కాకినాడ సాహితీస్రవంతి 6వ వార్షికోత్సవం

కాకినాడ సాహితీస్రవంతి 6వ వార్షికోత్సవం ఆగస్టు 11న కాకినాడ సూర్యకళామందిర్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకూ జరిగింది. మొత్తం మూడు విభాగాలుగా జరిగిన ఈ వార్షికోత్సవ ప్రారంభ సదస్సు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యింది. సాహితీస్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గనారా ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో మానవత్వం ఉండాలి కానీ మతతత్వం కాదు అన్నారు. జిల్లా గౌరవాధ్యక్షులు డా|| వుయ్యపు హనుమంతరావు మాట్లాడుతూ సాహిత్య సభలకు పిల్లల్ని కూడా తీసుకురావాలని, భాషా సాహిత్యాల మీద వారికి చిన్నప్పటి నుండీ అభిరుచిని కల్గించాలి అన్నారు.

విశిష్ట అతిధిగా విచ్చేసిన కాకినాడ సత్యా స్కానింగ్‌ సెంటర్‌ అధినేత డా|| కాద వెంకట రమణ మాట్లాడుతూ చిన్న చిన్న పల్లెటూర్లలో ఉండే పిల్లలలోని టాలెంట్స్‌ని కూడా వెలికితీస్తే సాహిత్యం చిరకాలం మనగలుగుతుందని అన్నారు. 

సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు డా|| జోశ్యుల కృష్ణబాబు మాట్లాడుతూ కవులూ, రచయితలూ ప్రతి ఊరిలోనూ

ఉంటారని, కాని వారిలోని మౌలిక శక్తిని వికసింపజేసి, వారిని మరింత మంచి రచయితగా రూపొందించగలిగే సమిష్టి ప్రోత్సాహం మాత్రం అన్నిచోట్లా ఉండదని సాహితీస్రవంతి ఆ పని చేస్తుందని అన్నారు.

సాహితీస్రవంతి కాకినాడ నగర అధ్యక్షులు మార్ని జానకిరామ్‌ చౌదరి ఈ సంవత్సరమంతా నిర్వహించిన సాహితీస్రవంతి కార్యక్రమాల నివేదికను సమర్పించారు. సాహితీస్రవంతి ఏయే ఆశయాలతో ముందుకు వెళుతుందో, ఎవరెవరి సహాయ సహకారాలతో సాగుతోందో వివరించారు.

ఇక ముఖ్య అతిథి, ప్రధాన వక్త, సాహితీస్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఇటు సాహిత్యంలోనూ, అటు సమాజంలోనూ కూడా నేడు కుల, మత, వ్యక్తి, స్వీయ పూజలు పెరిగాయన్నారు. నేటి సమాజం కులాన్ని, మతాన్ని బట్టి నడుస్తోందనే బలమైన భావజాలం ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇటువంటి ధోరణులను కవులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కులతత్వం సంకెళ్ళు తెంచేందుకు సాహిత్యం దోహదపడాల్సిన అవసరం

ఉందన్నారు. మతం పేరుతో జరుగుతున్న ఘర్షణల్ని వివరించారు. ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందంటూ కవులూ, రచయితలూ చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో వ్యక్తిపూజ పెరిగిందని, మతతత్వం లాగే వ్యక్తి పూజ కూడా ప్రమాదకరమైందని ఆయన వివరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిని తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు. మంచి లక్ష్యానికి, మంచి ఆశయానికీ మోకరిల్లితే తప్పులేదని, సింహాసనానికి మోకరిల్లితే శరీరం మలినమవుతుందని అన్నారు. వ్యవస్థలన్నీ తలక్రిందులుగా ఉన్న నేపథ్యంలో కవుల పాత్ర మరింత అవసరమన్నారు. సమాజ హితం కోరే సమిష్టి చర్చ జరగాలన్నారు. తెలుగునాట సంస్కరణ భావాలను ఇంకా ముందుకు తీసుకువెళ్ళేందుకు సాహితీస్రవంతి మరింతగా కృషి జరపాలన్నారు. కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ కాశ్మీర్‌ అభివృద్ధికి 370 ఆటంకమైతే మిగతా రాష్ట్రాలు అభివృద్ధి కాకపోవటానికి ఏ ఆటంకాలున్నాయని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 370 అడ్డమయితే ప్రభుత్వమే ఎందుకు పెట్టుబడులు పెట్టలేదని ప్రశ్నించారు. ఆర్టికల్‌ రద్దు సరికాదనే వారిని దేశ, జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. సత్య ప్రకటనమే సాహిత్యం యొక్క లక్ష్యమని నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత సీనియర్‌ కవులకు, రచయితలకు ఉందని అన్నారు.

అనంతరం సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు, సాహిత్య ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ వొరప్రసాద్‌ కాకినాడ సాహితీస్రవంతి 6వ వార్షికోత్సవ కవితా సంపుటి 'సాగర సమీరాలు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సాహితీస్రవంతి రచయితలను ప్రోత్సహించడంలో ముందుంటుందని అన్నారు.

ఈ సదస్సు ప్రారంభంలో గరికపాటి మాష్టారు రాసిన సాహితీస్రవంతి గీతాన్ని మేడిశెట్టి శ్రీరాములు ఆలపించారు. పి.ఆర్‌. ప్రభుత్వ కళాశాల తెలుగు లెక్చరర్‌ సుంకర గోపాల్‌ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. అద్దేపల్లి జ్యోతి వందన సమర్పణ చేశారు. ఇదే సదస్సులో 80 వసంతాలు నిండి, సాహిత్య, సామాజిక సేవలో అవిశ్రాంత మూర్తులుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్య శర్మ గారిని, గరికపాటి మాష్టారిని సాహితీస్రవంతి బృందం సత్కరించింది.

భోజన విరామం అనంతరం రెండవ సదస్సు ప్రారంభమయ్యింది. పసుమర్తి పద్మజా వాణి అతిథుల్ని వేదిక మీదకు ఆహ్వానించారు. సాహితీస్రవంతి కాకినాడ నగర కార్యదర్శి బొల్లోజు బాబా అధ్యక్షత వహించారు. ధనరాజు మాష్టారు రాసిన సాహితీస్రవంతి గేయాన్ని మేడిశెట్టి శ్రీరాములు ఆలపించారు.ఈ రెండవ సదస్సుకు ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ హాజరయ్యి ప్రసంగించారు. ఆత్మీయ అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి సభ్యులు ఐ. వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

బొల్లోజు బాబా మాట్లాడుతూ కవిత్వం జీవితాన్ని ప్రతిబింబించాలన్నారు. 20 వ శతాబ్దం అంతా దోపిడీ ఎక్కడుందో తెలుసుకోవటానికి ప్రయత్నించిందని, 21వ శతాబ్దం అంతా అధికారంల అనేది ఎలా వెర్రితలలు వేస్తుందో తెలియ చెపుతోందని అన్నారు. పాపినేని శివశంకర్‌ కవిత్వానికి పెద్దన్నలాంటి వారని అన్నారు.

శాసనమండలి సభ్యులు ఐ. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ సాహితీ వారసత్వం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉందని, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన పాఠశాల విద్యలో మాతృభాషను తప్పని సరి చేయకపోవటం శోచనీయమని అన్నారు.

ప్రధానవక్త డా|| పాపినేని శివశంకర్‌ 'ఆధునిక కవిత్వంలో ఎదురయ్యే సమస్యలు' అంశంపై ప్రసంగించారు. కుటుంబ నియంత్రణలాగా కవిత్వానికి కూడా నియంత్రణ అవసరం ఉందని అన్నారు. అసలు కవిత్వం ఎందుకు రాస్తున్నారు? కీర్తి కోసమా? ధనం కోసమా? ఒక సామాజిక బాధ్యత అనుకొనా? ఇది తేల్చుకోవాలన్నారు. నువ్వు కొత్తగా ఏదైనా రాస్తున్నావా? కొత్తగా ఏం చెపుతున్నావు? దేన్ని నువ్వు తవ్వుతున్నావు? అన్నది ఆలోచించుకోవాలన్నారు.

కవులు సాహిత్య సభల్లో మాట్లాడే తీరు ఒకలాగ, సాహిత్యానంతర సభల్లో మాట్లాడే తీరు ఒకలాగ ఉండకూడదన్నారు. అవసరమైతే కవి దేన్నైన్నా ఒప్పుకోవాలి. దేన్నైనా తిరస్కరించాలి అన్నారు. అమ్మను వృద్ధాశ్రమంలోకి తోసేవాళ్ళు అమ్మను గూర్చి కవిత్వం రాస్తున్నారన్నారు. ఇక నేటి కవులు ఏది కవిత్వం? ఏది వచనం అన్నది తేల్చుకోవాలన్నారు. కవిత్వంలో ఉత్తమమైన ఇమేజరీ ఉండాలి. ఊహ ఉండాలి, ఏదో ఒకటి కొత్తగా ఊహించాలి. ఇటీవల కొత్త కవులు కొత్త ఇమేజరీలను ప్రయోగించే హడావుడిలో కవిత్వంలో క్లారిటీని, స్పష్టతను కోల్పోతున్నారన్నారు. దానిని కొంచెం సరిచేసుకోవాలన్నారు. డాక్టర్‌ వి. ఎజ్రాశాస్త్రి వందన సమర్పణతో రెండవ సదస్సు ముగిసింది.

సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కవిసమ్మే ళన సదస్సుకు ఉభయ గోదావరి జిల్లాల నుండే కాక సుదూరాల నుండి 80 మంది కవులు హాజరయ్యారు. ఈ సదస్సుకు అధ్యక్షులుగా ప్రముఖ కవి, కథకులు శ్రీకంఠస్ఫూర్తి వ్యవహరించారు. సమన్వయ కర్తలుగా ఇందిర, ఎన్‌.వి. పద్మావతి వ్యవహరించారు. కె. శివ కవుల్ని వేదికపైకి ఆహ్వానించగా సలాది సాయి సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.

- డా. జోశ్యుల కృష్ణబాబు