మాయాబిళ రహస్య ఛేదన

డా|| ఎ. రవీంద్ర బాబు
9394489263
 
పాపినేని శివశంకర్‌... కవి, కథకులు, విమర్శకులు, పరిశోధకులు. వారు రాసిన కథే మాయాబిళ రహస్యం. ఈ కథ గురించి కొన్ని సంగతులు..చాలా మందికి తెలిసినవే.. అయినా...
రాజ్యంలో భూములు రాజుకు, ప్రధాన మంత్రికి తెలిసే మాయమవుతుంటాయి... వాళ్లే మహామాయావితో కుమ్మక్కై ఈ దారుణాన్ని చేస్తుంటారు. 
ఆ భూముల్నించి పేదలు వలసలు పోతుంటారు. సహాయ మంత్రి కుమారశేనుడు దీని గురించి ఆలోచన చేసి మొదట మాంత్రికుడు సింగప్పతో ఆ భూమాయావిని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సింగప్పనే ఆ మాయావి సిసాలో బంధిస్తాడు. కుమారశేనుడు స్వయంగా వెళ్లి ఆ మాయావిని బంధించి తెచ్చి రాజుగారి ముందు హాజరు పరుస్తాడు. కాని రాజు అతను చేసేది మంచిపని అని విందు భోజనాలతో సత్కరిస్తాడు. ప్రజల బాధలను స్వయంగా చూసిన కుమారశేనుడు చివరకు వాళ్లతో కలసిపోరాడటానికి సిద్ధమౌతాడు. స్థూలంగా కథలోని వస్తువు ఇది.

రచయిత మ్యాజిక్‌ రియలిజం కథనాన్ని ఎంచుకున్నప్పటికీ వస్తువును పాఠకునికి సులభంగానే చేరువ చేశారు. పురా గాధలు, జానపద గాధలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి కథను నడపడమే మ్యాజిక్‌ రియలిజం అని స్థూలంగా చెప్పొచ్చు. దాన్ని కథలో రచయిత సంపూర్ణంగా సాధించారు. సెజ్‌ల వల్ల భూమిని కోల్పోతున్న బాధితుల గురించి రాసిందీ కథ. అయితే రచయిత మ్యాజిక్‌ రియలిజం శిల్పంతో చెప్పిన విధానం గొప్పది. ఆ శిల్పాన్ని, వస్తువును, వాటి సంబంధాన్ని పరిశీలించడమే ఈ వ్యాసంలో గమనించవచ్చు. ఉన్నట్టుండి భూములు మాయం గావటమేమిటి? బొత్తిగా అర్థం లేని మాట విసుక్కున్నాడు కుర్రమంత్రి కుమార సేనుడు అని కథను ప్రారంభిస్తారు శివశంకర్‌. అందువల్ల చాలా కథల్లాగే ఈ కథలో కూడా వస్తువు భూమి గురించే అని ఎత్తుగడలోనే తెలుస్తుంది. అట్లానే ఎలా మాయం అవుతున్నాయన్న సందేహం మనసుల్లోకి సూటిగా వెళ్తుంది. కథాశిల్పంలో ఇదో మంచి ఎత్తుగడ..ఇది పాఠకుల్లో కథపట్ల ఆసక్తిని  కలిగిస్తుంది. రాత్రి రెండో జాము.. కాగడాల వెలుతుర్లో కుమారసేనుడు వేగుల వాళ్లతో మాట్లాడుతున్నాడు అనే ఈ వాక్యాలు ప్రారంభంలో ఉండటం వల్ల చీకట్లో చిరుదివ్వెలాగా కథా గమనాన్ని ముందే సూచించడం జరిగింది. కాగాడా వెలుగు పదబంధం కథా ముగింపును తెలపడాన్ని గమనించవచ్చు. ఇదీ ఓ రకమైన టెక్నిక్నే..ప్రాచీన కావ్యాలలో ఇలాంటివి చాలా చూస్తాం. ఉదాహరణకు భారతంలో శకుంతల దుష్యంతుల కథా వర్ణనలు.

 

కథలో భూ ప్రస్తావనలో మొత్తం రాజ్యంలో నూటయాభై మండలాలున్నాయి. వాటిల్లో 32 మండలాల లెక్కలు తారుమారు ఉన్నట్లు కుమారసేనుడు గుర్తిస్తాడు. కానీ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 109 సెజ్‌లుండగా.. పనిని ప్రారంభించినవి 36 మాత్రమే ఇక కథలో మాయమైన భూమి గురించి చెప్తూ...కనీసపు తేడా 500 ఎకరాలు కాగా గరిష్ఠ భేదం 5000 ఏకరాలుంది అంటాడు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఎకరాలకు పైగానే సెజ్‌లకు అప్పగించింది. బహుశా రచయిత ఈ లెక్కల్ని కచ్చితంగా ఇవ్వకపోవడానికి కారణం.. సాహిత్యం ఎప్పుడూ వాస్తవ ప్రపంచానికి కాల్పనికి స్వరూపమే. దీని గురించి రచయితకు తెలీదని అనుకోను. ఎందుకంటే ఆయన సిద్ధాంత గ్రంధంలో ఎక్కువ భాగం ఈ చర్చే.

రెండో భాగం మొదట కుమారసేనుడు ఇంత వింత మరియు విశేషం మరియు విచిత్రం మరియు విపరీతం నా ఇరవై తొమ్మిదేళ్ల జీవితంలో చూడలేదు. మహామంత్రీ! అంటాడు ఈ మరియు పదం అన్ని సార్లు పునరావృతం చేయటం వెనుక ఓ వైపు ఇరవై తొమ్మిదేళ్ల కుమారసేనుడి ఆవేశాన్ని చెప్తే...' ఇందులో మరీ అంత 'వింతమరియు' ఏముంది లేవయ్యా....' అన్న మంత్రి మాటల్లో ఇలాంటివి సహజమనే కాదు, భవిష్యత్‌లో మరికొన్ని జరుగుతాయి అన్న సూచన ఉంది. అతని వయసును, అనుభవరాహిత్యాన్ని ఎత్తిచూపడంలో మంత్రి ఎగతాలి చెయ్యడమూ ఉంది. అంతే కాదు మన రాష్ట్ర భవిష్యత్‌ చిత్రమూ దాగి ఉంది. ఇంకా భౌతిక పరిణామాల వెనుక భౌతిక కారణాలే ఉంటాయి గదా! అనే కుమారసేనుడి మాటలో రచయిత వాస్తవికతను అర్థం చేసుకున్న విధానాన్ని చారిత్రక భౌతికవాద దృక్కోణంతో చూడాలి. కుమారసేనుడి ఉత్సాహాన్ని గమనించిన అంధకరాజు నవ్వు, అసలు సంగతులేవీ అతనితో ముచ్చటించలేదు కదా!. వాళ్లకవి, మనకివి అని మహామంత్రి అనడం వెనుక రాజు మంత్రి, శత్రువులతో కలిసి ప్రజల భూముల్ని దోచుకోడానికి పన్నిన కుట్రగా భూములు మాయమవటాన్ని కథలో అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో 2005లో సెజ్‌ పేరిట చట్టం అమల్లోకి వచ్చింది. ఒకవైపు ప్రభుత్వం, ఇంకోవైపు కంపెనీలు.. ప్రజల భూముల్ని దోచుకునే చట్టం ఇది. గతించిన ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి హాయాంలో జరిగిన భూపందేర తంతును కళ్లముందు నిలుపుతాయి పై వాక్యాలు.
ఇక మాయా మాంత్రికుడు సింగప్ప విషయానికి వస్తే... భూకేటాయింపుల మీద ప్రభుత్వం వేసిన కమిటీ గుర్తుకు వస్తుంది. మాంత్రికుడు చేసే పూజావిధానం, మంత్రాలు.. అన్నీ మ్యాజిక్‌ రియలిజంలో భాగమే. కానీ చివరకు మాయా మాంత్రికుడి ఎదుట ప్రత్యక్షమైన మహాకాయుడు సింగప్పనే సీసాలో బంధించడం వెనుక భూకేటాయింపుల కమిటీ ఏమీ నిజనిర్ధారణ చేయలేదన్న వాస్తవం వ్యక్తమౌతుంది. కానీ భౌతికవాది అయిన కుమారసేనుడికి ఇలాంటి వాటిపై నమ్మకం లేదని రచయిత గుర్తు చేస్తూనే ఉంటాడు.
అందువల్లే రచయిత ఎక్కడా తను చెప్పదలచుకున్న అంశాన్ని వీడలేదని చెప్పొచ్చు. మహాకాయుడు ప్రత్యక్షమైన సింగప్పతో... ఒరే ఎవడురా నువ్వు! మా దత్త మండలానికి వచ్చి నీ కేకల్తో, ఈ పొగల్తో మా అభివృద్ధి పనికి భంగం కల్గిస్తున్నావు అంటాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం దత్తమండలం అనే పద ప్రయోగం, మా అభివృద్ధి అన్న పదం, అంటే భూమిని దత్తత తీసుకున్న సెజ్‌ కంపెనీల వాళ్ల అభివృద్ధి అని స్పష్టం అవుతోంది.
రెండో భాగంలో కుమారసేనుడి స్వభావాన్ని, ఆలోచనా విధానాన్ని చెప్పిన రచయిత, నాలుగో భాగంలో ఆ పాత్ర పనిని తన కథా వస్తువు పరిధిని విస్తృత పరచడానికి వాడుకున్నాడు. పాడిపంటల రంగంలో గోక్షీరం లోతుపాతులూ చూసుకోరాదూ... అని మహామంత్రితో కుమారసేనుడి సహమంత్రి పదవి పరిధిని చెప్పిస్తాడు. వెంటనే అవన్నీ భూమిపై ఆధారపడి ఉన్నవే అని సెజ్‌ల వల్ల కలిగే నష్టాన్ని సంపూర్ణంగా తెలియజేస్తాడు సూరసేనుడి మాటల్లో...
ఐదో భాగంలో భూములు మాయమయ్యే రహస్యాన్ని ఛేదించడానికి కుమారసేనుడు, ఉపసేనాపతి వీరమల్లుడుతో బయలు దేరుతాడు. 32 ప్రదేశాల్లోని బిలరహస్యాలను పరిశీలిస్తాడు. ఆ సంక్షోభ ప్రాంతాలన్నీ నదీ సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, కొండల్లో ఉంటాయి. సస్యశ్యామలమైన పొలాలు మొదలు మానవ నివాసాలు, నిర్జన పర్వతారణ్యాల దాకా ఉన్నాయి. అక్కడి ప్రజలు సెజ్‌ల వల్ల 'పిల్లా మేక, గొడ్డూగోద, తట్టాబుట్టా- అన్నీ వెంటబెట్టుకొని కదలిపోతున్నారు. ఊళ్లకి ఊళ్లే ఖాళీ అవుతున్నాయి. అవన్నీ బలవంతపు వలసలు గానే అన్పించాయి' అని అక్కడి సెజ్‌ల భూ స్వరూపాన్ని, వలసల వెనుక రహస్యాన్ని విప్పుతారు రచయిత.
రాజ్యాంగం ప్రకారం స్థానిక వనరులపై హక్కు అక్కడ నివసించే ప్రజలదే...51వ అధికరణం వినియోగంలో లేని భూమి, లేదా ఒక పంట పండే పొలాన్ని మాత్రమే సేకరించాలన్నది కేంద్ర ప్రభుత్వ సూచన కానీ అది ఎప్పుడో తుంగలో తొక్కబడిన విషయం రచయితకు సంపూర్ణంగా తెలుసని మనకు అర్థమౌతుంది. పై వాక్యాలే అందుకు బలమైన సాక్షీ భూతాలు. కుమారసేనుడు, వీరమల్లుడు తూర్పు కైవార రేఖ దగ్గరున్న బిలానికి చేరుకుంటారు.. అంటే రచయిత దృష్టిలో కృష్ణపట్నం లేదా కాకినాడ కావచ్చని నా ఊహ.. అక్కడే 50వేల ఎకరాలకు పైగా ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించింది. కథలో 2వేల ఎకరాలు ఈ ఐదో భాగంలోనే రచయిత కథా వస్తువు ముడిని కూడా విప్పాడు. ఇదో కథాశిల్ప రహస్యం. నేరుగా పాఠకులకు విషయాన్ని చెప్పేశారు. మహాబిలం 'లోపల నుంచి రెండు రకాల శబ్దాలు మాత్రం వినపడుతున్నాయి. స్‌...స్‌...స్‌. అంటూ ఒక శబ్దం. కాసేపటికి జ్‌...జె...జె... అని మరొక శబ్దం రెంటిని కలిపితే స్‌ ప్లెస్‌ జ్‌. అంటే సెజ్‌... రచయిత కథలో సెజ్‌ల పేరుతో ప్రభుత్వం ప్రజల భూమిని ఎలా లాక్కుంటుందో చెప్పదలచుకున్నాడని తెలిసిపోతుంది. కవిత్వంలో ఓ టెక్నిక్‌ ఉంది. అదే భావచిత్రం. కవిత మొత్తంలో ఎక్కడో ఒక చోట కవి ఏమేమి చెప్తున్నాడో అర్థం చేసుకోడానికి ఓ క్లూ ఇస్తాడు. ఆ టెక్నిక్‌నే ఈ కథలో ఉపయోగించాడు. కవిత్వ రహస్యాలు తెలిసిన రచయిత. కథ రహస్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోడానికి ఈ క్లూనే ఉపకరిస్తుంది. సామాన్య పాఠకుడ్నీ ఆలోచించేటట్టు చేస్తుంది.
సెజ్‌ల మహాకృత రూపాన్ని వర్ణిస్తూ... అది మనిషీ కాదు, రాక్షసీ కాదు, రెండూ కలిసిన భీకరాకారం... దానికొక్కటే కన్ను, నాలుగు కబంధ హస్తాలు అంటారు. దీనిలో ఒకటే కన్ను ప్రపంచీకరణలో ప్రపంచమంతా ఒకటే అన్న భావనలోని లోపాన్ని, జానపదకథల్లోని ఒంటి కన్ను రాక్షసి రెండు భావనలు దాగి ఉన్నాయి. ఒకటి వస్తువు, రెండోది శిల్పం. నాలుగు కబంధ హస్తాలు నాలుగు దిక్కులకు ప్రతీక. అందుకే నాలుగు దిక్కుల్లోని పంటచేలని, పశుపక్ష్యాదుల్ని, ఖనిజాల్ని ఆబగా తన గుహలాంటి నోటితో మింగేస్తున్నారు అని చెప్పేస్తాడు ఎటువంటి సంక్లిష్టతలకు తావివ్వకుండా రచయిత. వాడికి భోజన పరాక్రమం ఉన్నంతగా యుద్ధ పరాక్రమం లేదు అని వాడటంలోని అంతర్యాన్ని అర్థం చేసుకోవడంలో... అర్థిక మండళ్ల వెనుక వ్యాపారదృష్టే కాని యుద్ధదృష్టి లేదనేది రచయిత ఉద్దేశం కావచ్చు. కానీ ఇదంతా ఓ మేధోపరమైన యుద్ధం. భౌతిక యుద్ధం కన్నా చాలా ప్రమాదకరమైనది అనే విషయాన్ని మరవకూడదు. ఆరో భాగం చివర్లో కుమారశేనుడికి, వీరమల్లుడికి జరిగే సంభాషణలో మనిషికి గుప్పెడు మెతుకులు సరిపోతాయి. ఒక్క ప్రాణికి ప్రపంచమంతా దిగమింగే అంతటి ఆకలి ఎందుకు? అనడంలో ఇప్పటి ప్రపంచీకరణ స్వభావాన్ని, అగ్రరాజ్య ఎత్తుగడలను ఎత్తిచూపడమే అవుతుంది.
ఏడో భాగంలో కుమారసేనుడు రాజు ఎదుట మహారాక్షసుడ్ని ప్రవేశపెట్టి... వీళ్ల ఆకలి సామాన్యమైంది కాదు. గనులు, వనులు, పంటపొలాలు- ఏవీ మిగలడం లేదు... లక్షల మందికి దక్కాల్సిన సంపదంతా ఎవడో ఒక రాక్షసుడు అప్పనంగా భోంచేయటం సాంఘిక న్యాయానికే కాదు, ప్రకృతి న్యాయానికి కూడా విరుద్ధం కాదా? అని రాజును ప్రశ్నిస్తాడు. 'అప్పనంగా' అన్న ఒక్క పదం చాలు ఈ సెజ్‌ల పట్ల కవికిగల దృక్పథం తెలుసుకోడానికి. అతనికి వాటి పై ఎంత వ్యతిరేకత ఉందో... ప్రజల పట్ల ఎంత మమకారం ఉందో..
రాజు ఎదురుగా ఉన్న మహాకాయుల్ని చూసి... వాళ్లు మొదట మా సన్నిధికి వచ్చినప్పుడు మీలాగే గాలికి పడిపొయ్యేట్టున్నారు. ఇప్పుడు చూడండి. ఎంతెంత దృఢకాయులుగా తయారయ్యారో?.. వారి అభివృద్ధే మన అభివృద్ధి... ప్రపంచం దినదినానికి మరింతగా విస్తరిస్తున్నది. అంటాడు. వారికి విముక్తి కలిగించి, తిండి పెట్టి, సకల రాచమర్యాదలతో సాగనంపాలి అంటాడు. దీని వెనుక సెజ్‌లపై, విదేశీ విధానాలపై, ప్రపంచీకరణ నేపథ్యంలో ఐ.ఎం.ఎఫ్‌, అగ్రరాజ్యాల కాళ్లకు మడుగులొత్తే రాష్ట్ర స్వభావాన్ని తేటతెల్లం చేసేశాడు రచయిత పాపినేని శివశంకర్‌.
ఐతే ముగింపు ఆశావాద దృక్పథంతో ఉండాలని కుమారశేషుడు ఆవాసం కోల్పోయిన వారితో కలిసి పోరాడటానికి సిద్ధమయ్యాడు అని రాస్తారు. మీ వాడిగా వచ్చాను - కలిసి పోరాడగా నిల్చినాను అనే వాక్యాల ద్వారా చూపుతారు. దీనిని సీనీయాటిక్‌ ముగింపుగా చెప్పొచ్చు.
రచయిత అనుభవం ఉన్న కథకుడు కావడంతో మ్యాజిక్‌ రియలిజాన్ని చక్కగా పోషించాడు. రాక్షసుడ్ని బంధించడం, మాంత్రికుడు సింగప్ప పూజలు చేయడం వంటి వర్ణనలు ఈ కథనంతో సరితూగాయి. ప్రారంభంలో భూమి మాయమవడం.. చివరకు ఆ భూమికోసం పోరాటానికి ప్రధాన పాత్ర సిద్ధమవటం... లాంటి ఎత్తుగడ, ముగింపుల సంబంధాలు రచయిత శిల్పదృష్టికి నిదర్శనం. కథను ఎనిమిది భాగాలు చేసినా మొదటి రెండు భాగాలు రెండు రెండు భాగాలుగా విభజించే అవకాశం ఉంది. బహుశా కథ కావడంతో క్లుప్తత పాటించాడేమో... సన్నివేశాలు, సంఘటనలు పరిపూర్ణంగా కథానిడివిలో కలిసిపోయాయి. 
పాత్రల పేర్లు రచయిత ఎన్నుకున్న రాజుల కథా నేపథ్యాన్ని ముందుకు నడిపాయి. వాటి ప్రవర్తనా రీతికి, దృక్పథానికి ప్రతీకలుగా నిలిచాయి. రాజ్యాన్నే అంధక రాజ్యంగా చెప్పడం, రాజు-బంధక మహారాజు, కథానాయకుడు-కుమారశేషుడు, సేనాపతి- వీరమల్లుడు, కానీ మంత్రి పేరు సుమంత్రుడు అని పెట్టడంలో విశేషం ఏమిటో..!! అతనిదీ రాజు స్వభావమే... కానీ కుమారశేషుడి ప్రయత్నాలకి మాత్రం అడ్డుచెప్పని తత్వం. ప్రధమ పురుషలో కథనాన్ని నడిపే రచయిత అంతా తానుగా వ్యవహరించారు. అయినా మ్యాజిక్‌ రియలిజయంలో కథను అద్దంలో కాకుండా హృదయంపై ఆవిష్కరించారు.
పాత్రోచిత భాష కొన్నిచోట్ల పలికించడానికి ప్రయత్నించి.. మరికొన్ని చోట్ల రచయిత వదిలేశారు. సహజంగా జానపద పాత్రలు కొంత గ్రాంథిక వాసనల భాషలో మాట్లాడతాయి. కుమారశేషుడి పాత్రతో వ్యవహారికాన్ని పలికించి ఓ చోట మాత్రం... ప్రజలతో ఏమి నేరము చేసినారు మిమ్ము ఎవరిట్లు శిక్షించినారు అంటాడు.  ఆ ఊరి ప్రజల భాష నేరుగా ఉండటం ఉచితమే కావచ్చు. కానీ ఒకే పాత్రచే రెండు రకాల భాషను మాట్లాడటం సముచితమా... బహుశా రచయిత ఏదన్నా ఉద్దేశంతో పలికించారేమో... ఆలోచించాలి. అయినా..''పిల్లవానికేం తెలుసు ఉండేలు దెబ్బ?, రాజుల నవ్వులకు అర్థాలే వేరు, అడవిలో తినడానికి కాస్తంత బలుసాకు తీసుకెళ్లు, దిగితే కదా లోతు తెలిసేది.'' వంటి తెలుగు పలుకుబడులు కథలో కలిసిపోయి కథకు తెలుగు అందాన్ని తెచ్చాయి. ఆరో భాగంలో వీరమల్లుడి పేరు వీరసేనుడుగా ఉంది. ఇది ముద్రణ తప్పిదం కావచ్చు. ''భీకర సౌందర్యం'' పదప్రయోగం చేసి సౌందర్యం భీకరంగా ఉండదు అని చెప్పిన పాపినేని శివశంకర్‌కు ఈస్థటిక్స్‌పై కూడా పట్టు ఉంది. సంబంధిత పదజాలం పై కూడా సంపూర్ణ అవగాహన ఉంది. సెజ్‌లపై చాలా కథలు వచ్చాయి. సెజ్‌లను ప్రత్యక్షంగా పరిశీలించి, అక్కడి ప్రజలతో మమేకమై అనుభవాలను కథలుగా రాసిన వాళ్లూ ఉన్నారు. వాటిలో చాలా ఉత్తమ కథలుగా ఎన్న దగినవే... కానీ కథకు వస్తువు ఎంత ముఖ్యమో, శిల్పమూ అంతే ముఖ్యం. అవి రచనకు రెండు కళ్లు. చదివే వారికి చూపునిచ్చేవి. ఈ కథలో జమిలిగా అవి కలిసిపోయాయి. అందుకే ఈ కథను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
మొత్తం మీద మాయాబిళ రహస్యం కథ పేరుకు తగ్గట్టు ఓ జానపద చిత్రాన్ని చూసిన అనుభూతి ఇస్తుంది. వస్తువు శిల్పంతో కలిసిపోయి పాఠకుడ్ని ఆకట్టుకుంటుంది. రచయిత ఎప్పుడూ ఒక రచనను ఈ రూపంలో రాయాలి అని నిర్ణయించుకోడు. తనలో కలిగిన భావావేశమే రూపాన్ని ఎంచుకుంటుంది. ఈ కథలో కూడా వస్తువే కథనశిల్పాన్ని రూపొందించుకుంది. అందుకే సామాన్యులకు అంతుచిక్కని ప్రపంచీకరణ స్వభావాన్ని, సెజ్‌ల గుట్టును, ప్రభుత్వ లోగుట్టును చిక్కని శిల్పంతో బయటపెట్టింది. కథలో రచయితే చెప్పినట్టు దుర్భిణిలో చూపెట్టింది.