ప్రజల కోసం .. సృజన కోసం 2023

'మరోసారి పెరుగుతున్న కోవిడ్‌ పునరాగమన భయాల మధ్య 2023 ప్రవేశిస్తున్నది. ఇది దేశమంతటా కీలకమైన ఎన్నికల కాలం కాబోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అప్పుల మోత, ధరల వాత, ఉద్యోగాల కోత వంటివి ప్రజలను భయపెడుతున్నాయి, కామధేనువులా గోచరించిన ఐటి రంగం కూడా కదలిపోతున్నది. సుప్రీం కోర్టునే ఒత్తిడి పెట్టే అప్రజాస్వామిక ధోరణి దేశంలో తాండవిస్తున్నది. మతాల మంటలు, కులాల కుటిల వ్యూహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజావరణం, ప్రభుత్వ రంగం కుదించుకుపోతుండగా... ప్రైవేటుమయమైన వ్యవస్థ విశృంఖలంగా విస్తరిస్తున్నదని విశాఖ ఉక్కు హెచ్చరిస్తోంది. విద్యారంగంలో విశృంఖల శాసనాలు చాప కింద నీరులా రేపటి తరం బుర్రను కూడా అయోమయానికి గురి చేస్తున్నాయి. మిడిమేళపు మీడియా కథనాలు ఏది సత్యం ఏదసత్యం అన్న మహాకవి ప్రశ్నను నిజం చేస్తున్నాయి. వ్యవస్థలు అధికారం గుప్పిట్లో బందీలవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ప్రాథమిక హక్కులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రశ్నాకర్థకమవుతున్నాయి. అందరికంటే ఎక్కువగా వీటిని ఆకాంక్షించే ప్రజాపక్ష కవులూ, రచయితలూ, కళాకారులూ, బుద్ధిజీవుల పరిస్థితి అడగడుగు గండంగా మారిపోతున్నది. అధినేతల ఘనత మోత మోగుతున్నా అసలు పరిస్థితి అన్ని విధాలా అధ్వానమవుతున్నది. ఆందోళన కలిగిస్తున్నది. దళిత బలహీన వర్గాలు, మహిళల భద్రత దినగండమవుతున్నది. ఆధిపత్యం ఛాందసం, మతతత్వం బుసలు కొడుతున్నది. ఇందులో ప్రతిదానికి బోలెడుఉదాహరణలు, సంఘటనలు చెప్పొచ్చు గాని 24/7 చూస్తున్నాం గనక ఆ అవసరం లేదు. ఆ విస్తృత పరిశీలన లోపల వున్నది.
ఇవన్నీ చూసి వచ్చే రోజులు కూడా ఇలాగే ఉంటాయని పాఠాలు చెప్పేవారికి లోటు లేదు. ఈ సమయంలోనే అనేక ఉద్యమాటు పోరాటాలు ప్రతిఘటనలనూ చూస్తే ఆ విధమైన నిస్ప్రహకు అవకాశం వుండదు. దిగజారుతున్న పరిస్థితుల్లో వీటిని ఇవి మరింత ప్రజ్వలిల్లాల్సిందే తప్ప చల్లారే ప్రసక్తి వుండదు. ప్రగతి ప్రజాశ్రేయస్సు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం కోరే కలాలకూ గళాలకూ విరామం వుండదు. ఇన్ని సవాళ్ల మధ్యనా సాహిత్యకారులు గడచిన ఏడాది ఆ పాత్ర నిర్వహించడంలో ముందున్నారు. రాబోయే కాలంలోనూ అదే బాటలో ముందుకు నడుస్తారనే విశ్వసిస్తున్నాం. సృజన పంచడంతో ప్రజలకు మరింత చేరువై చైతన్యపర్చగలరనిఆశిస్తున్నాం.
సాహితీ స్రవంతి వివిధ కోణాల్లో వివిధ ప్రాంతాల్లో విస్తారమైన కృషి చేసింది. మంచిని ప్రోత్సహిస్తూ తిరోగమనాన్ని ప్రశ్నించింది. విశాల ప్రగతిశీల సాహితీ వేదికగా తన బాధ్యత నెరవేర్చింది. ప్రస్థానం ఇందుకు వేదికగా నిలిచింది. రాబోయే కాలంలో దీన్ని మరింత విస్తృత పర్చుకోవడానికి లోపాలోపాలు సరిచేసుకుని శక్తివంతంగా ముందుకు సాగడానికి సిద్ధంగా వుంటామని, చేయవలసింది ఇంకా ఎంతో వుందని భావిస్తున్నాం. ఇందుకు సాహిత్య మిత్రులు శ్రేయోభిలాషుల అండదండలు కోరుతున్నాం. మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.