జారుడు బల్ల

డి.కల్యాణ్‌ దేవ్‌

[email protected]
జారిపోవడం హాయిగానే ఉంటుంది
చిన్న పిల్లలు జారుడు బల్ల మీంచి
జారినట్టు జారిపోతుంటే బాగానే ఉంటుంది
ఆ జారడం మళ్లీ పైకి లేవడం కోసమైతే
జారిపోవడం ఆహ్లాదంగా ఉంటుంది!
జాగురత లోపించినప్పుడూ
జాగ్రత్త వొద్దనుకున్నప్పుడూ
జారిపోవడం సహజంగానే జరిగిపోతుంది!
జారటమే హాయనుకుంటే మాత్రం
అదొక జాఢ్యంలా దాపురిస్తుంది
జారటాన్ని జారుగా అనుభవిస్తుంటే
అది తిరిగిరానివ్వని ఊబి దాకా దారి తీస్తుంది!

నువ్వు నీలో లేక జారిపోతున్నావా?
నువ్వు నీలా ఉంటూనే జారిపోతున్నావా?
జారిపోవడంలో జాలిచూపులు వెతుక్కుంటున్నావా?
మనిషిగా నిన్ను నువ్వు జార్చుకోవడమే
నిన్ను అమితానందపెడుతుందీ అంటే
నిన్ను నువ్వు చేజార్చుకుంటున్నట్టే లెక్క!

జారిపోవడం బహుశా హాయిగానే ఉంటుంది
నీవైనవి అన్నీ నిన్ను వదిలిపోయినప్పుడు
జారిపోయే ఆట నిన్నెప్పుడూ కలవరపెడుతూనే ఉంటుంది
జారిపోవడం సరే గానీ,
దిగజారిపోవడం ఎప్పటికీ మానని గాయం అవుతుంది
తెలిసి తెలిసి జారిపోవడం
జారి జారి మురిసిపోవడం
నిన్ను నెమ్మది నెమ్మదిగా అంతర్ధానం చేస్తుంది
జారిపోతున్నప్పుడు నిన్ను నువ్వు వదిలేసుకుంటే
ఏ తీరానికైనా జారిపోవొచ్చు!
మళ్లీ నువ్వు నువ్వే కానంతగా దిగజారిపోవొచ్చు!
నీ నుంచి నువ్వు పారిపోయాక
నిన్ను నువ్వే గుర్తు పట్టలేనంతగా మారిపోయాక
బహుశా యథాస్థానాన్ని ఎప్పటికీ చేరుకోలేవు
నాలోని నీ పీఠాన్ని మళ్లీ ఎన్నటికీ అందుకోలేవు!