కవులు సమస్యల మూలాల్లోకి చొచ్చుకెళ్లి రాయాలి!

మాడభూషి సంపత్‌ కుమార్‌

ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం సంచాలకులు
''తెలుగు వెలుగులను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశం మొత్తంకూడా నింపాలనే దీక్షతోనే ఇక్కడ నేను, నా బృందం కతనిశ్చయులమై ఉన అన్నారు ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం సంచాలకులు, విశ్రాంత ఆచార్యులు మాడభూషి సంపత్‌కుమార్‌. కవి, రచయిత డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య 'సాహిత్య ప్రస్థానం' తరఫున ఆయనతో ముచ్చటించారు. ఆ ముఖా-ముఖి ఇదీ...
మొదటగా మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి ...

నేను చిత్తూరుకు 25 కిలోమీటర్లు, తిరుపతికి 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీరంగరాజపురం మండలంలో దేవళంపేట దగ్గర కమ్మపల్లె అనే ప్రాంతంలో 17-9-1959లో ఒక పేద కుటుంబంలో జన్మించాను. మా నాన్న శ్రీనివాసాచార్యులు, అమ్మ పట్టమ్మ. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. ప్రాధమిక విద్యాభ్యాసం కోసం ఒక పల్లె దాటి వెళ్ళేవాడిని. హైస్కూలు కూడా పక్కనే ఉన్న కొత్తమిట్ట పల్లెలో చదివాను. చిన్నప్పటినుండి ప్రాచీన సాహిత్యం అంటే బాగా ఇష్టం. శ్రీశ్రీ మహాప్రస్థానం హైస్కూల్లోనే కంఠతా పట్టి వాళ్ళకు చెప్పడం చూసిన తోటి విద్యార్థులంతా ఆశ్చర్యపడేవారు. ఇంటర్మీడియేట్‌ చిత్తూరులో చదివాను. పి.వి.కె.ఎన్‌ కళాశాలలో బి.కాం చదివాను. ఆ తరువాత మదరాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ., ఎం.ఫిల్‌ చేశాను. ఆ తరువాత మదురై కామరాజు విశ్వవిద్యాలయంలో 1987లో చేరి 'ఎరుకల భాషకు వర్ణాత్మక వ్యాకరణం' అనే అంశంపై 1990లో పిహెచ్‌.డి పట్టా పొందాను. మదరాసు విశ్వవిద్యాలయంలోనే డి.లిట్‌ కూడా పొందాను.
మీకు తెలుగుపై అభిమానం కలగడానికి కారణం?
నాకు చిన్నప్పటిుంచీ తెలుగుభాషమీద అభిమానం ఉంది. మా వూర్లో ఏడాదికొకసారి భారతం మీద నాటకాలు వేసేవారు, హరికథలు చెప్తూ ఉండేవారు. నాకు ఇవన్నీ చాలా ఆసక్తిగా ఉండేది. చిన్నప్పుడు గ్రంధాలయంలో బాలల రామాయణం, భారతం మొదలైనవన్నీ చదివేవాడిని. వార్తాపత్రికలకు ఫ్రీలాన్సర్‌గా పనిచేసేవాడిని. మా తల్లి గారు మోక్షగుండ రామాయణం పారాయణం చేస్తూ ఊరిలోని వారికి చెప్తూఉండేది. ఇవన్నీ మనసుకు బాగా పట్టుకున్నాయి. హైస్కూల్లో ఉపాధ్యాయులు తరగతిలో పద్యాలు చెప్పినప్పుడు నాకున్న ఆసక్తి వల్ల ఒకసారి వినగానే కంఠస్తం వచ్చేసేది. చదివింది కామర్సు అయినా, గురజాడ, శ్రీశ్రీ ఎక్కువగా ప్రభావం చూపడం వల్ల, నా మనసులో కవిత్వం కూడా సమాంతరంగా ప్రవహిస్తూ ఉండేది. అందువల్లనే మదరాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగులో చేరాను.
ఆచార్య జి.వి.ఎస్‌.ఆర్‌.కష్ణమూర్తిగారితో మీ అనుబంధం గురించి క్లుప్తంగా చెప్పండి.
నేను ఎం.ఎ చదవడానికి వెళ్ళినప్పుడు 1983 ఆగస్టులో వారిని మొదటిసారి కలిశాను. ఎంతో ప్రేమగా సన్నిహితంగా, స్నేహపూర్వకంగా మాట్లాడేవారు. సందేహాలను తీర్చేవారు. ఆ తర్వాత అక్కడే ఎం.ఫిల్‌ 'ఎరుకల తమిళ భాషల్లో -బంధువాచక పదాలు- సామాజిక భాషాశాస్త్ర అధ్యయనం' అనే అంశం మీద పరిశోధన చేశాను. పిహెచ్‌.డి అక్కడే చేయాలని ఉన్నా మదురై కామరాజు విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనం వస్తుందన్న ఉద్దేశంతో అక్కడికి మారాను. 1990లో మళ్ళీ నాకు మౌఖిక పరీక్ష నిర్వహించడానికి కృష్ణమూర్తి గారే వచ్చారు. ఆయన నా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన గురువు. ఆ అనుబంధం ఆయన మరణం వరకూ సాగింది.
తెలుగులో డాక్టరేట్‌ చేసిన మీరు పత్రికారంగలో ప్రవేశించడానికి కారణం?
నాకు పత్రికా వ్యాసంగం మొదటినుంచీ ఉండేది. బూదరాజు రాధాకష్ణగారు ఈనాడు పత్రిక వారికి పనిచేస్తున్నప్పుడు, నేను పిహెచ్‌.డి ముగింపుదశలో ఉండగానే వారునన్ను ఈనాడులోకి ఆహ్వానించారు. అలా ప్రారంభమె ౖఈనాడే కాకుండా, ఉదయం, వార్త, మహానగర్‌, మాభూమి, విజేత వంటి పత్రికల్లో పనిచేశాను. కవితలు, అనేక వ్యాసాలు రాశాను.
మదరాసు విశ్వవిద్యాలయంలో ప్రవేశం ఎలాజరిగింది?
ఆ సమయంలో ఆచార్యజి.వి.ఎస్‌.ఆర్‌.కష్ణమూర్తి గారు అక్కడ తెలుగు విభానికి అధిపతిగా ఉన్నారు. నేను హైదరాబాదులో ఉండేవాణ్ణి. ఆయనే అప్లికేషన్‌ నాచేత రాయించి, విశ్వవిద్యాలయం లో ఇచ్చారు. అయితే నాకు ఉద్యోగం ఇస్తానని ఆయన చెప్పలేదు. ఇమ్మనీ నేను అడగలేదు. తరువాత ఇంటర్వూ ్యలో ఎంపికయ్యాను. ఆయన చెప్పిన విధంగా నడవడం వల్ల కెరీర్‌ పరంగానే కాక, విద్యార్ధులతో మెలిగే విధానం వీటివల్ల ఒక మంచి వ్యక్తిత్వం కూడా నాకు ఆయన బోధనల వల్లనే కలిగింది.
మదరాసు విశ్వవిద్యాలయంలో మెరీనా క్యాంపసుకు ఒక తెలుగు ప్రొఫెసర్‌ డైరక్టరుగా వరుసగా మూడుసార్లు ఎంపికవడం వెనుక మీ కషి, ఆవిశేషాలు క్లుప్తంగాచెప్తారా?
అనేక భాషలున్న ఆ క్యాంపసుకు డైరక్టరుగా ఎంపికవడం ఒకమంచి అవకాశం. మదరాసు విశ్వవిద్యాలయ ఆచార్యుల ఫోరం ు నేను సుమారు దశాబ్దంపాటు అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ క్యాంపసుకు అంతవరకూ తెలుగు ఆచార్యుడు డైరక్టరయింది లేదు. నేనే ప్రథమం. నేను పనిచేస్తున్నకాలంలో అందరూ సంతోషంగా ఉండేవారు. ఎవరికి వీసమెత్తు ఇబ్బంది కూడా కలిగించలేదు. అదొక బాధ్యతగా భావించి పనిచేశాను. అందరి ఏకగ్రీవ ప్రతిపాదనతో పదవీ విరమణ వరకూ ఆ క్యాంపసుకు నేనే డైరక్టరుగా ఉన్నాను.
మీరు బ్యాంకాక్‌ అంతర్జాతీయ సదస్సులో 'తెలుగు ఉత్తమ లిపి' అనే ఖ్యాతిని తీసుకువచ్చారు. ఆ వివరాలు చెప్తారా?
తెలుగు సహజంగానే ఉత్తమ లిపి. నేను చెప్పినందువల్ల కాలేదు. కాకపోతే అన్ని భాషలవాళ్ళు ఆవిషయాన్ని గుర్తించే విధంగా మాత్రమే నేను కషిచేశాను, అంతే! అక్కడ అన్ని భాషల పండితులు వచ్చి వాళ్ళవాళ్ళ లిపుల ఆవిర్భావం, గొప్పదనం గురించి చెప్పారు. నేను తెలుగు భాష గురించి చెప్పినప్పుడు మిగతా ఏ భాషకు లేని సౌకర్యం, ప్రాశస్త్యం మన భాషకు ఎలా ఉందో వివరించాను. ఆ రచనా సౌలభ్యం దేవనాగర లిపికి గానీ ఆంగ్లానికి గానీ లేదు. వాళ్ళతో జరిగిన చర్చ, వాదనల్లో ఆంగ్లం బాగా వెనుకబడ్డ లిపి అని నిరూపించాను. ఆంగ్ల పండితులు ఎక్కువసంఖ్యలో పాల్గొని బాగా వాదన చేసిన సమయంలో, నేను ఆంగ్లలిపిలో ఉన్న లోపాలన్నీ వరుసగా ఎత్తి చూపాను. ఆంగ్లలిపిలో ఇన్ని లోపాలున్న విషయం వాళ్ళకే తెలియకపోవడం వల్ల దిగ్భ్రాంతికి గురయ్యారు. తరువాత వారే హర్షామోదం వెలిబుచ్చి, అంగీకరించారు. బలవంతంగా ఒక దేశభాషను ఇంకోదేశం మీద రుద్దినంత మాత్రాన అది గొప్పభాష అవదు. లిపిలోను, మాట్లాడడంలోను, వ్యక్తీకరణలో సర్వ సౌలభ్యత ఉండడం భాషకు అత్యంత ముఖ్యమని ససాక్ష్యాలతో వాదించి నిరూపించాను. తెలుగుభాష అన్నిభాషల కన్నా సహజంగానే ఉత్తమలిపి అని విశ్వవ్యాప్తంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు.
మీ రచనల గురించి చెప్తారా?
ఎక్కువగా వచన కవిత్వమే రాశాను. జీవితం- కవిత్వం, శత్రువుతో ప్రయాణం, ఆలోచనలు, చివరకు నువ్వే గెలుస్తావు, మూడో మనిషి, వికారి, మొదటి అబద్ధం వంటి వచనకవిత సంపుటాలు వెలువరించాను. ఐదారు పుస్తకాలు అనువాదాలు చేశాను. వ్యాసాలు, విమర్శనాత్మక సమీక్షలు చాలా రాశాను.
'జీవితం-కవిత్వం'లోని 'జీవితానికి పోరాటం తప్పదు. జీవితమొక ఆకాశం/ కవిత్వమొక సముద్రం. అందుకోనూ లేం/ ఈదనూ లేం' అన్న మాటల వెనుక మీ జీవిత పోరాటం ఉందా?
ఈ మాటలు ఎవరి జీవితానికైనా వర్తిస్తాయి. జీవితంలో సాధించాలి అనే లక్ష్యం ఉన్న వ్యక్తులకు జీవితం పోరాటమే కదా! జీవితం ఆకాశం లాంటిది అంటే ఎవ్వరూ ఆకాశాన్ని అందుకోలేరు. అలాగే అది సముద్రం వంటిది. దాన్ని ఈదడం కూడా సులభసాధ్యం కాదు. జీవితంలో ఎంత సాధించినా ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. ఎవరైనా నా జీవితం పరిపూర్ణం అన్నారంటే వాళ్ళు ఎక్కడో ఒక బిందువు వద్ద సంతప్తి చెందారని అనుకోవాలి. అలా జీవితాన్ని కవిత్వాన్ని భిన్న కోణాల్లో చూపాను.
స్త్రీవాదాన్ని మీ కవిత్వంలో బాగా సమర్ధించినట్టున్నారు?
నిజమే! పురుషులు ఎన్నివిధాలుగా చెప్పుకున్నప్పటికి, పిల్లలకు జన్మనివ్వడం అనేది స్త్రీలు మాత్రమే చేయగలిగిన పని. అందువల్ల అంత గొప్పదనం ఉన్న స్త్రీలను అణగదొక్కడం అనేది సమర్ధించ దగిన విషయం కాదు. స్త్రీకి సహజంగా ప్రకతిపరంగా ఉన్న కొన్ని బలహీనతలను ఆధారం చేసుకుని అణగదొక్కితే ప్రకతి ఎప్పుడైనా తిరగబడవచ్చు. వక్షాలను అదే పనిగా నరికివేస్తుంటే ఒకరోజు మన వినాశనానికి దారితీసినట్లే, స్త్రీలను కూడా అణగదొక్కాలని యత్నిస్తే మానవజాతి వినాశనానికి దారితీసే పరిస్థితి రావచ్చు. కాబట్టి కవిత్వం కూడా స్త్రీ-పురుష అసమానత్వాలను తొలగించే విధంగా ఉండాలన్నదే నా ఉద్దేశం.
శత్రువుతో ప్రయాణం కవితాసంపుటిలో 'దళితవాద కవిత్వం' కూడా ఉంది. మీ దళితస్పహకు కారణం?
చెప్పాలంటే నాకు పెద్దయ్యే వరకూ ఈ దళితులు, అంటరానితనం గురించి ఏమీ తెలియదు. నా చిన్నతనంలో విద్యార్థులమంతా కలిసిమెలిసి తిరిగేవాళ్ళం. ఒకరి పల్లెకు మరొక పల్లెవాళ్ళు రావడం, వరసలు పెట్టి పిల్చుకోవడం ఉండేది. వాళ్ళు దళితులు అనే స్పహ నాకు ఏమాత్రం లేదు. అంటరాని తనం ఉన్నదనే విషయం కూడా తెలియకుండా ఆ పల్లెల్లో పెరిగినవాణ్ణి. పాఠశాలలో నాకు అటూ ఇటూ బల్లపై కూర్చున్న వాళ్ళు దళిత విద్యార్ధులన్న స్ప హ నాకు ఏమాత్రం లేదు. వాళ్ళతో కలిసి ఆడుకుంటూ పెరిగినవాణ్ణి. మేము మా పాఠశాలకు వారి పల్లెదారి గుండానే వెళ్ళేవాళ్ళం. నేను నా జీవితంలో ఎప్పుడూ అంటరాని తనాన్ని పాటించింది లేదు. ప్రపంచంలో ఉన్న ఈ దుర్మార్గాలను చూసి నా కవిత్వంలో ఎండగట్టడానికి ప్రయత్నిం చాను.
కవిత్వం ఎలా ఉండాలంటారు?
కవిత్వాన్ని నిర్వచించడం లేకపోతే ఎలా ఉండాలో చెప్పడమన్నది అంత సామాన్య విషయం కాదు. ఎందరో గొప్ప గొప్ప వారు ఎన్నో రకాలుగా దాన్ని నిర్వచించారు. ఏదీ సంపూర్ణం కాదు. కవిత్వం ఇలాఉండాలి అని గీత గీయలేము. ఎలాగైనా ఉండొచ్చు. కాని, అదిఅవతలివారి మనసును స్పందింపజేయ గలగాలి. మనసుపొరల్లోకి చొచ్చుకొని వెళ్ళగలిగేదిగా ఉండాలి. ఒక మనిషిని కదిలించాలి. చైతన్యవంతం చేయగలగాలి. చదివిన క్షణాల్లోనైనా మనహదయం స్పందించాలి. రూపం లేదా ప్రక్రియ ఏదైనప్పటికి, స్పందింపజేయ గలిగితేనే అదికవిత్వంఆవుతుంది.
సామాజిక, రాజకీయరంగాలలో సరైన ఉద్యమాలు లేని లోటు సాహిత్యపరమైన స్తబ్దత ఆవరించడానికి కారణమౌతోంది అన్న అభిప్రాయంతో ఏకీభవిస్తారా?
ఉద్యమాలు సాధారణంగా ఒక సమస్య కారణంగా ఉద్భవిస్తాయి. ఇప్పుడు స్వాతంత్రోద్యమం తీసుకుంటే స్వాతంత్య్రం వచ్చేంత వరకూ సాగింది. ఉద్యమాలు ఆయా కాలాల్లో ఆయా అవసరాలకు అనుగుణంగా పుడుతూ ఉంటాయి. అక్కర తీరాక ఆ ప్రవాహ ఉధృతి అంతగా ఉండదు. అయితే సర్వకాలాల్లోనూ ప్రపంచాన్ని కొన్ని సమస్యలు పట్టిపీడిస్తూ ఉంటాయి. ఉదాహరణకు అవినీతి సమస్య ఉంటూనే ఉంటుంది. దానిమీద కవులు, రచయితలు కవిత్వంలో, కథల్లో, నవలల్లో ప్రతిఘటిస్తూనే ఉంటారు. ఉద్యమం లేనంత మాత్రాన అవినీతి అనేది కవిత్వ వస్తువు కాకుండాపోదు. ఉద్యమం అంటూ ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరంలేనివి ఎన్నో ఉంటాయి. అలాగే మానవత్వం అనే కవితావస్తువు మీద కూడా కవులు కొన్ని వందల సంవత్సరాలుగా రాస్తున్నారు. అన్యాయం, అక్రమాలపై తిరబడ్డం అనే కవితా వస్తువులు నిత్యనూతనం. అలాంటి సార్వజనీనమైన కవితా వస్తువులకు ఉద్యమాలంటూ ప్రత్యేకంగా అవసరంలేదు. అలాగే రైతుజీవితాన్ని గమనించినట్లైతే విధానాల్లో ఎంతో మార్పువచ్చింది, రైతు ఉపయోగించే పరికారాల్లో మార్పు వచ్చింది కాని రైతు జీవితంలో మార్పురాలేదు. స్త్రీల జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి అయిన ఇంకా స్త్రీల సమస్యలు తీరలేదు. ఇలాంటి వాటికి ఉద్యమాలంటూ ప్రత్యేకంగా రావలసిన పని లేదు. కవులు వీటిని గురించి రాస్తూనే ఉండాలి.
ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రానికి డైరక్టరుగా ఎంపిక కావడం మీకు ఎలాంటి అనుభూతి నిచ్చింది?
ఈ డైరక్టరు పదవి ద్వారా తెలుగుభాషకు సేవ చేసుకునే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది. ఈపదవి నేను ఒకఉద్యోగంగా భావించకుండా ఈ అవకాశం ద్వారా తెలుగుకు నేను ఏఏ విధంగా ఎక్కువగా సేవచేయలగలను అనే ఆలోచనతో ఈ పదవి చేపట్టాను. నేను మదరాసు విశ్వవిద్యాలయ ఆచార్యునిగా, కొన్ని భాషలున్న విశ్వవిద్యాలయ శాఖకు డైరక్టరుగా ఒక బాధ్యతా యుతమైన పనిని సంతప్తికరంగా నిర్వర్తించాను. తర్వాతి కాలంలో సాహిత్యానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు నిర్వహించాను. మరలా ఈ అవకాశం లభించింది.
ఇక ముందు ఆ కేంద్రం ఎలా రూపు దిద్దుకోబోతున్నది?
ప్లాన్‌ అయితే ఉంది. ఇంకా యాక్షన్‌ జరగలేదు. ముఖ్యంగా ఈ ప్రాచీన తెలుగు విశిష్టకేంద్రానికి ప్రత్యేకమైన ప్రతిపత్తిని తీసుకుని రావలసిఉంది. ప్రత్యేక భవన నిర్మాణం జరగాలి. భవనానికి భూమి కేటాయింపు జరిగినప్పటికి ఏవో కొన్ని వ్యాజ్యాల కారణంగా ఆగింది. ఆ భవన నిర్మాణం అనంతరమే ప్రత్యేక ప్రతిపత్తి సాధించగలము. తెలుగువెలుగులను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశం మొత్తంకూడా నింపాలనే దీక్షతోనే ఇక్కడ నేను, నా బందం కతనిశ్చయులమై ఉన్నాం. ఇక్కడ చేయడానికి చాలా పనులున్నాయి.
తెలుగు భాషాభివద్ధికి ఏంచేయాలంటారు?
తల్లిదండ్రులు తమ పిల్లల్ని తెలుగులో చదివించాలి. ఇంగ్లీష్‌ భ్రమ నుంచి బయటపడాలి. తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగాలు రావు, అమెరికాకు పోవడానికి వీలు కాదు అన్న అపోహలు తొలగించాలి. అమెరికాకు పంపడానికే పిల్లల్ని కనే తల్లిదండ్రులు మారాలి. ఇప్పటికే ఒక తరం పిల్లలు సాధారణంగా ఉపయోగించాల్సిన తెలుగు మాటలు మరిచిపోయారు. ఇది ఇలాగే కొనసాగితే తెలుగంటే ఏమిటి అనే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తెలుగుకు ప్రాముఖ్యం ఇచ్చి మన సంస్కతిని కాపాడాలి. తెలుగులో చదివిన వాళ్ళకు ఉద్యోగాల్లో మొదట అవకాశం కల్పించాలి. పార్టీలు తమ ప్రణాళికల్లో తెలుగు భాషకు సంబంధించిన వైఖరిని స్పష్టం చేయాలి. ప్రజలు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలకే వోటు వేయాలి. మేధావులు పార్టీల దాణాలకు, పురస్కారాలకోసం వక్ర భాష్యాలు చెప్ప కుండా ప్రజలకు మేలు కలిగించే విధంగా సలహాలు ఇవ్వాలి. తెలుగును అన్నీ రంగాలకు ఉపయోగపడే విధంగా అభివద్ధి చేయడానికి కషి చేయాలి.
చివరిగా వర్ధమాన తెలుగుకవులకు మీసందేశం?
ఇంతకుముందు చెప్పుకున్నట్టు, కవులు కవిత్వం పాఠకుల హదయాలను స్పందించే విధంగా వ్రాయాల్సి ఉంది. మనకున్న అనేక సమస్యలపై స్పందించాలి. కొత్త అలంకారాలు, కొత్త వస్తువులు, కొత్త అభివ్యక్తులు రావాలి. కవులు సమస్యల మూలాల్లోకి చొచ్చుకునివెళ్ళి వాటిపై సాధన దిశగా కషిచేయాలి.