ఆకుపచ్చని కన్నీరు (కవిత)

అమూల్యాచందు కప్పగంతు
9059824800


కన్నీటికి రంగుండదని తెలుసు
కాని అక్కడ పచ్చని కన్నీరు కారుతోంది
సన్నగా వీస్తున్న గాలి
ఆ ఎముకల్లోంచి మట్టి వాసనను తీసుకొస్తోంది
కపాలంలోని రెండు గుంటలు
భూమికేసి అదే పనిగా చూస్తున్నాయ్‌..

ఆ మృతదేహం నుంచి
పురుగుమందు వాసన గుప్పుగుప్పున వస్తోంది..
అపాదమస్తకం తేరిపార చూశా..
పచ్చని పొలం బీడుగా మారిపోయింది
అన్నదాత ఆర్తనాదంతో భూమి దద్దరిల్లింది..
పచ్చని కన్నీరు కారింది...
ధాన్యం పండించే రెండు చేతులు
ఈ లోకం నుంచి నిష్క్రమించాయి..
పొలం మీద పురుగుమందు పనిచేసిందో లేదో తెలీదు
కాని అతని మీద బాగా పనిచేసింది
ఒక అన్నదాత
వెళ్లలేక వెళ్లలేక విడిచి వెళ్లాడు
ఈ పొలాన్ని వదిలి..
ఎడ్లను వదిలి, నాగలిని వదిలి...
మనల్ని వదిలి
పచ్చని కన్నీటిని కారుస్తూ...