ఒక అపురూప వర్ణచిత్రం

మందరపు హైమవతి
94410 62732

తినడానికి గుప్పెడు మెతుకులు కరువై ఆకలిరాగం పాడుతున్నపుడు కన్నతల్లిలాంటి ఉన్న ఊరిని వదిలి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తాడు మానవుడు. సంతానోత్పత్తి కోసం చలి దేశాల నుంచి ఉష్ణ దేశాలకు వలస వస్తాయి పక్షులు. గాలిలో గాలై, నేలలో నేలై, ఊపిరిలో ఊపిరై జీవించిన జన్మభూమిని వదిలి తనవారంటూ ఎవరూ లేని చోటుకి, అంతా కొత్త కొత్తగా ఉండే పరాయి భూమికి వలస వెళ్ళడం ఎంత విషాదకరం! మనుషులకైనా, పక్షులకైనా ఇది బాధాకరం. తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఏటా మంచు కురిసే సైబీరియా నుంచి ఎండలు కురిసే మన రాష్ట్రానికి వలస వస్తాయి ఫ్లెమింగో పక్షులు. ఈ వలస పక్షుల జీవన గమనాన్ని గురించి వర్ణించిన కావ్యమే 'ఫ్లెమింగో'. దీర్ఘ కవితా ప్రక్రియకు చెందిన ఈ కావ్యాన్ని ప్రసిద్ధ కవి, నెల్లూరు నివాసి పెరుగు రామకృష్ణ రచించారు.
దీర్ఘ కవితకు వస్తువు ముఖ్యం. తీసుకున్న వస్తువును చివరి వరకు ఏక సూత్రతకు భంగం కాకుండా నిర్వహించడం కవికి కత్తిమీద సాము. కథాకథన చాతుర్యం గల రామకృష్ణ ఈ కావ్యాన్ని మొదటినుంచి చివరివరకు ఎక్కడా బిగి సడలకుండా కొనసాగించారు. వాక్య నిర్మాణం, కొత్త కొత్త పద చిత్రాలు పాఠకుణ్ణి ప్రత్యక్షరం కుతూహలంగా చదివింప చేస్తాయి.
పక్షికీ, మనిషికీ అవినాభావ సంబంధం. ఇప్పుడైతే కాకులు కనబడకుండా పోయాయి కానీ, ఒకప్పుడు పెరట్లో అంట్లు వెయ్యగానే కావుకావుమంటూ ఎక్కణ్ణుంచో వచ్చి వాలిపోయేవి. మన అమ్మలు, అమ్మమ్మలు వసారాలో కూర్చొని బియ్యం ఏరుతూ పారేసిన వడ్లను ముక్కుతో పొడుచుకొని తినే పిచ్చుకలు, నాలుగ్గింజలు జల్లితే మన ముంగిట్లోకి గుంపులు గుంపులుగా వచ్చే పావురాలు, మనిషి అదృష్ట దురదృష్టాలను ముక్కున కరుచుకొన్న అట్టముక్కలతో జోస్యం చెప్పే చిలక పండితులు.. ఇలా నిత్య జీవితంలో ప్రతి క్షణమూ పక్షులతో రాగరాజితం. స్వేచ్ఛకు ప్రతీక పక్షి. ఆకాశంలో ఎగురుతున్న పిట్టల్ని చూసి పక్షిలా ఎగిరిపోతే బాగుండునని అనుకోని వాళ్ళుండరు. ప్రతిరోజూ ఉదయాస్తమయాల్లో ఆకాశంలో బారులు తీరి ఎగిరే పక్షుల్ని చూస్తే ఎంతో ఆనందంగా వుంటుంది. అలాంటిది కొన్ని వేల విహంగాలు ఒక్కసారే ఆకాశంలో ఎగిరే దృశ్యం మరింత మహాద్భుతం.
నెల్లూరు జిల్లాలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం. అక్టోబరు నెల మొదట్లో సైబీరియా లాంటి సుదూర దేశాల నుంచి వలస వస్తాయి ఫెలికాన్‌ పక్షులు. ఇక్కడ ఈ పక్షులు గూళ్ళు కట్టుకొని జతకట్టి సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి. నేలపట్టుకి 1.5 కి.మీ దూరంలో పులికాట్‌ సరస్సు ఉంది. ఈ పక్షులు అక్కడకు వెళ్ళి ఆహారం సంపాదించి సాయంసంధ్యకి నేలపట్టులో తమ నివాసానికి చేరుకొంటాయి. ఆడపక్షులు గుడ్లు పెట్టి పొదగడంతో మగ పక్షులు వేటకి వెళ్ళి ఆహారాన్ని తెచ్చి ఆడ పక్షులకు అందిస్తాయి. ఆడ పిట్టలు పిల్లలను పొదుగుతాయి. 3,4 వారాల్లో పిల్లలు ఎగరడం నేర్చుకొంటాయి. అక్టోబరులో మన దేశానికి వచ్చిన పిట్టలు మార్చిలో పిల్లలతో సహా తమ దేశాలకు తరలి వెళ్ళిపోతాయి.
కవి ఈ వస్తువుని తీసుకొని ఫ్లెమింగో పక్షుల జీవన చిత్రాలకు తన కలం కుంచెతో రంగులు దిద్దారు. జీవితంలో ఎవరికైనా ప్రయాణం తప్పదు. ఉన్నచోటు నుంచి మరోచోటుకి తరలివెళ్ళడం ఒక ఆనందానుభవం. ''ప్రయాణం/ ఒక చలన లక్షణం/ పువ్వు ప్రయాణిస్తుంది పరాగమై/ పువ్వు నుంచి పువ్వు వరకు అనురాగమై పక్షి ప్రయాణిస్తుంది'' అంటూ ''ప్రయాణమే వలస పక్షుల జిగీష/ సంతానమే అనురాగ సాగర ప్రయాస'' అని సకల ప్రాణులకు సంతాన వృద్ధే జీవన పరమావధి అన్న వాస్తవాన్ని చెప్తారు.
రకరకాల అందమైన పక్షులు నేలపట్టుకి ఎగిరి వచ్చే సుందర దృశ్యాన్ని ''కెరటాల కాంక్షతో/ కడలి పరుగెత్తినట్లు/ తెరలుతెరలుగా గాలి ప్రవహించినట్లు/ ఊపిరూపిరులుగా జీవితం సాగిపోయినట్లు/ కాలం రెక్కలపై కదిలిన ఫెలికాన్లు / గాలికారుతో దూసుకొచ్చిన ఫ్లెమింగోలు/ పతంగులై ఎగిరొచ్చిన ఎర్రకాళ్ళ కొంగలు'' అని రకరకాల పక్షుల్ని అక్షరాకాశంలో చిత్రీకరిస్తారు. ఎక్కడినుంచో వచ్చిన పక్షులను ''ప్రేమ రాయబారులందరూ/ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నట్లు / నేలపట్టు ప్రకృతంతా రంగుల ప్రేమ సందేశాలు'' అని ఆ పక్షులు సంతానాన్ని కనడానికి నేపథ్యాన్ని సిద్ధం చేస్తారు.
సృష్టిలో అనేక ప్రాణులున్నాయి. ప్రాణులన్నిటిలో మనిషే స్వార్థపరుడు. తోటి ప్రాణులను తన ఉపయోగం కోసం వాడుకుంటాడు. పరోపకారం కోసం చెట్లు పూలు పూస్తాయి. కాయలు కాస్తాయి. కానీ రూపాయల మత్తులో మునిగి అన్నింటినీ అమ్ముకుంటాడు మనిషి. పశువులు తన పిల్లల కోసం పాలిస్తే, వాటిని అమ్ముకొంటాడు. ప్రవహించినంతమేరా తీరప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాయి నదులు. ఆ నీటిని అమ్ముకొని వ్యాపారం చేస్తాడు. కానీ పక్షికి స్వార్థం లేదు. దీనినే 'స్వార్థ చింతనే ఎరుగదు/ సంకుచితత్వంతో కుంచించుకు పోదు' అని అంటారు కవి.
అసలైన అనురాగానికీ, ప్రేమకీ ఉదాహరణలు పక్షులు. క్రౌంచ పక్షి మిథునంలో ఒక పక్షి మరణిస్తే మిగిలిన ఒంటరి పక్షి శోకిస్తుంది. కానీ డబ్బునే ప్రేమించే మనిషి భార్యతో కాపురం చేయడానికి కట్నం అడుగుతాడు. కానుకలు కోరతాడు. వరకట్నం కోసం సహచరురాలిని సజీవదహనం చేస్తాడు. లాభం కోసమో, మరొక కారణం కోసమో పరస్త్రీలతో సావాసానికి సిద్ధపడతాడు. కానీ పక్షులు ప్రేమమయ జీవులు. వాటి బంధం గొప్పదనాన్ని 'పక్షికీ అనుబంధాలుంటాయి/ అక్రమ సంబంధాలు లేవు/ పక్షులకీ సంఘ జీవనం ఉంటుంది/ సంఘ విద్రోహమే తెలీదు'' అని అంటారు. పిల్లలను పొదిగే ఆడపక్షికి మగపక్షే ఆహారం తీసుకొస్తుంది. 'సహనం సంయమనంతో/ పొదిగే ఆడపక్షికి/ పులికాట్‌ ఫలహారాన్ని/ ముక్కు కింద సంచుల్లో పొదుక్కొచ్చి/ పొడిచి పొడిచి తినిపిస్తుంది' అని తన సహచరి ఆడపక్షిపై ప్రేమను ప్రకటించడాన్ని కవి హృద్యంగా ఆవిష్కరిస్తారు.
సంవత్సరానికోసారి తమ దేశానికి వచ్చే అతిధులను ఎంతో ప్రేమతో అక్కున చేర్చుకొంటారు నేలపట్టు ప్రజలు. ఆ ప్రాంతాన్ని పక్షుల రక్షిత ప్రాంతంగా ప్రకటించింది ప్రభుత్వం. పుట్టింటి కొచ్చే ఆడపిల్లల్ని చూసినట్లుగా అక్కడి ప్రజలు ఆ పక్షుల్ని ప్రేమగా చూసుకొంటారు. ఏ వేటగాడూ తూటా గురిపెట్టకుండా కాపాడుకుంటారు. ప్రతిఫలంగా ఆ పిట్టలు రెట్టలు వేసి అక్కడి భూములను సారవంతం చేస్తాయి. 'తనపై ఏ తూటాను పేల్చనివ్వక / జాగ్రత్త వహించిన / ఆ పరిసర పల్లె ప్రజలకు/ పరోపకారిగా, కృతజ్ఞతా భావంతో/ తమ రెట్టలతో నేలపట్టు/ నేలను సారవంతం, ఫలవంతం చేసి / ముక్కారు కాపు/ కాన్కుగా ఇచ్చి వెళుతుంది' అని ఆ పక్షుల గొప్పతనాన్ని కొనియాడుతూ 'నిజాయితీకి నిబద్ధతకు / క్రమశిక్షణకు/ పక్షి మనిషికా ధర్మం కావాలి' అని అంటారు కవి.
నెల్లూరి నివాసియైన కవి వృత్తిరీత్యా సూళ్ళూరిపేటలో ఎన్నో సంవత్సరాలు ఉన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌లో ఎన్నోసార్లు పాల్గొన్నారు. అనేకసార్లు నేలపట్టు, పులికాట్‌ ప్రాంతాలు చూశారు. ప్రతి సంవత్సరం అక్కడకు వచ్చే విదేశీ పక్షులు కవి మనసులో ముద్రితమైపోయాయి. ఆ పక్షుల చిత్రాలను ఫ్లెమింగోలో రకరకాలుగా చిత్రిస్తూ 'ఒక్కో పక్షి ఎగరేసిన ఒక్కో కవితా పతాక/ రంగుల రామచిలక కలల ఖండ కావ్యం/ చీకటి అడుసు తొక్కిన నల్లకాళ్ళ కొంగ/ నీలి పులికాట్‌లో కాళ్ళు కడుగుతుంది/ రంగురంగుల సముద్రపు రాలుక/ గిలక బాయి చేదలా నీళ్ళలో జారుతుంది' అని విభిన్న భంగిమలలో ఉన్న పక్షులను కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.
పక్షుల్ని ప్రేమించిన కవి, విదేశీ పక్షులను చూసి పరవశించిన కవి 'ఆంక్షల్లేని ఆకాశం కింద అతిధి పక్షులు/ విశ్వ సౌభ్రాతృత్వ సందేశ వాహకులు/ ప్రణయ రహస్యాలెరిగిన మన్మధులు'' అని సంతానేచ్ఛతో ఒకటైన పక్షులను గురించి, 'విత్తంతైనా విశాల హృదయాలు వీళ్ళవి/ తరం నుంచి తరానికి ప్రాణ పరివేష్ఠి ఇహం నుంచి పరానికి పురాణగోష్టి/ పక్షులు కాలరాజు ఎగరేసిన కేతనాలు'' అని వర్ణిస్తారు.
మనుషుల్లాగా పక్షులు కూడా ప్రాణులే! సంతానాభివృద్ధి మనుషులకీ పక్షులకీ ఒకటే. ఈ పక్షుల సంతానోత్పత్తిని శృంగారరస భరితంగా మృదు మధురంగా చిత్రిస్తారు. 'ప్రతి కొమ్మా వాత్సాయన శిబిరం/ ప్రతిగూడు ప్రతివోత్థాన శిఖరం/ సంసార సుఖందినా విశ్వవృద్ధి లేదు / పక్షికి అందమే చైతన్య తేజం/ విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తు/ విశ్వవ్యాప్తికి మొదటి మెట్టు/ వలస పక్షుల సంతాన యజ్ఞానికి/ యాగ వేదిక పరిఢవిల్లిన కడప చెట్టు''. కడప చెట్ల మీదే ఈ పక్షులు నివసిస్తాయి. అక్కడే సృష్టి కార్యాన్ని నిర్వహిస్తాయి. ఈ విదేశీ పక్షుల వర్ణనలో కవి కలం మైమరచి పోతుంది. 'ఇంద్రియ చాపల్యం లేని విదేశీ యోగులు/ కాలచక్ర రహస్యం దర్శించిన దివ్య జ్ఞానులు/ దైౖహికానందమో, ఆనంద దైహికమో మరచి/ మన్మథుడు ఉన్నత యోగి అవుతాడిక్కడ/ ప్రకృతే ఈ నేలపై ప్రకృతి ధర్మం నెరవేరుస్తుంది/ పురుషుడై సృష్టి ధర్మం సాగిస్తుంది/ స్త్రీ పురుష వివక్షలేని సమానత్వం/ కళ్ళు తెరచిన వారికి వాంఛావాసన/ కళ్ళు మూసిన ముముక్షులకి/ ఆత్మ సాక్షాత్కారం' అని మానవ జీవన తాత్వికతను వ్యాఖ్యానిస్తారు.
ఈ పక్షులు తమ పిల్లలకి ఆహారం అందించే ప్రక్రియను మన కళ్ళ ఎదుట కనబడేటట్లు కవితా చిత్రాలు చిత్రిస్తారు. 'ముక్కున కరచి తెచ్చిన బేడిసని/ మురిపెంగా ముద్దరాలి కందిస్తుంది ఫ్లెమింగో'. పిల్లలు పెరిగి పెద్దవుతాయి. 'బుల్లి ఫ్లెమింగో రెక్కలాడిస్తూ/ పాము చేపను వేటాడుతుంది/ ముక్కు వంకరలకు ముకి పిట్ట/ మట్టి గిరుసను వెంటాడుతుంది/ రెక్కలొచ్చిన పిల్ల పక్షులకి/ ఆకాశం ఎంతో ఇరుకు'' అంటారు.
పక్షుల పండుగలోని అందాన్ని 'నేలపట్టు నుంచి పులికాట్టు వరకు/ రంగుల గంగాధారగా ప్రవహిస్తుంది/ పక్షుల పండుగ/ సంబరం అంబరాన్ని తాకుతుంది/ ఎరలేదు వలలేదు గాలం అదీ లేదు/ ముక్కే వేటాడే ఆయుధం/ ఆకలి యుద్ధం యేనాడాగదు'. ఈ సృష్టిలో ప్రతిప్రాణి ఆకలితో యుద్ధం చేయాల్సిందే. కష్టపడి విజయం సాధించాల్సిందే. ఎక్కడినుంచో తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇక్కడికి వస్తాయి పక్షులు. 'సంతాన సమృద్ధికి నేలపట్టు మానులేమహడీ/ ప్రళయకావేరి ప్రణయభావాల చర్చరి' అంటూ ఈ పక్షుల మీద అభిమానంతో 'వీటిని పరదేశి పక్షులన్న వాడు ఎవడో/ వలసత్వం వారసత్వం చేసినవాడెవడో/ ఇక్కడి పల్లె నుంచి వెళ్ళి/ అగ్రరాజ్యంలో పిల్లను కంటే/ ఆకుపచ్చ పతకంతో పాటు పౌరసత్వాన్ని దక్కించున్నట్లు/ ఇక్కడ పెట్టిన గుడ్డు పరాయిదెట్లౌతుంది/ ఈ నేల గుర్తిండిపోతుంది ప్రతి పక్షికి/ అందుకేగా తరలి వస్తుంది యేటేటా జన్మభూమికి'. ఈ ఫ్లెమింగో పక్షులు ఏ యేడాదికో ఒకసారి వచ్చి ఊరుకోవు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడికి తరలి వస్తాయి అని అంటారు.
ఈ కావ్యం కేవలం పక్షుల జీవితాన్ని మాత్రమే వర్ణించలేదు. సమాంతరంగా మానవ జీవన వ్యాఖ్యానం ప్రతి అక్షరంలో ప్రతిఫలిస్తుంది. నేడు నగరాల్లో, ఒక మాదిరి చిన్నచిన్న ఊళ్ళలో సైతం అపార్టుమెంట్‌ సంస్క ృతి విస్తరించింది. చెట్లమీద వాలిన పక్షులతో ఆకాశం ఇంద్రధనస్సు పూచినట్లుగా వుంటుంది. 'ఆకాశం రంగుపూలు పూచిన దృశ్యం/ రబ్బరు చెట్ల కొమ్మల్లో/ ఫ్లెమింగో ఫెలికాన్‌ల కాపురం/ విస్తరిస్తున్న అపార్టుమెంట్‌ సంస్క ృతిలో/ వేలాడుతున్న మనిషి కుటుంబాల ప్రతిబింబం' అని ఆధునిక నగర మానవ జీవితాన్ని కళ్ళకు కట్టిస్తారు కవి.
ఫ్లెమింగో పక్షులు ఏడడుగుల పొడవు వుంటాయి. మూడడుగుల పొడవు కాళ్ళతో, మూడడగుల పొడవు మెడతో ఒక అడుగు శరీరంతో తెల్లగా వుంటాయి. వీటిని సముద్ర రామచిలుకలు అని అంటారు. ఆకారాలు మాత్రమే కాదు, వాటి కూజితాలూ అందంగా ఉంటాయి. 'కువకువలు ప్రేమల్ని పొదిగే సింఫనీలో/ ఎన్నారై రెక్కల సంగీతం నేర్చే సరిగమ' అని వాటి అరుపులలోని మాధుర్యాన్ని అభివర్ణిస్తారు.
ఈ ప్రపంచంలో ప్రాణులన్నిటిలో మనిషి మేధావి. ఐనా స్వార్ధపరుడు. ప్రకృతితో మమేకమై జీవించవలసిన వాడు ప్రకృతిని వికృతిగా మార్చేస్తున్నాడు. మట్టితో అనుబంధం పెంచుకోవాల్సిన వాడు మట్టిని చూసి అసహ్యించుకుంటున్నాడు. కన్నతల్లిలాంటి భూమిని అమ్మకం సరుకుగా మార్చేశాడు. ఇలాంటి సమయంలో పక్షిని చూసి తన గుణగణాలను మానవులు మెరుగులు దిద్దుకోవాలని అంటున్నారు. 'బతుకు మూలాలు మరిచిన సమయంలో/ అంతర్ముఖాన్ని కోల్పోయిన మట్టి మనిషి/ మరయంత్రమై పోయాక/ ఇప్పటికైనా యిక/ పక్షిలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే'నని అంటారు.
'ఫ్లెమింగో కావ్యం' ఆద్యంతమూ ఆసక్తికరంగా చదివిస్తుంది. జలపాతం లాంటి శైలి. ఎక్కడా అవరోధం కలిగించదు. 'ఒక చీకటి ఖండం మీద నుంచి, ఒక వెలుగు మీదకు/ ఒక మంచుదేశం నుంచి/ ఒక ఉష్ణ ప్రాంతం వరకు/ రుతువుల వంతెన కడుతుంది'. ఇలాంటి వర్ణనలు హృదయాంగమంగా ఉంటాయి.
ఫ్లెమింగో చదివాక ఒక అపురూప క్యావం చదివిన అనుభూతి కలుగుతుంది. పక్షుల గురించి, అవి పిల్లలకు ఆహారం పెట్టే విధానం, ఇలాంటి సందర్భాల్లో ఆయా వర్ణనలు చదువుతుంటే రంగురంగుల వర్ణచిత్రం చూస్తున్నట్లే ఉంటుంది. ఇది కేవలం పక్షుల జీవితమే కాదు ఆధునిక మానవ జీవన వ్యాఖ్యానం కూడా. దీర్ఘకవితల కావ్యాల్లో 'ఫ్లెమింగో' ఒక విశిష్ఠమైన క్యావం. విభిన్న వస్తువులపై రాసిన దీర్ఘకవితా కావ్యాలు తెలుగు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఇలా పక్షులను వస్తువుగా తీసుకొని రాసిన దీర్ఘ కవితా కావ్యం ఇదేనని చెప్పవచ్చు. వస్తురూపాలు ఒకదానికొకటి పోటీపడి పాఠకుల హృదయాల్లో ప్రగాఢ ముద్ర వేస్తాయి. పుస్తకం చదివి మూసేసినా ఆ ఎగురుతున్న రంగు రంగుల ఫ్లెమింగో పక్షుల చిత్రాలు హృదయాకాశంలో ఎగురుతూనే ఉంటాయి ఎప్పటికీ.