కరోనా కవితలు

వీడ్కోలు - దాకరపు బాబూరావు
కరోనా! అబ్‌ తూ మరోనా! - డా|| ఎన్‌. గోపి
కరోనా హైకూలు - వై. రవీంద్ర
జైలుగది - రేణుక అయోలా
అప్రస్తుతమే అవసరమేమో - డా|| బాలాజీ దీక్షితులు పి.వి. 
రక్తమోడిన రహదారులు - ఝాన్సీ కె.వి. కుమారి
నానీలు - కోట్ల వెంకటేశ్వర రెడ్డి
ఊరిదారిలో - బంగార్రాజు కంఠ
రెక్కలు - పి. విజయలక్ష్మి పండిట్‌
నేను సైనికురాలిని! - రజిత కొండసాని
ఎడారి బాటసారులం - గోసల నారాయణస్వామి
నిశ్శబ్ద బీభత్సం - శ్రీనివాసరాజు పెన్మెత్స
పునర్నిర్మించుకుందాం..! - బి. కళాగోపాల్‌

 

వీడ్కోలు
- దాకరపు బాబూరావు - 
9848993599
దయచేసి!
మమ్మల్ని క్షమించండి!!
మీకొచ్చిన కష్టానికి
మిమ్మల్ని ఆదరించి
అక్కున చేర్చుకో లేకపోయిన
మా అమానవీయతను
ఈ సారికి మన్నించండి.........! !
ఏవో నాలుగు చెమట చుక్కల్ని
మా పంట చేలల్లో చల్లి
కూలి గింజ లేరు కెల్లటానికి
ఏటా వచ్చివాలే
వలస కూలి పక్షుల్లాగే మిమ్మల్ని చూసినందుకు
మన్నించండి.........! !
అర్ధాంతరంగా మీరెల్లిపోతుంటే
మీరు నాటిన
అనుబంధాల వేళ్ళు
పెల్లగించుకుని పైకొస్తుంటే గాని !
అర్థం కాలేదు.........! !
పొద్దు పొడిసీ పొడవకముందే
మా పంట పోలాలల్లో
పని మొలకలై తళ్ళుక్కున మెరిసే
మీ స్వేద జలరాశుల
తళుకుల సౌందర్యానికి
సూర్యుడే ముగ్దుడవ్వని రోజుందా !
అని మేం గ్రహించలేకపోయాం ! !
జీవనం మీకు పోరుబాటైన వేళ
ఆకలి కడుపుల్ని మోసుకుని
ఊల్లొదిలి గూల్లొదిలి
ఊరిగాని ఊరొచ్చిన
మీ గుండె గదుల్లోని
ఆవేదనా తెరల్లోకి
ఏనాడూ ! తొంగి చూడనైనా చూడని
అహంకార దర్పం మాది ! !
ప్రాణం మీది కొచ్చి
లోకమంతా బతుకులకే తాళాలు వేసుకున్న వేళ
సాలె గూట్లో చిక్కుబడ్డ
అమాయక ప్రాణుల్లా
మీరు అల్లాడుతుంటే.........! !
ఏదో సాయం చేస్తున్నట్టు
ఫోటోలకు ఫోజులివ్వడానికి
మేం చాచిన చేతుల్నే
దేవుళ్ళంటూ కళ్ళకద్దుకున్న
మీ అమాయకత్వం
వచ్చిరాని భాషలో
కతజ్ఞతా వచనాలై మీరుపెట్టిన దణ్ణాలూ.........
గుండెల్లో కలుక్కుమనేల
మాకు గుచ్చుకుంటూనేవున్నాయి ! ! మూటా ముల్లే సర్దుకుని
సొంత ఊళ్ళకు దార్లెతుక్కుంటూ
మీరలా నడిచెల్లిపోతుంటే
మిన్నకుండిపోయి
మీరెక్కి వెళ్ళాల్సిన రైళ్ళు
మీ బ్రతుకు లోగిల్లెక్కి
మీ ప్రాణాల మీద నుంచి
వెళ్లిపోతున్న వేళ
మీకు సాయం కొమ్మలం
కాలేకపోయిన
మమల్ని
మన్నించండి................
మన్నించండి.................

 

కరోనా! అబ్‌ తూ మరోనా!
- డా.ఎన్‌. గోపి

కాగితమక్కరలేదు
భూగోళం మీద
కర్కశగీతం రచిస్తోంది కరోనా.

చేతిలో కత్తులుండొచ్చు
జేబులో బాంబులుండొచ్చు
కరోనాకు భయంలేదు
ఊపిరితిత్తులుంటే చాలు
ఉత్త చేతుల్తో పోదు.

రాచరికాన్ని వెలిగించిన
ప్రిన్స్‌ చార్లెస్‌ అయినా
సాక్షాత్తు బ్రిటన్‌ సామ్రాజ్యాధినేత అయినా
వైరస్‌ ముట్టుకుంటే
యస్‌! పారిపోవలిసిందే.
ఫ్లయింగ్‌ నేషన్‌
భూమ్మీద
కుప్పకూలక తప్పదు.
వ్యాపార జీవితాలకు
సాంఘిక దూరం ఉండదు.
విలాస విహారాలను
కులాసాగా
పలకరిస్తోంది కరోనా.
ఇవాళ మానవాళికి
లిట్మస్‌ పరీక్ష కరోనా
తీగలాగితే ఏక్కడో బిగుసుకునే
మత్యువీణ కరోనా!

వలస బతుకుల్ని
అనాథలను చేసి
స్వార్థం సరిహద్దులకు
కొత్తభాష్యం నేర్పింది కరోనా.
సొంతూళ్లకు వెళ్లినా
ఎదురయ్యేది అదే కదా!

అంతటా లాక్‌ డౌన్‌
ఇండ్లు లేనివారు డౌన్‌ డౌన్‌
వేలాది మైళ్ళు నడిపించే
లక్షకాళ్ళ జెర్రీ కరోనా.

కర్తవ్యాలను గుర్తుచేశావు.
భయం తరగతి గదిలో
పాఠాలు నేర్పుతున్నావు.
ఇక చాలు
కరోనా! తూ అబ్‌ తో మరోనా.

 

కరోనా హైకూలు
- వై. రవీంద్ర - 9440818295


విలక్షణమైన సంవత్సరం..ట్వంటీ ట్వంటీ
అందరి శ్వాసల్ని దోచేస్తున్న.. ఫోర్‌ట్వంటీ!

శ్వాస.. కరోనా సహితం!
ఆశ... కరోనా రహితం!

తుమ్మితే... మరణం...
శిక్షస్మ ృతి మార్చాల్సిన తరుణం!

కరోనా దాహానికి చాలని సమాధిపెట్లు
చెక్కకోసం చంపేస్తారేమోనన్న భయంతో చెట్లు!

పూచిన మోదుగుల్లా వలసపక్షుల పాదాలు
వర్ణించడం వల్లకాదంటూ చేతులెత్తేసిన తెలుగు పదాలు!

నాడు కరం కరం కలపడం పలకరింపు
నేడది నిలువెల్లా వణికించే జలదరింపు!

స్తన్యమిస్తున్న మాతృత్వపు మమకారం...
ఆంక్షలకు అతీతమంటూ తలొగ్గిన సామాజిక దూరం!

 

జైలు గది
- రేణుక అయోల - 96768 53987


ఎన్ని సార్లు ఈ గదిలో
విశ్రాంతిగా కునుకు తీయాలనుకున్నా
గదిగోడలు చువ్వల్లా ఒంగి
జైలులా బంధిస్తాయి
ఖైదీ చుట్టూతా గదిలా-

అలవాట్లు
ఆలోచనలు
ఆత్మశోధనలు
తెగిపడిన తలల్లా వుంటాయి-

ఇష్టం లేని మరణాలు
చిలక్కొయ్య కొక్కానికి
వేళ్లాడుతూ వుంటాయి-
ప్రేమించిన కాగితాలన్ని
వుండచుట్టుకుని
పాదాల కింద
నలుగుతూ వుంటాయి-

ఊపిరి మెల్లగా సాగుతూ
ఒక్కోసారి కెరటంలా ఎగిసిపడి
ఏ రకం నొప్పిని బయటకు రానీయకుండా
కళ్ళలో ఇసుక జల్లుతుంది

దీపం ఒత్తి జారిపోతుంది
చీకటిలో ఆఖరి వెలుగు
కునుకుతూ మలిగి పోతుంది.

గతం
కత్తికి అంటుకున్న కేకుముక్కలా
వేళ్ళతో, కళ్ళతో
రుచి చూడమంటుంది
తీపితో ముంచెత్తి
కన్నీళ్ళ నదిని దాచిన గది
జైలులా వుంది ...

 

అప్రస్తుతమే అవసరమేమో
- డా. బాలాజీ దీక్షితులు పి.వి - 8885391722

విషపు నాగులను
వేటాడటానికి కత్తులు - కర్రలు పట్టిన కాలంనుండి
బరువెక్కిన గుండెలను
ఓదార్చడానికి మందుకొచ్చే మానవీయ ఆసరాలనుండి
మదమెక్కిన మనుషులను
బుద్ధి చెప్పడానికి చేదోడు వాదోడు గా నిలబడే సన్నిహితులనుండి
దాటొచ్చిజి
మూగపోయిన చిరునవ్వులతో
వాడిపోయిన ముఖాలతో
కల్మషం కలుపుకున్న మనసులతో
ఎదురొచ్చే హదయాలను
కరోనా మూసేసిందా మాస్కులతో
క్వారంటైను తో బంధీ చేసిందా ఇంట - బయట
అంబరాలు - ఆడంబరాలు కంటే
అణుకువ - నడక -నడత
జీవితానికి ముఖ్యమని తెలియజేస్తున్నట్లుంది కదూ....
నాటి అప్రస్తుతం - ప్రస్తుతానికి అవసరమేమో

 

రక్తమోడిన రహదారులు
- ఝన్సీ కె.వి. కుమారి - 9010823014


శతాబ్దాల నుండే ఈ దేశానికి
రక్తదానం చేస్తున్నవాడు
తాత తండ్రుల నుండి
వారసత్వం అందుకున్నవాడు
ఈ నేల కదా తనకు జన్మనిచ్చింది
ఈ నేలకే తన జీవితాన్నివ్వాలన్న
దృఢ సంకల్పం..
ఆ రక్తపు ప్రతి బొట్టులో..!
మాటల మాయాజాలంతో
పిట్టలదొర వేషాలతో
దేశప్రజలను నిండా ముంచి
ధనారాసుల కొండల్ని... ఆబగా దోచుకున్న....దొంగల ముఠావాడు
కాదు కదా తను...?
దేహాత్మలతో త్యాగాన్నే శ్వాసిస్తూ
తన వారసులకు
బాల్యం నుండే అక్షరాభాస్యం
చేయిస్తున్నవాడు కదా!

  •  

తన రక్తమాంసాలతో
నేల నుండి నింగి వరకూ
అంతటా విస్తరించి ఉన్నవాడు...
తాను కట్టిన భవనాలు
గగనంతో కబుర్లాడుతూ
పకపకా నవ్వుతుంటే
ఆ నవ్వులన్నీ తనవేనని మురిసి పోయేవాడు
''కరోనా పడగెత్తిన విషకాలంలో
నీకింత నీడనివ్వక పోయామే..
అన్నా'' అని
ఆ ఆకాశ హార్మ్యాలు...
కన్నీరు కారుస్తున్నాయి....

  •  

''మాలో సగం నీకే చెందాలి కదా
నీ రక్త ప్రాణాల ఖరీదు కదా, మేము
నువ్వు లేని కాలమంతా...
మేము..
ఒఠ్ఠి... నేలా, మట్టే కదా, అన్నా,
నీ కన్న పిల్లలకూ,
నిన్ను కన్న తల్లులకూ
కడుపు నింపాల్సిన మేము
కనుమరుగయ్యామన్నా...
కబ్జా అయిపోయామన్నా...'' అంటూ

ఏ కోటల్లోనో దాక్కున్న కరెన్సీ కట్టలు
సిగ్గుతో.. తలవంచుకున్నాయి...

  •  

కొండలను కూల్చివేశాడు
లోయ మడుగులను ఎత్తుచేశాడు
ముళ్ళ పొదలను .. రాళ్ళ కుప్పలను
సమతల నేలగా చదును చేసి
ఆ సేతు హిమాచలం
స్నేహ వారధులు కట్టి...
నేలను పరుగుపెట్టించాడు...!
నిలువెల్లా.. ఆనంద పరిమళమై
నేలంతా పరవశించాడు!
ఉన్నట్టుండి.. హఠాత్తుగా ఓ పిడుగు!
దేశాన్ని కరోనా చుట్టుముట్టుంది
దేశానికి తాళాలేశారు..!

  •  

కాలం... ఆగిపోయింది
పరుగైన జీవితం...ప్రశ్నార్థకమయింది..
కూడు లేదు... గూడు లేదు
దూరతీరాల్లో .. అమ్మానాన్న
అక్కా తమ్ముడు..? అమ్మో.. కరోనా..
అమ్మ ఊర్లో కూడానా..?

  •  

ప్రగతి రథ చక్రాలకు మహా చోదకుడై
పరుగులు పెట్టించిన నవభారత నిర్మాత
ఇల్లాలు పిల్లలతో...నట్టనడిరోడ్డున
ఒక్కడే మిగిలాడు...
దిక్కులన్నీ పారిపోయాయి...
కళ్ళనిండా నీళ్ళు... కాళ్ళల్లో రక్తం..
వేదనా ప్రవాహాలు
సుడులు తిరుగుతున్న హృదయం
కృతజ్ఞత లేని..ప్రణాళిక లేని దేశానికి..
తన సర్వస్వం ఇచ్చాడే...!
దేశం వెలుగుతోందని బూరలు ఊదే
ప్రభుత్వాలకు
ఆ వెలుగుకు కారణమైన సూర్యులు
కానరాకపోవడం.. అంధత్వమా...?

  •  

ప్రజలకు ఇళ్ళూ... వాకిళ్ళూ కట్టిన వాళ్ళం
నదులు ప్రాజెక్టులు పరిశ్రమలు ఆనకట్టలు
అన్నీ...మన శ్రమ ఫలితాలే!
పదండి...దేశానికి రాళ్ళెత్తిన మనకాళ్ళే
మన గూళ్ళకి మనల్ని చేరుస్తాయి...
రక్తమోడినా.. ప్రాణం పోయినా...
ప్రారంభిద్దాం మహాప్రస్థానం
శిలువను మోసిన క్రీస్తుప్రభువులా
ఈ రహదారులకు...మరోసారి
చేద్దాం...రక్తాభిషేకం!
పోదాం... అమ్మ ఒడిలో వాలిపోదాం...
చివరి చూపులకైనా...పరుగులు పెడదాం...

 

నానీలు
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి - 9440243261


ఇవ్వాళ నాకు
కొత్త మిత్రుడు దొరికాడు
ఆలింగనం
కళ్ళతోనే!

బడులు
మూతబడ్డాయి
పూల తోటలు
ధ్వంసమవుతున్న కల!
మాస్కున్నది నాకే
నా పద్యానిక్కాదు
గురి గింజ నలుపు
దానికి తెలుసు!

పద్యం
ప్రదర్శన కోరుకుంటది
లాక్‌ డౌన్లను
ధిక్కరిస్తది!

నేను
నా మిత్రులు
ప్రతి సాయంకాలం
ఇప్పుడో పచ్చి జ్ఞాపకం!

 

ఊరి దారిలో
- బంగార్రాజు కంఠ - 8500350464


సత్తువలేని చెమట చుక్కలు
దారిపొడవునా దొర్లుతూనే వున్నాయి
ఎవరికివాళ్ళు భుజాలపై భూమిని మోసుకుంటూ
చీమలబారై ఊరి దారి పట్టారు
కాంక్రీటు చెట్లకింద సేదతీరుతూ
మురికి కాసారాల పక్కన
మత్యువుని బుజ్జగిస్తూ
చావుకుముందు చచ్చే చావేదో
ఊరి ఒడిలో చచ్చిపోవాలని
సాగుతున్న బాటసారులు వాళ్ళు

ప్రపంచమంతా
పెల్లుబుకుతున్న మానవత్వం
తమవైపు ఒక్కసారైనా చూడాలనేం
ఎదురు చూడటంలేదు
వివక్షలో పుట్టి నిరంతరం వివక్షను
దిమ్మరించుకుంటున్న నడక
వివక్షలోనే నడక చాలించాల్సి వస్తుందేమోనన్న
గుబులు నిలవనివ్వడం లేదు
ప్రత్యేక సదుపాయాలేమి అక్కర్లేదు
ఎలాగోలా ఊరు చేరడానికి
సురక్షిత సర్ధుబాటొక్కటే వాళ్ళ కోరిక

తరాలుగా సామాజిక దూరానికి
అలవాటు పడిన బతుకులు
ఇప్పుడు కొత్తగా సామాజికదూరం
పాటించమంటుంటే
కొనఊపిరికి వేలాడుతున్న శరీరాలై
శక్తిని కూడదీసుకుని కిసుక్కున నవ్వుకుంటున్నాయి
వినండి.., వినండి..,
దేవుళ్ళచేత ఎప్పుడో తరిమేయబడ్డాక
ఆశలదూలం నుంచి చెదిరిన
గుంపుగబ్బిలాల పాటది

క్వారంటైన్‌ కట్టుకథల పక్కనుంచి
కదిలిపోతున్న కార్ల మాయాజాలమ్ముందు
తడబడుతూ వాళ్ళ అడుగుల్ని అడుగులే
వెక్కిరించుకుంటున్నాయి
ప్రత్యేక విమానాల్లో
దేశాలు దాటిస్తున్న ప్రత్యేక సందర్భాల్లా
ప్రత్యేక ఆటోల్లోనైనా
ఊరు చేర్చకపోతాయాని
మాత్రమే ఎదురుచూస్తున్నాయి

వాళ్ళకేం తెలుసు
ఇక్కడ కొన్ని ప్రసంగాలు బూటకమని
ఫోటోదిగిన ప్రతీసాయం ఒక ప్రచారమని
వాళ్ళకేం తెలుసు
ఐదువందలకు డబ్బాలో కుక్కబడ్డ
బాలెట్‌ పత్రం వాళ్ళ జీవితమని
ఆకలికి ఎవరో విసిరే ఆహారపొట్లాలకు
ఇప్పటికీ ఎదురు చూస్తున్నామని

 

రెక్కలు
పి.విజయలక్ష్మి పండిట్‌


''అమ్మా..పైన సూడు'' అడిగింది
రోడ్డుపై నడుస్తూ పైకిలేచిన
ఏడేండ్ల మగచేయి,
''అది పక్షులవలస గుంపు''అంది
నడుస్తూ బక్కచిక్కిన పదహారేండ్ల అమ్మ
చంకలోబిడ్డ నెత్తిమీద మూటతో..,

''ఎక్కడికి పోతా వుండాయవి''
ఏడేండ్ల కండ్లలో ఆశ్ఛర్యం..,
''కూటికోసం గూడుకోసం'',
అమ్మ తడికండ్ల జవాబు..,
''మన కూలిజనం మాదిరా'',
ఏడేండ్ల కొడుకు సందేహం,
''అయి మన మాదిరి కూలిసేయవు''
అమ్మ అవగాహన పలికింది..,
'అయితే వాటికి తిండికి డబ్బులెట్లా'',
కొడుకు ధర్మసందేహం,
''అవి సేచ్చగా గింజలు ఏరుకోని తింటాయి
మనమాదిరి వాటివి బానిస బతుకులు కావు''
తల్లి అనుభవం జవాబిచ్చింది,
''సేచ్చ అంటే ఏంది ?''
కొడుకు లోతు ప్రశ్న,
''పచ్చులవి సేచ్చగా ఎగిరిపోయే రెక్కలు ..,
మనవేమో కూలిగుంజకు కట్టేసిన రెక్కలు,
ఎట్ల ఎగురుతాయి?''
అమ్మ నిరాశ నిస్పహ గొంతు..!
అమ్మ అయోమయం జవాబుప్రశ్న తో
మాటపెగలని మట్టిబారిన కొడుకు
చూపు మనసు పక్షులకేసి
పరుగుతీశాయి స్వేఛ్చ గా..!!

 

నేను సైనికురాలిని!
- రజిత కొండసాని - 9652838920


ఇంతకుముందు ఎప్పుడైనా
నిన్ను చూస్తే నాకు భయమేసేది
నిజానికి నిన్ను చూస్తే
అప్పుడప్పుడు గగుర్పాటూ కలిగేది
నీ విజిల్‌ శబ్దం
నా వెన్నులో వణుకు పుట్టించేది
చట్ట వ్యతిరేకులపై నీ ఉక్కుపాదం
నా కళ్ళలో భయాన్ని చిత్రించేవి
అది సమాజ శ్రేయస్సుకేనని తెలుసు
ఇప్పుడు కూడా రోడ్డు మీదకొచ్చిన
నన్ను చూసి లాఠీ ఎత్తుతున్నావు
విజిలేస్తున్నావు గట్టిగా అరుస్తున్నావు
కానీ అదేమిటో
నీపై నాకిప్పుడు
కోపం రావడంలేదు
నువ్వు లాఠీ ఎత్తితే
గగుర్పాటు కలగటం లేదు
నీలో నాకో తండ్రి కనిపిస్తున్నాడు
నువ్వు విజిలేసినప్పుడు
హెచ్చరిస్తున్న అన్న అగుపిస్తున్నాడు
నీ అరుపులో నాకో గురువు గోచరిస్తున్నాడు.
నీ కోపం కళ్ళలోనూ
ఓ స్నేహితుడే కనపడుతున్నాడు.
నేను ఇన్నాళ్లూ దేశ సరిహద్దును
కాపాడుతున్నది సైనికులేననే అనుకున్న
ఇప్పుడే తెలిసింది
నా దేశ సమస్త ప్రజల్ని కూడా అదిగో
ఆ పారిశుద్ధ్య కార్మికురాలు రక్షిస్తుంది
అదిగో ఆ డాక్టర్‌ రక్షిస్తున్నాడు
అదిగో ఆ నర్సు రక్షిస్తుంది
వీళ్ళంతా జీతాల కోసం
పనిచేస్తున్నారనుకున్నా
ఇప్పుడే అర్థమైంది
జీతాల కోసం కాదు
జీవితాలు నిలబెట్టడానికి
ప్రమాదకర పనులు చేస్తున్నారని
దేశ శ్రేయస్సు కోసం
ప్రాణత్యాగాలు చేస్తారని
ఇప్పుడే అవగతమైంది
జీతం ప్రాణత్యాగం కోరితే
విధి నిర్వహణ మనుషుల్ని
మహనీయుల్ని చేస్తుంది
అదిగో చూడండి
నిన్నటి దాక స్టీరింగ్‌ తిప్పిన చేతులు
నేడు సామాజిక దూరాన్ని నేర్పుతున్నాయి
ముట్టుకోకున్నా వీరంతా ఇప్పుడు
నా ఆత్మ బంధువులు
మాస్కులు వెనకాల కూడా
మనం తీసే ఊపిరి ఒక్కటే
చేయి చేయి కలపకున్నా
మన లక్ష్యం ఒక్కటే
నా దేశం ఇప్పుడు
మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నది
వ్యాధుల బాధల నుండి విముక్తి కోసం!
నేనిప్పుడో పరిశుభ్రత తుపాకి
పట్టుకున్న సైనికురాలిని
నాది సరిహద్దులు లేని యుద్ధ క్షేత్రం
కనిపించని శత్రువు పైన
ప్రత్యక్ష యుద్ధం నాది
ఇప్పుడు నేను ఒక్కరినై
అనేకమై సామూహికమై
విశ్వ వ్యాపితమైన ఆరోగ్య సైన్యాన్ని
నేను ప్రపంచ ప్రాణ గానాన్ని!!

 

ఎడారి బాటసారులం
- గోసల నారాయణస్వామి - 8309544672


నేను '' రైతును '' అనీ
రొమ్ము విరుచుకునీ !
నిండైన ఆత్మాభిమానంతో
దర్పంగా నడచి ఉన్నా !
అతి దుర్భరమైన పేదరికాన్ని
పుట్టుకతోనే వారసత్వంగా పొంది ఉన్నా !
ఏటేటా దరువేస్తున్న కరువు కాటుతో !
కటిక దరిద్రపు బతుకే నెత్తికెక్కీ నడవమనీ
మెడ పట్టుకు నెడుతుంటే !
పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ !
ప్రయాణం మొదలుపెట్టీ !
ఎండా వానలకానని గూటిలో !
ముడుచుకుంటూ నడుచుకునే గువ్వలై !
ఎలుకలూ పందికొక్కుల సావాసంలోనే !
గబగబా గతికిన రుచి కోరని ఆకలి తిండీ !
సుఖమడగని బడలిక నిద్దురతో !
ఎంతకూ సాగని కాలం నదిలో కాళ్ళీడ్చుకుంటూ !
ఎదురీదడంలో ఎదురైన
ఎన్నెన్నో కడగండ్ల వడగండ్లు పోట్లెత్తితే !
తెగిన బాధల భారపు గట్ల నుంచీ !
ఎంత ఆపుకుంటున్నా ఆగకుండా పొంగుకొచ్చిన
దుఃఖ జలపాతాల్లో మునిగి తేలుతూ !
ముక్కుతూ మూల్గుతూ ముందుకు పోతున్న !
వలస ప్రయాణంలో మజిలీ మజిలీలోనూ !
గజిబిజి మలుపుల నుండీ !
కొట్టుకు పోయే సీమ చకోరాలం !!
ఎదురెక్కి వచ్చే కరోనాకు బెదరీ !
నక్కి నక్కీ వెనక్కే పరుగెత్తే ఎడారి బాటసారులం !!
పాలకులెవరైనా ప్రణమిల్లీ !
నీళ్ళు తప్పా కన్నీళ్ళతో ఏమడగనోళ్ళం !!
ఎవరికేమిస్తారో మాకైతే నీళ్ళొకటివ్వండి !
పై చేతులయ్యే పనులకు
ప్రాణం పొయ్యండి !!
మా చేతి చేతలకు ఊతమవ్వండి !!
ఎండిన పేగులై నేల తల్లి ఎద మీద !
వాలీ వాడి పోయిన కణిక రాళ్ళ చేల్లోనూ !
కనక రాశుల మెరుపులు పరిచే !
మెత్తటి ఎర్రటి సీమ నేలలో !
పచ్చటి ముంగారి మొలకలై మొలిచీ !
జీవ కళలద్దుకునేలా పల్లె తల్లికి ప్రాణం పోసే !
సేద్యపు సంబరాలకి రంగుల వెలుగు రేఖలై !
విరబూయడానికి వరదాతలవ్వండి !!

 

నిశ్శబ్ద బీభత్సం
- శ్రీనివాస రాజు పెన్మెత్స - 9550 981531


ఒక బీభత్సం నిశ్శబ్ద యుద్ధమై
మానవ జాతిపై పంజా విసిరితే...
సముద్ర గర్భం యుద్ధ నీతిని నేర్పింది
ఒక అడుగు వెనక్కి వేసేది
వేయి అడుగులు శిఖరమై
పైకి లేవడానికే అని
అడవి తల్లి నేర్పింది...
వెలుగులో చీకటి గెరిల్లావై
జీవితాన్ని సహనంతో గెలవమని!
తుఫాను బీభత్సం నేర్పింది...
నిశ్శబ్దంలో మానవ జాతి రహస్యాలు
దాక్కున్నాయి వెతుక్కోమని!
అగ్ని శిఖ నేర్పింది నీ చైతన్యం
కశేరు దండమై నిలబడే ఉండాలని
గాలిలో తరంగాలు
రహాస్యాన్ని మోసుకొచ్చాయి,
జరుగుతున్నవి కరోనా మరణాలు కాదు
మానవ జాతి తప్పిదాలని!
కళ్లు తెరచి కతజ్ఞతతో ప్రకతికి
క్షమాపణల నమస్కారం చేయకపోతే....
మీ చేయే భస్మాసుర హస్తమై
మిమ్మల్ని మింగేస్తుందని,
అవతారం అవశేషాలు కూడా
అనంతం బయటకు
విసిరివేయ బడతాయని
ఆకాశవాణి అవకాశం తీసుకుంది
కర్తవ్యాన్ని నిష్కామ కర్మగా
నేడు పుణ్యపురుషులు చేస్తున్న
కష్టం, త్యాగం, శ్రమ, ప్రేమ...
మానవజాతిని మంచి అభ్యాసం వైపుకు
ఉత్కష్టమైన మానవీయ విలువల వైపుకు
ఔన్నత్యం, క్రమశిక్షణ వైపుకు కదిలించకపోతే...
పొంచి ఉన్న మరిన్ని ముప్పుల్లో
మీరు మాయమైపోతారని హారతి కర్పూరంలా!
సముద్రంపై చెరిగి పోయిన సంతకంలా!
పులి నోట్లో మాయమైన జింక మాంసంలా!
మీకు అర్ధం కావడం లేదా??!
ఈ బీభత్సం మీ విజ్ఞానాన్ని,
అహంకారాన్ని, మీ ఆధిపత్య ధోరణినీ
మీ లోభత్వాన్ని, మీ కర్కశత్వాన్ని, మీ డొల్లతనాన్ని,
తెరవెనుక మీ టక్కుటమార రహస్య మోసాలను,
పంచభూతాలతో మీరు ఆడుతున్న రాక్షస క్రీడను
అంతెందుకు భూమిపై మీ అస్తిత్వాన్ని
మీ మనుగడనే సవాల్‌ చేసిందనీ
వికటాట్టహాసం చేసి మీ కాళ్లు, చేతులు
నోరు, కళ్లు, ముక్కు మూసి మూలని కూర్చో పెట్టిందని...
ఇప్పటికైనా
భక్తితోనో, భయంతోనో, చైతన్యంతోనో
నిర్మల మందాకినీ వీచికల వైపుకు
మానవీయ పరిమళం వైపుకు మనిషి అడుగులు కదపకపోతే-
ఈ నిశ్శబ్ద బీభత్సంపై నిజమైన విజయం సాధ్యం కాదని!
సన్నాయి నొక్కులు వొద్దు నిజాన్ని నిర్భయంగా చూద్దాం!
భావ సమూహమై, సమర శంఖమై విజయం సాధిద్దాం!

 

పునర్నిర్మించుకుందాం..!
బి. కళాగోపాల్‌ - 9441631029

అవును దిద్దుకుందాం..
ఇన్నాళ్ల తప్పులన్నీ
బతుకు పలక మీద పరిశుభ్రంగా చెరిపేసి
మళ్ళీ దిద్దుకుందాం..!
విశ్వవిజేత అని విర్రవీగే మానవుడి నడ్డి విరిచి
వెన్నెముక లేకుండా చేస్తున్న పురుగు యుద్ధంలో
ఇప్పుడిక చావో రేవో తేల్చుకుందాం
బయోవార్‌ నేపథ్యంలో దేశదేశాలను స్వాహా చేసి
శవాల దిబ్బగా మార్చేస్తున్న వైరస్‌ దెబ్బకు
ఇంటికప్పే ఆశ్రయమైన వైనం కథలు కథలుగా
భవిష్యత్‌ తరాలకు చెప్పుకుందాం
హాట్‌ స్పాట్లు, రెడ్‌ జోన్లు గా చీలిన దేశంలో
ఐసోలేషన్‌, క్వారంటైన్‌ అంటున్న నయా జీవనవిధానాన్ని
నేడు ఒకింత జాగరూకతతో గమనిద్దాం
ఇల్లంతా అమరిన ట్రంకుపెట్టె తలకెక్కగా
ఊరు పిలుస్తుంటే.. దేశం శత్రువై ఊపిరి తీస్తుంటే..
రామన్న గోసగా సాగుతున్న వలసకాళ్ళ పాదయాత్రను
విడమరిచి మరీ చెప్పుకుందాం
ఒకప్పుడు మన కడుపులు నింపిన బడుగు జీవులు
గిన్నెల చమక్కుల్లో చందమామలై మెరిసినోళ్ళు
నేడు పిడికెడు బియ్యం, నిత్యవసరాల కోసం
చాంతాడంత క్యూలైన్లలో నిరీక్షిస్తున్న దురదష్టాన్ని
కళ్ళకు కట్టినట్లుగా చరిత్ర పుటల్లో లిఖించుకుందాం
నాలుగు గుంజలు లేని ఒంటినిట్టాడి బ్రతుకు చిత్రంలో
సామాజిక దూరం భారమైన మురికివాడల మత్యుగీతాలు
అలుపు లేని టీవీ తెర అంకెల్లో ఆగమాగమవుతుంటే
రెండు కన్నీటి బొట్లతో శ్రద్ధాంజలి ఘటిద్దాం
కేంద్రకమే లేని వైరస్‌తో చేసే యుద్ధంలో
అమరులవుతున్న తెల్లకోటు వీరులు
బ్రతికొచ్చిన నైటింగేల్లా సేవలు చేస్తున్న నర్సమ్మలు
అనుక్షణం దండనతో ఆకతాయిలను దిద్దుతున్న
పోలీసుల కరకు లాఠీల నత్యాన్ని
లాక్‌ డౌన్‌ కాని కంటిరెటీనాలో భద్రంగా
రికార్డ్‌ చేసుకుందాం
వసుదైక కుటుంబ భావనకు చెల్లుచీటీ పలికిన
కరోనా ముందు.. వెనుకలుగా విడిపోయిన
కాలవిభజన శకాలను మళ్ళీ సరిదిద్దుకొందాం
నేడు మనిషి చేతులే కాదు.. చేతల్ని శభ్రపరుచుకుంటూ..
ముసుగు తొడగని మానవత్వంతో చెప్పని కథగా
మిగిలిపోతున్న కరోనా కన్నీటీ వ్యథ మాటున
చెదిపోయిన బ్రతుకు గూటిని పునర్నిర్మించుకుందాం..!!