అన్నపుముద్దకు ఆకలి

కోడం పవన్‌కుమార్‌
98489 92825

ఐదు వేళ్ళ మధ్య అమరిన అన్నపుముద్ద
నోటికాడికి చేరిందో లేదో
'అమ్మా ఆకలి ఇంత అన్నం పెట్టమ్మా' అని
ఓ పదేళ్ల కుర్రాడు దీనంగా అర్థిస్తున్నాడు
ఒక్కసారిగా నా దేహం ముక్కలయింది
బీడుబడ్డ పొలంలో కూలబడి
దీనంగా దిక్కులు చూస్తున్న రైతు కనిపించాడు
గిట్టుబాటు ధర అందక
రోడ్డుపాలైన టమాటాలు వెక్కిరిస్తున్నాయి
చేతికొచ్చిన పంటమీద
వడగళ్లు కురిసిన భీకర శబ్దం వినిపించింది
నకిలీ విత్తనాలతో నవ్వుల పాలైన పంట గుర్తుకొచ్చింది
పురుగుల మందో ఎరువుల మందో
బడుగు రైతు జీవం తీసుకుంటున్న దు:ఖం కురిసింది

ఈ మెతుకులు ఏ రైతు పండించినవి
చేతిలోని ముద్దను చూడగానే కళ్లు చెమర్చాయి
గుమ్మం దాటి వచ్చిన వాడి ఆకలి
నా కడుపును దేవినట్లయింది
గుమ్మం దాటి పోయిన నా చూపుకు
వాడు ఓ అన్నపుముద్దలా కనిపించాడు
ఆ ఒక్క పిడికెడన్నం
వాడి కడుపులోకి చేరి చేరగానే
ఎండిపోయిన నది పరుగులు పెడుతున్నట్లుగా
వాడి కళ్ళలో ఆనందం సుడులు తిరిగింది
పంట చేలలో పైరగాలిలో ఊగుతున్న రైతు దర్శనమిచ్చాడు