చాలిక

డాక్టర్‌ కొవ్వలి గోపాల కృష్ణ
[email protected]

చాలిక విద్వేష వాయు వీచికలు
చాలిక అమానుష ఉన్మాద ప్రేరేపణలు
చాలిక విభజన రాజనీతి యుక్తులు, కుయుక్తులు
చాలిక ఓట్ల వేటలు, కొనుగోళ్లు
చాలిక ప్రజా సంపదల అడ్డగోలు అమ్మకాలు,
ఆనీల ఆగడాలు
చాలిక నియంతృత్వ పోకడలు
అప్రజాస్వామ్య ధోరణులు
చాలిక ఆత్మవంచనాత్మక మనోవాక్కులు,
అవాకులూ చవాకులు
చాలిక ఆచరణ రహిత నినాదాలు,
వివాదాత్మక వాక్‌ విన్యాసాలు

భారత భూమి సహనం, ఓరిమి, సర్వ జన కూరిమి కోరే
ఎల్లలు లేని ఆశావని
ఎల్ల మానవ వికాస కాంక్షావని
భరతభూమి స్వేచ్ఛా భావ తరంగిణుల సంగమ వేణి

నిరతం సాగే సామాన్య మానవ జీవన పోరాటంలో
పొరపొచ్చాలు సృష్టించే కిరాత రాజకీయ కీటక శ్రేణి
భవిష్యాశాజీవికి నిరాశా విస్ఫోటక కారిణి

భారతం జగమేలే స్వేచ్ఛాభావ వీచికలు ప్రసరింపచేసే నేల
బాపూ కలల పంటల విరిదోట
విశ్వమానవ సమభావ పూదోట
భారతావని, సకల మానవ వికాస కారిణి
ధర్మో రక్షతి రక్షితః