నిర్ణయం

భమిడిపాటి గౌరీశంకర్‌
94928 58395

''జీవితం సుఖమయం కానీయండి, దు:ఖపూరితం కానీయండి. జీవితం ఒక అద్భుతమైన వ్యాపకం. ఇది నిత్యనూతనమైన వ్యాపకం''.
రాత్రి పది గంటల సమయం. జనవరి నెల.. చలి ఎక్కువగానే ఉంది. ఫోన్‌ మోగింది. రామలక్ష్మి. రాజమండ్రి ఓ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చేస్తోంది. నేనూ, రామలక్ష్మి, శుభ, కోదండ రామయ్య మేమంతా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తొంబైలో విద్యార్థులం.
''చెప్పు'' అన్నాను ఆనందంగా.
''ఏముందీ... మా కళాశాలలో దళిత సాహిత్యంపైన ఓ జాతీయ సెమినార్‌ నిర్వహిస్తున్నాం. నువ్వో సెషన్‌ తీసుకోవాలి. మా ఇంట్లోనే ఉండాలి సుమా.. అభ్యంతరం లేదుగా...'' అంది గొంతులో ఏదో తెలియని సందిగ్ధత... వారి 'కులం' నాకు గుర్తు చేస్తూ.
''మన స్నేహంలో ఏనాడైనా నేనలా ప్రవర్తించానా... ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావేమీ?'' అన్నాను.. కాస్త కోపంగానే.
''ఆ.. కోపగించుకోకే తల్లి... అలా అలవాటు చేసింది నా చుట్టూ ఉన్న వ్యక్తుల సమూహం...'' అంది.. తన గొంతులో ఏదో తెలియని నిస్సహాయత.
''నేను వచ్చి మీ ఇంట్లోనే రెండు రోజులుంటాను సరేనా..'' అన్నాను. తరువాత ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. శుభ, కొమరయ్య కూడా రాజమండ్రిలో ఉన్నారని చెప్పింది. నాకు ఎంతో సంతోషమనిపించింది. అందరం దాదాపు పాతికేళ్ళ అనంతరం కలుస్తున్నాం.
అఅఅ
రాజమండ్రి.. గోదావరి గాలి.. ఒకానొక సాహిత్యపు తాత్వికత... గోదావరి నదిలో నుంచి వినవచ్చు.. నీటి ప్రవాహపు జీవన విధానపు ఔన్నత్యపు పాఠం. ఏదో చెవిలో గుసగుసలు పోతున్నట్టుగా నాకు ఉంటుంది.
శీతాకాలపు తడిలో.. ఆ తల్లి ఒడిలో... మంచు దుప్పటి అంచున... ఆ రాత్రి ఎనిమిది గంటల వేళ... నా ఒడిలో తలపెట్టి పడుకున్న రామలక్ష్మి పసితనం.. నా పెద్దరికాన్ని మరింతగా పెంచింది.
''అవును... వెన్నెల ఎవరు? నన్ను బాగా కుదిపింది.. ఆమె పత్రసమర్పణ పద్ధతి. తనను నేను ఎక్కడో చూసాను. గుర్తుకు రావటం లేదు...'' అని అడిగాను. వెన్నెల ఉదయం నా సెషన్‌లోనే ముల్కరాజ్‌ ఆనంద్‌ రాసిన తొలి దళిత నవల 'అన్‌ టచ్‌బుల్‌' పైన అద్భుతంగా మాట్లాడింది. ఆమెను చూస్తే.. నన్ను నేను చూసుకున్నట్టనిపించింది.
''రేపు రాత్రికి మనం. ఒకరింటికి వెళదాం. అప్పుడన్నీ నీకు తెలుస్తాయి. ఇప్పుడు నీ సంగతులు చెప్పు'' అంది. తన గురించి మధ్యాహ్నం లంచ్‌ టైమ్‌లోనే మాట్లాడుకున్నాం. భర్త.. ఇద్దరు పిల్లలు... ఇద్దరూ అమ్మాయిలే.. హేపీగా ఉన్నానంది. కానీ, కాస్త నల్లగా, సన్నగా అయిపోయింది. ఏంటీ ఈ అవతారం అన్నాను'' చూడగానే.
''తన స్వేచ్ఛను పణంగా పెట్టి కుటుంబ సంబంధమైన ఆనందాన్ని పొందడంలో స్త్రీ సౌందర్యం ఆవిరైపోతుంది. సరే కానీ, ఏభైలో కూడా నీలో ఇంతందం ఎలా సాధ్యం? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే ఇద్దరు పిల్లలను పెట్టుకొని. నాకూ చెబుదూ, నీ గ్లామర్‌ రహస్యం...'' అంది నా బుగ్గ మీద ముద్దు పెడుతూ.
''నీవేమీ మారలేదు. అదే అల్లరి. మీ ఆయన ఎలా వేగుతున్నారే తల్లి'' అన్నాను టీజింగ్‌గా. ఇంతలో వేడి వేడి జొన్నపొత్తుల వాసన వచ్చింది. అమ్ముతున్న పిల్లాడిని పిలిచి, రెండు తీసుకున్నాను. ఇద్దరం తింటున్నాం. దూరంగా పడవల అలికిడి... ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి వస్తున్న చిరుగంటల శబ్దం... రైలు కమ్‌ రోడ్డు బ్రిడ్జి నుంచి రైలు వెళుతున్న అలికిడి... వాహనాల హారన్స్‌ అలజడి...
''అవును.. నీకేదో సమస్య అన్నావు. భర్త చనిపోయిన, పిల్లలు లేని ఇంట్లో ఒంటరి ఆడది... అదీ ఉద్యోగం చేస్తున్నదంటే.. అందరూ ఆశగా చూస్తారే...!? అదేనా నీ సమస్య.. లేక శుభ మాదిరి ఏమైనా కొమరయ్యలా మా కులం వారు ఎవరైనా...'' అంది అర్ధోక్తిగా, ఒక్క నిముషం ఆగి .. ''జోసఫ్‌ అని ఎవరి గురించో చెప్పావు. ఏమా కథ...'' అనడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు.
''రేపు బయల్దేరే ముందు చెబుతానులే. ఇప్పుడు జొన్నపొత్తులు పూర్తి చేద్దాం'' అని దాట వేశాను.
కొన్ని వైవాహిక జీవితాలు విఫలం కావటానికి ప్రధాన కారణం... భార్యాభర్తల మధ్య ప్రేమలేకపోవటం కాదు; స్నేహం లేకపోవటం. అదే నాకూ నా భర్తకు మధ్య దూరాన్ని పెంచింది. జోసఫ్‌ను నాకు పరిచయం చేసింది. ఇది మా ఇంట్లో అందరికీ తెలిసింది. కానీ అందరం.. పరువు మర్యాదల ముసుగులో ఆనందంగా బతికినట్లు నటించాం. హఠాత్తుగా నా భర్తమరణం దు:ఖాన్ని మిగిల్చింది. పిల్లలు చేతకంది వచ్చారు. నేను నా రాబడి కన్నా కాస్త రిచ్‌గానే బతకాలను కున్నాను. కానీ, తగిన ఆర్థిక వనరులు భర్త దగ్గర లేవు. ఎన్నో వ్యాపారాలు చేశాడు.. కానీ, నష్టమే మిగిలింది. ఆ సమయంలోనే 'జోసఫ్‌' పరిచయమయ్యాడు. కలక్టరాఫీసులో సీనియర్‌ అసిస్టెంటుగా చేసేవాడు. ప్రస్తుతం రిటైరయ్యాడు. అతనికి భార్యా పిల్లలున్నారు. అతను నా కుటుంబ స్నేహితుడుగా ఉన్నాడు.'' చెప్పటం ఆపాను.
అర్థం చేసుకొంది. ''సరే పద.. వెళదాం... వండుకొని తినాలి కదా'' అంది. ఇంటికి చేరుకొని.. వేణ్ణీళ్ల స్నానం చేశాక మనసును ప్రశాంతంగా చేసుకొన్నాను.
అఅఅ
మరుసటి రోజు సాయంత్రం నాలుగ్గంటలకే సదస్సు ముగిసింది. ఆరు గంటల సమయంలో రామలక్ష్మి భర్తకు ఫోన్‌ చేసి తను రాత్రికి రానని చెప్పింది. తరువాత దేవి చౌక్‌ మీదుగా జైలు రోడ్డు వైపు బండిని స్పీడ్‌గా పోనిచ్చింది. శీతకాలపు చలిగాలి రివ్వున తగులుతున్నది.
అరగంట తరువాత... ఓ ఇంటి ముందు ఆగింది. ఇంటి ప్రాంగణం చాలా బాగుంది. ఎక్కడి నుంచో సన్నజాజి, నైట్‌క్వీన్‌ వాసనలు.. మనసున మల్లెలు మాలలూగేనే... దేవులపల్లి వారు గుర్తుకొచ్చారు. రామలక్ష్మి డోర్‌బెల్‌ కొట్టింది.
'ఆ.. వస్తున్నా' అని స్త్రీ గొంతు. తలుపు తెరుచుకుంది. ఎదురుగా నా బాల్య స్నేహితురాలు .. శుభ. ఇద్దరికీ ఆశ్చర్యం.. ఆనందం. నన్ను గాఢంగా హత్తుకుంది. హృదయం చేసే కరచాలనమే కౌగిలింత.
ఆ రాత్రి భోజనాల దగ్గర శుభ మాట్లాడుతూ ''నేను.. కొమరయ్యను పెళ్ళి చేసుకోవటం ఎవరికీ ఇష్టం లేదు.. కారణం మా కులాలని మీకు తెలుసు. కొమరయ్య పేదవాడు.. దళితుడు...'' కాస్త ఆగి.. అతని ముఖంలోకి చూసింది. అతను చిరునవ్వుతో అన్నం తింటున్నాడు.
శుభ చెబుతోంది... : ''ఆ తరువాత అతనికి మొదట గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌ ఉద్యోగం వచ్చింది.. పేదవాడి సంపద సమర్థతే మరి. ఇహ అక్కడి నుంచి ఒక్కొక్కరూ మా ఇంటికి రావటం ప్రారంభించారు. అతనిని నన్నూ వేరు చేయాలని చూసారు. ఈలోగా నా పి.హెచ్‌డి అయిపోవటం.. ఓ యూనివర్శిటీలో తాత్కాలిక ప్రాతిపదిక పైన ఉద్యోగం రావటం జరిగిపోయాయి. మాకు ఒక్క పాపే...'' ''ఇంతకీ... నీకేదో సమస్య అని రామలక్ష్మి ఫోన్‌ చేసింది..'' అంది, కంచంలో చేతులు కడుగుకుంటూ.
ఇంతలో ఆమె ఫోన్‌ రింగయింది.
మాట్లాడింది.
''మా పాపే... వచ్చేసరికి ఆలస్యమవుతుందిట..'' అంది.
అందరం డైనింగ్‌ టేబుల్‌ దగ్గర నుంచి లేచి పడక గదికి చేరాము. నేను, రామలక్ష్మి, శుభ ఒక గదిలో.
''నేను... ఓ సమస్యలో ఉన్నాను. సమస్యతో పాటు సహాయం కూడా కలిసే ఉంది మరి'' అన్నాను నెమ్మదిగా.
ఇద్దరూ వైపు ఓసారి చూసి.. ''నా భర్త మరణం.. పిల్లలు వారి దారి వారు చూసుకోవటం.. ఎందుకో ఒంటరితనం... భయం... దాదాపు పదేళ్లు కుటుంబ స్నేహితుడుగా ఉన్న జోసఫ్‌ సహజీవనం చేద్దామంటున్నాడు. భర్త ఉన్న సమయంలో మంచి మనిషిగా తెలుసు. కష్టానికి ఆదుకున్నాడు.. కానీ, ఈ ప్రపోజల్‌ ఎందుకో నన్ను భయపెడుతుంది..'' అన్నాను. అలా అంటున్నపుడు నా గొంతులో సన్నని వణుకు నాకు తెలుస్తోంది.
సన్నగా.. ఒ కన్నీటి తెర..
శుభ దగ్గరగా వచ్చి... మెల్లగా కౌగిలించుకుంది. వీపున మెల్లగా తట్టింది.. ఓ తల్లి స్పర్శ. ఒక మౌన ఆలింగనం విచార హృదయానికి వెయ్యి పదాల సాంత్వన.
శుభ మెల్లగా... ''తమ బలహీనతలనే తమ ఆయుధంగా మలుచుకోనంతకాలం స్త్రీలు శక్తిమంతులు కాలేరు. తనకు లేని వాటి గురించి చింతించకుండా ఉన్నవాటిని గుర్తించి ఆనందించటమే తెలివైనవారు చేయాల్సిన పని... ఇది నీ జీవితం.. పిల్లలు వెళ్ళిళ్లు... మిగిలిన కర్తవ్యాలు కూడా నీకున్నాయి. ఆలోచించు. మేము చెప్పినంత తేలిక కాదు, నీవు ఆచరించటం. సహజీవనం తప్పా ఒప్పా అనే సందిగ్ధత నీది.. ఇంతకాలం మీరు చేస్తున్నదేమిటో నీవే ప్రశ్నించుకో.. పరస్పర వ్యక్తిత్వాల ఎదుగుదల మీద, మార్పుల మీద ప్రేమను వ్యక్తపరచే విధానాల మీద గౌరవమున్నప్పుడే ఇటువంటివి ముందుకు కొనసాగుతాయి. మనమంతా చివరి మజిలీ బాటసారులం. ఏది ఏమైనా.. నిన్ను నిరంతరం రక్షించు కోవటానికి... సహాయమందించటానికి.. ఇక్కడ మేమిద్దరం ఉన్నామనే విషయం మరిచిపోకు. ఇక్కడికి వచ్చేయి. ఆపాటి ప్రయివేటు ఉద్యోగం ఇక్కడ మేము చూసి పెడతాం. ఓకేనా.. ప్రశాంతంగా ఉండు. నీకు నచ్చిన నిర్ణయం తీసుకో.. దేనికైనా మా ఇద్దరి ఆమోదం ఉంటుంది. సరేనా...'' అంది.
''దా... పడుకుందాం...'' అంది.
ముగ్గురం ఒకే మంచం పైన. రామలక్ష్మి, శుభల మధ్య నేను. వారిద్దరి చేతులు నా మీద... దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత... ఇలా.. ఒకే మంచం మీద ముగ్గురం...
ఇంతలో తలుపు చప్పుడైంది.
పాప వచ్చినట్టుంది అంది శుభ.
'తనది నా పోలిక. నాలాగే పెంచాను' అని తలుపు తీసింది.
ఎదురుగా... వెన్నెల... చిరునవ్వుతో ''ఆంటీ'' అని నా దగ్గర కూర్చుంది.
నా కూతురిని చూసినట్టనిపించింది.
నా మనసులో సందేహాలు తీరిపోయాయి.
రేపు ఏమిటో... నిర్ణయించుకుంటాను.