సవాళ్లకు సిద్ధం చేసిన 2022

తెలకపల్లి రవి
కొత్త సంవత్సరం 2023లోకి ప్రవేశించాం. అది ఎన్నికల సంవత్సరం కూడా అవుతుంది. లోక్‌సభ ఎన్నికలూ 2024 మొదట్లోనే పూర్తి కావాలి. పాలక పార్టీలన్నీ ఎన్నికల జ్వరంలో మునిగిపోయాయి. నిజానికి ఇప్పటికే ఆ వాతావరణం చూస్తున్నాం. వివాదాలు పరాకాష్టకు చేరాయి. రాజకీయ సామాజిక జీవితంలోని ప్రతిరంగమూ ప్రకంపనలకు గురయింది. గతంలో ఎంత చెప్పినా అర్థం కాని అంశాలు ఇప్పుడు కొంత బోధపడుతున్నాయి. కోల్‌కతాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బిగ్‌ బి అమితాబ్‌ బచన్‌ దేశంలో ప్రాథమిక హక్కుల పరిస్థితి గురించి, భావస్వేచ్ఛ గురించి ఆవేదన ప్రకటించడం అందులో ఒకటి. గోవా చిత్రోత్సవంలో జ్యూరీ చైర్మన్‌ ఇజ్రాయిలీ దర్శకుడు లిపిడ్‌ 'కాశ్మీర్‌ ఫైల్స్‌' కేవలం చవకరకం ప్రచార చిత్రమని ధైర్యంగా కొట్టిపారేయడం మరొకటి. అత్యున్నత న్యాయస్థానం పౌరహక్కుల రక్షణ చేయలేకపోతే మేమెందుకని కేంద్రాన్ని ప్రశ్నించడం ఇంకోటి. ఈ మూదు సందర్భాలు కూడా దేశం ముందున్న ప్రధాన సవాలును సూటిగా చెబుతున్నాయి.
తెలుగునాట చూస్తే గురజాడ పురస్కారాన్ని ఛాందస ప్రవచన కారులకు ఇవ్వడంపై విస్తృత స్థాయిలో నిరసన వ్యక్తం కావడం పునరుద్ధరణవాద శక్తులపై ప్రగతివాదుల కదలికను చెబుతుంది. ఇదే సమయంలో సినిమా రంగంలో మతతత్వ భావాలతో కూడిన పునరుద్ధరణవాద సినిమా ప్రపంచ స్థాయికి చేరడం అందోళనా పెంచుతున్నది. మీడియా మోడియాగా మారే క్రమం కొనసాగింది. ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన సోషల్‌ మీడియాను కూడా పెద్ద పార్టీలు, వ్యాపార శక్తులు పక్కదోవ పట్టిస్తున్నాయి.
మార్కెట్‌ శక్తుల చెలగాటం ప్రపంచ కుబేరుల జాబితాలోని భారతీయ మహా సంపన్నులు లక్షల కోట్లకు ఎగబాకడం శరవేగంగా జరిగింది. బ్యాంకులు వారికి 13 లక్షల కోట్లకు పైగా కట్టబెట్టిన ఉదంతం అధికారికంగానే వెల్లడైంది. ఇక విశాఖ ఉక్కు బేరం కొనసాగుతున్నది. స్వయంగా కేంద్ర నేతలు ఖండించినా సింగరేణి గనులలో కొంత భాగం వేలానికి పెట్టడం ఈ కాలంలోనే జరిగింది. ఓడరేవులు, గనులు, విమానా శ్రయాలు అన్నీ ప్రయివేటు చేతుల్లోకి వెళుతున్నాయి. సంఘ పరివార్‌ మతతత్వం మార్కెట్‌ శక్తుల విశృంఖలత కలగలసిన మోడీ పాలన ఈ ఏడాది మరింత వెర్రితలలు వేసింది.
ఎన్నికలలో కొత్త పరిణామాలు
దేశం వివిధ ప్రాంతాలలో ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బిజెపి అయిదు తెచ్చుకుంది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ బలం మూడో వంతుకు పడిపోతే బిజెపి బలం బాగా పెంచు కొంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ విజయం కొంత ఊరట, ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలలో విజయం, అంతకు ముందు పంజాబ్‌లోనూ అధికారం చేపట్టి గుజరాత్‌లో 13 శాతం ఓట్లు తెచ్చుకోవడంతో ఆప్‌కు జాతీయ హౌదా లభించింది. బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించకుండా మామూలు మాటలకే ఆప్‌ రాజకీయ విధానం పరిమితమవడం సందేహాలు కలిగించింది. కేరళలో సిపిఎం రెండోసారి విజయం సాధించి సుదీర్ఘకాల వరవడిని మార్చింది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఈ ఏడాదిలో బిజెపితో తెగతెంపులు చేసుకుని మళ్లీ తేజస్వి యాదవ్‌ ఆర్జేడీతో కలిశారు. బిజెపిపై తీవ్ర విమర్శలు చేయడం మొదలెట్టారు. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి మోడీ విధానాలపై విరుచుకుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ బీహార్‌ వెళ్లినపుడు కూడా ఈ ప్రసక్తి రాగా ఆయన దాటవేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కెసిఆర్‌తో నడుస్తున్నారు. బిఆర్‌ఎస్‌ ఎపికి విస్తరించాలని చూస్తోంది.
ప్రాంతీయ పార్టీల పాట్లు
మరో వంక తెలంగాణలో అస్త్ర సన్యాసం చేసి ఎ.పి కే పరిమితమైన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఖమ్మం సభతో పున:ప్రారంభం చేశారు. ఆరెస్సెస్‌ బాధ్యులొకరు ఇచ్చిన సలహా మేరకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎ.పి ఎన్నికల్లో బిజెపితో మెప్పు కోసమేనని కూడా చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌తో కలిస్తేనే తమకు గట్టి మెజార్టీ వస్తుందని టిడిపి అంతర్గత సర్వే తేల్చిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏమైనా టిడిపి రాజకీయం అక్కడే పరిభ్రమిస్తోంది. మరోవైపున వైఎస్‌ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం కూడా రాజకీయ ప్రశ్నలకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వం బిజెపికి కేంద్రంలో అనుకూలంగా వుంటూనే తెలంగాణపై ఆసక్తి లేదని ప్రకటించింది. జనసేన పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికీ ఓట్లు చీలనివ్వబోనని ఒకసారి, ప్రజల మద్దతు వుంటే తనే ముఖ్యమంత్రి అవుతానని మరోసారి రకరకాలుగా మాట్లాడుతూ తమ శ్రేణులనూ ఇతరులనూ కూడా తికమక పెట్టారు. ప్రధానంగా కాపులను తమ వైపు తిప్పుకోవడానికి వివిధ రాజకీయ పార్టీలు తమతమ వ్యూహాలతో హంగామా చేస్తున్నాయి. ఇతరత్రా కూడా కుల రాజకీయాలు బాగా పెరిగాయి. తెలంగాణ, ఎ.పి మళ్లీ కలిసే అవకాశముంటే తాము ముందుంటామని వైసీపీ చేసిన ప్రకటన, దానిపై తెలంగాణ నేతల దాడి మరోసారి విభజన రోజులను గుర్తు చేసింది. ఎ.పి ప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారంలో జాప్యంపై సుప్రీం కోర్టులో తెలంగాణపై కేసు వేసింది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఆరు నెలల గడువు లోపు అమరావతినే కట్టాలం టూ ఎ.పి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు ఆ మేరకు నిలిపేసింది. మార్గదర్శికీ వైసీపీకి ఘర్షణ పునరావృతమైంది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఎల కొనుగోలుకై బిజెపి దళారులు దిగిపోవడం సంచలనం సృష్టించింది. మునుగోడు ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల మద్దతుతో బిఆర్‌ఎస్‌ గట్టెక్కడమే గాక భవిష్యత్‌ సమీకరణాలను గురించి ప్రశ్నలు లేవనెత్తింది. కెసిఆర్‌ కుమార్తె కవితను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రితో పాటు లిక్కర్‌ స్కామ్‌ ఛార్జిషీట్‌లో చేర్చడం, వైసీపీ ఎం.పి విజయసాయి రెడ్డి దగ్గర బంధువులను దాంట్లో ముద్దాయిలుగా చేర్చడం దేశం దష్టిని ఆకర్షించింది.
అంతర్జాతీయ రంగంలో..
అంతర్జాతీయంగా ఫిబ్రవరిలో మొదలైన రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతూనే వుంది. భారతదేశం యుద్ధ విరమణ జరగాలంటూనే రష్యా దగ్గర చమురు కొనే హక్కును నిలబెట్టు కుంది. జి20 నాయకత్వం దేశానికి రావడం, దానిపై ప్రధాని అఖిలపక్ష చర్చ నిర్వహించడం బట్టి చూస్తే ఎన్నికల్లో దీన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకోవడం తథ్యమని స్పష్టమైంది. భారత చైనా సరిహద్దుల్లో కొన్ని ఘర్షణలు పునరావృతమైనా రెండు దేశాలు వాటిని శ్రుతి మించకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ విషయంలో బిజెపి దాగుడుమూతలు ఒకవైపు, కమ్యూనిస్టేతర ప్రతిపక్షాల అతి స్పందన మరోవైపు, మీడియా అత్యుత్సాహం ఇంకోవైపు వివాదాన్ని పెద్దగా చూపుతున్నా అదే సమయంలో ఇరుదేశాల సంప్రదింపులు కూడా కొనసాగు తున్నాయి. చైనా అద్యక్షుడుగా సీ జిన్‌ పింగ్‌ మరోసారి ఎన్నిక కావడం గురించి బడా మీడియా ఉధృత కథలు వదలినా చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభ వాటిని వమ్ము చేసింది. ఇప్పుడు మళ్లీ కరోనా ఆంక్షలపై తిరుగుబాటు అనీ, వాటిని సడలించిన తర్వాత విచ్చలవిడిగా కరోనా విజృంభణ అని గతంలో లాగే విపరీత ప్రచారం కొనసాగుతోంది. గొప్ప సంపదగా ప్రచారమైన క్రిప్టో కరెన్సీ ఇంతలోనే కూలిపోయింది. రిజర్వు బ్యాంకు భారతీయ డిజిటల్‌ నోట్‌ను లాంఛనంగా విడుదల చేసింది. కరోనా కాలంలో ఎన్నో ఒడుదుడుకులు చూసిన ఐటి రంగంలో 2008 మాంద్యాన్ని మించిన తొలగింపులు ఖాయమంటున్నారు. దేశంలో కోవిడ్‌ వేరియంట్‌ ప్రవేశం ఘటనలు పెరగడంతో గతానుభవాల నేపథ్యంలో తీవ్రమైన సందేహాలు అలుముకుంటు న్నాయి. ప్రధాని మోడీ తనదైన శైలిలో భిన్న సంకేతాలు ఇస్తూ ఉత్కంఠ పెంచుతున్నారు.
వివిధ రంగాల పరిస్థితి
మత సామరస్యంపైనా లౌకిక వాదుల పైన దాడులు 2022లో పెరిగాయి. ప్రార్థనా స్థలాల చట్టం-1991 వున్నా కాశీ, మధుర మందిరాలపై కోర్టులు విచారణ చేశాయి. కాశ్మీర్‌లో 370 రద్దు, పౌరసత్వ సవరణచట్టం సమీక్ష, ఎన్నికల బాండ్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామకంలో లొసుగులు, నగదు రద్దు నిర్ణయం సమీక్ష వంటి కేసులన్నీ ఇంకా విచారణలోనే వున్నాయి. బిజెపి యేతర పార్టీలపై ఇ.డి, ఐ.టి, సిబిఐలను ప్రయోగించే త్రిశూల వ్యూహం తీవ్రంగానే అమలైంది. రాష్ట్రాలకు నిధుల కోత, హక్కులపై కేంద్రం దాడి మరింత ఉధృతమైంది. గవర్నర్ల జోక్యం పరాకాష్టకు చేరింది. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీసే ప్రయత్నం పెద్ద ఎత్తున సాగుతోంది. సుప్రీం కోర్టు ఈ ఏడాదిలో ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులను చూసింది. ప్రజల తరపున పోరాడే కొద్దిమందికి ఉపశమనం లభించినా అనేక మంది నిర్బంధం లోనే వున్నారు.
భారతీయ సినిమా రంగం కరోనా దెబ్బ నుంచి కోలుకుని మళ్లీ ఉత్సాహం పుంజుకోవడమేగాక ఓటిటి ప్రభావం పెరిగింది. సినిమా రంగంలో ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప, కెజిఎఫ్‌2, కాంతార... వంటివి అంతర్జాతీయ రికార్డులు సాధించి బాలీవుడ్‌నే గాక హాలీవుడ్‌ను కూడా కుదిపేశాయి. కాకుంటే మొదట ప్రస్తావించుకున్నట్టు వీటిలో పునరుద్ధరణవాద ధోరణులూ పెరిగాయి. కొద్దో గొప్పో సామాజిక న్యాయ భావనను, దిగువ వర్గాల అభ్యున్నతిని చెప్పిన దర్శకులు కూడా వ్యాపార అవసరాల కోసం వాతావరణంలో ఇమిడిపోవడం కోసం ఇలాటి సినిమాలకు పట్టం కట్టడం ఆందోళనకరం. కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, చలపతిరావు వంటి దిగ్గజాలు ఈ ఏడాది దూరమయ్యారు. మధురాంతకం నరేంద్ర నవలకూ, వారాల ఆనంద్‌ అనువాదానికి, బాల సాహిత్యంలో పత్తిపాక మోహన్‌కు, యువ పురస్కారంగా పల్లిపట్టు నాగరాజుకూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు దక్కడం హర్షం కలిగించింది. వివిధ రంగాల్లో ప్రతిభావంతులు, యవశక్తులు ప్రతికూల పరిస్థితుల్లోనూ పలు విజయాలు సాధించారు.
విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, పెరిగే ద్రవ్యోల్బణం, అధిక ధరల పోటు వీటి మధ్య మోడీ సర్కారు గొప్పలు కుప్పకూలుతున్నాయి. పాలక వర్గాలు తమ జీతభత్యాలపైనా గతంలో సాధించుకున్న హక్కులపైనా ఉపాధి, ఉద్యోగ భద్రతలపైనా చేస్తున్న దాడులను కార్మికవర్గం గట్టిగా ప్రతిఘటించింది. గత ఏడాది మోడీ హామీలతో తీవ్ర ఆందోళన విరమించిన రైతాంగం హామీలు వమ్ము చేసిన కేంద్రంపై మరోసారి పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. మహిళలు తమపై కొనసాగుతున్న దాడులనూ అవకాశాల నిరాకరణనూ నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నారు. చివరగా ముంచుకొస్తున్న కరోనా ముప్పును ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధమవు తున్నారు. అందుకే అనేక విధాల 2022 కొత్త సవాళ్లకు సమాయత్తం చేసిన కాలంగా మిగిలిపోయింది.