కొంత వెలుగు .. కొన్ని చినుకులు

డాక్టర్‌ సుంకర గోపాలయ్
94926 38547

అతను యుద్ధానికేం వెళ్ళలేదు
కొన్ని కలల్ని కన్నాడు
సకల సౌకర్యాలతో ఇల్లు కట్టాలనుకున్నాడు

బ్యాంకు ఖాతా బరువుగా ఉండాలని
రెండు ఫ్లాట్లు వెనకేయ్యాలని బాగా కోరిక

అతని పిల్లల దగ్గర అతను లేడు
వాళ్ళు ఎదిగే క్షణాల్ని కోల్పోయాడు
కొమ్మకు అంటిపెట్టుకున్న పువ్వుల్లా
వాళ్ళిప్పుడు నాన్న గుండెకు ఆని
కొన్ని కథల్ని వినాలనుకుంటున్నారు
అలా వేలు పెట్టుకుని, వీధి వెంట
గర్వంగా నాలుగడుగులు వేయాలనుకుంటున్నారు

వాళ్ళ కోసం ఆన్లైన్‌లో బోలెడు ఆట వస్తువులు పంపాడు
ఎక్కి నడుపుతున్న బాటరీ కారు హఠాత్తుగా ఆగినప్పుడు
వెనుక నుండి ముందుకు నెట్టే నాన్న చేతుల్లేని దిగులు
వాళ్ళని కుంగ దీస్తోంది
వీడియో కాల్‌లో నాన్నకు ముద్దుపెట్టినా
అది స్క్రీన్‌ దాటిపోదని తెలిశాక
ఆ పసిపెదవులు రెండు
నెర్రెలిచ్చిన నేలను తలపిస్తున్నారు!
అన్ని హంగులతో, ఇల్లు కట్టించినా
నాన్న లేని ఇల్లు
చీకటి నిండిన
పురాతన కట్టడంలా ఉంది!
ఏ మొక్కా మొలవని బీడులా ఉంది

నాన్నా నాన్నా
నువ్వు నీడలా వెంట ఉంటే చాలు
మా భుజం మీద నీ చెయ్యి ఉంటే చాలు
నీ కంట్లో నుండి ప్రేమ
చినుకులు చినుకులుగా
మా గుండెల్లోకి కురిస్తే చాలు అంటూ
పిల్లలిద్దరూ చేసే ప్రార్థన
చుట్టూ మార్మోగుతుంది!