు ఇప్పుడు చీకట్లు కమ్మిన కోటలా, మౌనంగా ఉండడం చూసి గుండెను మెలిపెట్టినట్లు అన్పించింది.
జేబులోంచి చిల్లర డబ్బులు తీసి, టీ తాగమని కొండలు చేతిలో పెట్టి నెమ్మదిగా కదిలాను. నడుచుకుంటూ మర్రిమాను కిందికొచ్చి నిల్చున్నాను. దారి పరిసరాల్ని పరికించి చూసాను. దారంతా నీరవ నిశ్శబ్దం. కంటోన్మెంట్‌ ఏరియాలో నిషేధ మార్గాన్ని తలపిస్తుంది. చెట్టుమీద కాకుల అరుపు స్పష్టంగా విన్పిస్తుంది. రాకపోకలు లేకపోవడంతో దారి మధ్యన కుక్కలు రెండు నిశ్చింతగా పడుకుని ఉన్నాయి.
దూరంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలు చాలావరకు మూసి ఉన్నాయి. తెరిచి ఉన్న ఒకటీ అరా దుకాణాలు కొనే వాళ్ళు లేక వెలవెలబోతున్నాయి. అలా చూస్తున్న నాకు ఒక కొట్టు ముందు నెత్తిన టోపి, తెల్లటి గడ్డం, మాసిన లాల్చి, గళ్ళ లుంగీలో ముఖమంతా ముడతలు తేలి డెబ్భై ఏళ్ళు పైబడిన వృద్ధుడొకడు గుమ్మటం మీది పావురంలా కూర్చొని ఉండటం కన్పించింది. చేతిలో తావళం తిప్పుతూ దైవస్మరణ చేసుకుంటు న్నాడు. చూస్తే బాగా తెలిసిన మనిషిలా అన్పించాడు. బాబా కాదు గదా అనుకుంటూ దగ్గరగా వెళ్ళి చూసాను.
ఆశ్చర్యం! బాబానే! బాబాది ఈదారి పక్కనే బజ్జీల కొట్టు. ఆ బజ్జీల రుచి చూడని వాళ్ళు మా ఊర్లో ఉండరంటే అతిశయోక్తి కాదు. కొట్టంటే నాలుగు చక్రాల బండి. దాని మీదే బజ్జీలు, పునుగులు, గారెలు పెట్టి వేడి వేడిగా అమ్మేవాడు. పొద్దున్నే పది గంటలప్పుడు బండిమీద సరుకు పెట్టుకుని నెట్టుకుంటూ వచ్చి ఎన్జీవో హోం గోడ ముందు పెట్టేవాడు. బండి పక్కన కళాయి పెట్టి వేడి వేడిగా బజ్జీలు వేస్తుంటే ఆ పరిమళం దారిన పోయేవారి ముక్కుపుటాలను తాకేది. వెళ్ళేవాళ్ళు మంత్రించినట్లు ఆగి కొట్టు దగ్గరకొచ్చి ప్లేటు బజ్జీలు తినో, పొట్లం కట్టించుకునో గాని వెళ్ళరు. ఉదయం పదికి మొదలైన బేరం ముగిసేది రాత్రి పది గంటలకే. ఎప్పుడు చూసినా కొట్టు ముందు కస్టమర్లు మూగి ఉండేవారు. బేరంలో బాబా ఇంటిల్లిపాదీ పాలు పంచుకునేది. బాబా కళాయి ముందు కూర్చుని సరుకు వేస్తుంటే కొడుకులు ఇద్దరూ బేరం చేసేవారు. భార్య బూబమ్మ గల్లాపెట్టె దగ్గర కూర్చుని లెక్క పని చూసేది.
బాబాది పొదిలి దగ్గర తురకపాలెం. ఊర్లో వ్యవసాయం అచ్చిరాక, ఉన్న భూమి అమ్మి అప్పులు తీర్చి కట్టుబట్టల్తో భార్య, బిడ్డల్ని తీసుకుని నలభై ఏళ్ళ క్రితం మా ఊరొచ్చాడు. తొలినాళ్ళలో ఏంజెల్‌ టాకీసు దగ్గర నారాయణ బజ్జీల కొట్లో పనికి కుదిరాడు. సరుకు వేయడంలో మెళుకువలు తెలుసు కున్నాడు. కొన్నాళ్ళ తర్వాత కొద్దిపాటి పెట్టుబడితో సొంతంగా ఇక్కడ కొట్టు పెట్టాడు. కొద్దికాలంలోనే బాబా బజ్జీలకు మంచి రుచిగా ఉంటాయన్న పేరొచ్చింది. ఇక ఆ తర్వాత వెనక్కు చూసింది లేదు. కొట్టు మీద బేరంతోనే రెండు పోర్షన్ల ఇల్లు కొనుక్కున్నాడు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేసాడు. చదువు అబ్బకపోవడంతో కొడుకులకు తన పనే నేర్పించాడు. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి, వేరు కాపురాలు పెట్టించాడు. ఈ విషయాలన్నీ బాబానే ఒకసారి నాతో చెప్పాడు.
కొడుకులు ఎక్కొచ్చాక బేరం పూర్తిగా వాళ్ళకే వదిలి పెట్టి, తను పై ఎత్తున ఉండేవాడు. బాబాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఐదుపూట్ల నమాజు చేస్తాడు. కొట్టు దగ్గర ఎంత బేరం ఉన్నా నమాజ్‌ వేళ అయితే అన్ని వదిలేసి వెళ్తాడు.
మా ఇంట్లో అన్నంలో నంజుకోవడానికి బాబా బజ్జీలు ఉండాల్సిందే! అమ్మ డబ్బులిచ్చి నాతో తెప్పించేది. ఒక్కోసారి డబ్బులేక నేనలాగే నిలబడితే, నా పరిస్థితి గమనించి 'తీసుకుపో బేటా.. డబ్బులు రేపిద్దువుగాని' అంటూ ఆప్యాయం గా కట్టిచ్చేవాడు.
'ఎవురూ...' అన్న మాట విన్పించి ఆలోచనల్లోంచి బైటికొచ్చాను. నుదుటిన అరచెయ్యి పెట్టి, కళ్ళు చికిలించి నావైపు చూసాడు బాబా. నేను ఫలానా అని చెప్పాను.
'ఒరె.. ఒరె.. నువ్వా బేటా..' ముఖంలో సంతోషం తొణికిస లాడుతుండగా అన్నాడు.
తన పక్కన జాగా చేత్తో ఊడ్చి 'రా.. కూర్చో' నవ్వుతూ అన్నాడు. బాబా పక్కన కూర్చున్నాను.
'నువ్వు యాడ్నో భోపాల్‌ కాడ ఉజ్జోగం చేస్తున్నావని మాము చెప్పాడే' గుర్తొచ్చినట్లు అడిగాడు.
అవునని చెప్పాను. తర్వాత భార్యా, పిల్లల గురించి అడిగాడు. చెప్పాను.
'మాషా అల్లా' అని పలికి చేతిలోని తావళాన్ని జేబులో వేసుకున్నాడు. తర్వాత సంగతులేంటన్నట్లు నావైపు చూసాడు.
'కొట్టు పెట్టట్లేదా?' అనడిగాను.
బాబా ముఖంలో దు:ఖపు వీచిక కదలాడింది. ఇందాకటి సంతోషం ఆవిరై గంభీరంగా మారిపోయాడు. కొట్టుండే చోటువైపొకసారి దిగాలుగా చూసాడు.
'ఇంకా యాడ కొట్టు బేరం .. బేటా, సొరంగం దారొచ్చాక, ఈ దారి మూసేసాక జనం ఇటు రావడం మానేసారు. మా యాపారం మూతబడింది.'
నిశ్శబ్దాన్ని చెదరగొడ్తూ వణుకుతున్న గొంతుతో చెప్పాడు బాబా. బేరం చేసినప్పటి రోజులు గుర్తొచ్చాయేమో... కళ్ళలో కన్నీటి చెమ్మ కదలాడటం గమనించాను.
'అప్పుడు ఎట్టా ఉండేది ఈ దారి. వచ్చేపోయే జనంతో, మోటారు బళ్ళతో ఎంత సందడిగా ఉండేది. దారి పొడుగుతా చిన్న చిన్న యాపారాలు చేసుకుంటూ ఎంతమంది బతికేటోళ్ళు. అందరూ చెట్టు కూలాక, గూడు చెదిరి పిట్టలెగిరిపోయినట్లు దిక్కుకొకరిగా పోయినారు బేటా.'
గొంతు గాద్గదికం కాగా, దుఃఖంతో చెప్పాడు.
దారి మూసివేతతో పేదల బతుకుదార్లు మూసుకు పోవడం బాధగా అన్పించింది.
'గేటు కాడ సోడాలమ్మే సుభాని సెంటర్లో కూల్‌డ్రింక్‌ షాపులో పన్చేస్తున్నాడు. టీకొట్టు కిష్టప్ప టేసను రోడ్డులో అరవోళ్ళ హోటల్లో సప్లర్‌గా ఉంటున్నాడు. గుంత పునుగులమ్మే లక్ష్మమ్మ ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటుంది.'
కళ్ళ తడిని చేత్తో తుడుచుకుంటూ నిర్వేదంగా చెప్పాడు బాబా. ఒకప్పుడు తమ కాళ్ళమీద తాము బతికినోళ్లు ఇప్పుడు ఒకరి కింద పన్చేయాల్సి రావడం బతుకులో విషాదంగా అన్పించింది.
ఆజాన్‌ విన్పిస్తుంది. బాబా మౌనంగా ఉన్నాడు. అయి పోగానే దువా చదువుకుని అరచేతులతో కళ్ళకద్దుకున్నాడు.
'నీ కొడుకులేం చేస్తున్నారు?' అడిగాను.
'పెద్దోడు బాందీ షాపులో పన్చేస్తున్నాడు. రెండోవాడు బస్టానింగ్‌ కాడ బిరానీ హోటల్లో పన్చేస్తున్నాడు' నిర్లిప్తంగా చెప్పాడు బాబా.
'నువ్వు కొడుకుల దగ్గర ఉంటున్నావా?' అనడిగాను.
'కన్నోళ్ళను కొడుకులు చూసే కాలమా బేటా ఇది. మా రెండు పాణాలు ఆళ్ళకు బరువయ్యాయి. ఆళ్ళ దార్లు ఆళ్ళు చూసుకున్నారు. నేను బూబమ్మ టేసను కాడ రేకుల గదిలో అద్దెకుంటున్నాం. వచ్చే పింఛను డబ్బుల్తో బతుకుతూ, అల్లా పిలుపు కోసరం ఎదురు చూస్తుండాం' బతుకు మీద వేసటతో అన్నాడు బాబా.
గూడ్సు రైలు పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్తుంది. ఇద్దరం మౌనంగా ఉన్నాం. రైలు వెళ్ళిపోయాక మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది.
'మా బతుకుల సంగతి సరే. దారి మూసేసాక గుళ్ళో అమ్మోరి పరిస్థితి ఏంది?' మఠం వైపు చూస్తూ అన్నాడు బాబా.
'ఏమైందని' ఆశ్చర్యంగా అడిగాను.
'మునుపు మఠం ఎలుగు ఎట్టా ఉండేది. భక్తులతో అమ్మోరి గుడి కిటకిటలాడేది కదూ. దసరా అప్పుడు తొమ్మిది రోజులు జాతర జరిగినట్లే ఉండేది. సూట్టానికి రెండు కళ్ళు సాలేవా? ఇప్పుడా ఎలుగు మసకబారిపోయింది బేటా. దారి మూసాక సుట్టు తిరిగి రాడం కష్టమై గుడికొచ్చే భక్తులు తగ్గిపోయారు.' ఆవేదనగా చెప్పాడు బాబా.
నావైపు సూటిగా చూస్తూ 'నాకు తెలీకడుగుతా బేటా.. దారి మూసారని అమ్మోరిని సూట్టానికి రాకపోతే అది భక్తి ఎట్టా అవుతుంది?' ప్రశ్నించాడు బాబా.
మాటలైపోయినట్లు కాసేపు మౌనంగా ఉన్నాడు.
తర్వాత నేనే 'దారి మూసుకుపోయి మీ బతుకులు ఆగమయినందుకు బాధగా లేదా?' అనడిగాను.
బాబా నవ్వాడు. ఆ నవ్వులో తాత్వికత కన్పించింది.
'ఓ పాలి వినుకొండ నుంచి పెసాదరావనే పంతులొకాయన మఠానికొచ్చాడు. ఆయన చెప్తుంటే విన్నాను'
ఏంటన్నట్లు బాబా వైపు చూసాను.
'పురాణాల్లో అముర్తం కోసరం దేవుళ్ళు, రాచ్చసులు పాలసంద్రాన్ని సిలికిన ఘట్టం చెప్పాడు. కొండను కవ్వం చేసి, పామును తాడుగా చుట్టి సిలికినప్పుడు ఆ ఒరిపిడిలో కొండ మీన బతికే లచ్చొపలచ్చల జీవులు సచ్చిపోయినాయంట. ఎవరూ పట్టించుకోని ఆ జీవుల త్యాగం గురించి చెపుతూ, పదిమందికి మంచి జరిగేటప్పుడు మనకు నష్టం జరిగినా ఓర్సుకోవాలంటాడాయన' అన్చెప్పి, క్షణకాలం ఆగి మళ్ళీ ..
'ఇంతకు మునుపు గేటు పడ్డప్పుడు జనం ఎంత యాతన పడేటోళ్ళు. సొరంగ మార్గం వచ్చినాక ఆ బాధల్లేవుగా. పంతు లాయన చెప్పినట్లు మందికి మేలు జరిగేటప్పుడు మనకు జరిగే నష్టం గురించి యోచన చెయ్యకూడదు బేటా.'
ఆ మాటలు చెప్తున్నప్పుడు బాబా ఔన్నత్యం నా కంటికి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కన్పించింది. తనని అనిమిషంగా చూస్తుండిపోయాను.
నా చేయి పట్టుకుని లేచి 'నమాజ్‌ వఖ్త్‌ అవుతుంది. వస్తాను బేటా' అన్చెప్పి కదిలాడు బాబా. రెరడడుగులు వేసి ఆగి వెనక్కి తిరిగి తటపటాయిస్తూ నిలబడ్డాడు.
'ఏంటి బాబా?' అనడిగాను.
'ఏం లేదు బేటా, ఇంటికాడ బూబమ్మకు జరంగా ఉంది. మాత్తర్లు తీసుకెళ్ళాలి. ఓ యాభై రూపాయలుంటే ఇస్తావా?' దీనంగా అడిగాడు.
ఒకరికివ్వడమే గాని అడగడం తెలీని బాబా అలా ఆర్తిగా అడిగేసరికి నా గుండె నీరయ్యింది. నిలువునా చలించి పోయాను. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
క్షణకాలం అచేతనుడినయ్యాను. వెంటనే తేరుకుని జేబులోంచి నాలుగు ఐదొందల నోట్లు తీసి బాబా చేతిలో పెట్టాను.
బాబా కంగారుగా 'బేటా .. ఇంత డబ్బు .. ' అంటుండగా, పర్లేదన్నట్లు చేత్తో సంజ్ఞ చేసాను.
'అల్లా నిన్ను నీ బిడ్డల్ని సల్లగా చూడాలని' దీవించి మసీదు వైపు వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు.
బాబా కనుమరుగయ్యే వరకు చూసాను. నేను మామూలు స్థితికి రావడానికి కొంచెం సమయం పట్టింది. ఫ్రెండును కలవడాన్ని వాయిదా వేసుకుని మనసంతా దు:ఖం ఆవరించగా అక్కడ్నుంచి కదిలాను.
ఒకప్పుడు నేను నడయాడిన దారి... ఇప్పుడు మూసుకు పోయి, జనసంచారం లేక స్తబ్దుగా పడి ఉన్న దారిలో ... బరువెక్కిన గుండెలతో ఇంటి దారి పట్టాను.