బామ్మ

కథ

- వేణు మరీదు 9848622624

మా బామ్మ ఉదరంలోగానీ, హృదయంలోగానీ ఏదైనా 'మంట' మొదలైందంటే అది ఆస్ట్రేలియా అడవుల్లో మొదలయ్యే కార్చిచ్చే మరి! తుఫాను పట్టి కురిసే కుంభవృష్టి వల్ల ఆ కార్చిచ్చు ఆరిపోతుందేమోగానీ మా బామ్మ మదిలో ఆ 'మంట' వంటిది మొదలైందంటే ఏ అగ్నిమాపక యంత్రమూ దానిని చల్లార్పలేదు!
ఈ మధ్య బామ్మ 'మంటం'తా మా ఊళ్ళో ఉన్న మా పాత ఇంట్లో అద్దెకుంటున్న తోడు లేని 'ఆమె' గారి మీద!
గత రెండు వారాల్లాగానే మళ్ళీ ఈ ఆదివారం కూడా ఫోన్‌ మోగింది. ఇది తొంభైలల్లో ముచ్చట గాబట్టి మోగిన ఆ ఫోన్‌ సెల్‌ఫోన్‌ కాదు. అది ల్యాండ్‌లైన్‌! మన పాత తెలుగు జేమ్స్‌బాండు మాదిరి తీసిన చిత్రాల్లో ఘల్లుమని మోగే నల్లటి తొలితరం 'ల్యాండ్‌లైన్‌' ఫోనది.
''అరేరు నాయనా - నువ్వామెను వెంటనే ఖాళీ చేయిస్తావా లేదా?' ఫోన్‌లో బామ్మ బెదిరింపు.
''మళ్ళీ ఏమైంది బామ్మా?''
''ఏమైందా?... ఆవిడగారు మళ్ళీ రాత్రికూడా ఇంకెవర్నో ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ ముదనష్టపు టేపు రికార్డులో ఒకటే పాటలు... ఇక ఇకలు, పకపకలు. మధ్య మధ్యలో ఆ 'చలం గారు' రాసిన నవలలూ, కథలూ వగైరా వాటి మీద చర్చలూ.... ఇగో ఇలాంటి ఆడవాళ్ళు అలాంటి సాహిత్యం బాగా చదివీ చదివీ ఇట్లా అడ్డూ అదుపూ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ మధ్య...''
''ఆమె స్నేహితులై ఉంటార్లే బామ్మా... అపార్థం చేసుకోమాక!''
''అలా సమర్థించకురోరు... ఆవిడేమన్నా నీ చుట్టమా పక్కమా?''
''పాపం ఆవిడ ఒంటరి ఆడది కదా బామ్మా!''
''అబ్బబ్బో... ఆమెగారు ఒంటరి ఆడది గాదురా...తుంటరి ఆడది!''
- బామ్మగారి అనుమానపు జ్వాల వర్సెస్‌ ఆస్ట్రేలియా కార్చిచ్చు!
ఫోనులో బామ్మే మళ్ళీ అందుకుంది. ఇక నేను కేసు ఓడిపోబోతున్న డిఫెన్సు న్యాయవాదిలా తను చెప్పేది వినటానికి సిద్ధమయ్యాను!
''నువ్వెన్నయినా చెప్పరా. నాకు కాస్త మంచీ చెడూలో తోడుగా ఉంటుందని ఆమెను ఇంట్లో అద్దెకు దింపావు. మీ తాతగారి పవిత్రమైన జ్ఞాపకాలు సంచరించే ఇల్లురా ఇది. భ్రష్టు పట్టిద్దామా ఏమిటి? ప్రతిసారీ యిలా కాళ్ళీడ్చుకుంటూ ఈ ఎస్టీడీ బూత్‌ దగ్గరకు వచ్చి మళ్ళీ మళ్ళీ నీకు ఫోన్‌ చేయనబ్బారు! ఆవిణ్ణి ఖాళీ చేయిస్తావా సరి.. లేదంటే...''
''అదిగాదులే బామ్మా...ఈ రోజుల్లో...''
పళ్ళూ గోళ్ళూ రాలిపోయినా ఒంట్లో రౌద్రం తగ్గని శివంగిలా మళ్ళీ ఘర్జించింది బామ్మ!
''ఆ రోజులూ- ఈ రోజులూ అని కాకమ్మ కథలు చెప్పకురోరు! జీవితం నిండా పండిన అనుభవం నాది. నీవేమో పేద్ద భోళాశంకరయ్యవి! అదిగో మేం చక్కగా, సలక్షణంగా పెళ్ళి చేసేలోగానే తొందరపడి ప్రేమ పెళ్ళి అఘోరించావు. ఏమయ్యంది! జాతులూ, జాతకాలూ చూసుకోకుండా హడావిడిగా ఆ ఏడడుగులు నడిపించావు. పెళ్లయి పుష్కరం దాటినా మీ ఆవిడకు డోకులే రావాయ!! నువ్వేం ఏడ్చినా అంతే ఉంటుంది! 'పాపంలే', 'ఒంటరి మనిషిలే' అంటూ ఆవిడెవ్వరో, ఎలాంటిదో తెలుసుకోకుండానే ఇంట్లో అద్దెకు దింపి నువ్వు చేసిన తప్పును సమర్థించుకుంటున్నావు.....
హూం... హూం...చూడు! వారంలోగా ఆవిడగార్ని ఖాళీ చేయించక పొయ్యావో నువ్వు కాశీ వెళ్ళాల్సివస్తుందిరో!''
''అదేంటి! కాశీ ఎందుకే''
''ఎందుకా? నా పిండాలు పెట్టటానికి!''
బామ్మ విసురుగా ఫోన్‌ పెట్టగా వచ్చిన శబ్ధానికి నా కర్ణభేరి గుయ్యిమని మారు మోగింది.
బామ్మ మహా మొండిది! ఒక్కోసారి 'కచ్చగా' అవతల వాళ్ళు నచ్చకపోతే చుక్కలు చూపిస్తుంది. ఒక్కోసారి ప్రేమగా అవతలివాళ్ళు నచ్చితే తన పేగులు తోడేసి పూలదండలు కట్టి మెళ్ళో వేసి సన్మానించాలనుకుంటుంది! బామ్మ ఫోనులో అన్నంత పనీ చేసిద్దేమో అని భయపడి ఉన్నపళంగా ఊరెళ్ళాను. మా పాత ఇంట్లో ఉంటున్న ఆ- బామ్మ క్రూరంగా పెట్టిన పేరు - 'ఒంటరి తుంటరి ఆమె' ను వారం రోజుల్లో ఏవో కుంటిసాకులు చెప్తూ ఖాళీచేయించాను. ఒక్కోసారి నవనాగరిక ఆధునికత సాంప్రదాయపు ఛాదస్తం ముందు ఇలానే ఓడిపోతుందిలే అని సర్ది చెప్పుకున్నాను!
బామ్మ మాత్రం విజయ దరహాసంతో నవ్వింది... ఆఖరి ఓవర్లో ప్రత్యర్థి టీమ్‌పై మెరుపు హ్యాట్రిక్‌ సాధించినంత విజయదరహాసమది!
్జ్జ్జ
'ఆమె' ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయిన చాలా రోజులకు సెలవుల్లో నేనూ, మా ఆవిడా ఊరెళ్ళాము. అయితే బామ్మ ఎందుకో ఎప్పటిలా ఉషారుగా లేదు. ఏ పనీ చేసుకోలేకపోతున్నానే, ఏదో దిగులుగా ఉంటుందని చెప్తుంది. హాస్పిటల్‌కు వెళ్దాం అంటే వద్దంటే వద్దంది. ఆమెకు అల్లోపతి మందులు సరిపడవు. అందుకే పావులూరి కృష్ణచౌదరి గారి హోమియో మందులే వాడుతుంది- వాటి మీదనే గురి. అయితే బామ్మకు ఏ జబ్బు లేకపోయినా ఆమెకున్న జబ్బేంటో నాకు తెలుసు! అది 'ఒంటరి తనం'. వయసుపైబడిన వాళ్లకు ఒంటరితనమే అతిపెద్ద దీర్ఘకాలిక వ్యాధి!
్జ్జ్జ
ఒకరోజు బామ్మ, నేను కలిసి సాయంత్రం ఇంటివెనుక పెరట్లోకి వెళ్లాము - కాస్త చల్లటిగాలి పీల్చుకుందామని. మధ్యలో ఒకటి రెండుసార్లు హడావిడిగా వచ్చి వెళ్ళాను కానీ ఇంటి వెనుక పెరట్లోకి రాక చాలా రోజులయ్యుంటుంది. ఎండిపోయిన గడ్డీ, ఉమ్మెత్త పొదల్తో ఉండే మా పెరడు ఇప్పుడు మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా కాలంలో భాగ్యనగరంలో ఉన్న సుందర 'బగీచా'లలో ఒకదానిలా పచ్చగా, పదుల రకాల పూల, పండ్ల మొక్కలతో మెరుస్తుంది.
''బామ్మా ఈ మొక్కలన్నీ ఎప్పుడు పెంచారే? ఎవరేసారు ఇవన్నీ?' అని ఆశ్చర్యపోతూ అడిగాను.
''ఆ అద్దెకున్న 'ఆమే' పెంచింది''
సన్నని స్వరంతో చెప్తుంది బామ్మ. ఈ మాటలంటున్నపుడు బామ్మ కళ్ళల్లో ఓ చిరుచెమ్మ చిన్న తటాకంలో ఓ చిన్ని గులకరాయి వేస్తే పుట్టే ఓ చిన్న వర్తుల తరంగం తిరుగాడినట్లుగా కదలటం నేను గమనించాను. ఆమె గొంతులోంచి వచ్చిన ఓ జీర తొడిరాగపు విషాదాన్ని ప్రకటించే వాగ్గేయకారుని కంఠంనుండి వెలువడిన తొలి స్వరంలా విన్పించింది.
''అవును నాయనా ఆమే పెంచింది. చూడు ఆ పాదులు, పూల జాలులు ఎంత కుదురుగా తీసిందో! గొప్ప అభిరుచిగల పిల్ల...నేనే అనవసరంగా...''
బామ్మ పూర్తి చేయలేదు. అయినా నాకు ఆమె మనసులో దూకి ఉరుకుతున్న నయాగరాలు కనిపించాయి.
మరుసటి రోజు ఒక్కడినే మా పెరట్లో వనంలా విస్తరించి ఉన్న రకరకాల పూల మొక్కల మధ్య ఒక పూటంతా గడిపాను. ఆ సాయంత్రమే బయటకు వెళ్ళి 'ఆమె' ఫోన్‌ నెంబరు ఏమైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించాను. కానీ తనకు ఫోన్‌ కనెక్షను లేదని ఆమె స్నేహితురాలి ద్వారా తెలిసింది. అయితే తన చిరునామా మాత్రం దొరికింది. ఆమె ఎక్కడుంటున్నదీ వివరాలు తెలిసే సరికి బామ్మే అందరికంటే ఎక్కువ సంతోషపడినట్లు అన్పించింది నాకు! ఆలస్యం చేయకుండా మరుసటి రోజే 'ఆమె'కు ఓ సుదీర్ఘమైన ఉత్తరం రాసాను. ఆ లేఖ ఇలా సాగింది -
''అమ్మా,
మేమంతా క్షేమం. మీరు కుశలమా? మీరు యిల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటి నుండీ నాకు మనసులో అంత మంచిగా అనిపించటం లేదండీ, 'ఒంటరి ఆడవాళ్లు - తుంటరి ఆడవాళ్లు' అంటూ మా బామ్మ తర్కంలేని పిచ్చి మాటలు పట్టించుకుని నేనూ ఓ పాతకాలపు 'బామ్మ'లాగానే ఆలోచించాను!
నిన్న సాయంత్రం మా ఇంటి పెరట్లో కొద్దిపాటి స్థలంలో ఐనా మీరు పెంచిన ఆ చిన్న పూలనంలోకి వెళ్లాను. చిన్నప్పటినుండీ నాకు పూల మొక్కలన్నా, పండ్లమొక్కలన్నా ప్రాణం! ఆ పూల జాలుల మధ్య చల్లటి నీడలో అటూ ఇటూ తిరుగుతుంటే ప్రతి లేత మొక్కా మీ పేరునే పలుకుతున్నట్లు వినిపించింది నాకు! ఆ తెల్ల గులాబీలు, గన్నేరు పూలు, బంతీచేమంతి మొక్కలు చిరుగాలికి తమ కొమ్మలను కదిలిస్తూ నన్ను ఆహ్వానిస్తున్నాయేమో అనుకున్నాను! వాటిని చూసి పులకరించిపోయిన నా మదిలో ఎన్నో వింత ఊహలు, చిరు హెచ్చరికలు కదలాడాయి.
మీరు కాంపౌండు గోడ ప్రక్కనే పొడవాటి వెదురు కర్రలతో చాలా కుదురుగా వేసిన పందిరిపై గుబురుగుబురులుగా పెరిగిన సన్నజాజి లతలు ఆ మధ్య వచ్చిన గాలివానకు కొన్ని నేలకు వాలిపోయాయి. తియ్యని, గుభాళింపుల పూలతో నిండి ఉన్న ఆ లతల్లో ఒకటి రెండు నా కాళ్ళకు చుట్టుకున్నట్లుగా అనుభూతి చెందాను. అంతేగాక యుద్ధంలో పట్టుబడ్డ బానిస సైనికుల యొక్క చంటిబిడ్డల లేలేత చేతుల్లా ఆ లతలు నా కాళ్లను కౌగలించుకుని ''అయ్యా! అయ్యా!... మా అమ్మను మాత్రం మా దగ్గరే వదలి వెళ్ళండయ్యా'' అని ఆర్తితో ప్రార్థిస్తున్నట్లుగా వినిపించి నాలోనేనే ఉలిక్కిపడ్డాను. తీవ్ర అపరాధ భావనతో నా కళ్లు చెమర్చాయి!
ఇక ఇంకోవైపు ''హేరు పెద్ద మనిషీ! మీరు చేసిన పనికి పదునైన మా ముళ్ళతో మీ ఒళ్ళంతా గిల్లాలని ఉంది! ఆ బామ్మను కూడా బాగా రక్కేయాలని ఉంది. కానీ లోకానికి మేము సౌందర్యాన్ని సృష్టించే వాళ్లం గానీ కురూపితనాన్ని కాదు. అందుకే ఊరుకొన్నాం!'' అన్నట్లు బోగన్‌ విలియా మొక్కలు, గులాబీ అంటూ పెద్దగా అరిచినట్లు - ఆ మాటలు ఆ చోటంతా ప్రతిధ్వనిస్తున్నట్లు విన్పించసాగాయి. పుష్ప విలాపాన్ని, ప్రకృతి ఘోషను వినే, కనే మృదు హృదయం నాది. మరి మిమ్మల్ని ఉన్నఫళంగా ఖాళీ చేయించటంలో నేను ఎంత 'మొరటుగా' ప్రవర్తించానో తల్చుకుంటేనే సిగ్గుగా అన్పిస్తుంది అమ్మా!
ఇంకొక్కమాట! కమ్మటి తీపి పరిమళం వెదజల్లుతున్న నిండైన పూలతో నిండ ిఉన్న ఆ 'సంపంగి' చెట్టును చూడగానే నా మదిలోంచి తన్నుకొచ్చిన జ్ఞాపకాల దొంతరలో ఉక్కిరిబిక్కిరై పోయాను. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం మా ఊళ్లో సర్పంచి గారి పెరట్లో ఇలా నిండుగా, చెట్టంతా పూసి ఆ వీధంతా ఇలా ఘుమఘుమగా వచ్చే ఆనాటి ఆ సంపంగి పూల తియ్యటి వాసనను మళ్లీ ఇపుడు అనుభవిస్తుంటే నా బాల్యం, యవ్వనపు మధుర జ్ఞాపకాలు ఫౌంటెన్‌లా తన్నుకొచ్చాయి. హైస్కూలులో మొదటి గంట మోగుతుండగా 'సంపెంగల రాణి' అని మేమందరం ముద్దుగా పిలుచుకునే శ్రీలత వస్తుందని తాను అల్లంత దూరంలో ఉండగానే మాకు తెలిసిపోయేది. తన తలలో కమ్మటి వాసనతో, నిండుగా పండిన పసుపు రంగు పూరేకులతో లేత నీరెండకు మెరుస్తున్న పెద్ద సంపంగి పువ్వు. ఆ సంపంగి పరిమళమే నన్ను తనవైపు విపరీతంగా ఆకర్షింపబడటానికి, తరువాత మేమిద్దరం పీకల్లోతు ప్రేమలో కూరుకుపోవటానికి, చివరికి మేమిద్దరం పారిపోయి పెళ్ళాడాలే చేసింది! మా పెళ్లి ప్రక్కనే ఉన్న పట్టణంలోని 'హనుమాన్‌ టెంపుల్‌'లో ఎంత కంగారుగా జరిగిందో మా ఆవిడ శ్రీలత మీకు చెప్తుంటే మీరు పడీపడీ నవ్వటం నాకు గుర్తే ఉందమ్మా!
మీ గురించి మా బామ్మ అపార్థంగా మాట్లాడిన మాటలు పట్టించుకుని అనవసరంగా మిమ్మల్ని ఖాళీ చేయించాము. ఆ తొందరపాటుని మన్నించండి. మేము నగరంలో ఉంటూ బామ్మకు చాలా దూరంలో ఉంటున్నాము. ఆమేమో ఆ ఊరూ, ఇల్లూ వదిలి రాదు. రాత్రి బామ్మ తన బాధను చెప్పుకుంటుంది. తను అస్సలు 'ఒంటరిగా' ఉండలేకపోతుందట! తాతగారు పోయి పదిహేనేళ్లు. తనూ తన మనసులోకి తొంగి చూసుకుందేమో... తనూ ఓ 'ఒంటరి ఆడదే' గా అనే విషయం గమనించుకున్నట్లుంది. మీరు నిష్క్రమించిన తర్వాత మీ స్నేహంలో ఉన్న 'మాధుర్యం' తనకు తెలిసింది కాబోలు!
అమ్మా... మా ఇంటిని మరొక్కరెవరూ ఇంత చక్కగా
ఉంచలేరు. ఇక్కడ ఇంత చక్కటి పూలతోటను పెంచలేరు! మా గురించి కాకపోయినా మీ 'మొక్కల' కోసం అయినా మీరు రావాలి. అవి మీ మీద బెంగపెట్టుకున్నట్లున్నాయి. దయచేసి మళ్లీ రండి! వచ్చి మీ మొక్కలను మళ్లీ సాకండి. ప్రతిదినం వాటిని ప్రేమగా తాకండి. దేశాంతరం వెళ్లిపోయి దీర్ఘకాలం తిరిగిరాని తల్లికోసం తపించే బిడ్డల్లా అవి మీ కోసం నిరీక్షిస్తున్నాయి. మీరు ఎవరితో స్నేహంగా ఉన్నా ఇక మా బామ్మ అభ్యంతరం చెప్పబోదు. మీ గురించి మీ స్నేహితులు ఎన్నో గొప్ప విషయాలు చెపితే విని విస్మయం చెందాను. 'ఒంటరి మహిళందరూ తుంటరి మహిళలే' అనే దుర్మార్గపు ఆలోచనను ఇక దరిచేరనివ్వము.
ఎప్పుడో, ఎక్కడో చదివినట్లు గుర్తు. 'భగవంతుడు ధరించే అందమైన వస్త్రమే ప్రకృతి' అని. మరి ఆ ప్రకృతికే తాము పెంచే మొక్కల ద్వారా సప్తవర్ణాల 'సహజ నేతలు' నేయగల మీ వంటి వనితలు ఈ జగతికే విధాతల వంటివారు కదా-
మీ రాకకోసం మేము మీ పూల మొక్కలతో కలిసి ఎదురు చూస్తూ ఉంటాము!
ప్రేమతో, గౌరవంతో నమస్కరిస్తూ...
మీ సోదర సమానుడు-
'రాజా'.
్జ్జ్జ
మేమే సెలవులు అయిపోయాక మళ్లీ నగరానికి చేరుకుని 'యంత్రభూతముల కోరలు తోమే'' ఉద్యోగ గులాంగిరీల్లో కూరుకుపోయాము. కొన్ని వారాల తర్వాత బామ్మ నుండి ఫోనొచ్చింది!
''అరేరు నాయనా..'ఆమె' వచ్చింది... సామనుతో సహా... ఇక మనింట్లోనే ఉంటుందట... నాకు చాలా సంతోషంగా ఉందిరా!... ఐతే....!''-ఐతే? ఈ 'ఐతే' అనేది మన మానవలోకంలో మహా విశ్వ విస్ఫోటనాలనే 'బిగ్‌ బ్యాంగ్‌'లను పేలుస్తుంది అపుడపుడూ!
''ఐతే...?''
''ఏమీ లేదురా... ఇప్పుడామె ఒంటరి కాదు... పెళ్ళి చేసుకుంది! భర్తతో పాటు వచ్చింది. అబ్బాయి పండులా చక్కగా ఉన్నాడు...ఎక్కువ వయసే ఉండొచ్చు...ఐతే....!
''ఐతే... విషయం చెప్పు బామ్మా... ఈ ఐతేఐతే ఏమిటి?''
''ఏం లేదులే... ఆ అబ్బాయి... సాయిబులబ్బాయి అట!''
''అబ్బా బామ్మా...ఐతే?'' ఈసారి 'ఐతే'ని నేను లాక్కున్నాను.
మళ్ళీ బామ్మే మాట్లాడసాగింది.
''మరి అంతా బాగానే ఉంది గానీ...సాయిబులూ....''
- అప్పుడర్థమైంది నాకు... ఒక జాడ్యం నుంచి ఇంకో జాడ్యానికి దూకటమే మానవ ప్రగతి అనీ, ఒక మౌఢ్యం వదిలించుకుని ఇంకో మౌఢ్యాన్ని తగిలించుకోవటమే నాగరికతా పురోగతి అని!
కోపంగా 'రిసీవర్‌' రీసౌండు వచ్చేలా అరిచాను.
''బామ్మా అంతా నీ యిష్టం.... నువ్వింకా లోకంతోపాటు మారకపోతే ఆ మధ్య నువ్వన్నట్లు నేను ఖచ్చితంగా కాశీకి వెళ్ళాల్సివస్తుంది!''
- కఠినంగానైనా ఈసారి బామ్మను నేను బెదిరించాను!
''సరేలే సరేలే రా! సర్దుకుంటాను... కోపం ఆపు!'' అంటూ బామ్మ ముగింపు పలికింది.
''ఐతే'' అనేది విశ్వ విస్ఫోటనాలను రగిలిస్తే, ఈ ''సరేలే'' అనేది మాత్రం విస్ఫోటనంతో విడివడిన అగ్నిగోళాలు ఘనీభవించి, చల్లారి అందమైన అంగారకులు, శోభాయమాన శుక్రులు, దేదీప్యమైన మన ఈ ధరిత్రులూ వంటి ఖగోళ బ్రహ్మాండములు రూపుదాల్చటానికి దారితీస్తుంది!
''సరేలే.. ఇక ఉంటాను'' అని నేనూ ముగించాను!