సప్తవర్ణాలు చిందించిన కవిత్వం

విశ్లేషణ

- జంధ్యాల రఘుబాబు9849753298

తెలంగాణలొ ''సింగిడి'' అంటే ఇంధ్ర ధనస్సు. కుమారి వింధ్యవాసినీ దేవి రాసిన ఈ ''నానీల సింగిడి'' సప్త వర్ణాలలో వెలుగుతూ వివిధ విషయాల్ని సూక్ష్మ రూపంలో మనకు తెలుపుతుంది. కర్నూలు కసిరెడ్డి వేంకటరెడ్డి పి.జి. కళాశాలలో సహాయక ఆచార్యులుగా పనిచేస్తూ, వివిధ సదస్సులతో ఊపిరి సలపకుండా ఉండే వీరు అప్పుడప్పుడూ రాసిపెట్టుకున్న నానీలతో కూర్చిన హరివిల్లే ఈ నానీల సింగిడి. అందులో ఎక్కువభాగం రెండువేల ఏడు, ఎనిమిది సంవత్సరాల్లో రాసినవి. చిన్నతనంలోనే తనువు చాలించిన తన సోదరి ఇందిరా ప్రియదర్శినికి అంకితమిచ్చిన ఈ నానీల సంపుటికి నానీల పితామహుడు ఆచార్య డా.ఎన్‌.గోపి,
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ.సూర్యాధనంజరు, తమ కళాశాల ప్రిన్సిపల్‌ డా.సి.వి.రాజేశ్వరి ముందు మాటలు రాశారు. ఇక ఈ సింగిడిలో తెలంగాణ యాస ఉండక పోవడం విశేషం.
నానీల ప్రక్రియ గురించి చెప్పాలంటే ఎందరో వచన కవులు కవితలు, మినీ కవితలు రాస్తారే కాని నానీల జోలికి వెళ్ళింది ఏ కొద్ది మంది మాత్రమో ఉంటారు. ఈ ప్రక్రియలో సాధన చేసిన వాసిని ఇంకా ఇందులో రాటుదేలవలసి
ఉంది. కొన్ని కొన్ని చోట్ల అవి సంఖ్యకు మాత్రమే సరిపోయాయి, ఆ విషయం ఆమే చెబుతారు కూడా. మనసుకు హత్తుకుపోయే, పుస్తకం మూసినా గుర్తొచ్చే, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే నానీలు ఇందులో ఎన్నో ఉన్నాయి. చదివినప్పుడు ఓస్‌ ఇంతేనా అనిపించినా రాయడానికి పోతే కాని దాని వెనుక ఉన్న శ్రమ తెలియదు. అందుకు వాసినిని అభిందించక తప్పదు.
లోతుగా ఉన్నది సముద్రమొక్కటే అనుకుంటాము కాని ''సముద్రమొక్కటే/ లోతైనది కాదు/ సుజ్ఞాని/ అంతరంగం కూడా!'' అని మనిషి అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించారు వింధ్య వాసిని. ''మౌనాన్ని/ మాట్లాడమందాం!/ ఎన్ని సముద్ర ఘోషల్ని/ వినిపిస్తుందో మరి'' అని మౌనంలో వినిపించే సముద్ర ఘోషల్ని చెప్పే ప్రయత్నం చేశారు. మౌనం మాట్లాడడమే ఒక ప్రయోగం. అసలు జీవితం ఎప్పుడు మొదలవుతుంది అది చెప్పే పాఠాలేమిటి, పెట్టే పరీక్షలేమిటి, అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే మాత్రం ఇది చదవండి ''పరీక్షలు/ ముగిసాయని సంతోషమా!/ జీవిత పాఠాలు/ నేర్వాల్సింది ఇకపైనే...''. అలా విద్యార్థి జీవితాన్ని తదనంతర జీవితాన్ని ఒక నాలుగు పంక్తుల్లో చెప్పడం సాహసమే. వాసిని పట్టు సాధించారందులో.
''గాయపడిన కవి గుండెలలో రాయ బడని కావ్యాలెన్నో'' అన్నారు దాశరధి. అసలు కవులు ఏం రాయాలనుకుంటారు, ఎలా రాయాలనుకుంటారు అని కనుక ఆలోచిస్తే ఎన్నో విషయాలు బయట పడతాయి. అందుకేనేమో ''లిఖితమో మౌఖికమో/ ఏదైతేనే?/ కవితా దాహం/ తీర్చుకుంటున్నాడు కవి'' అంటూ ప్రోత్సహిస్తారు రాసేవాళ్ళను. ''నిశ్శబ్దాన్ని/ విని చూడు/ నీలొని ధ్వనులన్నీ/ పలుకుతాయి'' అని, ''లిపి భాషకే కాదు/ మనుషులకు కూడా/ కొన్ని మనసులు/ మాట్లాడలేవు'' అని చెబుతారు. ''కలం/ తడిగా
ఉందెందుకో?/ కన్నీటిని/ అక్షరీకరిస్తున్నందుకా?'' అని అక్షరంపై కలానికి, కలంపై తడికి ఉన్న సంబంధాన్ని చెబుతారు. ''హదయంలో/ భావాలెన్నుంటేనేం?/ కలానికి/ పని'' , ''కవిత్వంలో/ కన్నీరు ప్రవహిస్తూంది/ కవి స్పర్శ/ బడుగుజీవి మరి!'' ఇలా తాము రాసే కవిత్వంపై నానీలను రాశారు.
గెలుపు ఓటములను తూకం రాళ్ళుగా చూసే ఈ నవీన కాలంలో అసలైన లక్ష్యం ఏది అన్న ప్రశ్నకి-
''సంతోషమే/ లక్ష్యం కావాలి/ గెలిచినప్పుడే కాదు/ ఓడినప్పుడు కూడా!'' అని అని ఉద్బోధ చేస్తారు.
విజయం వరించినప్పుడు ''విజయం/ వరించిందా?/ సంకెళ్ళు వేసి బంధించు/ అహంకారాన్ని'' అని సందేశమిస్తారు.
చదువుకోని వారిని కొందరు చులకన చేస్తారు. కాని ''నిరక్షరాస్యుడా!/ అయితేనేం?/ అనుభవ జ్ఞానం/ విస్తతమే కదా!'' అంటూ అసలైన అనుభవం జీవితాన్నుండి వస్తుందని చెబుతారు. పర్యావరణం పై స్పందిస్తూ ''తరాలనాటి వక్షం/ తలొంచుకొని/ బలౌతుంది/ నగరాభివధ్ధి కోసం'' అని నగరీకరణను వేలెత్తి చూపుతారు.
గుండెకు తగిలే గాయం గురించి చెబుతూ ''గాయంతో/ ఆ గుండె మూగవోయింది/ మారణాయుధంతో కాదు'' అని అంటూనే ''మనుషులు మారాలా?/ అయితే/ మనసులకు/ రూపం రావాలి'' అని పరిష్కారమూ చూపుతారు.
''అతడు/ మహౌన్నత మానవతావాది/ కన్నీటి రుచి/ తెలిసినవాడు'' అని నిజమైన మానవతావాదిగా ఎప్పుడు మారతాడో చెబుతారు. మానవీయ విలువల్ని ఎక్కడ వీలైతే అక్కడ చొప్పించడం వింధ్యగారికే చెల్లింది.
కవిత్వం రాసిన కాలానికే కాదు తరువాత కూడా బతకాలంటే అది సర్వ కాలాలకూ సరిపోవాలంటారు. కరోనా వచ్చి అందరూ సతమతమవుతుంటే దేవుడి ఆలయాలని కూడా మూసేశారు.
''దైవం/ కళ్ళు తెరిస్తే బాగుండు/ జన రక్షణకు కాదు/ తన రక్షణకే...'' ఈ నానీ చదివి మీరే పోల్చుకోండి ఇప్పుడు సరిపోతుందో లేదో. అలాగే ఇప్పుడు ఆన్‌ లైన్‌ క్లాసుల గురించి వింటున్నాం. మెల్లగా విద్యా వ్యవస్థనే మార్చే పనిలో ప్రభుత్వాలు పనిచేస్తున్నారు.
''నల్లబల్ల/ చిన్నబోయింది/ డిజిటల్‌ బోర్డూ.../ ఎంత పని చేశావు నువ్వు'' అంటూ రాసిన నానీ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది కదా.
''మెదడుకు/ పని లేదిప్పుడు/ సమస్తం/ జీబీల్లోనే నిక్షిప్తం'' అనడం కూడా చక్కగా సరిపోతుందీ సమయాన. ''ధరణికి ఆభరణం/ పచ్చలహారం కాదు/ హరితహారమే/ అందం'' అన్న ఈ నానీ కూడా తిరిగి పొందిన, పొందాల్సిన పచ్చదనాన్ని గుర్తుచేస్తుంది. ఈ కరోనా కంటే ఎంతో ముందు రాసిన నానీలివి.
''చంద్రమండలం పై/ ప్లాట్‌ సంపాదించారా!/ మరి ఎదుటి వ్యక్తి/ మనసులో?''
''దేశాంతరం వెళ్ళిన/ పక్షి తిరిగొస్తుంది/ మార్కెట్టుకు/ వెళ్ళిన మనిషి?''
''నీరు ఇంకిపోయింది/ భూమిలోనే కాదు/ ప్రతి రైతు/ కన్నుల్లో కూడా...''
''అస్తిత్వ పోరాటం/ ఆస్తి లో వాటాకు కాదు/ ఆత్మగౌరవానికి/ తొలి మెట్టు''
''సొంత గొంతును/ వినిపినంచాను మొదటిసారి/ మిత్రులు/ శత్రువులయ్యారు''
''బతుకమ్మ సిగలో/ మందారం/ ప్రపంచ పటంలో/ తెలంగాణ సింగారం''
''పసి పిల్లలను/ విదిలిస్తున్నాడతడు/ పసి హదయం/ లేదు కాబోలు!''
''భరతమాత/ కోరింది/ స్వఛ్ఛ భారతే కాదు/ స్వఛ్ఛ హదయాల్ని సైతం''
''భాషా నైపుణ్యానికి/ నిఘంటువులెందుకు?/ జనం లో/ కలిసిపో'' ఇలా చాలా నానీలు మనల్ని కట్టిపడేస్తాయి.
వర్షం వచ్చినప్పుడే ఇంధ్రధనస్సు కనిపిస్తుంది. ఈ నానీల సింగిడే కాకుండా వర్షానికి మొలకెత్తే చెట్లలా, పాడి పంటల్లా వింధ్యవాసినీ దేవి కవిత్వం ఎన్నో రూపాల్లో విరబూయాలని, విరగ పూయాలని ఆశిద్దాం.