మత్తు కమ్మిన రాత్రి

శింగమాల సుబ్రహ్మణ్యం
94902 99399

విజయకుమార్‌ ఊళ్ళో సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. ఇంజనీరింగ్‌ చదివి బెంగుళూర్లో సాఫ్టువేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత తొలిసారి సంక్రాంతి సెలవులకని సొంతూరు వచ్చాడు.
గోపాలకృష్ణ అదే ఊళ్ళో మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎం.బి.ఏ. చదివి హైదరాబాదులో ఒక కన్సల్టెంటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనూ సంక్రాంతి సెలవులకని ఊరొచ్చాడు.
సుధాకర్‌ బి.ఎ. చదివాడు. పోటీ పరీక్షల్లో పాసై జీవిత బీమా సంస్థలో సహాయకుడిగా ఉద్యోగంలో చేరాడు. తను పనిచేసే కార్యాలయం ఊరికి దగ్గరగానే ఉన్న టౌన్లోనే ఉంది. అందువల్ల రోజూ ఇంటినుండే విధులకు వెళ్ళొస్తుంటాడు.
పై చదువులు చదివే స్థోమత లేని నాగేంద్ర ఇంటర్మీడియటు తోనే సరిపెట్టుకున్నాడు. తమకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ ఊళ్ళోనే ఉంటున్నాడు.

వీళ్ళు నలుగురూ బాల్య మిత్రులు. పదో తరగతి వరకు కలిసే చదువుకున్నారు. చదువు, ఉద్యోగరీత్యా దూరప్రాంతాలకు వెళ్ళినా అప్పుడప్పుడూ ఫోన్లో పలకరించుకుంటూనే ఉంటారు. భోగి పండక్కి ముందురోజు విజయకుమార్‌ తన ముగ్గురు మిత్రులకి ఫోన్‌ చేసి సాయంత్రం ఐదు గంటలకంతా ఊరి సెంటరుకి వచ్చేయమని చెప్పాడు. చిన్నతనం నుంచి ప్రతి సాయంత్రం సముద్ర తీరానికి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం వాళ్ళకి అలవాటు. ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళలో వుండటం చేత ఈమధ్య అంతరాయం ఏర్పడింది. అందువల్ల సముద్రం దగ్గరకేమో! అనుకున్నారు మిగతా వాళ్ళంతా.
ఆరోజు సాయంత్రం ఊళ్ళో ఎక్కడ చూసినా భోగి మంటల హడావిడి కనిపిస్తోంది. పండగరోజు కూర కోసం కోళ్ళు తెచ్చేవాళ్ళు ఓ వైపు. వేట మాంసం కోసం పొట్టేళ్ళు, మేక పోతులు తోలుకొచ్చేవాళ్ళు మరొకవైపు. వేకువజామున వేసే భోగి మంటల కోసం సవకాకు, తాటాకు తెచ్చేవాళ్ళు కొందరు. ఇచ్చిన కొత్త బట్టలు ఇంకా కుట్టివ్వని టైలర్ల చుట్టూ బిక్కమొహాలేసుకుని తిరు గుతూ మరికొందరు. ఎటు చూసినా పండగ వాతావరణమే!
చెప్పిన సమయానికి మిత్రులంతా సెంటరుకి చేరుకున్నారు. ఊళ్ళోవాళ్ళ హడావిడి చూస్తూ రచ్చరుగుమీద కూర్చున్నారు. చిన్నగా మాటల్లోకి దిగారు. తెలిసిన వాళ్ళ పలకరింపుల్తో అప్పుడప్పుడూ ఆ మాటలకి అంతరాయం కలుగుతోంది.
''ఇక్కడే ఎంతసేపు కూర్చుంటాంరా! సముద్రం దగ్గరకి వెళదాం పదండి'' అన్నాడు గోపాలకృష్ణ
''ఎప్పుడూ సముద్రం దగ్గరకేనా? ఇంకేదైనా కొత్త ప్రదేశానికి వెళదాం'' అన్నాడు విజయకుమార్‌
''ఇంకెక్కడికెళతాం? ఇదేమీ బెంగుళూరో, హైదరాబాదో కాదు కదా!'' సుధాకర్‌ ప్రశ్న
'' కొత్త ప్రదేశాలు బెంగుళూరు, హైదరాబాదుల్లోనే ఉంటాయా! ఇక్కడేమీ ఉండవా?'' విజయకుమార్‌
''ఎందుకుండవూ... మనసులో బలంగా కోరుకుంటే అన్నీ ఇక్కడే ఉంటాయి. అటువంటి విషయాల్లో మన చుట్టుపక్కల ఊళ్ళు కూడా మీ నగరాలకేమీ తీసిపోవు'' తల గోక్కుంటూ అన్నాడు నాగేంద్ర.
''మనసులో లేకుంటే నేనెందుకు అడుగుతాన్రా?'' నవ్వాడు విజయకుమార్‌
''అయితే వినండి. ఒక్కొక్కరికి ఉద్యోగాలొచ్చినప్పుడు మీరేం చెప్పార్రా?'' ప్రశ్నించాడు నాగేంద్ర. అందరూ మౌనంగా ఉన్నారు.
నాగేంద్ర అందుకున్నాడు : ''అప్పుడు ఇస్తానన్న పార్టీ ఈ రోజు ఇవ్వండి! పండగ సందర్భం కూడా కలిసొస్తుంది''
''నిజమేననుకో! కానీ ఈ చుట్టుపక్కలంటే మనందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అందరూ తెలిసినోళ్ళే. టౌన్లో అయితే పర్వాలేదు. అక్కడ ఎవరికెవరో! అసలే మనకు మంచి పిలకాయల మని పేరు. మనల్ని ఎవరు చూసినా అంతే సంగతులు!'' అన్నాడు విజయకుమార్‌. దాంతో ఏకీభవించాడు గోపాలకృష్ణ.
''నాకలాంటి పట్టింపులేమీ లేవురా. మీరెక్కడికి తీసుకెళితే అక్కడికొస్తాను'' నవ్వుతూ అన్నాడు నాగేంద్ర.
''నీకెందుకుంటుందిరా! బాగా తాగడం అలవాటైపోయింది'' చిరుకోపం ప్రదర్శించాడు సుధాకర్‌
''ఏం అలవాటు లేరా! నెలకోసారి తాగడం కూడా అలవాటేనా'' - నాగేంద్ర
''ఇప్పుడు నెలకనుకో. ఆ తరవాతా...! ఊళ్ళో పరిస్థితులు అసలే బాగాలేవు. కొంచెం వయసొచ్చిన పిలకాయల్నించి పండు ముసలోళ్ళ వరకూ అందరూ తాగుతున్నారు. పోనీ తాగినోళ్ళు గుట్టుగా ఇంటికెళతారా అంటే అదీ లేదు. వీధుల్లోకొచ్చి గొడవ చేస్తారు. తాగొచ్చినోళ్ళని చూస్తే మిగతా వాళ్ళు అసహ్యించుకునే పరిస్థితులున్నాయిరా!'' అన్నాడు సుధాకర్‌.
''నేననుకున్నా. పార్టీ అంటే ఏదో కారణం చెప్పి తప్పించు కుంటాడు వీడు. ఇప్పుడు మీరు ఇస్తానంటుంటే అడ్డుపుల్ల లేస్తున్నాడు'' నిష్ఠూరపోయాడు నాగేంద్ర.
''పోరా.. పరిస్థితులనర్థం చేసుకోకుండా ఎన్నన్నా అంటావు! ఇక్కడ చీమ చిటుక్కుమన్నా అందరికీ తెలిసిపోతుంది. ఊళ్ళో మంచి పిలకాయలమనే పేరుంది మనకు. దాన్నెందుకు చెడగొట్టు కోవాల. మొన్నటికి మొన్న ఆ ఖాసిం గాడు, శీనిగాడు ఇద్దరూ ఎక్కడో దొంగచాటుగా కొంత పుచ్చుకున్నారు. వచ్చే దోవలో ఏమైందో ఏమో! కలబడి కొట్టేసుకున్నారు. తెల్లారి రెండు కుటుంబాల మధ్య పంచాయతీ...'' సుధాకర్‌
''ఇంతకీ ఏ విషయంలో గొడవపడ్డారు''అడిగాడు గోపాలకృష్ణ.
''అసలు విషయం పంచాయతీలో బయటపడింది. మామిడి తోపుకి కాపలా ఉండే రామయ్య కూతురు రేణుక తనను ప్రేమిస్తుం దని ఖాసిం గాడన్నాడంట. కాదు నన్నే ప్రేమిస్తుందని శీనుగాడు. మాటా మాటా పెరిగింది. కలబడి కొట్టేసుకున్నారు'' చెప్పాడు సుధాకర్‌.
''పొట్ట చేత్తో పట్టుకుని మనూరొచ్చి మామిడి తోటకు కాపలా కాస్తూ వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళని వీధుల్లో పెట్టడమెందుకురా?'' అన్నాడు విజయకుమార్‌.
''వాళ్ళు కాదు కదా! వాళ్ళల్లో జొరబడిన మందు ఆ పని చేసింది'' అన్నాడు సుధాకర్‌
''మందే ఆ పని చేస్తే ఊళ్లో రోజూ ఎన్నెన్ని గొడవలు జరగాల. ఆ అమ్మాయిలో ఏమి చూశారో.. నాదంటే నాదని కొట్టేసుకున్నారు'' - నాగేంద్ర.
''ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో!'' సుధాకర్‌
''అంతంత పెద్ద మాటలెందుకులేరా! వాళ్ళ గుండెలోతుల్లోకి పోయి చూడండి. అర్థమౌతుంది.'' ముసిముసి నవ్వులతో అన్నాడు నాగేంద్ర.
''అబ్బో... పెద్ద తత్త్వవేత్త బయల్దేరాడు గుండె లోతులు చదవడానికి. ఇంతకీ నువ్వెన్ని గుండె లోతుల్ని చదువుతున్నావురా! - అడిగాడు గోపాలకృష్ణ సరదాగా
''అవన్నీ చుక్కపడితేగానీ బయటికి రావురా!'' మెలికలు తిరుగుతూ నవ్వాడు నాగేంద్ర.
''వీడు మన్మధావతారమెత్తి చాలా రోజులే అయ్యింది. వాటి గురించి మొదలు పెడితే భోగిమంటలు ఇక్కడే వేసుకోవాల.'' అన్నాడు సుధాకర్‌ నవ్వుతూ.
''అసలు విషయం వదిలేస్తారు. మిగతావన్నీ విషయాలు మాట్లాడతారు. ముందు పార్టీ విషయం తేల్చండహె!'' కొంచెం గట్టిగానే అన్నాడు నాగేంద్ర.
''ఒరేరు... చిన్నగా మాట్లాడరా. పార్టీ ఇవ్వడానికి నాకేమీ ఇబ్బంది లేదు. ఈ చుట్టుపక్కలైతే ఇబ్బందిగా ఉంటుందని మా అభిప్రాయం.'' అన్నాడు విజయకుమార్‌.
కొంచెంసేపు ఆలోచించి ఏదో గుర్తుకొచ్చిన వాడిలా చిటికేస్తూ అన్నాడు నాగేంద్ర. ''అయితే ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఒక బారుందిరా. ఆ బారు వెనుక తోటలో కుర్చీలు, టేబుళ్ళేసుం టారు. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాను. అక్కడైతే మన పరువుకొచ్చే ఇబ్బందేం వుండదు. సరేనా!''
మిగతా ఇద్దరూ సుధాకర్‌ వైపు చూశారు.
''ఇక తప్పేటట్టులేదుగా. సరే వెళదాం'' అన్నాడు సుధాకర్‌.
సుధాకర్‌, గోపాలకృష్ణ తమ ఇళ్ళకెళ్ళి మోటారు సైకిళ్ళు తీసుకొచ్చారు. నలుగురూ అనుకున్న చోటుకు చేరుకున్నారు.
ఙఙఙ
సందడి అంతా అక్కడే కనిపిస్తోంది. మద్యం ప్రియులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయుంది. ఓ పక్క జనతా బార్‌. మరోపక్క గార్డెన్‌ బార్‌. రంగురంగుల రేకుల ఫెన్సింగ్‌ ఆ రెండింటిని వేరు చేస్తోంది. ఎక్కువ ఖర్చు భరించలేని వాళ్ళు మద్యం, నీళ్ళు కొనుక్కుని అవతలి వైపున్న జనతా బార్లో కింద కూర్చుని తమ లోకంలో తాము విహరిస్తున్నారు.
గార్డెన్‌ బార్లో ఒక క్రమ పద్ధతిలో పెంచిన పోకడ్‌ చెట్లున్నాయి. ఆ చెట్ల మధ్యలో ఒక్కో దగ్గర ఒక టేబుల్‌, నాలుగు కుర్చీలు వేశారు. ఒక టేబులు దగ్గర కూర్చున్న వారికి వేరే టేబులు దగ్గర కూర్చున్న వాళ్ళు కనపడకుండా ఏర్పాటు చేశారు. టేబుళ్ళ దగ్గర కూర్చున్న అందరికీ కనిపించేటట్టు గార్డెన్‌ రెండు వైపులా పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. ఆ తెరల మీద టీవీ ప్రోగ్రాములు. ఊళ్ళో తమకున్న మంచిపేరు గుర్తుకొచ్చి ముగ్గురికీ కొంచెం బెరుగ్గానే ఉంది. నాగేంద్ర అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు.
ఓ మూల టేబుల్‌ ఖాళీగా కనపడితే అక్కడ తిష్ఠేశారు నలుగురూ. వెయిటర్‌ ఆర్డర్‌ తీసుకోడానికి వచ్చాడు. ''ఏం తీసుకుంటావురా'' అని నాగేంద్రని అడిగారు మిగతావాళ్ళు.
''నాకు పలానా బ్రాండు తాగాలని ఏమీ లేదురా. మీరేం తీసుకుంటే అదే తీసుకుంటా'' నాగేంద్ర సమాధానం.
విజయకుమారే ఆర్డర్‌ చేశాడు. ఒక ఫుల్‌ బాటిల్‌ విస్కీ, స్టఫ్‌, వాటర్‌, సోడాలతో సహా అన్నీ తెచ్చాడు వెయిటర్‌.
ఒక్కో గ్లాసులో విస్కీ పోసి తగినంత సోడా, వాటర్‌ కలిపి ఒక్కొక్కరి ముందు ఒక్కోటి పెట్టాడు. తెచ్చిన స్టఫ్‌ కూడా నాలుగు ప్లేట్లలో సర్ది నలుగురి ముందు పెట్టి వేరే ఆర్డర్‌ తీసుకోడానికి వెళ్ళిపోయాడు. నలుగురూ చీర్స్‌ చెప్పుకుని గ్లాసులు ఎత్తారు. ముగ్గురూ కొంచెం సిప్‌ చేసి దించారు. నాగేంద్ర మాత్రం ఖాళీ గ్లాసు దించాడు.
''అంత స్పీడుగా ఎలా తాగుతావురా'' అన్నాడు గోపాలకృష్ణ.
''అలా తాగడం మంచిది కాదురా'' అంటూ వారించ బోయాడు విజయకుమార్‌.
''తాగేటప్పుడు మంచీ చెడులెందుకులేరా'' అంటూ బాటిల్లోంచి కొంచెం విస్కీ తన గ్లాసులోకి ఒంపుకున్నాడు నాగేంద్ర. వాడు తాగే స్పీడు చూసి మిగతా వాళ్ళు కంగారు పడ్డారు.
సమయం గడిచేకొద్దీ చీకటి చిక్కబడుతోంది. ప్రతి ఒక్కరిలో రెండో మనిషి మేల్కొంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే వాళ్ళ మాటలు సాగదీతతో బయటకొస్తున్నాయి. ''తాగుచుండే బుడ్డి/ తరుగుచుండే కొద్ది/ మెదడు మేయును గడ్డి ఓ కూనలమ్మా!'' అన్న ఆరుద్ర మాటలు నిజమౌతున్నాయి.
''ఇప్పుడు చెప్పరా.. నువ్వెన్ని... గుండె లోతుల్ని... చదివావో!'' కదిలించాడు విజయకుమార్‌.
''మీకంటే ఎక్కువెక్కడ చదూకున్నాను. చదూతోపాటు ఆ విషయాల్లోనూ మీరే ఫస్ట్‌ కదరా'' అన్నాడు నాగేంద్ర కన్నుకొడుతూ.
''తిప్పి తిప్పి... మా మీదకే... తోస్తావేందిరా'' నవ్వాడు గోపాలకృష్ణ.
''లేకపోతే ఏందిరా... నా విషయాలు మాత్రం మీక్కావాల. మీ విషయాలు మాత్రం నాకు చెప్పకూడదు. అంతేకదా'' చేతులు తిప్పతా అన్నాడు నాగేంద్ర.
''చచ్ఛా... అదేం లేదురా... ఇన్నాళ్ళ మన స్నేహంలో... నిన్ను వేరుగా ఎప్పుడన్నా చూశామా? ఏదో సరదాగా కూచున్నాం. ఊళ్ళో యవ్వారాలు నువ్‌ చెబితే సరదాగా నవ్వుకోవచ్చు. అంతకు తప్పితే ఇంకోటి కాదురా'' అన్నాడు విజయకుమార్‌.
''ఇష్టమైతేనే చెప్పు. లేకపోతే వదిలేరు!'' అన్నాడు గోపాలకృష్ణ.
''నాదేముందిరా. సేద్దిం చేసుకునేటోణ్ణి. ఊళ్లో యిలాంటి యవ్వారాలు తప్పవురా'' అన్నాడు నాగేంద్ర.
''చేసిన పనిని ఎలాగైనా సమర్ధించుకోవాలి గదా!'' నాలిక తిప్పతా అన్నాడు సుధాకర్‌.
''రేరు!... నువ్వు యిలాంటి గాలి మాటలు మాట్లాడబాక. ఇందాగ్గూడా ఇట్టాగే మాట్లాడావు. అడెవడూ... ఆ... ఆ... నేను మనమధావతారమెత్తానా? నువ్‌ మాత్రం నంగనాచి టింగు బుర్రవా? నీ యవ్వారం నాకు తెలీదనుకోబాకు'' నాగేంద్ర.
''నా యవ్వారం నీకేం తెలుసురా? ఇప్పుడే సెప్పు. నేనేం ఆంబోతులాగా ఊరి మీద పడి తిరిగే రకం కాదు'' అరిచాడు సుధాకర్‌.
''నన్ను ఆంబోతంటావురా! నాలుగు రూకలు సంపాయించు కుంటానే కళ్ళు నెత్తికెక్కాయిరా నీకు'' రెట్టింపు గొంతుతో అరిచాడు.
ఇద్దరూ కలబడబోయారు. విజయకుమార్‌, గోపాలకృష్ణ తూలుతూనే ఇద్దరిని విడదీశారు. అప్పటికే అందరూ వీళ్ళవైపే చూస్తున్నారు.
''పండగ రోజు ఏదో సరదాగా కాలక్షేపం సేద్దామంటే మీరేందిరా ఇలా గొడవలు బెట్టుకుంటుండారు. ఇలాగే ఉంటే మన పరువు గంగలో కలిసిపోతుంది'' కోపంగా అన్నాడు విజయ కుమార్‌.
''మీరిద్దరంటే నాకు ఎప్పటికీ గౌరవమే. మీరేం చెప్పినా వింటాను. కానీ... ఆ సుధాకర్‌ గాడు ఏం వాగుతున్నాడో చూడరా. వాడు టౌనుకు పోయినప్పుడు ఏమేమి చేసొస్తుండాడో అన్నీ నాకు తెలుస్తుండాయి. ఎప్పుడైనా ఒక్క మాట మీతో అన్నానా. మీరిద్దరూ చెప్పండ్రా!'' అన్నాడు నాగేంద్ర చేతులూపుతూ...
''టౌన్లో నేనేం చేశాన్రా! దమ్ముంటే చెప్పు. ఈ యవ్వారం ఇక్కడే తేలిపోవాల'' పళ్ళు పటపటా కొరుకుతూ గట్టిగానే అరిచాడు సుధాకర్‌.
''సత్యవంతుడి మాటలు మాట్లాడబాకు. నేను గనక నోరు తెరిస్తే ఈళ్ళ ముందు నీ పరువు ఉష్‌! ఏమనుకుంటుండావో ఏమో!'' అంతే గట్టిగా బదులిచ్చాడు నాగేంద్ర.
''అంత కోపంగా ఎందుకు మాట్లాడుకుంటార్రా. సరదాగా మాట్లాడుకుందాం'' సర్దబోయాడు విజయకుమార్‌.
''అది కాదు విజరు. నా గురించి ఏదో తెలుసని వాగుతున్నా డోడు. ఏం తెలుసో వాడిక్కడే కక్కాల. లేకపోతే ఊరుకునేది లేదు.'' సుధాకర్‌ రెచ్చిపోతున్నాడు.
''ఊరుకోక ఏమి చేస్తావురా'' అంటా తూలుతూ సుధాకర్‌ మీదకి పోయాడు నాగేంద్ర. కోపం పట్టలేక టేబుల్‌ మీదున్న బాటిల్‌ తీసుకుని నాగేంద్ర నెత్తిమీద ఒక్కటేశాడు సుధాకర్‌. తల పగిలి రక్తం కారుతోంది. అందరూ గుమిగూడారు. ఏదైతే జరక్కూ డదనుకున్నారో అదే జరిగిపోయింది. మత్తు కమ్మిన ఆ రాత్రి వాళ్ళ పరువు పోలీస్టేషను కెక్కింది. వాళ్ళ పెద్దలు కేసులేమీ లేకుండా చేసి నలుగుర్ని వాళ్ళ ఇళ్ళకు తీసుకొచ్చుకున్నారు.
ఙఙఙ
వేకువ జామున ఊరంతా మంచు తెరలు కమ్ముకున్నాయి. ఆ మంచు తెరల మాటున భోగి మంటల వెచ్చదనంలో గుసగుస లతో ఊరంతా చలి కాచుకుంటోంది. ముగ్గురిళ్ళల్లో కుంకుడుగాయ రసంతో తలంటుతూ సుప్రభాతాలు చదువు తున్నారు పెద్దోళ్ళు (నాలుగోవాడికి తల చిట్లింది కదా). కుటుంబా ల పరువు కలగలిసిన భోగి నీళ్ళు వీధుల్లో పారుతున్నారు!