మైసూరు పర్యటన 3

డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
94407 32392

మా హిందూపురానికి అప్పటి జిల్లా కేంద్రమైన అనంతపురానికి మధ్యా వాతావరణంలోనే కాదు, తిండి పదార్థాలు లభించే తీరులో కూడా ఎంతో తేడా వుంటుంది! అనంతపురం నుంచి బెంగుళూరు వెళ్ళే దారిలో, పెనుకొండ తరువాత హైవే మీద సోమందేపల్లి ముందు ఎడమవైపు డౌన్‌కు తారురోడ్డు తిరుగుతుంది. అక్కడ నుంచే వాతావరణంలో తేడా అంటే ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం అనేది పెద్దలు చెప్పడమే కాదు, నాకూ అనుభవమే! అనంతపురంలో దొరకని రీతిలో హిందూపురం హౌటళ్ళలో టిఫిన్లు, చిరుతిళ్లు లభిస్తాయి. ఇది బెంగుళూరు వైపు నుంచి హిందూపూర్‌ వైపుకు ప్రాకిన తిండి సంస్క ృతి అని నా అవగాహన మేర భావిస్తున్నాను.
బెంగుళూరులో కూడా రాత్రి సమయాల్లో షాపులు మూసేసిన తర్వాత చాలా రకాల టిఫిన్‌ ఐటమ్స్‌ బళ్ళలో పెట్టి వేడి వేడిగా అమ్ముతుంటారు. మామూలు హౌటళ్ళలో కూడా చాలా వైవిధ్యం ఉంటుంది. ఇదే పద్ధతి లేదా ఇంకా ఎక్కువ వైవిధ్యం మైసూరులో చూడొచ్చు. కనుక 2023 సంక్రాంతి రోజున 'తోటదమనే' (తోటలో ఇల్లు)లో భోజనానికి వెళ్ళాం. మైసూరు నుంచి బెంగుళూరుకు వెళ్ళే హైవేలో పాండవపుర దగ్గర రోడ్డు పక్కనే ఈ తోటదమనే వుంది. నిజానికి ఆ రోజు దానికి సెలవు కానీ, మా మిత్రుడి కోసం, మరో కుటుంబం కోసం ప్రత్యేకంగా పండుగ భోజనం తయారు చేశారు. వంటకాలు మరీ ఎక్కువగా లేవు గానీ, చేసినవన్నీ చక్కగా, ఏమాత్రం పడెయ్యడానికి అవకాశం లేకుండా వండడం విశేషం! ఈ తోటదమనే లోపలికి వెళ్ళేటప్పుడు మేము నలుగురం మంచి గ్రూప్‌ ఫోటో తీసుకున్నాం.
ఆ రోజు సంక్రాంతి, జనవరి 15. ఆ ఉదయం చెల్లాయి రాజేశ్వరి వండిన ఉప్మా తిని నేనూ, హంస చాముండి పురంలో జూ దగ్గర ఉండే కారంజి లేక్‌కి వెళ్ళాం. మైసూరులో చాలా తటాకాలున్నాయి. అందులో ఇది ఒకటి. ప్రకృతిని ఇష్టపడే మా ఇద్దరి స్వభావాన్ని గమనించి ఆ దంపతులు ఇక్కడికి వెళ్ళమని సలహా ఇవ్వడమే కాకుండా, ఐదారు కిలోమీటర్ల దూరంలో వుండే కారంజి కుంట వెళ్ళి రావడానికి ఒక ఆటోను కూడా మాట్లాడారు. కారంజి ప్రత్యేకత ఏమిటంటే ఆ నీళ్ళలో ఆహ్లాదంగా బోటులో వెళ్ళిరావచ్చు. మా ఇద్దరికీ అది అంత ఆసక్తి కలిగించలేదు. కానీ రకరకాల చెట్లు పుష్కలంగా కళకళలాడుతూ ఉన్నాయి. ఎన్నో రకాల పక్షులు, నెమళ్ళు ఒక విభాగంలో హాయిగా గంతులేస్తున్నాయి. అలాగే మరోచోట సీతాకోక చిలుకల జోన్‌ వుందని రాసి వుంది కానీ, మేము ఈ నెమళ్ళ హడావుడిలో పడి సీతాకోకచిలుకలని మర్చిపోయాం. సుమారు గంటన్నర అక్కడ గడిపినా ఆ సమయం చాలదనిపించింది. మర్కెరా సూర్యాస్తమయం దృశ్యాలు, కాఫీతోట అనుభవాలతో పోల్చదగ్గ ఆనందం ఇక్కడ మాకు లభించింది!
కారంజి లేక్‌కు వెళ్ళేముందు ఒక చోట ఆటో ఆపి తెలుగు దినపత్రికలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను. తన వద్ద లేవు ఎదురు షాపులో వుంటాయని ఒక న్యూస్‌ పేపర్‌ స్టాల్‌ వ్యక్తి చెప్పారు. అక్కడికి వెళ్ళి అడిగితే తెలుగు డైలీ అయిపోయిందన్నారు. సరే అని కన్నడ పత్రికలు కొన్ని ఇవ్వండి అని అడిగి, ఇచ్చిన వాటిలో ఒక తొమ్మిదింటిని మాత్రం కొనుక్కుని దగ్గర వుంచుకున్నాం. వాటిలో 74 ఏళ్ళుగా నడుస్తున్న ప్రజావాణి, కన్నడ ప్రభ (56 ఏళ్ళు), ఉదయవాణి (30 ఏళ్ళు), విజయ కర్ణాటక (22 ఏళ్ళు), విజయవాణి (10 ఏళ్ళు) ఉన్నాయి. ఈ ఐదు (నాకు పేర్లు తెలిసిన) పత్రికలను కొన్నాను. అవి కాక మరో నాలుగు లోకల్‌ పేపర్లు. సంయుక్త కర్ణాటక అక్కడ కనబడలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదలైన డెక్కన్‌ హెరాల్డ్‌ గ్రూప్‌ ప్రజావాణి దినపత్రికని, కన్నడ దినపత్రికను సంజవాణి సాయంకాల దినపత్రికను నిర్వహిస్తోంది. ఒకప్పుడు ఈ మూడు దినపత్రికలు సర్క్యులేషన్‌లో అగ్రస్థానంలో ఉండేవి. ఇప్పటికీ గాంభీర్యంగా నడిచే పత్రికల సముదాయమిది. ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ వారి 'కన్నడ ప్రభ' కూడా ఆంధ్రప్రభలాగా వేరే వారికి అమ్మివేయబడింది. ఏషియా నెట్‌ ను నిర్వహించే రాజ్యసభ సభ్యులు రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం కన్నడ ప్రభకి యజమాని. ఇది యాభై ఆరేళ్ళుగా నడుస్తున్న పత్రిక.
టి.ఎ.పారు కుటుంబానికి చెందిన 'ఉదయవాణి' మూడు దశాబ్దాలుగా వస్తోంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే కన్నడ పత్రిక చూడగానే కొంత తికమకకు గురయ్యాను. 'కాంతార' సినిమా స్టార్‌ సువర్ణ ఛానల్‌లో ఆ రోజు సాయంకాలం ప్రసార మవుతోంది కనుక పత్రిక పేరుని 'విజయ కర్ణాటక' కాకుండా 'సువర్ణ కర్ణాటక' అని తొలి పేజీలో మార్చుకున్నారు. మొదట ఈ పత్రిక పేరు ఎప్పుడు మారింది, ఎందుకు మారింది అని నాకు సందేహం కలిగింది, కొంత కన్ఫ్యూజన్‌కు గురయ్యాను. కాస్త నెమ్మదిగా పరికిస్తే గానీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా మార్కు బిజినెస్‌ గిమ్మిక్‌ అని బోధపడలేదు!
విఆర్‌ఎల్‌ యజమాని, పారిశ్రామికవేత్త విజయ సంకేశ్వర్‌ తొలుత ప్రారంభించిన విజయ కర్ణాటక, విజరు టైమ్స్‌ దిన పత్రికలు బాగా విజయవంతమయ్యాయి. పదేళ్ళ క్రితం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పైకమిచ్చి ఈ రెండింటినీ కొనేసింది. విజయ కర్ణాటకను కొనసాగిస్తూ విజరు టైమ్స్‌ చందాదారులను, పాఠకులను తన వైపుకు మార్చుకుని ఆ ఇంగ్లీష్‌ పత్రికను ఆపివేసి తను బలపడింది. ఈ పాచికతో కర్ణాటకలో కన్నడ ఇంగ్లీషు దినపత్రికల రంగంలో డెక్కన్‌ హెరాల్డ్‌ గ్రూపును దెబ్బతీసి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఆ పత్రికలను అమ్మిన డాక్టర్‌ విజయ సంకేశ్వర్‌ మరింత లాఘవంగా పదేళ్ళ క్రితమే 'విజయవాణి' అని మరో కన్నడ దినపత్రికను స్థాపించారు. ఇప్పుడు కన్నడ దినపత్రికల అగ్రస్థానం విజయ కర్ణాటక, విజయవాణి మధ్య దోబూచులాడుతూ వుంటుంది.
ఆరోజు ఆదివారం కనుక, ఆ సంచికలనే చూశాను కనుక ఎడిట్‌ పేజీ తీరుతెన్నుల గురించి వ్యాఖ్యానించడం సబబు కాదు! అలాగే ఆ రోజు సంక్రాంతి కనుక అన్ని పత్రికలూ ఎక్కువ పేజీలతో రంగులతో కళకళలాడుతూ ఉన్నాయి. ప్రజావాణి, ఉదయవాణి ఆరేసి రూపాయలు కాగా; కన్నడ ప్రభ ఏడు రూపా యలు, విజయ కర్ణాటక, విజయవాణి 5 రూపాయలు. కన్నడ ప్రభలో ఆదివారం సంచికలో జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌ గురించి ఒక ఇంటర్వ్యూ కనబడింది. విజయ కర్ణాటకలో లవ్‌ లైఫ్‌ అని 'అడ్వర్టోరియల్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఇండిస్టీ ప్రమోషనల్‌ ఫీచర్‌' కనబడింది. చెప్పుకున్న రీతిలో సరంజామా దొరకకపోతే మిగతా విషయాలు ఇస్తున్నట్టున్నారు. ఇదే పేజీలోనే 'సాహిత్యద అంతిమ గురి మానవీయతే' పేరున కన్నడ-తమిళ అనువాదకులు కాళిముత్తు నల్లతంబితో ఒక ఇంటర్వ్యూతో పాటు, సంక్రాంతి గురించి ఒక అర పేజీ వ్యాసం కనబడింది. ఉదయవాణి పత్రికలో ఎనిమిది పేజీల సినిమా ప్రకటనలు మరో విశేషం. తెలుగు పత్రికల్లాగ స్థానిక వార్తల అనుబంధాలు, వీక్లీ సైజులో ఆదివారం సంచికలు కన్నడ పత్రికల్లో లేవు!
ఈ ఐదు పత్రికలు కాకుండా నాకు తెలియని మరో నాలుగు స్థానిక (?) పత్రికలను ఎంచుకున్నాను. అవి 'ప్రతినిధి' (63 సంవత్సరాలు). 'ఆందోళన' (51 సంవత్సరాలు). 'మైసూరు మిత్ర' (42 సంవత్సరాలు). 'కన్నడిగర ప్రజానుడి' (23 ఏళ్ళు). ఈ పత్రికలు ఇంకా స్టార్‌ ఆఫ్‌ మైసూర్‌ అనే పత్రిక కూడా మైసూరు ప్రాంతంలో ప్రధానంగా నడుస్తున్నాయి. కన్నడం చదవడం నాకు పెద్దగా రాకపోయినా ఆ పత్రికలో కనబడే ప్రకటనలు, ఫొటోలను బట్టి ఆ పత్రికలు ఏ వర్గమో మనం తెలుసుకోవచ్చు. ఆ పెద్ద పత్రికలకన్నా ఈ స్థానిక పత్రికలు కొంచెం తక్కువ పేజీలతో మూడు, నాలుగు రూపాయల ధరతో పుష్టిగానే నడుస్తున్నాయి. అయితే అన్ని పత్రికలు రంగుల్లో కళకళలాడడం సంక్రాంతి విశేషం కావచ్చు.
ఆదివారం రోజు సాయంకాలం ఉమేష్‌కు నాకూ బాచ్‌ మేట్‌ అయిన, నాలుగైదేళ్ళ క్రితం పదవీ విరమణ చేసిన, ఉమేష్‌ ఒకప్పటి కొలీగ్‌ శ్రీనివాస ప్రసాద్‌ ఇంటికి వెళ్ళాము. మిత్రుల కుటుంబాన్ని కూడా ఆహ్వానించి సాదరంగా భోజన ఆతిథ్యాన్ని ఇచ్చిన సహృదయులు శ్రీనివాస్‌, సుకన్య దంపతులు. శ్రీనివాస్‌ ప్రసాద్‌ ఇంట్లో కనబడ్డ చాలా ఇంగ్లీషు పుస్తకాలు వారు మంచి చదువరి అని, పుస్తకాలు చక్కగా భద్రపరుచుకుంటారని చూడగానే బోధపడింది. ఆయన ఆకాశవాణిలో అనౌన్సర్‌గా ఉద్యోగంలో చేరి, తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌ అయిన సైన్సు రచయిత, సాహిత్యం సినిమాలంటే ఆసక్తి ఉన్న వ్యక్తి వారు.
ఇలా నాలుగు రోజులు గడిచిపోయింది. మేము బయల్దేరే జనవరి 16 వచ్చేసింది. ఆరోజు ఉదయం మేమిద్దరం, సుశీల నాగరాజు దంపతులు మైలారి పేరున ప్రాచుర్యంలో ఉన్న ఉపాహారశాలకు వెళ్ళాలని అనుకున్నాం. వారొక వైపున నుంచి, మేము ఇంకొక వైపు నుంచి ఒకే పేరుతో ఉన్న రెండు హౌటళ్లను రెండు ప్రాంతాలకు చేరడం వల్ల కొంత గందరగోళం, కొంత సమయం వృథా ఏర్పడ్డాయి. నాకయితే ఆ హౌటల్‌లో తిన్న దోసె పెద్దగా నచ్చలేదు. మళ్ళీ ఆకాశవాణిలో వచ్చి కలుస్తామని సుశీలా దంపతులు వెళ్ళిపోగా, నేను నా మిత్రుడి కోసం రామకృష్ణ ఆశ్రమం దగ్గర దిగి పోగా హంస రాజేశ్వరీ వాళ్ళింటికి వెళ్ళింది. తర్వాత అక్కడి నుంచి రాజేశ్వరితో కలిసి సిల్కు ఫ్యాక్టరీకి వెళ్ళి హంస మైసూర్‌ సిల్క్‌ చీర కొనుక్కుంది.
1986-87 కాలంలో ఎమ్మెస్సీ అయిన తర్వాత నేను కొన్ని నెలలపాటు హిందూపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఉండే బాగేపల్లిలోని నేషనల్‌ కాలేజీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌ గా ఉద్యోగం చేశాను. డబ్బులకు కటకట కనుక ఎమ్‌ ఫిల్‌ మధ్యలో ఈ ఉద్యోగం చెయ్యాల్సి వచ్చింది. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్‌ లో టెంపరరీ లెక్చరర్‌ కు ఆరువందలు ఇస్తుండగాబీ కర్ణాటకలో అదే ఉద్యోగానికి 1,980 రూపాయలు ఇచ్చేవారు. కనుక నేను అక్కడికి పోయాను. హేతువాది, న్యూక్లియర్‌ శాస్త్రవేత్త, గాంధేయవాది, సత్యసాయిని వ్యతిరేకించిన పోరాటశీలి డా. హెచ్‌. నరసింహయ్య నేతృత్వంలో నడిచే విద్యాసంస్థ అది. ఆ కాలంలో వారిని రెండుసార్లు కలవడం, వారి 'సైన్స్‌ అండ్‌ హ్యుమ నిజం' వ్యాసాన్ని తెలుగులోకి తర్జుమా చేసుకోవడానికి అనుమతి కోరడం కూడా జరిగింది. అలా అనువాదం చేసిన వ్యాసం తెలుగు అకాడమి మాసపత్రిక 'తెలుగు'లో అచ్చయ్యింది. ఇప్పుడు ఆ వ్యాసం నా 'సైన్సు సాహిత్యం సమాజం' సంకలనంలో ఉంది.
బాగేపల్లి నేషనల్‌ కాలేజీలో అప్పట్లో లెక్చరర్‌గా పనిచేస్తున్న బి.పి.విజరు కుమార్‌ ఇటీవలే పదవీ విరమణ చేసి మైసూరులో సెటిలైన విషయం ముందురోజు అనుకోకుండా గుర్తుకు వచ్చింది. బాగేపల్లి మిత్రుడిని ముందురోజే సంప్రదించి విజయకుమార్‌ కాంటాక్ట్‌ నెంబర్‌ తీసుకుని మాటాడి ఉన్నాను. విజరు కుమార్‌ ఆకాశవాణి దగ్గరున్న రామకృష్ణ ఆశ్రమం దగ్గర వేచి వుంటానని చెప్పారు గనుక, నేను అక్కడికి వెళ్ళాను. మైసూరు మహరాజ్‌కు గురుతుల్యులైన స్వామి వివేకానంద స్ఫూర్తితోనే మైసూర్‌ మహారాణి బెంగుళూరులో టాటా ఇనిస్టిట్యూట్‌కి 371 ఎకరాల భూరి విరాళం ఇచ్చారు. కనుకనే జంషెడ్జీ టాటా ఆ సంస్థను బొంబాయి లో కాకుండా బెంగుళూరులో ప్రారంభించారు. అదే సంస్థ నేడు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌గా పేరు గాంచింది. తొమ్మిది దశాబ్దాలుగా నడుస్తున్న రామకృష్ణాశ్రమం మైసూరు ఆకాశవాణికి చాలా దగ్గరగా రకరకాల పూల మొక్కలతో విశాలమైన ప్రాంగణంతో కనబడింది. ఆ పరిసరాల్లో ఒక 20 నిమిషాలు గడిపి బయటకు రాగానే మా మిత్రుడు విజరు కుమార్‌ వచ్చారు.
కాస్త మాటలయ్యాక దగ్గరనే ఉన్న, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఆర్‌.కె.నారాయణ్‌ నివసించిన ఇంటికి వెళ్ళాం. జన్మతః తమిళుడయిన రాసిపురం కృష్ణస్వామి అయ్యర్‌ నారాయణ స్వామి 'ఆర్‌. కె.నారాయణ్‌'గా ప్రసిద్ధులయ్యారు. వీరు, ముల్కరాజ్‌ ఆనంద్‌, రాజారావులను కలిపి 'ఆధునిక ఆంగ్ల భారతీయ వచన రచయిత ల త్రయం'గా పేర్కొంటారు. నారాయణ్‌ తండ్రి మహరాజా కాలేజి హైస్కూలుకు బదిలీ కారణంగా 1920వ దశకంలో మైసూరు తరలి వెళ్ళారు. సుప్రసిద్ధ కార్టూనిస్టు ఆర్‌.కె.లక్ష్మణ్‌ వీరి తమ్ముడు. ఆర్‌.కె.నారాయణ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్య ఐదేళ్ళ వైవాహిక జీవితం తర్వాత అంటే 1939లో కన్నుమూశారు. తర్వాత ఆయన మరో పెళ్ళి చేసుకోలేదు. ఒకే కూతురు, ఆమె పేరు హేమా నారాయణ్‌.
స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌, బాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్సు, ది ఇంగ్లీష్‌ టీచర్‌, ది ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌, ది గైడ్‌, ది రిటర్న్‌ ఆఫ్‌ బాపు వంటివి వీరి ప్రఖ్యాత రచనలు. 95 ఏళ్ళ వయసులో 2001లో ఆయన కన్నుమూశారు. ఆయన అసలైన రచనా జీవితం గడిపింది మైసూరులోనే. 1953లో ఎంతో ఇష్టంగా మైసూర్‌లో కట్టుకున్న ఇంట్లో చాలా కాలం ఉన్నారు. ఆయన సంతతి 2011లో ఈ ఇంటి అమ్మేశారు! 2016లో కాంట్రాక్టరు ఆ భవనం పడగొట్టా లని సిద్ధమైనప్పుడు స్థానిక రచయితలు, కళాకారులు దీన్ని వ్యతిరేకించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. తత్కారణంగా ఆర్‌.కె. నారాయణ్‌ మూడు గదుల రెండంతస్తుల ఇల్లు భద్రపరచ బడింది. ఆయన పుస్తకాలు, ˜ఫొటోలు, పురస్కార పత్రాలు, దుస్తులు, కళ్ళజోడు వంటివి ఇక్కడ ఉన్నాయి. ఈ ఇల్లు గురించి పెద్దగా ప్రచారం లేనట్లు నా ఫేస్‌బుక్‌ పోస్టుకు లభించిన స్పందనబట్టి నాకు బోధపడింది. నాక్కూడా ఫేస్బుక్‌ మిత్రుడు ఆర్‌ఎస్‌ వెంకటేశ్వరన్‌ ద్వారా ఈ ఇల్లు గురించి తెలిసింది.
ఇక్కడ రేడియో స్టేషన్‌ గురించి చెప్పుకోవాలి. అప్పట్లో సంస్థానాలు కూడా రేడియో స్టేషన్లు ఉండేవి. హైదరాబాద్‌లోను, ఔరంగాబాద్‌లోను నైజాంకు రెండు రేడియో కేంద్రాలుండగా; మైసూరు, తిరువాంకూర్‌ సంస్థాలకు చెరొకటి ఉండేవి. మైసూరు స్టేషన్‌ను తొలుత 1936లో మైసూరు కళాశాల లెక్చరర్‌గా ఉంటూ సొంత ఆసక్తి మీద మొదలు పెట్టారు. 1942 లో మైసూరు రాజా నిర్వహణలోకి మారి 1950 దాకా కొనసాగింది. పిమ్మట భారత ప్రభుత్వం దాన్ని బెంగళూరుకు తరలించింది. 1974లో మళ్ళీ ఆకాశవాణి అక్కడ మొదలైంది. ఆకాశవాణి అనే మాటను తొలిసారి ఈ రేడియో స్టేషన్‌కే వాడారు. దీనికి ఈ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ అన్న గోపాలకృష్ణమాచారి పెట్టారని అంటారు. ఇక్కడ స్టుడియో షడ్భుజి రూపంలో తక్కువ మానవ వనరులతో ఎక్కువ రికార్డింగులు పర్యవేక్షించే సదుపాయం ఉంది. ఇలాంటి ప్రత్యేక రీతి స్టుడియో మనదేశంలో మరెక్కడా లేదు. నిజానికి సంస్థానం కాలంలో రాజనర్తకి నృత్యం చేసే స్థలాన్ని స్టూడియోగా మార్చారు.
ఆకాశవాణి అభిమాని అయిన నా ఫిజిక్స్‌ లెక్చరర్‌ మిత్రుడు ఆకాశవాణికి రావడానికి ఉత్సాహం చూపారు. అలాగే సుశీలా నాగరాజ దంపతులు కూడా ఆకాశవాణి ప్రాంగణానికి వచ్చారు. కాసేపటికి హంస, రాజేశ్వరి గార్లు కూడా వచ్చారు. ఆరోజు ప్రత్యేకత ఏమిటంటే, మైసూర్‌ ఆకాశవాణి మృదంగ విద్వాంసులు శివశంకర స్వామి నిర్వహించే 'లయసంభ్రమ' అనే ధారావాహిక 50వ ఎపిసోడ్‌ ప్రసారం కావడం! కనుక 'లయసంభ్రమ' విందుకు మేము కూడా హాజరయ్యాం. అందరితో కలిసి భోంచేసి, మధ్యాహ్నం 2.30కు బయల్దేరి, మైసూరు జంక్షన్‌ స్టేషన్‌లో సిద్ధంగా ఉన్న కాచిగూడా మైసూరు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి, జనవరి 17 ఉదయం 5.30కు హైదరాబాదు చేరుకున్నాం!(సమాప్తం)