పల్లె పదాల కవితా పరిమళం చింతల తొవ్వ

డాక్టర్‌ మహ్మద్‌ హసన్‌
99080 59234

కవి హృదయం ప్రపంచమంత విశాలం భౌతికంగా కనిపించే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కవితా వస్తువే అందుకే శ్రీశ్రీ అన్నట్లుగా 'కాదేది కవితకు అనర్హం'. ఏదైనా మనిషిని స్పందింపజేసే కవితా వస్తువువే అయినప్పుడు కవితా ప్రవాహం ధారలై ప్రవహిస్తుంది. మనస్సు అలజడిగా వున్నప్పుడో లేదా ప్రశాంతంగా ఉన్నప్పుడో, కవి సంచరించే పరిసరాలో లేదా ప్రపంచంలో ఏదో ఒక మూల మనసుకు బాధకలిగే సంఘటన జరిగినప్పుడు కవి హృదయం వెంటనే స్పందిస్తుంది. అది కవితా రూపమైన కావచ్చు. మరే ఇతర సాహిత్య ప్రక్రియ ఐనా కావచ్చు. కవుల సున్నితత్త్వమే వారిని ముందుకు నడిపిస్తుంది.
కవిమిత్రుడు తులా శ్రీనివాస్‌తో నాకు మూడేళ్లుగా పరిచయం వుంది. వివిధ వాట్సాప్‌ సమూహాల్లో కవితల్ని పోస్టు చేసినప్పుడు చదివి స్పందించిన సందర్భంలో కల్గిన పరిచయం స్నేహంగా మారింది. ఇటీవల తను 'చింతల తొవ్వ' పేరుతో కవితా సంపుటి తెచ్చారు. ఒకసారి ఆ కవిత్వంలోకి వెళ్ళి పరికిద్దాం.
''ఎన్నివేల బతుకుల్ని/ కన్నదో నా నేల ...
ఎన్ని కన్నీళ్ళు దిగమింగి
ఎన్ని చరిత్రలకు వేదికై నిలిచిందో ...
ఈ నేలమీద నా తాతల/ పాదముద్రలున్నవి
ఈ గాలినిండా వారి ఊపిరి /జాడలున్నవి
ఆ సంపుటిలోని 'పురిటి మట్టి' కవితలోని వాక్యాలు ఇవి. ఇది చదవగానే శ్రీశ్రీ 'దేశ చరిత్రలు'లోని 'చారిత్రక విభాత సంధ్యల మానవకథా వికాసమెట్టిది? ఏ దేశం ఏ కాలంలో సాధించినదే పరమార్ధం?' అన్న వాక్యాలు గుర్తొచ్చాయి. 'ఎన్ని చరిత్రలకు వేదికై నిలిచిందో' అన్న వాక్యంతో దాశరధి 'ఈ మానవ రూపం కోసం జరిగిన/ పరిణామాలెన్నో' వాక్యాలు గుర్తుకు వచ్చాయి. 'ఈ నేల మీద నా తాతల/ పాదముద్ర లున్నవి, ఈ గాలి నిండా వారి ఊపిరి జాడులున్నవి' అన్న వాక్యాల్లో భౌతికమైన తార్కికవాదం కనిపిస్తుంది.
''పసులకాడిసుక్క మొలవడానికిముందే
సందుచివర తోర్నపాకయ్యేది నా సూపు
గుళ్లె ముత్యాలమ్మ కదిలొచ్చినట్టు
సద్ది గంపెత్తుకొని అమ్మ సందుమల్లంగనే
అన్నకూ, నాకు ఉరుకుడు పోటీ మొదలయ్యేది
అమ్మను ముట్టుకోంగనే పానం
ఎగిరిగంతేసే లేగదూడయ్యేది
గోలెంకాడి గుల్మాల మొగ్గలన్నీ
అమ్మరాంగనే కల్లిప్పి నవ్వేవి
అమ్మను జూసినంకనే తల్లికోడి
పిల్లల్ని గూట్లోకి పిలిచి ఆర్తిగా
రెక్కల కింద పొదువుకునేది''
'అనురాగపు జల్లు' కవితలోనివి ఈ వాక్యాలు. ఆర్ధ్రతవున్న భావోద్వేగపు కవిత ఇది. బాల్యం బాల్యపు జ్ఞాపకాలు, అమ్మతో పెనువేసుకొని వుండే ఆప్యాయతలని చక్కగా కళ్ళముందు ఉంచారు. ఇది చదివాక నా బాల్యం ఓ మధురమైన జ్ఞాపకంగా గుర్తుకు వచ్చింది. పొలం దగ్గరికెళ్ళిన అమ్మ కోసం అమాయకత్వపు నిరీక్షణ, సాయంత్రాలవేళ సందు నుండి వస్తున్నట్లు గంప నెత్తిన పెట్టుకొని ముత్యాలమ్మ నడిచి వస్తున్నట్లుగా చెప్పటం అద్భుతం. 'అమ్మను చూడగానే గోలెంకాడి గుల్మాల మొగ్గలన్ని కల్లిప్పినవ్వేవి.' ఎంత సహజమైన వర్ణన ఇది. తల్లి కోడి, లేగ దూడ, ముత్యాలమ్మ, చక్కని గ్రామీణ పదాలను పేర్చి గొప్ప కవితగా తీర్చిదిద్దిండు శ్రీనివాస్‌. 'ఏ మజ్జెరాత్రో నిద్రలో ఉలికిపడితే అంతలోనే అందరి దేవుళ్ళను తలుసుకునే యాయమ్మ తలుపుగూట్లే ఆటాన దెచ్చి మీదంగ దిప్పి ముడుపు గట్టేది.' ఈ వాక్యాలు చదివితే నా కళ్ల వెంట జ్ఞాపకాల నీటిసుడలు పొరలు పొరలుగా కదిలాయి.
పదిమంది కలిసే పండుగ చూద్దామని
పొద్దుగూకేవేళ పొల్లగాల్లమందరం
గూడెపుబాయి తాళ్ళల్లకు గుంపులై పోయేటోల్లం
చేదునాదెక్కిన తాటికల్లు నెమ్మదిగా తలకెక్కుతుంటే
చేదు నిజాలాన్నీ ఒక్కొక్కటిగా బయటకు పొక్కేవి
ఈ వాక్యాలు 'అలా తాటివనంలో' కవితలోనివి. తన సావాసగాల్ల కథలను గాధలను చక్కగా వర్ణించాడు. వారి నైపుణ్యాలను, చీకటి పడితే మారే మనస్తత్వం ఒకడిది, తెల్లారితే మారే విచిత్రమైన మనస్తత్వం మరొకరిది ఇలా ఎన్ని విధాలుగా రాసిన ముగింపు ఉండకపోవచ్చు. 'పావనగంగ' కవిత అభాగ్య మహిళల ఆవేదనకు అద్దం పట్టింది.
'చీకటి పరదా కప్పుకున్న ఆ జీవితం సాయంత్రానికి
జాతీయ రహదారివెంట కదిలే విగ్రహమౌతుంది
ఓ రాత్రి తనకు తనువిచ్చిన తల్లికిస్తుంది
మరోసారి మనువాడినోడి మందుల లెక్కవుతుంది
పిల్లవాడి పాలడబ్బో పిల్లకు రెండో జత బట్టలో...
రూపేదైతేనేం? చీకటిని ఆయుధంగా చేసుకుని
దారిద్య్రంపై తీవ్రమైన దాడిచేసే తాను
మలినాలన్నీ కలుపుకుని ముందుకుసాగే పావనగంగే...'
ఇది చదివాక అలిశెట్టి ప్రభాకర్‌ 'తను శవమై మరొకరికి వశమై తనువు పుండై మరొకరికి పండై, తను ఏడారై మరొకరికి ఒయసిస్సై' అన్న కవిత గుర్తొచ్చింది.
'పిన్నీసు / ఐదేళ్లప్పుడు అమ్మ
నాకిచ్చిన అపురూప బహుమతి
ఎందుకో .../ నాలుగు దశాబ్దాలైనా అది
నా గుండెనింకా గుచ్చుతూనే ఉంది
ఎడతెరిపిలేని అమ్మ జ్ఞాపకంలా ...
బడికెళ్ళేవేళ ...
గుండీలూడిన నిక్కరుకో/ కుట్టు పిగిలిన చొక్కాకో
పిన్నీసుపెట్టి బుగ్గను ముద్దాడి
అమ్మ కళ్ళుతుడుచుకున్న క్షణం
ఇప్పటికీ వెంటాడి గుచ్చుతూనే ఉంది.
అమ్మ రవిక చినిగినప్పుడు/ అక్క లంగాబొందె ఊడినప్పుడు
'మానాన్ని కాపాడి/ దారిద్య్రాన్ని దాచిందీ ఈ పిన్నీసే' అని 'పిన్నీసు' కవితలో అద్భుతంగా చెప్పారు. 'పిన్నీసు'తో ముడిపడని జీవితాలు ఎవరికి ఉండకపోవచ్చు కానీ పేదరికానికి చాలా దగ్గరి సంబంధం 'పిన్నీసు'తో వుంటుంది. చెప్పు తెగినప్పుడు, లంగా బొందె ఊడినప్పుడు, జడలో మల్లెలు తురుముకోవాలన్నప్పుడు, గుండీలూడిన చొక్కాకో, నిక్కరుకో ఆధారం అయ్యేది ఈ పిన్నీసే. నేను ఇప్పటికీ తరగతి గదిలో చాలామంది పిల్లల్ని ఈ సన్నివేశంలో చూస్తూనే ఉంటాను. హృదయం ద్రవించిపోతుంది.
ఈ పుస్తకానికి ముందుమాటలో ఆచార్య ఎన్‌.గోపి ''పిన్నీసు' లాంటి కవితను వారు కూడా రాసినట్టు తన కన్నా శ్రీనివాస్‌ బాగా రాసినట్టు చెప్పారు. 'పిన్నీసు' తక్కువ వెలతో కూడుకున్నది కానీ దాని అవసరం వెల కట్టలేనిది. ఈ కవితా సంపుటిలో మొత్తం 45 కవితలు ఉన్నాయి. వస్తు వైవిధ్యంతో అన్నీ పాఠకులను అలరిస్తాయి. ఆచార్య ఎన్‌.గోపి చెప్పినట్లుగా ఈ కవితా సంపుటి 'మానవ సంబంధాల వారధి'. చదివిన ప్రతి ఒక్కరూ తమ బాల్యంలోకి లేదా జీవితంలోకి తరచి చూసుకోవటం మాత్రం మరువలేరు. ఎంతో ఆర్ధ్రతతో అనుభవంతో, రసానుభూతిని మిగిల్చే కవితలు ఇందులో పొందుపర్చారు. ఒక అక్షరాల మాలను కూర్చి పుస్తకానికి రూపం ఇవ్వటం గొప్ప ప్రయత్నం. నందిని సిద్ధారెడ్డి, జీవకవి మునాసు వెంకట్‌ ముందుమాటలు రాశారు. 'చింతల తొవ్వ' గుండా వెళ్తే బాల్యపు జ్ఞాపకాలు, అమ్మతో పెనువేసుకునే అనుబంధాలు, నాన్నతో ముడిపడి వుండే ప్రేమలు, అన్నయ్యతో మమతలు ... ఇలా అన్ని రకాల భావోద్వేగాల నెలవు ఈ సంపుటి. ఈ కవిత్వంలో పల్లె పదాలు, మాండలికాలు, దేశ్య పదాలు పుష్కలంగా దొరుకుతాయి. అద్భుతమైన రచనా కూర్పుతో మొదటి కవితా సంపుటితోనే బలమైన ముద్ర వేశాడు మిత్రుడు శ్రీనివాస్‌. భవిష్యత్తులో మరిన్ని కవిత సంపుటాలు వెలువరించాలని ఆశిద్దాం.