సామాజికాంశాల చుట్ట'కుదురు'

ఎమ్వీ రామిరెడ్డి
98667 77870
వచన కవిత్వంతోపాటు నాయకురాలు నాగమ్మ, కన్నెగంటి హనుమంతు వంటి చారిత్రక వ్యక్తుల ఆత్మకథలు ఆవిష్కరించిన రచయితగా కె.హెచ్‌.కె.మోహన్‌రావు ప్రసిద్ధులు. ఆయన తాజాగా వెలువరించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణాత్మక కథనాల సమాహారం 'కుదురు'. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయాక ఆంధ్రలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అమరావతిని నూతన రాజధానిగా ప్రకటించారు. ప్రపంచస్థాయి రాజధాని నగరం నిర్మించాలన్న తలంపును తెరపైకి తెచ్చి, అందుకోసం భూసేకరణ ప్రారంభించారు. 30 వేల ఎకరాలకుపైగా భూమిని నూతన నగర నిర్మాణం నిమిత్తం సేకరించారు. ఆ భూముల్లో పైర్లు ఆగిపోయాయి. రాత్రికి రాత్రే భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గ్రామగ్రామాన రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులు వెలిశాయి. జీవన సరళిలో అనూహ్య మార్పులు సంభవించాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అత్యంత వేగంగా మార్పు చెందాయి. ఈ పర్యవసానాలకు మూల కారణాలను అన్వేషించే క్రమంలో మోహన్‌రావు పదికి పైగా వ్యాసాలు రాశారు. 'భూమే రైతులకు జననం, జీవనం, మరణం అన్న విషయం విస్మరించదగినది కాదు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరదలొచ్చినా, విపత్తులచ్చి సాగిలపడినా వ్యవసాయాన్ని వదలడం రైతుకు చేతకాని పని' అని 'రాజధానికి పేదరైతుల భూములా?' శీర్షికతో రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. వాటితో తమ అనుబంధాన్ని తెంచుకోవటం అంత తేలికగాని పరిస్థితుల్లో పాలకులు ప్రయోగించిన చిట్కాల వెనక మతలబులను వివరించే ప్రయత్నం చేశారు. లోటు నిధులతో ప్రయాణం ప్రారంభించిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక హౌదా మాత్రమే సంజీవనిలా ఆదుకోగలదని, అందుకోసం పాలక, ప్రతిపక్ష నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటివో వివరిస్తూ రాసిన వ్యాసం 'ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హౌదాపై పోరు'. కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఇవ్వడం కుదరదని ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను 'గోదాలో హౌదా - అయోమయంలో అభివృద్ధి' శీర్షికతో రాసిన వ్యాసంలో పరామర్శించారు. ఈ పరి ణామాల వెనక దాగి ఉండే ఆర్థిక గణాంకాల రహస్యాలు, అమరా వతి శంకుస్థాపనకు వచ్చి మోదీ ఇచ్చిన హామీలు, మోదీతో అప్పటి ముఖ్యమంత్రి ఘర్షణ పడలేని అచేతనత్వం, ఓటుకు కోట్లు కేసు తదితర అంశాలను కూలంకషంగా విశ్లేషించారు.
'హౌదాపైగానీ, సాయంపైగానీ మోదీ ప్రభుత్వాన్ని నిల దీయడంలో చంద్రబాబు ఇంకా అశక్తతనే ప్రదర్శిస్తున్నారు' అని 'ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న పాలకులు'లో విమర్శించారు. అదే సమయంలో 'ప్రశ్నిస్తాను, పోరాడతాను' అనే నినాదాలతో రాజకీయ రంగప్రవేశం చేసిన పవన్‌ కళ్యాణ్‌ క్రియాశీల వ్యూహాల తో ముందుకు సాగటం లేదని కుండ బద్దలు కొట్టారు. రాజకీయ మేధావిగా పేరొందిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పొందటానికి దారి తీసిన పరిస్థితులను 'నీ వల్లే గెలిచి... నీ వల్లే ఓడి...'లో సుదీర్ఘంగా అవలోకించారు. పోలీసు మార్కు పాలన, ఆందోళనకారుల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేయటం, అమాయకులపై అక్రమ కేసులు, వాగ్దానాలకు ఆచరణరూపం ఇవ్వలేకపోవటం, మితిమీరిన జన్మభూమి కమిటీల పెత్తనం, సాగునీటి ప్రాజెక్టుల్లో పురోగతి లేకపోవటం, పొంతన లేని సొంత సర్వేలు.. ఇలా
ఎన్నో అంశాలు తెదేపా అధికారానికి కత్తెర వేశాయని తేల్చారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక, ఆంధ్ర ప్రయాణం మరికొన్ని మలుపులు తిరిగింది. 'అధికార వికేంద్రీకరణ' నినాదంతో వైఎస్‌ జగన్‌ రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటిం చారు. ఒక్కసారిగా అమరావతి అభివృద్ధి పాలపొంగులా చప్పున చల్లారిపోయింది. కట్టిన భవనాలు, వేసిన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పొలాలు బీళ్లు పడిపోయాయి. ఈ నేపథ్యాన్ని సవివరంగా సమీక్షించిన మోహన్‌రావు 'వికేంద్రీ కరణ వైసీపీ చిత్తశుద్ధిని కూడా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు నిర్ణయాన్ని శాసన సభలో స్వాగతించి ఇప్పుడు టర్న్‌ తీసుకొని వికేంద్రీకరణ చేపట్టడం సమంజసమా?' అంటూ కొన్ని వర్గాలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నిలదీస్తున్న సందర్భాలను 'ఏపీ రాజధాని ఆందోళన ఆర్థిక ఉద్యమమేమో!' అనే వ్యాసంలో ప్రస్తావించారు. 'రాజధాని' కేంద్రంగా తెదేపా, వైకాపాలు క్షేత్రస్థాయిలో తమ బలాబలాల నిరూపణకు పడుతున్న పాట్లు వివరించారు. రాజ ధానికి ముందూ వెనకా తీవ్రంగా నష్టపోయింది భూమిలేని నిరుపేదలే. రెక్కల కష్టంపై కడుపు నింపుకొనే శ్రమజీవులు దిక్కు తోచని స్థితిలో చిక్కుబడ్డారు. భూములున్న బాబులు మాత్రం కోట్లకు పడగలెత్తారు. గతంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, వాటికోసం రైతులు ఎన్ని ఎకరాలు కోల్పోయారో, ఎన్ని గ్రామాలు తరలిపోయాయో సందర్భానుసారంగా పేర్కొనటం బాగుంది.
అసమర్థత, అజ్ఞానాలపై విమర్శనాస్త్రాలు
రాష్ట్రాలతో నెరపాల్సిన సంబంధ బాంధవ్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో కొన్ని వ్యాసాల్లో లోచూపుతో పరిశీలించారు రచయిత. బీజేపీయేతర రాష్ట్రాల అభివృద్ధి పట్ల నిష్పాక్షిక ధోరణి కొరవడిన వైనాన్ని వివరించారు. కక్షపూరిత చర్యల గురించీ నిర్మొహమాటంగా చెప్పారు. 'స్వచ్ఛతలేని మోడీ రాజకీయ ప్రయాణం' అంటూ మొదటి వ్యాసంలోనే తూర్పారబట్టారు. జనధన్‌ ఖాతాలు, గంగానది ప్రక్షాళన, స్వచ్ఛభారత్‌, అవినీతి రహిత పాలన వంటి అంశాలు చెప్పుకోదగ్గ ఫలాలను వ్యవస్థకు అందించలేదని ప్రస్తావించారు. 'వాస్తవానికి రాజకీయ రంగంలో మార్పు రాకుండా దేశంలోని ఏ వ్యవస్థలోనూ కాలుష్యాన్ని నివారించడం సాధ్య మయ్యే పని కాదు. శుద్ధ గంగ, స్వచ్ఛభారత్‌లను ముందుగా రాజకీయరంగం నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉంది' అని మూలావసరాన్ని సూచించారు.
బీజేపీ సమస్త శక్తియుక్తులనూ కూడదీసుకుని పోరాడినా ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని తప్పించుకోలేకపోయిన సందర్భాన్ని రచయిత 'విలువల విజయమే ఢిల్లీ ఎన్నికల ఫలితం'గా అభివర్ణిం చారు. 'భారత రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధానమంత్రి ఢిల్లీలోని గల్లీ గల్లీ తిరిగి శాసనసభ ఎన్నికల్లో ప్రచారం గావించడం పసికూనలాంటి ఆమ్‌ ఆద్మీ పార్టీపైనా, ఆ పార్టీ ప్రధాననేత కేజ్రీవాల్‌పైనా సంధించిన విమర్శలు, ఆరోపణలు పరాజయం రూపాన్ని సంతరించుకుని తిరిగి ఆయన పొదిలోకే వచ్చిచేరాయి' అంటూ విశ్లేషించారు. 'గర్భ సంస్కార్‌' పేరుతో ఆరెస్సెస్‌ రూపొందించిన సీడీలు, పుస్తకాలు ప్రజల్లో మూఢత్వాన్ని పెంచి పోషించే హానికారకాలనీ, 'వాస్తుదోషం' పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూల్చివేతలు, నిర్మాణాల కోసం కోట్ల రూపాయలు తగలేస్తున్నారనీ ధ్వజమెత్తారు. స్వయంగా పాలకులే అజ్ఞానాన్ని ప్రజల బుర్రల్లోకి బట్వాడా చేస్తున్నారని రచయిత విరుచుకుపడ్డారు. 'ప్రపంచ దేశాలనేకం వైజ్ఞానికంగా పరుగులు పెడుతుంటే, మనం విశ్వాసాల మూకుడులో పేలాల్లా వేగు తున్నాం. రాజ్యాంగం ఒకవైపు డప్పుకొట్టి చెబుతున్నా మన పాలకుల వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. విద్య, సామాజిక, రాజకీయ, పాలనా వ్యవస్థల్లో పరిశోధనల దిశవైపు తలతిప్పే యోచనే చేయడం లేదు' అని స్పష్టంగా తన అభిప్రా యాలు వెల్లడించారు.
'భగవద్గీతలో జాతీయభావం ఉన్నదా?', 'వేగుచుక్కల ఉసురు తీస్తున్న మతోన్మాదం' శీర్షికలతో రాసిన వ్యాసాల్లో సున్నితమైన అంశాలను విశ్లేషించటంలో రచయిత ప్రదర్శించిన పరిణతి ప్రశంసనీయం. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ 'బతికి ఉండటం కంటే చని పోతున్నందుకు తాను సంతోషంగా ఉన్నా'నంటూ రాసిన ఆఖరి అక్షరాల వెనక నీలినీడల్ని వెలికితీస్తూ రాసిన వ్యాసం 'ఆఖరి అక్షరాలు ఆలంబనగా...' ఆకట్టుకుంటుంది. 'చైనాతో భారత్‌ యుద్ధం వాంఛనీయం కాదు' అంటూ ప్రధాని మోదీకి చేసిన విన్నపంలో ఆసక్తికరమైన అంశాలను పాఠకుల దృష్టికి తీసుకువచ్చారు. భారతదళం బలాబలాలు, సైనిక పాటవాలు, కాగ్‌ నివేదించిన ఆయుధ నిల్వలు, రాజకీయ వ్యూహాలు, పాకిస్తాన్‌ నుంచి పొంచి ఉన్న ప్రమాదాలు, అమెరికా - రష్యాల నుంచి ఎదురు కాబోయే పరిణామాలను కూలంకషంగా విశ్లేషించారు. యాదవులపై చాగంటి కోటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, వైశ్యులపై రాసిన పుస్తకంలో కంచె ఐలయ్య చేసిన ఆరోపణలు కొందరి మనోభావాలను ఎంతగా గాయపరిచాయో, అలాంటి వ్యాఖ్యల్లో రచనల్లో ఎంతటి సంయమనం అవసరమో వివరిస్తూ రెండు వ్యాసాలు రాశారు. 'మల్లెతీగ ముద్రణలు' ప్రచురించిన ఈ పుస్తకం ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. మోహన్‌రావు గారి కలం నుంచి మరిన్ని సమగ్ర సామాజిక కథనాలు వెలువడాలని ఆకాంక్ష. 94401 54114 నెంబర్లో రచయతను సంప్రదించవచ్చు.